రాకెట్ ఎగిరినపుడంతా ‘మొగల్తూరు’ రైతే గుర్తొస్తాడు

రాకెట్ ఎగిరినపుడంతా ‘మొగల్తూరు’ రైతే గుర్తొస్తాడు

మొగల్తూరు అనగానే టక్కున చిరంజీవి గుర్తొస్తాడు. అరే, కృష్ణంరాజుదీ అదే ఊరు కదా అనుకుంటాం. ఈ సినిమా వ్యవహారం పట్టని పాత తరం వాళ్ళయితే, బారిష్టర్ పార్వతీశంని గుర్తు చేసుకుంటారు. ఈ ముగ్గురూ కాకుండా నాలుగో హీరోని ఇప్పుడు పరిచయం చేస్తున్నాం. పేరు ఎంవైఎస్ ప్రసాద్. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం డైరెక్టర్. అంతరిక్ష శాస్త్రవేత్తగా అంతర్జాతీయ ఖ్యాతి గడించినవాడు. పాతిక దేశాలు తిరిగినవాడు.

ఐక్యరాజ్య సమితిలో భారత దేశపు అంతరిక్ష స్వరాన్ని పదకొండేళ్ళ పాటు వినిపించినవాడు. ఉపగ్రహాన్ని మోసుకుని మన నేల మీద నుంచి ఎగిరిన తొలి రాకెట్టు ఎస్ఎల్‌వీ నుంచి నిన్నటి పీఎస్ఎల్‌వీ-సి20 దాకా ప్రతి ప్రయోగంలోనూ భాగం అయినవాడు. మన దేశపు ఖ్యాతిని అంతరిక్షంలో రెపరెపలాడిస్తున్న శాస్త్రవేత్త ప్రసాద్ పుట్టి పెరిగింది పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోనే మొగల్తూరు జ్ఞాపకాలే ఈ వారం మా ఊరు..

మా నాన్న మలపాక రామ సూర్యనారాయణ మూర్తి మొగల్తూరులో టీచరు. హైస్కూల్‌లో ఇంగ్లీషు, లెక్కలు చెప్పేవారు. చెట్లూ, బావులూ, పొలాలూ.. నా బాల్యం అంతా అందమైన ఆ పచ్చని పల్లెలోనే గడిచింది. నాకు ఇద్దరు అన్నలు, ఒక తమ్ముడు, ఇద్దరు అక్కలు. అమ్మ భాస్కరం ఎస్ఎస్ఎల్‌సీ దాకా చదువుకుంది. పిల్లలంతా బాగా చదువుకోవాలని నాన్న కోరిక. పెద్ద కుటుంబం. జీతం సరిపోయేది కాదు. మాకు కొద్దిగా పొలాలుండేవి. రైతులకి కౌలుకి ఇచ్చేవాళ్ళు. ఏడాదికి రెండు పంటలు పండేవి. ఆ పంటల ఆదాయమే కుటుంబాన్ని నడిపేది. అన్నలంతా అప్పటికే పై చదువుల కోసం మొగల్తూరు దాటేశారు. ప్రతి నెలా వాళ్ళకి డబ్బులు పంపాలి. ఏలూరులో పీయూసీలో చేరేదాకా నాకు కొరతంటే ఏమిటో తెలీదు.

మాకు చదువులకి అవసరమైనపుడంతా నాన్న తడుముకోకుండా డబ్బులు పంపడానికి ఒక కారణం ఉంది. మొగల్తూరులో అనంతపల్లి వారని కోమట్ల కుటుంబం ఉండేది. వాళ్ళకి బియ్యం మిల్లు ఉండేది. ఇంకా బట్టల షాపులూ, సరుకుల షాపులూ ఉండేవి. ఆ కుటుంబం మాకు పెద్ద బ్యాంకు. ఎప్పుడు అవసరమైనా, ఎంత అవసరమైనా అప్పు పుట్టేది. మా పొలంలో పండిన పంటంతా నాన్న వాళ్ళకే అమ్మి అప్పు తీర్చేవారు. ప్రతి యేటా ఇంతే. అవసరమైనపుడు తీసుకోవడం, పంటొచ్చినపుడు తీర్చడం. ఎక్కడా మా చదువులు ఆగకూడదని నాన్న పట్టుదల. మేం కూడా అట్లాగే చదివే వాళ్ళం. ఆటలూ పాటలూ ఉన్నా, చదువులో మాత్రం ఎప్పుడూ నేను వెనకబడలేదు.

