మా మంచి స్నేహితుడు మా నాన్న

మా మంచి స్నేహితుడు

తెలుగు సినీ సాహితీ లోకంలో పండువెన్నెలలు కురిపించే నిండుచంద్రుడు పద్మభూషణ్ డాక్టర్ సి. నారాయణరెడ్డి. నదీమ తల్లులను తన నలుగురు కుమార్తెల పేర్లలో ఇముడ్చుకున్న ఆయన తన ప్రేమతో అల్లుళ్ల హృదయాలనూ దోచుకున్నారు. ఒకే కుటుంబంలా జీవిస్తున్న ఆ ఇంటికి పెద్దదిక్కుగా ఉంటూ 82 ఏళ్ల వయసులో సైతం సాహితీ సేవను కొనసాగిస్తున్నారు. ఆయన పెద్దకుమార్తె సింగిరెడ్డి గంగ తండ్రితో తన అనుబంధాన్ని గురించి తెలియచేస్తున్న విశేషాలే ఈ వారం ‘నాన్న-నేను’.
మేము నలుగురం అక్కచెల్లెళ్లం. నేను పుట్టకముందు మా అమ్మకు నలుగురు మగపిల్లలు పుట్టి పురిట్లోనే చనిపోయారు. దాంతో నేను బతికి బట్టకడితే నాకు గోదావరి నది పేరును పెట్టుకుంటానని అమ్మ మొక్కుకుందిట. దాంతో, మా ఊరికి దగ్గర్లో ప్రవహించే గోదావరిపాయ పేరిట ‘గంగ’ అని పెట్టింది. నాన్నకు నదులన్నా, ప్రకృతి అన్నా చాలా ఇష్టం. అలా మా చెల్లెళ్లకు వరుసగా యమున, సరస్వతి, కృష్ణవేణి అని పేర్లు పెట్టారు. 1962లో నాన్న సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్.టి.రామారావుగారు నటించిన ‘గులేబకావళి కథ’ పాటల రచయితగా నాన్న మొదటి సినిమా.

అప్పటికి నాకు ఏడేళ్లు. మొదటి సినిమాతోనే నాన్న చాలా బిజీ అయిపోయారు. పాటలు రాయడానికి మద్రాసుకు వెళ్లి రోజుల తరబడి ఉండిపోయేవారు. నాన్న అక్కడకు వెళ్లినా మనసంతా ఇక్కడే ఉండేది. అప్పట్లో ఎస్‌టిడి సౌకర్యం లేదు. ట్రంక్‌కాల్ చేసి రెండు రోజులకోసారి మాట్లాడేవారు.

నాన్న అక్కడి నుంచి మా యోగ క్షేమాలు అమ్మను అడిగి కనుక్కునేవారు. అయితే ఆయన ఎప్పుడు మాట్లాడినా “పిల్లలు రోజూ శుభ్రంగా పళ్లు తోముకుంటున్నారా?” అని మాత్రం అడగడం మరచిపోయేవారు కాదు. ఊరు నుంచి తిరిగిరాగానే ఆయన మొదట చేసే పని మా నలుగురిని వరుసగా నిలబెట్టి పళ్లు చెక్ చేయడం. పళ్లు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని ఆయనకు గట్టి నమ్మకం. ఇప్పటికీ మునిమనవళ్లను దగ్గరకు పిలిచి వాళ్ల పళ్లను చెక్ చేస్తుంటారు నాన్న.

భాషాభిమాని
నాన్నకు తెలుగు భాషంటే ఎంతో మమకారం. ఆ కారణం చేతనే నన్ను, ఇద్దరు చెల్లెళ్లను తెలుగు మీడియంలోనే చదివించారు. ఆఖరు చెల్లెలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదివింది. నాకు ఊహ తెలిసేసరికి మేము అశోక్‌నగర్‌లో ఉండేవాళ్లం. అప్పట్లో చాలామంది సాహితీ ప్రముఖులు నాన్న కోసం ఇంటికి వచ్చేవారు. వారు మాట్లాడుకుంటుంటే ఆసక్తిగా వినేదాన్ని. ఆ రోజుల్లో నాన్న సాహితీ కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉండేవారు. ప్రతిరోజు సాయంత్రం ఎక్కడో అక్కడ సన్మానం లేదా విందు సమావేశాలు జరుగుతుండేవి. దీంతో నాన్న సాయంత్రం బయటకు వెళుతుంటే రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేస్తారో లేదో కనుక్కోమనేది అమ్మ.

