బడి ‘భాగవతం’

బడి ‘భాగవతం’


అరుణ పప్పు

ఇక్కడ నడుస్తున్న విద్యావిధానానికి ముగ్థురాలైన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి వాళ్లకో చక్కటి భవనాన్ని కానుకగా ఇచ్చారు. అంతేనా, ప్రతి తరగతి గదికీ ఓ కంప్యూటర్. అందులోనే పాఠాలన్నీ నిక్షిప్తమయి ఉంటాయి. లెక్కలైనా, సైన్సయినా, ఇంగ్లీషయినా… కంప్యూటర్‌లో సినిమా చూసినంత సులువుగా చూసెయ్యడమే. తర్వాత దాని గురించిన చర్చ, రన్నింగ్ నోట్సు రాసుకోవడం, విషయాన్ని అర్థం చేసుకోవడం. పాఠం మేస్టార్లు చెప్పడమూ, విద్యార్థులు కష్టపడి గుర్తుంచుకోవడమూ అన్న పద్ధతే రద్దయిపోయింది. దానికి మారుగా నేర్చుకున్న ప్రతి విషయమూ ఆ పసిమనసుల్లో అక్షరమక్షరమూ అచ్చయిపోతుందంతే.

– అక్కడి బడికి పిల్లలు పరుగులు తీస్తూ వెళతారు, లోపల పనులు చేస్తూ కనిపిస్తారు. ఈ చిత్రం చూసి ముచ్చటపడి ఇన్ఫోసిస్ సుధామూర్తి వాళ్లకో చక్కటి భవనం కట్టించి ఇచ్చారు!
– అక్కడి రైతులు నిరుపయోగమైన మడులను తీసుకుంటారు, వాటిని సాగుచేస్తూ కనిపిస్తారు. ఈ విచిత్రానికి ఆశ్చర్యపోయి ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా ఒక కృషి విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించి ఇచ్చింది.
– అక్కడి గుడులు భజనలు చేస్తూనే సామాజిక మార్పుకు శ్రీకారం చుడుతుంటాయి.
ఎక్కడ ఇదంతా?
విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి సమీప గ్రామం హరిపురమే కేంద్రం.
ఎవరు చేస్తున్నారిలాగ?
భాగవతుల ఛారిటబుల్ ట్రస్టు.
‘ఓ ఇదా, మాకు తెలుసు’ అంటారా, మరిన్ని వివరాలు తెలుసుకుందురుగాని పదండి. 

‘ఈ సంస్థ పేరే వినలేదే’ అంటారా, అయితే ఇంకా జాగ్రత్తగా తెలుసుకోవాలి లోపలికి వెళ్ళండి.
చెట్టు పైకి ఎంత ఎదుగుతుందో, భూమి లోపలికీ అంతే ఎదుగుతుందట. వేళ్లు ఎంత బలంగా ఉంటే పైన కొమ్మలంత పచ్చగా ఉంటాయి. అది తెలియకపోతే ఎంత తొందరగా విస్తరిస్తామా అనే ఆరాటపడతాం. కుదుళ్లలోనే బలం పుంజుకోవాలన్నది అర్థమైతే గనక ‘భాగవతుల ఛారిటబుల్ ట్రస్టు’ పనితీరును అర్థం చేసుకోగలుగుతాం. ఇతర రాష్ట్రాల్లోనే కాదు, కనీసం ఇతర జిల్లాలకైనా విస్తరించకుండా కేవలం విశాఖపట్నం జిల్లాకే పరిమితమయిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినదెలాగో తెలుసుకుంటాం. ఎలమంచిలి చుట్టుపక్కల వేలమంది గ్రామీణుల జీవితాల్లో వచ్చిన మార్పును వీక్షించగలుగుతాం.

