ప్రభాకరదీపిక

ఈ పరిణామ చరిత్రకు మూలపురుషుడు స్వర్గీయ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు. అన్నమయ్య జీవిత విశేషాలను, ఆయన వాగ్గేయ సాహిత్యాన్ని మొదటిసారిగా వెలుగులోకి తీసుకు వచ్చినవారు శాస్త్రిగారే. ఒక్క అన్నమయ్య సాహిత్యమే కాదు- నన్నయ నాటి నుంచి మొన్నమొన్నటి దాకా దాదాపు వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యాన్ని శోధించి, మధించి, పరిష్కరించి, ప్రచురించి తెలుగు భాషకు, సంస్కృతికి మహోపకారం చేశారాయన. స్వర్గీయ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి 125వ జయంతి సందర్భంగా కృష్ణాజిల్లా పెదకళ్లేపల్లి గ్రామంలో నేడు (గురువారం) ఆయన విగ్రహ ఆవిష్కరణ జరుగుతున్నది. ఆయనకు నివాళిగా ఈ వ్యాసం.1888లో కృష్ణాజిల్లాలోని పెదకళ్లేపల్లి గ్రామంలో ఒక గొప్ప పండిత కుటుంబంలో జన్మించిన శాస్త్రిగారు పదహారేళ్ళ వయస్సులో బందరులో మహాకవి చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారి వద్ద చేరి రెండేళ్ళు శిష్యరికం చేశారు. పదిహేడవయేట అష్టావధానం చేశారు. అప్పుడే రచనావ్యాసంగం ఆరంభించారు. పద్దెనిమిదేళ్ళ వయస్సులో ఉద్యోగం కోసం మద్రాసు చేరారు. 1910లో మద్రాస్ ఓరియంటల్ మాన్యుస్కిప్ట్ లైబ్రరీలో కాపీయిస్ట్‌గా చేరారు. అప్పటినుంచి లెక్కలేనన్ని ప్రాచీన తాళపత్ర గ్రంథాలను, వ్రాతప్రతులను సేకరించి, పరిశోధించి, ప్రచురింపజేశారు. 1939లో మద్రాసునుంచి తిరుపతికి వచ్చి స్థిరపడిన తర్వాత శాస్త్రిగారి సాహిత్య కృషి కొత్త మలుపు తిరిగింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయం ఆవరణలోని ఒక నేల మాళిగలో నాలుగు శతాబ్దాలుగా దాగి ఉన్న తాళ్ళపాక వాగ్గేయకారుల సంకీర్తనలు గల రాగిరే కులను గుర్తించి, బయటికి తీయించి 1948లో వాటిని దేవస్థానం చేత ప్రచురింపజేశారు. మొత్తం 29 సంపుటాలుగా వెలువడిన ఆ సాహిత్యంలో మొదటి ఐదు సంపుటాల ప్రచురణ ఆయన పర్యవేక్షణలోనే జరిగింది. అన్నమయ్య 32 వేల కీర్తనలు రచించగా వాటిలో 11 వేల కీర్తనలు మాత్రమే లభ్యమయ్యాయి. అన్నమయ్య మనవడు తాళ్ళపాక చిన్నన్న రచించిన ‘అన్నమాచార్య చరిత్రము’ గ్రంథాన్ని శాస్త్రిగారు తన సుదీర్ఘపీఠికతో ప్రకటించారు. ఆ గ్రంథం ద్వారానే అన్నమయ్య జీవితం గురించి, సాహిత్యం గురించి ప్రపంచానికి స్పష్టమైన అవగాహన కలిగింది.
రాగిరేకుల మీది సంకీర్తనలకు స్వరాలు లేవు. వాటికి రాగతాళాల పేర్లు మాత్రమే పేర్కొనబడినాయి. అయినా, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, శ్రీపాదపినాకపాణి, బాలమురళీకృష్ణ, మల్లిక్, నేదునూరి కృష్ణమూర్తి వంటి ప్రముఖ సంగీత విద్వాంసులు ఆ కీర్తనలకు స్వరాలు కూర్చి పాడారు, పాడించారు. ఆకాశవాణి విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలు 1950 నుంచి ఆ పాటలకు విరివిగా ప్రచారం కల్పించాయి. రాగిరేకుల సంగతి ఇలా ఉండగా, తిరుమల ఆలయ చంపక ప్రదక్షిణ ప్రాకారం వద్ద కొన్ని శతాబ్దాలుగా అజ్ఞాతంగా పడి ఉన్న రెండు పెద్ద రాతి బండలు 1949లో ప్రభాకరశాస్త్రిగారి దృష్టికి వచ్చాయి. వాటిపై కొన్ని స్వరసహిత సంకీర్తనలు చెక్కి ఉన్నాయి.