“నాన్నా! దండల మీటింగా… భోజనాల మీటింగా?” అని అడిగేదాన్ని. సన్మాన సభలైతే ఇంటికి దండలు వచ్చేవి. అదే విందు సమావేశాలైతే అక్కడే భోంచేసి వచ్చేవారు నాన్న. నాన్నకు మనసులో ఏ విషయం దాచుకోవడం అలవాటు లేదు. ఏ ఊరెళ్లి వచ్చినా అన్ని విషయాలు సినిమా కథలా కూర్చోబెట్టి చెప్పేవారు. మాకు చిన్నప్పటి నుంచి నాన్న దగ్గర చనువు ఎక్కువ. ఆయన కూడా ఒక స్నేహితుడిలా మాతో ఉంటారే తప్ప తన పట్ల భయభక్తులు ప్రదర్శించాలని ఏనాడూ కోరుకోరు.

అనారోగ్యంలోనూ నాన్న కోసమే…
అమ్మకు 1962లో పక్షవాతం వచ్చింది. చికిత్స కోసం నాన్న, నేను, పెద్దచెల్లెలు అమ్మను తీసుకుని మద్రాసు వెళ్లాం. మిగిలిన ఇద్దరు చెల్లెళ్లు అమ్మమ్మ వాళ్ల ఊర్లో ఉండిపోయారు. మద్రాసులో ఒక ఏడాదిన్నర పాటు ఉన్నాం. అప్పుడు నాన్న చాలా కష్టపడ్డారు. ఒక పక్క సినిమాలకు పాటలు రాయడం, మరో పక్క అమ్మకోసం ఆసుపత్రుల చుట్టూ తిరగడం. మద్రాసులో కొంతకాలం, రాయవెల్లూరులో కొంతకాలం అమ్మకు చికిత్స జరిగింది. ఏమాత్రం గుణం కనిపించకపోవడంతో మళ్లీ అమ్మను తీసుకుని హైదరాబాద్ వచ్చేశాం. అమ్మ లేవలేని పరిస్థితిలో ఉండడంతో మా నలుగురి బాధ్యత నాన్నపైన పడింది. కొంతకాలానికి అమ్మకు ఒక కాలు, ఒక చెయ్యి మాత్రం స్వాధీనంలోకి వచ్చాయి.

ఒక మనిషి సాయంతో వంటింట్లో స్టూలు పైన కూర్చుని నాన్నకు ఇష్టమంటూ నాన్‌వెజ్ తనే చేసేది. అమ్మకు దైవభక్తి ఎక్కువ. నాన్నకు అలాంటివేవీ లేవు. అమ్మ ప్రతి శనివారం ఉపవాసం ఉండేది. “ఆ దేవుడు నీకు ఏమిచ్చాడని అమ్మా ఇంకా ఆయననే నమ్ముతున్నావు?” అని నేనెప్పుడైనా అంటే “మీ నాన్నను, మిమ్మల్ని కనీసం ఈ కళ్లతో చూసే భాగ్యాన్ని కల్పించాడు కదమ్మా” అంటూ నవ్వేది. నాన్నకు అమ్మ వంట అంటే చాలా ఇష్టం. కొర్రమీను చేపన్నా, ఉలవచారన్నా చాలా ఇష్టంగా తినేవారు. చిన్నప్పుడు వాళ్లమ్మ హనుమాజీపేటలో రోజూ మాంసం దొరకదని పక్క ఊర్ల నుంచి తెప్పించి మరీ పెట్టేదట.

ఒక్కరోజు నాన్‌వెజ్ లేకపోయినా నాన్న అలిగి అన్నం తినడం మానేసేవారట. అలా అమ్మ గారాబంలో పెరిగిన నాన్నకు రుచుల విషయంలో మాత్రం పట్టింపులెక్కువ. కూరలు ఒకేలా వండితే ఆయనకు నచ్చదు. అవి ఇవి కలిపి వండొచ్చు కదా అంటూ ఉంటారు. ఇప్పటికీ వంటలు రుచిగా లేకపోతే మాతోపాటే పెరిగిన మా నాన్న సహాయకుడు రాములును మెచ్చుకుంటూ “మీకన్నా వాడే నయం… అమ్మ దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి చక్కగా వంటలు చేస్తాడు” అని దెప్పిపొడుస్తుంటారు.