బడి మడి గుడి – ఈ మూడింటినీ కార్యక్షేత్రాలుగా ఎంచుకుని నలభయ్యేళ్లుగా కృషి చేస్తున్న ఈ సంస్థ తీరుతెన్నులే ఈవారం మన కవర్‌స్టోరీ. హరిపురం ఎలమంచిలికి సమీప గ్రామం. అక్కడ పచ్చని పరిసరాల మధ్యన ఉంది భాగవతుల ట్రస్టు ప్రారంభించిన రెసిడెన్షియల్ మోడల్ హైస్కూల్. ఆరు నుంచి పదో క్లాసు దాకా తెలుగు మీడియమ్‌లో చదువు. చుట్టుపక్కల వంద గ్రామాల పిల్లలు పోటాపోటీగా ప్రవేశ పరీక్ష రాసి మరీ చేరుతారు. అలాగని లక్షల్లో ఫీజులు, ఆకాశాన్నంటే భవనాలు ఉన్నాయనుకుంటే పొరపాటే. చేరేవాళ్లంతా పేద గ్రామీణుల బిడ్డలే కనుక ఫీజులు నామమాత్రం. మొన్నటి వరకూ చెట్ల నీడన, తాటాకు కప్పుల కింద చల్లగా వాళ్ల చదువులు సాగేవి. పాఠాలను బట్టీ పెట్టడాలు, ముక్కున పెట్టి పరీక్షలు రాయడాలు కుదరనే కుదరదు అక్కడ. పని చేస్తేనే చదువొచ్చేది. ఏమిటీ విచిత్రమంటే ఆ బడి ఉన్నది ఒక వ్యవసాయ క్షేత్రంలో.

మామిడి, సపోటా, జీడిమావిడి, అరటి, పనస ఇలా పెద్దపెద్ద పళ్ల చెట్లు, ఆ నీడనే కూరగాయల మడులు, పక్కనే పూల మొక్కలు. కొంతమంది పిల్లలు, ఒక ఉపాధ్యాయుడు కలిసి బృందంగా ఏర్పడి తమకు కేటాయించిన భూమిలోని అన్నిటి సంరక్షణా చూసుకుంటారు. నీళ్లు పొయ్యడం, పూల మొక్కలకు అంట్లు కట్టడం, కూరగాయలనేరడం, తమ మెస్ దాకా చేర్చడం… ఒకటేమిటి అన్నీ వాళ్ల బాధ్యతే. అయితే అన్నిటినీ ఎంతో ఇష్టంగా చేస్తారా బాలలు. అవి చేస్తూనే తమ ఊపిరితిత్తుల నిండా స్వచ్ఛమైన గాలిని నింపుకొంటారు. పురుగు మందులు కలవని పంటతో చక్కటి ఆహారాన్ని తింటారు. చదువు మాటకొస్తే పుస్తకాల మోత బరువు లేదు. ప్రతిరోజూ టెస్ట్‌లని విసిగించే మాస్టార్లుండరు.

కొత్త బోధన పద్ధతుల్లో శిక్షణ పొందిన మంచి ఉపాధ్యాయులు – పిల్లలే స్వయంగా చేసి, చూసి నేర్చుకునేలా రూపొందించిన సిలబస్ – ఇక పాఠాలు నేర్చుకోవడానికి బెదురెందుకు? అందుకే ఇక్కడ పదో తరగతి ఫలితాలు కార్పొరేట్ స్కూళ్లను మించి వస్తాయి. ‘విద్య అంటే జీవిక కోసం ఏదో ఒకటి నేర్పించడం కాదు. చక్కటి జీవనం ఎలాగో నేర్పించడం’ అన్న సూక్తిని బీసీటీ అక్షరాలా పాటిస్తుంది. ఇక్కడ నడుస్తున్న విద్యావిధానానికి ముగ్థురాలైన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి వాళ్లకో చక్కటి భవనాన్ని కానుకగా ఇచ్చారు. అంతేనా, ప్రతి తరగతి గదికీ ఓ కంప్యూటర్. అందులోనే పాఠాలన్నీ నిక్షిప్తమయి ఉంటాయి. లెక్కలైనా, సైన్సయినా, ఇంగ్లీషయినా… కంప్యూటర్‌లో సినిమా చూసినంత సులువుగా చూసెయ్యడమే.