ఆ బండలు ఏడు అడుగుల పొడుగు, నాలుగు అడుగుల వెడల్పు, తొమ్మిది అంగుళాల మందం కలిగి ఉన్నాయి. ఒక బండపై 94 పంక్తులు, మరో బండపై 100 పంక్తులు చెక్కి ఉన్నాయి. శాస్త్రిగారి శిష్యుడు అర్చకం ఉదయగిరి శ్రీనివాసాచార్యులు మొదట యాదృచ్ఛికంగా ఆ బండలను చూసి వాటిని గురువు గారి దృష్టికి తెచ్చారు. అవి క్రీ. శ. 1500 ప్రాంతం నాటి తాళ్ళపాక వాగ్గేయకారుల రచనలై ఉంటాయనీ, బహుశా అన్నమయ్యవే కావచ్చుననీ శాస్త్రిగారు అభిప్రాయపడ్డారు. అంతేకాదు యావత్ప్రపంచంలోనే ప్రప్రథమంగా లభించిన స్వరసహిత వాగ్గేయ రచనల శిలాలేఖములని కూడా ఆయన భావించారు. త్వరలో వాటిని నిశితంగా పరిశీలించి, పరిష్కరించి ప్రకటించాలని ఆయన సంకల్పించారు. కాని, ఆ పని జరిగేలోపునే – 1950లో – ఆయన దివంగతులైనారు.శాస్త్రిగారు మరణించేనాటికి ఆయన కుమారుడు ఆనందమూర్తిగారి వయస్సు ఇరవయ్యేళ్లే. అయినా, అప్పటినుంచే ఆయన తండ్రిగారి సంకల్పందిశగా కృషి చేస్తూ వచ్చారు. ఆయన కృషి ఫలితంగా 1990లలో దేవస్థానం రంగంలోకి దిగింది.
సాధారణంగా బండలపై అక్షరాలు చెక్కేవారు ముందుగా వాటిని నునుపు చేస్తారు. కాని, ఈ సంకీర్తనలు చెక్కిన బండలు నునుపుగా లేకుండా ఎగుడు దిగుడుగా ఉన్నాయి. వాటి మీది అక్షరాలను గుర్తించడం కష్టం. దేవస్థానం వారు ఆ బండలకు ఫోటోలు తీయించడం, లిపి శాస్త్రజ్ఞులు వాటిని నిశితంగా పరిశీలించి అక్షరాలను కాగితాల మీదికి ఎక్కించడం, కనిపించకుండా పోయిన భాగాలను మరొక తరహా పండితులు పూరించడం, సంగీత విద్వాంసులు స్వరసాహిత్య సమన్వయాన్ని సాధించడం, వీరంతా చర్చలు జరిపి గ్రంథాన్ని ప్రచురించడం – ఈ దశలన్నీ 1999 నాటికి పూర్తయినాయి.
అయినా, ‘ప్రథమోపలబ్ధ స్వరసహిత సంకీర్తన శిలాలేఖము’ అనే పేరుతో దేవస్థానం వెలువరించిన ఆ గ్రంథం ప్రతులు సంపాదక వర్గం వారికి, దేవస్థానం అధికారులలో కొందరికి లభించాయే గాని మార్కెట్లోకి రాలేదు. సంగీత సాహిత్య ప్రియులెవ్వరికీ అవి అందుబాటులోకి రాలేదు. దేశంలోని పెక్కు నగరాలలో గల బాలాజీ కళ్యాణ మండపాలలోని పుస్తక విక్రయశాలల్లో సైతం అవి కనిపించడం లేదు. అసలా పుస్తకాన్ని తాము ఎప్పడూ చూడలేదని దేవస్థానం వారి పుస్తక విక్రయశాలల వారే చెబుతున్నారు. ఏమైనాయి అవన్నీ?
* * * తిరుమలలో దొరికిన రెండు రాతిబండలలో ఒకదానిపై 11 రచనలు, మరొక దానిపై 10 రచనలు స్వరసహితంగా ఉన్నాయి. వాటిలో కొన్నింటికి మొదళ్ళు లేవు, మరికొన్నింటికి చివళ్ళు లేవు. ఇందుకు కారణం ఏమిటంటే, ఆ బండలు రెండూ వరుస సంఖ్యలు గల బండలు కావు. మొత్తం కనీసం ఐదు బండలు ఉండి ఉండాలనీ, వాటిలో రెండు, నాలుగు సంఖ్యలు గల బండలు మాత్రమే దొరికాయనీ, 1,3,5 నంబర్లు గల మిగిలిన మూడు ఇంకా దొరకాల్సి ఉందనీ సంగీత సాహిత్య పరిశోధకులు చెబుతున్నారు. రెండవ నంబరు బండలో గల దశావతార సూళాదిలో మొదటి రెండు అవతారాలకు సంబంధించిన రచనలు లేవు. మిగిలిన ఎనిమిది అవతారాల రచనలే ఉన్నాయి. వాటికి రాగనామాలు లేవు.
