మధురవాణి ‘ఝాన్సీ’

మధురవాణి ‘ఝాన్సీ’


‘సెంచరీ’ తరువాత?…
‘డబుల్’కు రెడీ కావడమే అనుకుంటాం!
కానీ ఝాన్సీ మాత్రం ‘నూరో’ ఎపిసోడ్‌కే చేరుకోలేదు..
ఆ తరువాత ఏమైంది?…
‘నూటొక్క’ ఏళ్ల మధురవాణిగా రంగస్థలంపై మెరిసింది..
మహిళా నిర్ణయాధికారం మీద ‘ఆల్ ఐ వాంట్ ఈజ్ ఎవ్విరి థింగ్ ‘ అనే సినిమాను నిర్మించే స్థాయికి ఎదిగింది.
‘నూటొక్క’ మహిళా దినోత్సవం నాడు ఆ అనుభవాలను మనతో పంచుకుంటున్నారు…

మలచిన ఆ మాట!: ఒకప్పుడు ఏడు రోజులు, మూడు రోజులు వేసే కన్యాశుల్కం నాటకాన్ని ఇప్పుడు మూడుగంటలకు కుదించారు. ఆ తరువాత మేము వే యాలనుకున్నప్పుడు దీక్షిత్ మాస్టారు మరికొంత సౌకర్యం కోసం రెండు గంటలకు కుదించారు. ఈ నాటకాన్ని మా సంతృప్తి కోసమే వేసినా, సినిమా వాళ్లు వేయడం ద్వారా నాటకానికి కొత్త తరం ప్రేక్షకుల్ని తీసుకురావచ్చు అన్న ఒక చిన్న ఆలోచన కూడా దాని వెనుక ఉంది. ఒక దశలో నేనూ, గిరీశం పాత్ర పోషించిన ఉత్తేజ్ ఇద్దరమే నాటకానికి సంబంధించి మొత్తం బాధ్యతల్ని భుజాన వేసుకుని మోయాల్సి వచ్చింది. వాస్తవానికి రంగస్థలం మీద నటించడం నాకు ఇదే తొలిసారి.

మేము కన్యాశుల్కం వేద్దామనుకున్నప్పుడు పరోక్షంగా కొందరు వీళ్లకు నాటకం గురించి ఏం తెలుసు? అన్న వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని నేనొక చాలెంజ్‌గానే తీసుకున్నాను. రిహార్సల్స్ అన్నీ అయిపోయాయి. ప్రదర్శన రోజు రానే వచ్చింది. ప్రదర్శన ఇంకో నాలుగు గంటలు ఉందనగా ఇందులో వెంకమ్మ పాత్ర వేస్తున్న సీనియర్ రంగస్థల నటి హైమావతి గారు నావద్దకు వచ్చి నా చేతుల్ని ఊపుతూ ” అమ్మడూ…! నువ్వు చాలా బాగా చే స్తున్నావ్. కానీ, మధురవాణిలో ఝాన్సీ కనబడుతోంది నాకు . నీ హుందాతనం, నీ ఇంటలెక్చువల్ ఇమేజ్ ఏవైతే ఉన్నాయో అవి దీనికి అక్కర్లా.

మధురవాణి ఇంటెలెక్చువలే కానీ, రామప్పపంతులో, లుబ్దావధానులో, గిరీశమో మధురవాణి వెంట పడింది అందుక్కాదు కదా! దానికో శృంగార కోణం ఉంది కదా. నీ అభినయంలో అది కాస్త కలుపుకో” అన్నారు. ఆ మాటలు వినగానే ఎంత సత్యమిదీ అనిపించింది. నిజానికి అన్ని రోజులు రిహార్సల్స్ ఫలితం ఒక ఎత్తయితే, ప్రదర్శనకు కేవలం నాలుగు గంటల ముందు హైమావతి గారి సూచనతో వచ్చిన ఫలితం ఒక ఎత్తు. ఆమె సలహాతో ఆ పాత్ర పోషణలో ఒక అద్భుతమైన తేడా వచ్చింది. మన వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలు ఒక్కోసారి పాత్రల మీద పడి వాటి సహజాతాలను ఎలా దెబ్బ తీస్తాయో ఆమె మాటల్లో నాకు చాలా స్పష్టంగా తెలిసి వచ్చింది.

ఒక్క అడుగుతో ఇక శిఖరాన్ని అందుకుంటామనుకుంటున్న సమయంలో ఏదో అవాంతరం వచ్చి, హఠాత్తుగా ఆగిపోవడం నా అనుభవంలో ఎన్నో సార్లు చూశాను. ‘డాన్స్ బేబీ డాన్స్’ షో 99 ఎపిసోడ్స్ నేను నిర్వహించాక 100 వ ఎపిసోడ్‌లో నేను లేను. నన్ను ఎప్పుడు మార్చారో, ఎందుకు మార్చారో నాకు తెలియదు. నేను లేకుండానే ఆ సెలబ్రేషన్ జరిగిపోయింది. పోస్ట్‌బాక్స్…..అనే మరో ప్రోగ్రాం విషయంలోనూ అదే జరిగింది. 25 ఎపిసోడ్లు చేయడమే ఎంతో గొప్ప అనుకునే ఆ రోజుల్లో 24 ఎపిసోడ్స్‌లు నేను నిర్వహిస్తే ఆ 25వ ఎపిసోడ్‌కు నేను లేను. నన్ను తొలగించారు. దంపతుల నుంచి సహజీవన అనుభవాల్ని, వారి బంధాన్ని నిలబెడుతున్న అంశాలను వస్తున్న సత్యాల్ని ఆవిష్కరించే ‘పెళ్లి పుస్తకం’ కార్యక్రమం విషయంలోనూ అలాగే జరిగింది. కొన్ని ఎపిసోడ్ల తరువాత ఆ కార్యక్రమం ఎంతో ఆదరణ పొందుతున్న సమయంలో నేను వైదొలగాల్సి వచ్చింది.

