నాదారి తీరు -7 నా బోధన–పెద్దల మెప్పు

     నాదారి తీరు -7

                          నా బోధన–పెద్దల మెప్పు

మోపిదేవి లో నా మొదటి ఉద్యోగం ‘’.ఫ్రేష్ ఫ్రం కాలేజి .’’సబ్జెక్టు లో పెద్దగా లోతులు తెలియవు .అందుకని చాలా  కష్ట పడి నేర్చి చెప్పాలి .లేక పోతే మా తెలుగు మేష్టారు అన్నట్లు ‘’వాసనేసి పోతాను ‘’.ఒళ్ళు జాగ్రత్త గా పెట్టు కోవాలి .అందుకని ఇంటి దగ్గర సబ్జెక్ట్ బాగా చదువు కొని ఒంటికి పట్టించు కొనే వాడిని ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ చదివి జీర్ణించుకొని సబ్జెక్ట్ ను హస్త గతం చేసుకొన్నాను .అప్పుడు పిల్లలకు ప్రాక్టికల్స్ ఉండేవి నేను చాలా శ్రద్ధ తీసుకొని అందరికి అర్ధమయ్యేట్లు చెప్పి చేయించే వాడిని ఆది వారాలు కూడా క్లాసులు పెట్టె వాడిని పిల్లల్లో ఉత్సాహం పెరిగింది .టెక్స్ట్ బుక్ చూడ కుండా పాఠాలు చెప్పటం తో పిల్లల్లో మంచి క్రేజ్ వచ్చింది నా మీద .నోట్స్ బదులు కాలేజి లో ఇచ్చి నట్లు ముఖ్య మైన పాయింట్స్ చెప్పి రాయించే వాడిని అవి రాస్తే ప్రశ్నలకు సమాధానాలు సరి పోఎట్లున్దేవి .అందుకని నా నోట్స్ కు కూడా మంచి డిమాండ్ వచ్చింది క్లాస్ కు ఇన్ షర్ట్ ర్ట్ తో కాలేజి లో వెళ్లి నట్లు వెళ్ళేవాడిని అందుకని గౌరవమూ ,ఆకర్షణా పెరిగాయి .హెడ్ మాస్టర్  తూమాటి  కోటేశ్వర రావు గారు నేనంటే పరమ అభిమానం గా ఉండే వారు .ఎవరు స్కూల్ కు వచ్చినా నా గురించి వారి కి చెప్పే వారు నా బోధన ను ఆయన బాగా ప్రశంశించే వారు .ఇది నాకు లోపల సంతోషం గా ఉన్నా .దాన్ని నిల బెట్టుకోవాల్సిన బాధ్యత పెంచింది కనుక ఆ స్తాయి తగ్గకుండా ఉండాలని ఇంకా జాగ్రత్తగా బోధించే వాడిని .మిగతా టీచర్లు  కూడా నా మీదే  మంచి అభిమానం చూపే వారు కనుక ఇటు పిల్లల్లో మేస్తార్లలో నాకొక ప్రత్యెక స్థానం వచ్చింది