నాన్న పుస్తకాలు బాగా చదివేవారు. మాతో కూడా చదివించేవారు. పద్యాలు రాసేవారు. ఇంటి నిండా పుస్తకాలుండేవి. ఎస్ఎస్ఎల్‌సీలో నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను. నాకు బహుమతిగా మహాభారతం ఒరిజినల్ సెట్ ఇచ్చారు నాన్న. ఇప్పటికీ అది నా దగ్గరుంది. చిన్నతనంలో నేను బాగా ఇష్టంగా చదువుకున్న పుస్తకం ‘ఆంధ్రశ్రీ’. అల్లూరి సీతారామరాజు మీద రాసిన పద్య కావ్యం. బహుశా పడాల రామారావు రాసిందనుకుంటాను. ఆ పుస్తకం చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడిచేది.

గురువులకి నమస్కారం
నా తొలి గురువు పొదిల కృష్ణమూర్తి గారు. మా ఇంటి పక్కనే బడి ఉండేది. అమ్మాయిల బడి. నేను ఒకటో తరగతిలో చేరే సంవత్సరమే దాన్ని కో-ఎడ్యుకేషన్ చేశారు. అప్పటిదాకా గర్ల్స్ స్కూల్ కాబట్టి అందరూ అమ్మాయిలే ఉండేవారు. నేనొక్కడినే అబ్బాయిని. ఆడపిల్లల మధ్య కూర్చోకుండా టీచర్ కుర్చీ పక్కనే కింద కూర్చునేవాడిని. బాగా చదువుకున్న వారు కృష్ణమూర్తిగారు. ఇప్పటికీ ఊరెళ్ళినపుడు ఆయనకి నమస్కారం పెట్టుకుంటాను. ఆరు, ఏడు తరగతుల్లో ఉస్మానీ గారని ఇంకో టీచర్ ఉండేవారు.

ఆయన ఏ పాఠాన్నయినా కథగా మార్చి చెప్పేవారు. ఎంత అల్లరి చేస్తున్నా, కోపంగా గాక, సరదా మాటలతోనే సద్దు మణిగేట్టు చేసేవారు. ప్రతి మాటా చమత్కారంగానే ఉండేది. లెక్కల టీచర్ రామకృష్ణరావు అంటే మాత్రం అందరికీ హడల్. చాలా స్ట్రిక్ట్. హిందీ అయ్యవారు బాపిరాజు గారు పక్క ఊరి నుంచి సైకిలు మీద వచ్చేవారు. హిందీలో నాకు మంచి మార్కులు వచ్చేవి. పులికొండ వెంకటేశ్వరరావు గారు తెలుగు చెప్పేవారు. ఎంత శ్రావ్యంగా ఉండేదో ఆయన పాఠం, పాటలాగా. పిల్లలతో ఎంత ప్రేమగా, ఎంత దయగా ఉండేవారో వీళ్ళంతా. ఇటువంటి టీచర్ల వల్ల నాకు చదువంటే ఇష్టంగా ఉండేది. గౌరవంగా ఉండేది.

హైస్కూల్‌లో సత్యనారాయణ రాజు గారని సైన్స్ టీచర్ ఉండేవారు. పిల్లల్తో అవీ ఇవీ మాట్లాడుతూ ఉండేవారు. ఒక సారి క్లాసులో ఒక్కొక్కరినీ లేపి, పెద్దయ్యాక నువ్వేం కావాలనుకుంటున్నావ్? అని అడుగుతున్నారు. నా వంతు వచ్చింది. , ‘ ఫారిన్ రిటర్డ్న్ ఇంజనీరు అవ్వాలనుకుంటున్నా సార్’ అన్నా. ఆయనతో సహా అందరూ నవ్వారు. నేను అలా అనడానికి ఒక కారణం ఉంది. ఊళ్ళో ఎవరికైనా జబ్బు చేస్తే, ఏలూరెల్లండి, బెజవాడెల్లండి, ఫలానా ఆయన ఫారిన్ రిటర్న్ డాక్టర్..ఆయన దగ్గరకే వెళ్ళండి అని చెప్పే వాళ్ళు. ఫారిన్ రిటర్డ్న్ అంటే గొప్ప కదా అని నేను అట్లా చెప్పాను. అయితే, నేను పెద్దయ్యాక అదే నిజమైంది.