కాని, స్వరాల సంచారం అంతా నేటి ‘మాయామాళవగౌళ’ రాగానికి తగినట్లుగా ఉన్నట్లు సంగీత విద్వాన్ ఆకెళ్ల మల్లికార్జున శర్మగారు భావించారు. అన్నమయ్య కాలంలో ఆ రాగంపేరు ‘మాళవగౌళ’. కనుక ఆ పేరునే ఆయన నిర్ధారించారు. ఇక, దశావతార సూళాదిలో లోపించిన మొదటి రెండు అవతారాల సాహిత్యాన్ని మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు పూరించగా ఆ సాహిత్యానికి ఆకెళ్ళవారు స్వరరచన చేశారు. అలా ‘మాళవగౌళ’ రాగంలో దశావతార సూళాదికి పూర్తిరూపం ఏర్పడింది. ఈ సూళాదిలో లోపించిన మొదటి రెండు అవతారాల రచన దొరకకుండా పోయిన ఒకటవ నంబరు బండలో ఉండి ఉంటాయి. అలాగే, మొదళ్ళూ, చివళ్ళూ దొరకని మిగిలిన రచనల్లో కూడా లోపించిన భాగాలు దొరకని 1,3,5 బండల్లో ఉండి ఉంటాయని భావిస్తున్నారు.
* * * కడచిన యాభై సంవత్సరాలలో తాళ్ళపాక వారి సాహిత్యంపై డజన్ల కొద్దీ సిద్ధాంత వ్యాసాలు వెలువడినాయి. ఎందరో డాక్టరేట్లు తీసుకున్నారు. కాని, ఒక్కరు కూడా అన్నమయ్య సంగీత పద్ధతి గురించి ఆలోచన చేయలేదు. అన్నమయ్య గేయకవి మాత్రమే కాదు. ఆయన వాగ్గేయకారుడు. అంటే తన గేయ సాహిత్యానికి తానే స్వర రచన చేసుకున్నవాడు. రాగి రేకుల మీద ఆయన సంకీర్తనలకు రాగతాళాలున్నాయి. కాని, ఆ రచనలు స్వరసహితంగా లభించకపోవడం వల్ల ఎవరికి తోచినట్లు వారు వరసలు కట్టి పాడుతున్నారు. చాలా వరసల్లో ఔచిత్య స్పృహ కనిపించడం లేదు. వరసలు కట్టుకోడానికి కొన్ని వేల అన్నమయ్య పాటలు అందుబాటులో ఉండడం మహాభాగ్యంగా భావించుకొంటున్నారు చాలామంది.
కొందరు డిప్లొమా కోర్సు పాసవగానే అన్నమయ్యపాటకు ట్యూన్లు కట్టడం మొదలుపెడుతున్నారు. రికార్డు షాపుల్లో కుప్పలు కుప్పలుగా అన్నమయ్య కేసెట్లు, సి.డిలు దర్శనమిస్తున్నాయి. శాస్త్రీయ సంగీత కచేరీల్లో చివర ‘తుకడాలు’గా అన్నమయ్య పాటలు వినిపిస్తున్నాయి. బ్యాండు మేళాల వాళ్ళు కూడా వాయిస్తున్నారు. అన్నమయ్య సినిమాతో ఆయన ‘ఖ్యాతి’ తారాస్థాయినందుకుంది. పాపులారిటీలో ఆయన త్యాగయ్యను మించిపోయాడు.
సంగీత ఉద్యోగాల పరీక్షాపత్రాల్లో ‘ఈ క్రింది అన్నమయ్య కీర్తనను స్వరపరచి పాడి వినిపించుడు’ అనేది ఒక ప్రశ్న. దానికి అరగంటో, ముప్పావుగంటో టైము. ఇది అతిశయోక్తి కాదు, వేళాకోళం కాదు. ‘అయ్యో అన్నమయ్యా.. ఇంత లోకువైపోయావా?’ అని బాధపడాలా? గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కాడని సంతోషించాలా?
‘త్యాగరాజకృతుల్లాగా అన్నమయ్య పాటలకు వర్ణమెట్టులు లేవు కదా, మరి ఏం చేస్తాం?’ అంటారు. కాని, లేకలేక స్వరసహితంగా అన్నమయ్య పాటలు కొన్ని రాతిబ