తర్వాత దాని గురించిన చర్చ, రన్నింగ్ నోట్సు రాసుకోవడం, విషయాన్ని అర్థం చేసుకోవడం. పాఠం మేస్టార్లు చెప్పడమూ, విద్యార్థులు కష్టపడి గుర్తుంచుకోవడమూ అన్న పద్ధతే రద్దయిపోయింది. దానికి మారుగా నేర్చుకున్న ప్రతి విషయమూ ఆ పసిమనసుల్లో అక్షరమక్షరమూ అచ్చయిపోతుందంతే. మామూలు పాఠశాలల్లో సబ్జెక్టు వారీగా టీచర్లు వస్తుంటారు గంట కొట్టినప్పుడల్లా. బీసీటీ స్కూల్లో ‘తెలుగు గది’, ‘లెక్కల గది’… ఇలా ఉంటాయి, అక్కడ ఆ సబ్జెక్టు టీచర్లుంటారు. విద్యార్థులే తమ పీరియడ్ ప్రకారం అక్కడికి మారుతుంటారు. దీనివల్ల అక్కడికి వెళ్లగానే ఆ సబ్జెక్టుకు సంబంధించిన వాతావరణంలోకి ఇమిడిపోతారు.

ఎలా మొదలయిందంటే….
హరిపురం చిన్న గ్రామం. చిన్నాచితకా పనులు చేసి పొట్టపోసుకునేవారే అక్కడంతా. కలుపు తియ్యడమో, పశువులకు కుడితి పెట్టడమో… ఇలా తమతోపాటు పిల్లలూ ఏదొక పని చెయ్యకపోతే గడిచే ఇళ్లు కావు అవి. అలాంటి పిల్లల కోసమంటూ 1993లో మొదలయింది భాగవతుల సంస్థ బడి. వ్యవసాయప్పనులతో బాల కార్మికులుగా బడి ముఖమే తెలియకుండా మగ్గిపోతున్న పిల్లల్లో వారు అక్షర కాంతులు నింపారు. దాదాపు ఇరవై స్వచ్ఛంద సంస్థలతో కలిసి చుట్టుపక్కల 800 ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసినప్పుడు మూస చదువులు విద్యార్థులను బట్టీ యంత్రాలుగా మారుస్తున్నాయన్న సంగతి బీసీటీ గ్రహింపులోకొచ్చింది.

దాంతో 1995లో తన సొంత బడి ని ప్రారంభించి, సొంత సిలబస్‌ను రూపొందించుకుని గ్రామీణ పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అక్కడ చదువంటే కేవలం పాఠాలూ మార్కులూ కాదు. ప్రతి విద్యార్థి చర్ఖా తిప్పి నూలు వడకడం, వ్యవసాయ పనులు, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, బేకరీ ఉత్పత్తుల తయారీ – వీటిలో ఏదో ఒకటి తప్పక నేర్చుకోవాలి. సూల్లో చేరిన మూడు నెలల్లోనే వాళ్లకవి నేర్పేస్తారు. తర్వాత ఆ పనుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పిల్లల అకౌంట్లో జమ చేస్తుంది స్కూలు. ఇవిగాక చుట్టుపక్కల గ్రామస్థులు వచ్చి తమ పనుల్లోని సాధకబాధకాలను బాలలకు అర్థమయ్యేలా చెప్పి వెళుతుంటారు. కమ్మరి, కుమ్మరి, చాకలి, కూరగాయల రైతు… వీళ్లే ఆ స్కూలుకు విజిటింగ్ ప్రొఫెసర్లు. అందుకే ఇక్కడి పిల్లలు మార్కులూ సాధిస్తారు, మానవత్వాన్నీ ప్రదర్శిస్తారు.

చేసి చూపిస్తారు…
విద్యార్థుల్లో మానవీయ విలువలను పెంచాలి, వాళ్ళకు తమ కాళ్ల మీద తాము నిలబడే నైపుణ్యాలుండాలి – ఇదీ బీసీటీ స్కూలు లక్ష్యం. అది సాధించాలంటే ముందు తాము కూడా ఆ విలువలను ఆచరణలో చూపెట్టాలి. అందుకే స్కూల్లో చేరతామని వచ్చే వికలాంగ బాలబాలికలను కాదనకుండా చేర్చుకోవడం మొదలెట్టారు. వీరిలో కొందరు వినలేరు, కొందరు మాట్లాడలేరు. కొందరికి బుద్ధి మాంద్యం. మామూలుగానైతే అలాంటివారిని ప్రత్యేక స్కూళ్లలో వేసెయ్యమని తిప్పి పంపేస్తాయి యాజమాన్యాలు. కానీ బీసీటీ అలాంటివారినీ అక్కున చేర్చుకుంది. వీళ్లు చరఖా తిప్పి దారం తీస్తారు. కుట్లు, అల్లికలు, రెడీమేడ్ వస్త్రాల కోసం బట్ట కత్తిరింపులూ నేర్చుకుంటారు.