                        బాబు గారి దగ్గర ప్రశంస

    మొవ్వ జిల్లా బోర్డ్ హెడ్ మాస్టర్,బ్రాహ్మణులు అయిన  మొవ్వ వెంకట కృష్ణా రావు గారు ఒక సారి నేను చేరిన ఒక నెల లోపే మా స్కూల్ కు వచ్చారు .ఆయన కు నన్ను మా హెడ్ మాస్టర్ గారు పరిచయం చేస్తూ ‘’మా సైన్సు మేష్టారు చాలా బాగా పాఠా లు చెబుతారు .పిల్లలకు అయన క్లాసంటే మరీ ఇష్టం .బద్ధకం అనేది లేదు కుర్రాళ్ళ లో ఇలాంటి ఉత్సాహం ఉన్న్న వారిని నేనెప్పుడు చూడ లేదు ‘’అని చెప్పారు .ఆయన పెద్ద పేరున్న హెడ్ మాస్టర్ .ఆయన్ను అందరు ‘’బాబు గారు ‘’అని గౌరవం గా పిలిచే వారట .అదే మొదటి సారి నేను వారిని చూడటం .అయన సంతోషం తెలియ జేస్తూ ‘’కోటేశ్వర రావు !కొత్తలో అందరూ ఇట్లాగే ఉంటారు .ఒక ఏడాది దాటితే ఈ పొంగూ ,ఉత్సాహం నీళ్ళు కారి పోతాయి .మనం ఏం చేశాం జ్ఞాపకం లేదా “?అని తేలిగ్గా తీసి పారేశారు .వెంటనే మా హెడ్ మాస్టారు ‘’బాబు గారూ !ఇప్పుడు కాదు అయన సర్వీసు అంతా ఇలానే ఉంటారు నాది గారంటీ .మెతుకు చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పినట్లు ఈ నెల లోనే వారి సత్తా ఏమిటో నాకు తెలిసింది బోధనా అణకువా ,వినయం ,విధి నిర్వహణా ,గౌరవం అన్నీ ఉన్న వారు నాకు ఆయన మీద ఏమీ అనుమానం లేదు ‘’అని భరోసాగా  మాట్లాడి ఆయనకు సమాధానం చెప్పారు నా మీద మా హెడ్ మాస్టర్ గారికి ఒక్క నెలలో ఇంత సదభి ప్రాయం కలగటం దాన్ని బాబు గారు లాంటి పెద్దల సమక్షం లో ప్రశాసించటం నాకు మరీ ఆశ్చర్యం కలిగించి నన్ను నేను ఎప్పుడు కరెక్ట్ చేసుకోవటానికి వీలు చిక్కి ఆ స్తాయి బోధనా ,ప్రవర్తన నుండి ఒక్క సెంటి మీటర్ కూడాజారకుండా  నా సర్వీసు అంతా కాపాడుకో గలిగాను ఇది కోటేశ్వర రావు గారి అభిమానం .ఒక రకం గా ఆశీర్వాదం కూడా..నాకు మార్గ నిర్దేశం చేసినట్లయింది .అంత కంటే కొత్త గా ఉద్యోగం లో చేరిన వాడికి కావల్సిందేముంది ?అప్పుడు సైన్సు అంటే భౌతిక ,రసాయన శాస్త్రాలు జంతు వృక్ష శాస్త్రాలు పాఠాలుగా ఉండేవి అన్నీ ఒక్క మేస్టారే చెప్పాలి .అన్నీ బాగా ప్రిపేర్ అయి చెప్పేవాడిని పిల్లలకు ఆపి చదువులకు వెళ్తే ఉపయోగ పాడుతాయని తెలుగు పదాలకు ఆంగ్ల సమాన పదాలు కూడా చెప్పేవాడిని .అవసరమైతే ఇంగ్లీష్ లో కూడా బోధించేవాడిని సైన్సు ను .అది మరీ నచ్చేది విద్యార్ధులకు యెన్.ఎస్ ప్రసాద రావు పుస్తకమేఉండేది ..