ఎన్టీఆర్‌తో అనుబంధం
నాన్నకు సినిమారంగంలో కొందరు ఆత్మీయమైన స్నేహితులు ఉండేవారు. నిర్మాత డీవీఎస్ రాజుగారు, ఎస్వీఎస్ ఫిలింస్ అధినేత మిద్దె జగన్నాథరావుగారు నాన్నకు మంచి మిత్రులు. మద్రాసులో ఎక్కువగా జగన్నాథరావుగారింట్లోనే ఉండేవారు నాన్న. అలాగే గుమ్మడిగారు, మిక్కిలినేనిగారు, పుండరీకాక్షయ్యగారు కూడా నాన్నకు ఆప్తులు. అక్కినేని నాగేశ్వరరావుగారంటే కూడా నాన్నకు చాలా అభిమానం. ఇక, ఎన్టీ రామారావుగారితో నాన్నగారి అనుబంధం అందరికీ తెలిసిందే. రామారావుగారికి కూడా మేమంటే చాలా అభిమానం. ఎప్పుడూ మా యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండేవారు.

శ్రీనాథుడు, బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాలకు నాన్న పాటలు రాసినప్పుడు రామారావుగారు ఓకే చేసిన పాటలను నాన్న డిక్టేట్ చేస్తుంటే నేను ఫెయిర్ కాపీ రాసేదాన్ని. వాటిని తీసుకెళ్లి రామారావుగారికి ఇచ్చినప్పుడు, “అమ్మాయిగారు రాసిన తర్వాత మళ్లీ వేరే వాళ్లతో కాపీ చేయించడం ఎందుకు? ఇదే చాలా బాగుంది” అంటూ ఆయన నా రాతను మెచ్చుకునేవారు.

మా ఇంట్లో జరిగే ఫంక్షన్లకు ఆయన తప్పకుండా వచ్చేవారు. నాన్న కంట్లో నీళ్లు రెండు సార్లే చూశాను. ఎన్టీరామారావుగారు మరణించినప్పుడు తన సొంత సోదరుడిని కోల్పోయినట్లు బాధపడ్డారు. అలాగే తన బాల్యస్నేహితుడు, యూనివర్సిటీలో తన సహచర అధ్యాపకుడు అయిన ఇరివెంటి కృష్ణమూర్తిగారి మరణం కూడా నాన్నను బాగా కృంగదీసింది. ‘విశ్వంభర’ రచనాకాలంలో ఆయన నాన్నకు కుడిభుజంలా ఉండేవారు.

నాన్న జేబులు ఖాళీ
నాన్నకు మొదటి నుంచి డబ్బు వ్యవహారాలంటే పట్టదు. ఆయన జేబులో ఒక్క రూపాయి కూడా ఉంచుకోరు. నాకు కొంచెం జ్ఞానం వచ్చినప్పటి నుంచి నా చేతికే నాన్న డబ్బులిచ్చేవారు. మద్రాసు నుంచి నాన్న వస్తున్నారంటే నేను కారు తీసుకుని ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాల్సిందే. విమానం దిగి బయటకు వచ్చిన వెంటనే తన చేతిలోని బ్రీఫ్‌కేసును నా చేతిలో పెట్టేసి “హమ్మయ్య! భారం దిగింది” అంటూ ఊపిరి పీల్చుకునే వారు నాన్న. మా ఇంట్లో నాన్న కవిత్వ వారసత్వం నా మనవరాలు(కూతురి కూతురు) వరేణ్యకు వచ్చింది. ఇప్పుడు దానికి 12 ఏళ్లు. నాలుగేళ్ల కిత్రమే అమెరికాలో ఉన్నప్పుడు ఒకఆంగ్ల కవితల సంకలనాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు మరో సంకలనం తెస్తోంది. మా ఇంట్లో పిల్లలందరికీ నాన్నే పేర్లు పెట్టారు.