పద్దెనిమిది నెలల కోర్సు తర్వాత సొంతంగా ఒక టైలరింగ్ దుకాణం పెట్టుకోగలిగిన స్థాయికి చేరుకుంటుంది వారి నైపుణ్యం. వీరు తయారు చేసే గుడ్డ సంచులు గొప్ప ఆకర్షణీయంగా ఉండి, ఎక్కడ ప్రదర్శన జరిగినా హాట్ కేకుల్లాగా అమ్ముడయిపోతాయి. ప్రతి సంచీ అమ్మకం ద్వారా వచ్చే సొమ్మును ఆ సంచీ తయారీలో పాల్గొన్న విద్యార్థులందరికీ చేరేలా ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది బీసీటీ. మరో ముఖ్యమైన సంగతేమంటే – ఈ స్కూల్లో విద్యార్థులను ఒకరితో ఒక రిని పోటీ పడమని చెప్పరు. ఒకరికొకరు సాయం చేసుకోమని చెబుతారు. “బయటివాళ్లు దీన్ని బడి అంటారుగానీ, మేం మాత్రం ఈ ఆవరణను ఒక ‘లెర్నింగ్ సెంటర్’గా వ్యవహరిస్తాం. విలువలనూ, నైపుణ్యాన్నీ రెండింటినీ విద్యార్థికి పట్టుబడేలా చేస్తుంది ఇది. పిప్పి చదువులు కాకుండా సారవంతమైన విద్య నేర్చుకుంటున్నారు మా పిల్లలు” అని చెప్పారు బీసీటీ కార్యదర్శి భాగవతుల శ్రీరామ్మూర్తి. పదిహేనేళ్లలో 3500 మంది పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసింది ఈ స్కూలు.

గుడి భాగవతం
గ్రామీణ బాలల్లో ఆత్మవిశ్వాసం పెరగడానికి గ్రామాల్లో మార్పు దిశగా అడుగులు పడడానికి- రెండిటికీ ఒకటే మంత్రం వేసింది భాగవతుల ఛారిటబుల్ ట్రస్టు. పిల్లల్లో, యువతలో సంప్రదాయ కళల పట్ల ఆసక్తిని పెంచడమే ఆ తారక మంత్రం. అంతరించిపోతున్న మన గ్రామీణ కళారూపాలను పిల్లల చేతిలో ఆయుధంగా మలుస్తోందీ సంస్థ. ఉత్తేజకరమైన దేశభక్తి గీతాలను పాడటం, జానపద గేయాలను ఆలపించడంతో వీరి కళాపోషణ మొదలవుతుంది. తర్వాత తప్పెటగుళ్లు, కోలాటం, చెక్కభజన, బుర్రకథ, జముకులు, చిటికెలు, డప్పుడ్యాన్స్, పల్లెసుద్దులు, సామాజిక నాటకాలు ప్రదర్శించడం వరకూ రకరకాలు నేర్చుకుంటారు.

తాము నేర్చుకున్న వాటిని మూడు నెలలకోసారి బృందాలుగా వెళ్లి దగ్గర్లోని గ్రామాల్లో గుడినో, రామమందిరాన్నో వేదికగా చేసుకొని ప్రదర్శిస్తారు. పనిలో పనిగా అక్కడ అవసరమైన సందేశాలను గ్రామస్థుల మదిలో విత్తనాలుగా నాటుతారు. సారా తాగడం, బహిరంగ మలమూత్ర విసర్జన వంటి అంశాలు మొదలుకొని మహిళా సంఘాల పనితీరు, నోట్లకు ఓట్లు అమ్ముకోవడం, ఎన్నికల్లో అవినీతి వరకూ దేన్నీ వదలకుండా తమ ఆటపాటలతోనే ఆలోచనలు రేకెత్తిస్తారు. హరిపురం చుట్టుపక్కల గ్రామాల్లో సారా తాగే అలవాటును అరికట్టడంలో బీసీటీ స్కూలు విద్యార్థుల పాత్ర ఎనలేనిది. ‘పెద్దలు మారితేనే పిల్లలకు భవిష్యత్తు’ అన్న విషయాన్ని గ్రామీణులకు అర్థమయ్యేలా చెప్పడానికి వీరికి ఈ కళారూపాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. వీటన్నిటికీ భూమికగా స్కూలు ఆవరణలోని గుడిలో ప్రతి సాయంత్రమూ అరగంట పాటు భజన చేస్తారు. దాని తర్వాత మానవీయ విలువలను పెంచే చిట్టిపొట్టి కథలతో పాటు ఆరోజు తమలోతాము ఎవరెవరికి ఏ రకంగా సాయం చేసిందీ చెప్పుకొంటారు విద్యార్థులు.