ఇంజనీరుగా ఇరవై అయిదు దేశాలు పర్యటించాను. ప్యారిస్‌లో నాలుగేళ్ళున్నాను. ఇటీవల మొగల్తూరు వెళ్ళినపుడు అప్పటి మా సైన్స్ టీచర్ సత్యనారాయణ రాజు గారికి ఆ సంఘటన గుర్తు చేశాను. నాతో పాటు మొగల్తూరులో చదువుకున్న ఎందరితోనో ఇప్పటికీ నా స్నేహం కొనసాగుతోంది. అనంతపల్లివారి రాధాకృష్ణ అక్కడే వ్యాపారం చేస్తున్నాడు. మధిర సీతారాం నర్సాపురం కాలేజీలో పనిచేసి రిటైరయ్యాడు. సుబ్బరాజు భీమవరం ఇంజనీరింగ్ కాలేజీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్ అయ్యాడు. పాలా వెంకటేశ్వరరావు నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌లో ఫైనాన్స్ మేనేజర్‌గా చేశాడు. పడాల భాస్కరరావు హైస్కూల్ హెడ్‌మాస్టర్‌గా చేశాడు. అయిసం సుబ్బారావు ఊళ్లోనో ఉన్నాడు, వ్యవసాయం చేసుకుంటూ. ముత్యాల్లాంటి అక్షరాలు రాసేవాడు. అతని పక్కనే కూర్చునే వాడిని నేను. వీళ్ళ స్నేహాభిమానాలు ఇప్పటికీ నాకు అలాగే ఉన్నాయి.

ముంచెత్తిన అభిమానం
1982లో నాన్న చనిపోయారు. అమ్మ మొగల్తూరులోనే ఉండేవారు. అమ్మ కూడా పోయాక 20 యేళ్ళపాటు నేను మొగల్తూరులో అడుగు పెట్టలేదు. 2006లో వెళ్ళాను. అమ్మా నాన్నా దూరమైనా, అమ్మలాంటి ఊరుంది కదా అనిపించింది. సుదీర్ఘ విరామం తర్వాత వెళ్లినా ఆ ప్రయాణం ఎన్నటికీ మరచిపోలేని అనుభూతినిచ్చింది. కొద్దిగా పొలాలూ, పాడుబడిపోయిన ఇల్లూ తప్ప నా అనుకోవడానికి అక్కడేమీ లేదు. ఊరికి వస్తున్నానని ఒక రోజు ముందు పాత స్నేహితులకి ఫోన్‌లో చెప్పాను. ఊళ్ళో అడుగు పెట్టగానే నాకు లభించిన స్వాగతం అపూర్వం. మా ఇల్లూ, పెరడూ శుభ్రం చేయించారు. షామియానాలు వేయించారు.

ఊరంతా వచ్చారు, నన్ను పలకరించడానికి. నాకు చదువు చెప్పిన టీచర్లు, నాతో కలిసి చదువుకున్నవాళ్ళు అందరూ. ఆశ్చర్యం, ఆనందం. చంద్రయాన్ ప్రాజెక్టు గురించి అంతకు మునుపే పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ కీలక బాధ్యతల్లో నేను కూడా ఉన్నానని రాశారు. నాకు సంబంధించినంత వరకూ, వరుస రాకెట్ ప్రయోగాల్లో చంద్రయాన్ కూడా ఒకటి. అంతకన్నా ప్రాధాన్యం లేదు. మొగల్తూరుకి మాత్రం అది ప్రత్యేకం. మా మొగల్తూరు వాడు చంద్రుడి మీదకి రాకెట్ పంపుతున్నాడని వాళ్ళ సంబరం. మొన్న నాకు నాయుడమ్మ అవార్డు ప్రకటించినపుడు కూడా మా ఊళ్ళో నా ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టారని తెలిసినపుడు కలిగిన పులకింత, ఐక్యరాజ్యసమితిలో అంతరిక్ష వ్యర్థాల మీద భారత వాదనను వినిపించి మెప్పించి ఒప్పించినప్పుడు కూడా కలగలేదు. మొగల్తూరు పేరు వినగానే కలిగే పులకింత అది. ఊరితో, మట్టితో, మనుషులతో ఉండే అనుబంధం అది.