                          నాకు మొదటి ఇన్ స్పెక్షన్–సీతారావమ్మ గారి తనిఖీ 

         నేను చేరిన రెండు నెలలకే సీతా రావమ్మా గారు అనే డి.యి.వో.స్కూల్ ఇన్స్పెక్షన్ కు వచ్చారు ఆమె అంటే అందరికి హడల్ అని చెప్పుకొనే వారు చాలా నిజాయితీ గా ఉండే వారని పేరు ..రూల్స్ అన్నీ బాగా తెలిసినావిడ అని అనుకొనే వారు .హెడ్ మాష్టారంటే ఆమెకు మహా గౌరవం ఆయన కూడా ‘’అమ్మా అమ్మా ‘’అంటూ భక్తీ చూపే వారు .ఆవిడ అన్ని క్లాసులు చూసే వారు దీన్ని తనిఖీ అంటారు .అన్ని సబ్జెక్టులు చూసే వారు లెక్కలు తెలుగు అంటే ఆమెకు అభిమానం .నాక్లాస్ కు రమ్మ మని నేను కోరాను భయం లేకుండా ‘’నువ్వు కొత్తగా వచ్చావు .నీ క్లాస్ చూడన్లె ..అంత అవసరం లేదు నీ క్లాసులకు వెళ్లి సబ్జెక్టు చెప్పుకో ‘’అన్నారు .నేను వెనక్కి తగ్గకుండా ‘’అమ్మా ! నా ఖాళీ పీరియడ్లలో మీరు ఇన్స్పెక్షన్ చేసే క్లాస్ లకు వచ్చి కూచోవటానికి పర్మిషన్ ఇస్వ్వండి ‘’అన్నాను ఆవిడ నవ్వుతు ‘’సరే నీ ఇష్టం‘’అంది అలాగే ఆమె వెంట క్లాస్ లకు వెళ్లి వెనక బెంచి లో కూర్చుని ఆమె వేసే ప్రశ్నలు మేస్టార్లు బోధించే తీరు ఆకళింపు చేసుకొన్నాను .ఒకో సారి ధైర్యం గా పిల్లల్ని ఆవిడ బదులు నేనే ప్రశ్నించే వాడిని ఆవిడా నవ్వుతు నా చొరవ కు ఆనందించేది .ఇది నాకు మరీ హుషారు నిచ్చింది .రెండు రోజుల ఇన్స్పెక్షన్ .రోజు బందరు నుంచి వచ్చేది అసెంబ్లీ నుండి అన్నీ చూసేది నేను పిల్లలతో చార్టులు వేయించాను ప్రాక్టికల్స్ చేయిన్చినవన్నీ రికార్డ్ రాయించి ఆవిడాతనిఖీ కి పెట్టాను అన్నీ చూసింది చిన్న  తెలుగు మేస్టారు అదే ‘’వాసన మేస్టారు ‘’క్లాస్ కు వెళ్లి ఆయన పద్యం బోధించే తీరుకు చదివే విధానానికి అత్యాస్చర్య పోయింది భలే మెచ్చింది స్టాఫ్ మీటింగ్ సమయం లో .రెండు రోజులు సరదాగా గడిచి పోయాయి స్కూల్ అన్నిటా ముందు ఉంది అని హెడ్ మాస్టార్ని ప్రశంసించింది .