ఈ భజనల వల్ల చేరిన నెల రోజుల్లోనే విద్యార్థి ప్రవర్తనలో గణనీయమైన మార్పు కనిపిస్తుందని ఘంటాపథంగా చెబుతోంది భాగవతుల ట్రస్టు. దుడుకుతనం, ఒంటరితనం తగ్గి, మృదువైన స్నేహపూర్వకమైన ప్రవర్తనతో మెలగడం పెరుగుతుంది. చదువుల్లో ఏకాగ్రత, చురుకుదనం పెరుగుతున్నాయని చెపుతున్నారు అటు ఉపాధ్యాయులూ, ఇటు విద్యార్థులూ కూడా. తాము నేర్చుకున్న కళారూపాలన్నిటితో దాదాపు రెండొందల మంది బీసీటీ స్కూలు పిల్లలు విశాఖపట్నంలో ఇరవైనాలుగ్గంటల పాటు నిరంతరాయంగా ప్రదర్శన ఇచ్చినప్పుడు పట్నవాసులంతా ఆశ్చర్యంలో మునిగిపోయారంటే అతిశయోక్తి కాదు.

మడి భాగవతం
‘రైతే ఎప్పటికైనా రాజు, అతను లేని భారతదేశమే లేదు’ అని నమ్మే భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్ నలభయ్యేళ్ల ప్రయాణంలో విశాఖ జిల్లాలోని సుమారు వంద గ్రామాల ప్రజలకు దారి దీపమై నిలిచింది. వేలమంది గ్రామస్థుల జీవితాలను అనేక రకాలుగా మెరుగు పరిచింది. సమీప గ్రామమైన పంచదార్లలో యాభై ఎకరాల బీడు భూమిని ప్రయోగాత్మకంగా తీసుకుంది బీసీటీ. గులకరాళ్లు తప్ప మరేమీ లేని భూమి అది. పైగా కొండవాలు ప్రాంతం, వర్షచ్ఛాయా ప్రదేశం. ఏడాదికి సగటు వర్షపాతం 24 సెంటీమీటర్లే. అలాంటి చోట అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తల సాయంతో స్థానిక రైతులకు శిక్షణ శిబిరాలు నిర్వహించింది. దాంతో వారు రాతి గట్లను కట్టి, కుండలతో బిందు సేద్యం చేసి భూసారాన్ని కాపాడారు.

కొన్నిచోట్ల పళ్ల మొక్కలు, కొన్నిచోట్ల పూలమొక్కలు, మరికొంత జాగాలో పశుగ్రాసానికి పనికొచ్చే గడ్డినీ నాటారు. మూడేళ్లు తిరిగేసరికల్లా వంద రకాల మొక్కలు ఏపుగా పెరిగాయి. పచ్చదనంతో ఆ ప్రాంతం రూపు మారిపోయింది. ఈ ప్రయోగం సఫలం కావడంతో రైతులు హరిపురంలో 50 ఎకరాలు, గోకివాడలో 44 ఎకరాలు, గొర్లిధర్మవరంలో 120 ఎకరాల బీడు భూమిని తీసుకున్నారు. ఈ క్షేత్రాల్లో ఫలితాలను గమనించిన కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి 1995లో హరిపురంలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ కూడా కలిసొచ్చింది. ఆరుగురు మంచి శాస్త్రవేత్తలను రైతులకు అందుబాటులో ఉంచింది.