లాంతర్ల వెలుగులో ఇంజనీరింగ్
పీయూసీ పాసయ్యాక ఇంజనీరింగ్‌లో చేరాను. సెలవు దొరికితే చాలు మొగల్తూరులో వాలిపోయేవాణ్ణి. కరెంటు లేదు. ఇంజనీరింగ్ సెకండియర్ దాకా లాంతర్ల కిందే చదువుకున్నాను. చిన్నప్పటి నుంచీ అలాగే చదువుకున్నాను కనుక నాకేం పెద్ద తేడా తెలిసేది కాదు. పొలానికెళ్ళి వ్యవసాయం చెయ్యకపోయినా ఇంటి పెరట్లో ఆకు కూరలూ, కూరగాయలూ మేమే పండించుకునేవాళ్ళం. ఆ పనిలో గొప్ప ఆనందం ఉండేది. ఉద్యోగం వచ్చి ఊరొదిలే దాకా కూడా స్నేహితులతో కలిసి ఊరెమ్మట మామిడి తోటల్లో తిరిగేవాడిని. రేడియోలో బీబీసీ వింటూనే చదువుకునే వాడిని. పాటలు వినడం, పాడడం, సాహిత్య పుస్తకాలు చదవడం, నాటకాలు వేయడం వంటివి నాకు ఇష్టమైన పనులు. నా చదువుకి ఇవి ఎప్పుడూ ఆటంకం కాలేదు. విదేశాలకు వెళ్ళినా, హసన్‌లో, త్రివేండ్రంలో ఏ హోదాలో ఉన్నా నా చదువు ఆగలేదు. తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ ఫిక్షన్‌నే ఎక్కువగా ఇష్టపడేవాడిని. పత్రికల్లో వచ్చే కథలూ, సీరియల్సూ కూడా వదలకుండా చదివేవాడిని.

రావిశాస్త్రి చూపిన దారి
రాచకొండ విశ్వనాథశాస్త్రి నవలలన్నా, కథలన్నా చాలా ఇష్టం నాకు. కొడవటిగంటి కుటుంబరావు కథలు కూడా చదివేవాడిని. అయితే రావిశాస్త్రి రచనా శైలి ఎక్కువగా నచ్చేది. శ్రీశ్రీ కవిత్వాన్ని ఇష్టపడినంతగా రావిశాస్త్రి వచనాన్నీ ఇష్టపడేవాడిని. ‘రత్తాలు రాంబాబు’ నవల కనీసం మూడు నాలుగు సార్లన్నా చదివుంటాను. ఆయన ‘సొమ్మలు పోనాయండీ’ కూడా అంతే. ‘వార్ అండ్ పీస్’ చదివినపుడు నాకు ఎటువంటి ఫీలింగ్ కలిగిందో, అటువంటి ఫీలింగే నాకు ‘రత్తాలు రాంబాబు’ చదివినపుడూ కలిగింది. గొప్ప రచయితలు ఎవ్వరూ తమ పాత్రలకి అన్యాయం చేయరు. ఏ పాత్రనీ తక్కువగా చూపించరు. సమన్యాయం పాటిస్తారు. ‘వార్ అండ్ పీస్’ నవల చదివితే, కనీసం ముప్పయి నలభై యేళ్ళ జీవితానుభవం మనకు అదనంగా లభిస్తుంది. చెహోవ్ కథలు కూడా గొప్పగా ఉంటాయి. మనకు ఉన్నది ఒకే జీవితం. పుస్తకాలు చదవడం వల్ల అనేక జీవితాలు లభిస్తాయి.