               వాసన మేస్టారి నాన్న గారు గొప్ప సంస్కృత పండితులు .శివాలయం లో ఉండి అభిషేకాలు అవీ చేయించే వారు గోపాల కృష్ణ కు పిల్లలు లేరు యెర్రని కుంకుమ నుదుట పెట్టుకొనే వాడు .మేమిద్దరం ఖాళీ పీరియడ్ లలో కలిసి నప్పుడు సాహిత్యం గురించే మాట్లాడుకొనే వాళ్ళం అయన సాహితీ నిధి అని అని పించింది నాకు .ఒక సారి ఏదో ప్రస్తావన లో మను చరిత్ర లో పెద్దన గారి ‘’పూత మేరుమ్గులున్ ‘’అన్న పెద్ద పద్యం విషయం వచ్చింది నీకోచ్చా ఆపద్యం అని అడిగా రాదన్నాడు నాకూ రాదన్నాను అయితే ఒక వారం లో మనం దాన్ని సాధన చేసి బట్టీ పట్టుదాం అన్నుకోన్నాం ఇద్దరం రోజూ చదువు కొనే వాళ్ళం వారాని కంటెముందే ఆ పద్యం నాకు కంఠతా వచ్చేసింది ఆయనకు నాకంటే ఆలస్యం గా వచ్చింది .అప్పుడు ‘’బలే వాసనేశావ్ తెలుగు మేస్తర్ కంటే ముందే నేర్చాశావ్ .అందుకే నువ్వంటే నాకు ఇష్టం‘’అన్నాడు నన్ను అభి నందిస్తూ ఆ ఉత్పల మాలా దీర్ఘ పద్యం నిద్ర లేపి అడిగినా చెప్పగలిగే వాణ్ని ఆ తర్వాతా .ఇది ఆయన చలవే .ఆ పోటీ లేక పోతే అది నోటికి వచ్చేది కాదు ఆయన్ను ‘’నీకు రాకుండా నాకు ముందు ఎలా వచ్చిందో ఆశ్చర్యం నువ్వు కావాలనే అశ్రద్ధ చేశావ్ ‘’అన్నాను కాదని తనకంటే నేను లేత కనుక వెంటనే వచ్చిందని  తనకేమీ బాధ లేదని ఆనందం గా ఉందని అన్నాడు అతను సిగరెట్లు బానే పీల్చేవాడు క్లాసు అవటం ఆలస్యం దమ్ము కొట్టే వాడు అసలే నలుపు .పెదిమలు ఇంకా నల్ల బడేవి పొగకు .అలా మా స్నేహంగట్టి పడింది .పెద్ద తెలుగు మేస్టారు రామ క్రిష్నయ్య గారికి ఈయన తో చనువుగా ఉండటం నచ్చేది కాదు .ఆయన పెద్దగా సాహిత్య విషయాలు మాట్లాడే వాడు కాదు ఇక్కడే కాదు ఆ తర్వాతా నేను పని చేసిన ప్రతి స్కూల్లో ను తెలుగు మేస్తర్లె నాకు ఆప్తులయ్యే వారు .గోపాల కృష్ణ నేను అక్కడి నుండి వచ్చిన తర్వాతా ప్రొమోషన్ పొంది సీనియర్ తెలుగు పండిట్ గా ఏంటి.రామా రావు ఊరు నందమూర్ హైస్కూల్ లో పని చేశాడు రామా రావు కొడుకు హరికృష్ణ ఈయన విద్యార్ధి అని చెప్పేవాడు అతనితో డ్రామాలు వేయించే వాడినని చెప్పాడు .

                      వెంకయ్య గారి ఇన్స్పెక్షన్ –బూజు పాఠం

     సీతారావమ్మ గారి తర్వాత పి. వెంకయ్య గారు అనే ఆయన డి.యి.వో.గా వచ్చారు .ఈయనకూ మంచి పేరుంది మూతి తమాషా గా ఉండేది నల్లగా ఉండే వారు సీతా రావమ్మ గారు చీరే తో ఉండేవారు ఈయన కోటు బూటు తో ఉండేవారు రెండో ఏడాది వెంకయ్య గారు ఇన్స్పెక్షన్ కు వచ్చారు అప్పుడే బందరు అతను వావిలాల వారబ్బాయి సోషల్ కు ఇక్కడికి వచ్చి చేరాడు మనిషి చూడటానికి స్పోటకం మచ్చలతో వికృతంగా ఉండే వాడు బోధనా సరిగ్గా ఉండేది కాదు .మాట విని పించేది కాదు తనకి తెలీకుండా ఇక్కడికి వచ్చాడని హెడ్ మాస్టర్ గారికి ఆయన మీద కోపం .ఎలాగైనా డి.యి.వో.తో అయన క్లాస్ కు రప్పించి అభాసు చేయాలని కోటేశ్వర రావు గారు అన్ని రకాల పన్నాగాలు పన్నారు .కానీ వాళ్ళ నాన్న బందరు లో పెద్ద పేరున్న లాయర్ .మాకు బంధువులు .ఆయన ఉయ్యూరు వస్తూండే వారు వెంకయ్య గారిని బందర్లో ముందే కలిసి కొడుకు సంగతి చెప్పి జాగ్రత్త పడ్డారు .నేనూ ఇక్కడ అతనికి బాసట గ నిల బడ్డాను .ఎంత ప్రయత్నం చేసి ఈయన క్లాస్ కు తీసుకు వెళ్దామని ప్రయత్నించినా వెంకయ్య గారు నవ్వుతు దాటేసి వేరే క్లాస్ లకు వెళ్ళే వారు అసలు ఆయన్ను చూడకుండానే ఇంకో సోషల్ మేస్తర్ క్లాస్ చూసి అయిందని పించి హెడ్ గారికి దిమ్మ తిరిగేట్లు చేశారు ఈయన నిప్పు తొక్కిన కోతి లా గంతులు వేస్తూనే ఉన్నారు .అదీ అధికారి చాకచక్యం ..