ఫలితంగా దాదాపు 5000 ఎకరాలకు పైగా బీడు భూములు ఆకుపచ్చని రంగులోకి మారిపోయి రైతులకు పండగ చేస్తున్నాయి. శాస్త్రపరిజ్ఞానం దగ్గరలో ఉండటంతో ఏ సమయంలో ఏ సందేహం వచ్చినా వెంటనే బీసీటీని సంప్రదిస్తారు పరిసర వ్యవసాయదారులు. సెల్‌ఫోన్ ద్వారా కూడా సలహాలను అందుకునే స్థాయికి ఎదిగారు ఇక్కడి రైతులు. ‘బీడు భూములంటూ ఏమీ ఉండవు, బీడు పెట్టిన భూములుండొచ్చు కాని’ అంటున్నారు అక్కడి రైతులు, పనిలో పనిగా బీసీటీ నర్సరీలను నిర్వహించింది. కమ్యూనిటీ నిర్వహణ కింద బోర్లను తవ్వించింది. పశుగ్రాసాన్ని పెంచి పాడి పరిశ్రమ వృద్ధికు ఊతమిచ్చింది. దాంతో పాటు పౌల్ట్రీకీ ప్రాధాన్యమిచ్చింది. 1980 నుంచీ గ్రామీణ మహిళలకు పొదుపు సంఘాలు, స్వయం ఉపాధి పథకాలు నిర్వహిస్తూనే యువతకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే కంప్యూటర్ సెంటర్, ఐటీఐలనూ నిర్వహిస్తోంది బీసీటీ.

ఆరోగ్య రక్ష
‘దేశాభివృద్ధికి రైతే వెన్నెముక’ అని ఉపన్యాసాలిస్తే చాలదు. ఉత్తి మాటలకు కాలం చెల్లింది. నిజంగా రైతన్నల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాల్సిన కాలం వచ్చేసింది. విషతుల్యమైన రసాయన పురుగుమందులు, ఎరువుల వాడకం వల్ల పంటకు సత్తువ సంగతి అటుంచి రైతు ఆరోగ్యం క్షీణిస్తోంది. రైతొక్కడే కాదు, పౌష్టికాహార లోపాలు, అపరిశుభ్ర పరిసరాలు కలిసి అతని కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తున్నాయి. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ పనిచేస్తేనే తప్ప గడవని పరిస్థితుల్లో అనారోగ్యంతో పడకెయ్యడం కుదరదు.

ఆస్పత్రుల కోసం పట్నాలు వెళ్లాలంటే అదో మొయ్యలేని భారం. వీటన్నిటినీ గమనించిన భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్ గ్రామీణుల ఆరోగ్య పరిరక్షణ కోసం 1985 నుంచే చిన్నచిన్న ఆరోగ్య శిబిరాలను నిర్వహించేది. చిన్నపిల్లలు మొదలుకొని వయోవృద్ధుల వరకూ అందరినీ లెక్కలోకి తీసుకొని వివిధ అవసరాలను తీర్చేది. ప్రస్తుతం హరిపురం, దిమిలి గ్రామాల్లో ఆస్పత్రులు నిర్వహి స్తోంది. మహిళలకు అత్యవసర వైద్యం మీద అవగాహన కల్పించడం అన్నిటికన్నా అక్కరకొచ్చే పని. ఈ అవగాహన వల్ల వారు తమ పిల్లల్లో హిమోగ్లోబిన్ స్థాయి పడిపోకుండా, కడుపులో నులిపురుగులు రాకుండా, సరైన బరువులో ఉండేట్టు చూసుకోగలుగుతున్నారు. రైతుకు ప్రాణం పశువులే కనుక, వాటి బాగోగులు చూడటమూ అంతే ముఖ్యం. దానికోసం స్థానిక స్త్రీలకే పశువైద్యంలో ఆర్నెల్ల కోర్సు నిర్వహించి ప్రోత్సహిస్తోంది.