అందులోనూ నాన్న కవిహృదయం కనపడుతుంది. మా అబ్బాయి పుట్టినప్పుడు నాన్న రాసిన ‘ఇంటి పేరు చైతన్యం’ పుస్తకం విడుదలైంది. దాంతో వాడికి ‘చైతన్య’ అని పేరుపెట్టారు. మా అమ్మాయికి మనస్విని అని, పుట్టినప్పుడు బాగా కాళ్లు ఆడించే చెల్లెలి కొడుకుకు ‘లయచరణ్’ అని, ఎప్పుడూ కళ్లతో వెదికే మరో చెల్లెలి కొడుక్కి ‘అన్వేష్’ అని, మేడే నాడు పుట్టిన మనవడికి ‘క్రాంతి కేతన్’ అని, పుట్టినప్పుడు కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా ఉన్న మనవరాలికి ‘మౌక్తిక’ అని పేర్లు పెట్టారు.

కలసి ఉంటేనే సుఖం: నాన్నకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంటే చాలా ఇష్టం. అందరూ కలిసి ఒకే కుటుంబంగా ఉండాలని ఆయన కోరుకుంటారు. నాలుగు తరాలు ఒకే ఇంట్లో నివసించడం మా ఇంటి ప్రత్యేకత. పెళ్లయినా అమ్మానాన్నలను విడిచి వెళ్లకూడదని నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. పెళ్లయిన తర్వాత కుమార్తెలు అత్తగారింటికి ఎందుకు వెళ్లాలి? తల్లిదండ్రుల దగ్గరే ఎందుకు ఉండకూడదు? అని అనుకునేదాన్ని. జన్మతః వచ్చిన ఇంటిపేరు పెళ్లి తర్వాత మారిపోవడం కూడా నాకు ఇష్టం ఉండేది కాదు. మా వారు ఒకసారి నాకు తెలియకుండా తన ఇంటి పేరును చేర్చి నా పేరిట ఒక ఇంటి స్థలం కొన్నారు.

ఆ విషయం తెలిసి మళ్లీ ‘సింగిరెడ్డి గంగ’ పేరిట ఆ దస్తావేజులను మార్చేంతవరకు నేను నిద్రపోలేదు. నేనే కాదు మా చెల్లెళ్లు ఎవరూ తమ ఇంటి పేరు మార్చుకోలేదు. నా పెళ్లయిన తర్వాత నేను, నా భర్త నాన్న దగ్గరే ఉండిపోయాం. ఆ తర్వాత చెల్లెళ్లు, వాళ్ల భర్తలు కూడా మాతోనే కలసి ఉంటున్నారు. అలా మా పిల్లలు, వాళ్ల పిల్లలు కూడా ఒకే కుటుంబంగా ఉంటున్నాం. మాకు మా నాన్న ముఖ్యం. మా పిల్లలకు కూడా తాతయ్యంటే ప్రాణం. నాన్నకు మేమే కాదు మనవళ్లు, మునిమనవళ్లతో కూడా మంచి అనుబంధమే ఉంది.

మా అమ్మాయి తన భర్తతో కలసి అమెరికాలో పదేళ్లు ఉండి వచ్చింది. అప్పట్లో అమ్మాయి డెలివరీ కోసం నేను నాన్నను వదిలి నాలుగు నెలలు అమెరికా వెళ్లాల్సి వచ్చింది. నాన్నను అంతకాలం ఎప్పుడూ వదిలి ఉండకపోవడంతో విమానం ఎక్కిన వెంటనే నాకు ఏడుపు ఆగలేదు. పక్కనే కూర్చున్న ఓ విదేశీ వనిత ఎందుకు ఏడుస్తున్నావని అడిగితే విషయం చెప్పాను.

మీ వయసెంతని ఆమె అడిగి “ఈ వయసులో కూడా తండ్రి కోసం తపిస్తున్నారా? మీ దేశంలో ఇంతలా సెంటిమెంట్స్ ఉంటాయా” అంటూ ఆశ్చర్యపోయింది. మా నాన్నను మేము ఎంతగా ప్రేమిస్తామో ఆయన మమ్మల్ని అంతకన్నా రెట్టింపుగా ప్రేమిస్తారు. అనుక్షణం మా కోసం తపిస్తారు. కూతుళ్లమైన మాపైనే కాదు…అల్లుళ్లపైన కూడా అంతే ప్రేమాభిమానాలు కనబరుస్తారు. నాన్న కలం నుంచి జాలువారే కవితలే కాదు..ఆయన హృదయమూ ప్రేమామృతమే.

సుధాకర్ తొయ్యేటి
ఫోటో : నరేష్ వరికిల్ల

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.