           వెంకయ్య గారి తనిఖీ లో నేను ‘’బూజు ‘’పాఠం’’ను ఎస్ ఎస్ ఎల్ సి క్లాస్ కు . ఆయన పరమానందం పొందారు నన్ను బాగా మెచ్చారు .స్టాఫ్ మీటింగ్ లో మాట్లాడుతూ కూడా నన్ను గురించి మంచి మాటలు చెప్పటం హెడ్ మాస్టారికి ఆనందం కల్గించింది కొంత కాలానికి ఈ వావిలాల సోషల్ మేస్తార్ని ట్రాన్స్ఫర్ చేయించేశారు తూమాటి వారు .ఒక లేడి విజయ లక్ష్మి అనే ఆవిడ వచ్చింది తర్వాతా కైకలూర్ నుండి గోపాల కృష్ణమూర్తి  అనే అయన వచ్చాడు ఈయన సరదా మనిషి ఆవిడ మంచి మనిషి .ఇలా నా కు అక్కడ ఉండగా రెండు సార్లు ఇన్స్పెక్షన్ జరిగింది .

                          పరీక్ష

        తొమ్మిదో తరగతి చదివే రావివారి పాలెం ఆర్.ఏం.పి.బ్రాహ్మాణ డాక్టర్ గారి చెల్లెలు .ఎందుకో రోజు క్లాస్ కు వెళ్లి నప్పుడు బయటా నవ్వుతు ఉండేది చనువు గా దగ్గరికి రావటానికి ప్రయత్నించేసెది.నేనేమీ చనువు ఇవ్వలేదు .ఒక సారి ఒక కవర్ లో’’ ప్రేమ లేఖ ‘’రాసి పోస్ట్ చేసింది నాకు ముచ్చెమటలు పట్టాయి .ఏం చేయాలో తోచలేదు .రామణా రావు గారు నా అంత రంగికులు ఆయన తో రహస్యం గా చెప్పాను .ఆయనా కంగారు పడ్డారు ఇది అందరికీ తెలిస్తే నాకే కాదు ఆ అమ్మాయికీ ప్రమాదం .అని మేమిద్దరం శర్మ గారికి చెప్పాం .ఆయన కంగారేమీ పడ వద్దని ఆ అమ్మాయి అన్నగారు తనకు చాలా కాలం గా తెలిసిన వారేనని మనముగ్గురం ఒక రోజు వాళ్ళింటికి వెళ్లి ఆయనతో చెబుదామని భరోసా ఇచ్చారు సరే నన్నాం .ఒక ఆదివారం మేము ముగ్గురం సైకిళ్ళు వేసుకొని రావి వారి పాలెం వెళ్ళాం. డాక్టర్ గారు మమ్మల్ని సాదరం గా ఆహ్వానించారు కాఫీలు ఇచ్చారు అప్పుడు నెమ్మదిగా శర్మ గారు ఆ అమ్మాయి రాసిన ఉత్తరం సంగతి చెప్పారు ఆయన ఆశ్చర్య పడ్డారు అయితే శర్మ గారు చాలా లౌక్యులు ఆ అమ్మాయికి ఈ విషయం చెప్ప వద్దని మేము మామూలుగా వచ్చినట్లే నని అనుకోనేట్లు చేయమని చెప్పి ఆ అమ్మాయి రాసిన లేఖ ను ఆయన చేతిలో పెట్టారు .అయన చదివి ముఖం చిన్న బుచ్చుకొని తన కుటుంబం పరువు కాపాడి బజారున పడ కుండా చేసిన మ ముగ్గురికి కృతజ్ఞత చెప్పారు ఇక నుండి ఆమెను జాగ్రత్త గా కనీ పెట్టి ఉంటానని ఈవిషయాలేవీ తనకు తెలియనట్లు గానే ఉంటానని చెప్పి మా ఎదుటే ఆమె రాసిన ఉత్తరాన్ని చించి పారేశారు కవరు తో సహా..హమ్మయ్య అనుకొన్నాం .శర్మ గారి తెలివికి మేమందరం ఆశ్చర్య పడ్డాం ఈ విషయం ఎవ్వరికీ మాకు తప్ప తెలీకుండా జాగ్రత్త పడ్డం ఇలా ఒక కఠిన పరీక్ష నుంచి నన్ను గట్టున పడేశారు శర్మ గారు .