తొలి అడుగు వేసిందీయనే…
వందల గ్రామాలకు మేలు చేస్తున్న భాగవతుల ఛారిటబుల్ ట్రస్టును ప్రారంభించింది భాగవతుల వెంకట పరమేశ్వరరావు. 1933 జనవరి 17న పుట్టిన ఆయన అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి అణుభౌతిక శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టాపుచ్చుకున్నారు. గ్రామాల్లో సేవ చెయ్యాలన్న ఉద్దేశంతో తాను పెరిగిన దిమిలి గ్రామానికి తిరిగి వచ్చి అక్కడి హైస్కూలు నిర్మాణంలో తొలి అడుగులు వేశారు. వ్యక్తిగా కన్న సంస్థగానైతే పక్కాగా పని చెయ్యగలమన్న ఆలోచనతో 1976 నవంబరులో ట్రస్టును నెలకొల్పారు. సుమారు నలభయ్యేళ్లకు చేరువ కావస్తున్న ఈ సంస్థలో పనిచేసిన మహామహులెందరో.

ప్రతి దరిద్రానికీ ఒక విరుగుడుంది
“మనకు ఏడురకాల పేదరికాలున్నాయి. ఆర్థిక పేదరికాన్ని ఉత్పత్తి కార్యక్రమాల ద్వారా పారద్రోలాలి. గ్రామ పారిశుధ్యాన్ని కాపాడుకుంటూ పౌష్టికాహారాన్ని తీసుకుంటే ఆరోగ్య పేదరికం అంతమవుతుంది. అక్షరాస్యత ద్వారా మానసిక పేదరికం తొలగిపోతుంది. శ్రమదానం, పరస్పర సహాయం ద్వారా సామాజిక పేదరికం, కళారూపాలను కాపాడుకోవడం ద్వారా సాంస్కృతిక బీదరికం పోతాయి. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగం చేస్తే రాజకీయ పేదరికం అంతరిస్తుంది. కనీసం అరగంట అయినా సామూహికంగా భజన చేస్తే ఆధ్యాత్మిక పేదరికం తొలగిపోయి అందరిలోనూ మానవత్వం వెల్లివిరుస్తుంది.
– ‘నమ్మలేని నిజాలు నా గ్రామానుభవాలు’ పుస్తకం నుంచి

అన్నీ మాకే అనుకున్నా
మురకాడ చిన్న గ్రామం. మహిళా మండలి ఏర్పడక ముందు అంటరానితనం తీవ్రంగా ఉండేది. ఐదేళ్లలోనే పరిస్థితిలో మార్పొచ్చి దళిత మహిళ అనుకు అచ్చయ్యమ్మ ప్రెసిడెంటు కూడా అయింది. ఆర్నెల్లలో మహిళామండలి సభ్యులంతా వచ్చి గగ్గోలు పెట్టారు. ‘గ్రామానికి ఏ స్కీము వచ్చినా అచ్చయ్యమ్యే తీసేసుకుంటోంది. అన్నీ తన చుట్టాలికిపక్కాలికేగానీ, వేరెవ్వరికీ దక్కనివ్వడం లేదు’ అని. ఇదేమిటో తెలుసుకుందామని నేనా ఊరికెళ్లాను. అందరిమధ్యనా ఆమె ఏం చెప్పిందంటే ‘బాబూ, ఇన్నాళ్లు పనిచేసిన ప్రెసిడెంట్లందరూ తన కుటుంబానికీ బంధువులకే అన్నీ చేసుకున్నారు. ప్రెసిడెంటవుతే మనమూ అలాగే చెయ్యాలనుకున్నానుగానీ, అందరికీ అన్నీ ఇచ్చాక నేను తీసుకోవాల అని నాకు తెలియదు బాబూ. ప్రజలు ముందు నేను వెనకాల అని మాకు చెప్పినోళ్లు లేరు బాబూ’ అంటూ అమాయకంగా మాట్లాడింది. తర్వాతి ఆర్నెల్లలో ఊరికెంతో మేలు చేసి చూపించింది. నాయకులు ఎలా ప్రవర్తిస్తే, సామాన్యులూ అలాగే ఆలోచిస్తారు. వారు మారితే సమాజంలో మార్పు సాధ్యమే.
– పరమేశ్వరరావు అనుభవాల్లో ఒకటి.

అరుణ పప్పు, విశాఖపట్నం, ఫోటోలు : వై. రామకృష్ణ
భాగవతుల ఛారిటబుల్ ట్రస్టు ఫోన్ నెంబర్ : 08924 253770
ఈమెయిల్ : info@bctindia.org 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.