మాది చాలా ఒత్తిడి ఉండే ఉద్యోగం. ఒక్కోసారి నెలల తరబడి ఆ ఒత్తిడిని పగలూ రాత్రీ తేడా లేకుండా మోయాల్సి వస్తుంది. ఏఎస్ఎల్‌వీ రాకెట్‌లు రెండు వరుసగా ఫెయిలయినపుడు విపరీతమైన టెన్షన్‌కు గురవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒత్తిడి నుంచి నన్ను కాపాడింది మొగల్తూరులో నాన్న నాకు నేర్పిన పుస్తక పఠనమే. ఆఫీసు నుంచి రాత్రి పదింటికి ఇల్లు చేరినా స్నానం చేసి, భోంచేసి మూడింటి దాకా పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. ఎక్కువగా రెండో ప్రపంచ యుద్ధకాలానికి సంబంధించిన రచనలు చదివాను. యుద్ధ కాలంలో మానవ జీవన సంఘర్షణను అర్థం చేసుకున్నాక, వాళ్ళు అనుభవించిన ఒత్తిళ్ళ ముందు మనవి ఎంత అనిపించేది. మనసు తేలిక పడేది. పొద్దున్నే కొత్త శక్తితో మళ్ళీ పనిలో పడేవాడిని.

రైతూ, నేనూ వేరు కాదు

రాకెట్ విఫలమైనపుడు మీరెందుకు అంతగా కుంగిపోతారు? అని అడుగుతుంటారు కొంతమంది. రాకెట్ ఒక యంత్రమే కావచ్చు, కానీ అందులోని అనేక భాగాలను రూపొందించి, అమర్చిన వాళ్ళకి అది ఒట్టి యంత్రం మాత్రమే కాదు. ఎస్ఎల్‌వీ అపజయం సమయంలో తొలుత నేను గంభీరంగానే ఉన్నాను. అప్పుడు మా టీం లీడర్ కలాంగారు. రాకెట్ విఫలమైందని నిర్ధారించుకున్న కొంత సేపటి తర్వాత ఆయన్ని కలిశాం. కలాంగారిని చూడగానే దుఃఖం కట్టలు తెంచుకుంది. ఏఎస్ఎల్‌వీ రెండు వైఫల్యాల వేళ కూడా నేను కన్నీళ్ళని ఆపుకోలేక పోయాను. 40 యేళ్ళ లోపల యువకుడిగా ఆ మాత్రం భావోద్వేగాలు ఉండడం సహజమే అనుకుంటాను. ఇప్పటికీ రాకెట్ ఎగిరిన ప్రతి సారీ నాకు మా మొగల్తూరు రైతులే గుర్తొస్తారు. నారు పోసి, నీరు పెట్టి, కలుపు తీసి ఫలితం చేతికి వచ్చేదాకా వాళ్లు పడే టెన్షన్ గుర్తొస్తుంది. ఏ వరదో వచ్చి పంట పోయినపుడు భోరున ఏడ్చే ఏడుపు గుర్తొస్తుంది. ఆర్థికంగా నష్టపోయామనే కాదు, ఆ ఏడుపు. ఆ పైరుతో రైతుకి పెనవేసుకున్న అనుబంధం అది. రైతుకి పైరుతో ఉండే అనుబంధమే, రాకెట్‌తో శాస్త్రవేత్తకీ ఉంటుంది. బంధానుబంధాలు, భావోద్వేగాలు మనుషులందరిలోనూ ఒక్కటిగానే ఉంటాయి. వాళ్ళు రైతులా శాస్త్రవేత్తలా అని కాదు, వాళ్ళు మనుషులైతే చాలు.

– ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు
మొగల్తూరు ఫోటోలు: జి.వి.వి. రమాకుమార్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

1 Response to రాకెట్ ఎగిరినపుడంతా ‘మొగల్తూరు’ రైతే గుర్తొస్తాడు

  1. kkv naidu says:

    exclent. Not only Mogaltur entire Telugu jaathi Proud to read this.

Leave a Reply to kkv naidu Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.