ఆయన ఋణం తీర్చుకో లేనిది .ఈ ఉదంతం తో శర్మ గారికి నా మీద బోలెడు అభిమానం కలిగింది మరీ దగ్గిరయ్యాను అయన చెల్లెలు దుర్గ అనే అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయాలనే కోరిక ను ఒక సారి తెలియ జేశారు నేను నాకు మేన మామ కూతురు ఉందని మర్యాదగా చెప్పి ఆ విషయం లో ఇక ముందుకు వెళ్ళకుండా చేశాను అయినా అలాచెప్పి నందుకు ఆయన సంతోషించి స్నేహం పెంచుకొన్నారు కాని తుంచు కోలేని సంస్కారం శర్మ గారిది అలాంటి వారు దొరకటం నా అదృష్టం .ఆ తర్వాతా శర్మ గారికి హెడ్ మాస్టర్ గా ప్రొమోషన్ వచ్చి వెళ్ళారు పడమట హెడ్ మాస్టర్ గా చేసి రిటైర్ అయ్యారు .కృష్ణ జిల్లా గిల్డ్ ప్రెసిడెంట్ ను చేశాం ఆయన్ను .ఆదర్శ వంతమైన హెడ్ మాస్టర్ గా పేరు పొందారు శర్మ గారు . అ నేను స్కూల్లో చేరక ముందే కుటుంబ శాస్త్రి అనే లెక్కల మేష్టారు జూనియర్ కాలేజికి పింగళి అయన ,హెడ్ గా మా ఇంటి ఓనర్ గోపాల కృష్ణ మూర్తి గారు లెక్చరర్ గా మార్కండేయులు గారు హెడ్ గా ప్రొమోషన్ మీద వెళ్లి పోయారు వీరంతా దిగ్దంతులని పేరు పొందిన వారే మార్కండేయులు గారు నూజివీడు హెడ్ గా పని చేసి రిటైర్ అయారు .వాళ్ళబ్బాయి అమర్ నాద్ మా  అబ్బాయిలకు లెక్కలు చెప్పేవాడు ఒల్లో లేకలాల్ ప్రైవేట్ మేస్తర్ గా బాగా పెఉ ,డబ్బూ సంపాదించాడు డిగ్రీ ,ఇంటర్ లకు బాచీలు బాచీలుగా తూషణ్ చెప్పాడు .అమ్మాయిలూ మాకు బాగా పరిచయం ఆయన గుర్రప్పందాలలో డబ్బు కాసే వాడని పేకాడే వాడని ప్రసిద్ధి నస్యం పీల్చేవాడు .పింగళి అయన తో కూడా కొంత పరిచయం .

             సశేషం

                  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్—23-2-13- ఉయ్యూరు 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

1 Response to నాదారి తీరు -7 నా బోధన–పెద్దల మెప్పు

  1. ‘పూ(త మెరుంగులుం బసరుపూపబెడంగులుం జూపునట్టివా కైతలు’ అంటూ మొదలయ్యే పద్యమాలిక అల్లసాని పెద్దన
    రచనే కానీ మీరు పేర్కొన్నట్లుగా అది “మను చరిత్రము”లోనిది కాదు.భువన విజయ సభలో రాయల వారు పెద్దన పాదానికి గండపెండెరం తొడిగే సందర్భంగా పెద్దన ఆశువుగా చెప్పిన ముప్పది పంక్తుల సుదీర్ఘ పద్యమాలిక అది.
    గమనించగోర్తాను. — ముత్తేవి రవీంద్రనాథ్, తెనాలి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.