అవరోధం మరో ఆరంభానికే
కెరీర్ ప్రారంభంలో ఈ పరిణామాలేమిటో అర్థం కాక చాలా ఆవేదనకు గురయ్యే దాన్ని. కానీ, ఆ తరువాత ప్రోగ్రాం అగిపోయిన ప్రతిసారీ అంతకన్నా మెరుగైన అవకాశమేదో నాకు వచ్చి పడటం నేను గమనించాను. అందుకే ఏదైనా చేజారిపోయినప్పుడు ఎంత మాత్రం బాధపడని స్థితికి చేరుకున్నాను. పైగా ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు నాలోకి నేను ముడుచుకుపోవడం కాకుండా సమస్యను ఆవలివైపు నుంచి పరిశీలించడం నేర్చుకున్నాను. దానివల్ల భావోద్వేగాలకు లోనుకాకుండా, వాస్తవాల్ని గమనించే శక్తి అబ్బి, నిబ్బరంగా ఉండ అలవాటయ్యింది.


బ్యాలెన్స్ చెయ్యకపోతే…
కొంత కాలం పాటు నేను ‘నవీన’, ‘ చేతన ‘ వంటి ఇంటలెక్చువల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండిపోయాను. ఇవి నాకు ఒక కొత్త ఇమేజ్ ఇచ్చాయి. వాటికి పిఆర్‌పి ఉన్నా లేకపోయినా ఆత్మ సంతృప్తిని ఇచ్చాయి. కాకపోతే, అవి మెల్లమెల్లగా నన్ను వినోదాత్మక కార్యక్రమాల నుంచి దూరం చేశాయి. ఈ పరిణామాలు ఒక దశలో ఝాన్సీ వినోదాత్మకంగా ఏమీ చేయలేదు అన్న అభిప్రాయాన్ని చాలామందిలో కలిగిస్తూ వచ్చాయి. అంతకు ముందు నేను వినోదాత్మక షోలు ఎన్ని చేసినా, ఎన్నో సూపర్ సక్సెస్‌లు ఇచ్చినా అవేవీ పరిగణనలోకి రాకుండా పోయాయి. ఆ స్థితిని ఛేదించడం నిజంగా నాకో పెద్ద సమస్య అయిపోయింది. నేనుగా ప్రయత్నించినా ఏ ఒక్క అవకాశమూ రాలేదు.

ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం వల్ల ఏం జరుగుతుందో ఆ మూడే ళ్ల పరిణామాలతో నాకు బాగా తెలిసొచ్చింది. అయితే 2011 డిసెంబర్ మాసంలో ఒక భార్యాభర్తల జంట మా ఇంటికి వచ్చి. “మీతో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ షో చేయాలనుకుంటున్నాం” అన్నారు. నేను వెంటనే అంగీకారం తెలిపాను. కాకపోతే, వాళ్లు చెప్పిన లక్కు-కిక్కు అనే ఆ కాన్సెప్ట్ అతి మామూలుగా ఉంది. అయినా ఆ ప్రాజెక్టుకు ఒప్పేసుకుని వర్క్ చేయడం మొదలెట్టాను. అది ఆ తర్వాత చేసిన ‘కో అంటే కోటి’ రెండూ సక్సెక్ అయ్యాయి. మనసుకు నచ్చిన వాటి ప్రవాహంలో పడిపోతే ఒక్కోసారి మన ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని ఆ అనుభవం నాకు నేర్పింది.

అవి మానవ హక్కులే
నా ఉద్దేశంలో పురుషాధిక్యతా ధోరణి ఇప్పటికీ ఏమీ బలహీనపడలేదు కాకపోతే వేరే కోణాల్లో కనిపిస్తోంది. ఇప్పుడు ఆడపిల్ల బయటికి వచ్చి పనిచేస్తుంటే, ఏయ్ ఆడపిల్లవు బయటికి ఎందుకు వచ్చావు? అన్నమాటయితే అనరు. అలాగే నీకు చదువులెందుకమ్మా! అని నేరుగా ఎవరూ అనరు. కానీ అది లోపల ఎక్కడో ఉండిపోతుంది. అవకాశాలు ఇచ్చే దగ్గరో, ప్రమోషన్లు ఇచ్చేద గ్గరో, వేతనాలు మాట్లాడే దగ్గరో అది పనిచేస్తూ ఉంటుంది. పైగా అవన్నీ సంస్థాగతం అయిపోయాయి ఒకప్పుడు వ్యక్తిగతంగా ఉన్న భావజాలం ఇప్పుడు సంస్థాగతం అయిపోయింది.

ఆడపిల్ల అయితే తక్కువ వేతనం ఇచ్చుకోవచ్చు. ఎక్కువ గంటలు పనిచేస్తారు. ప్రమోషన్లు ఇవ్వకపోయినా గట్టిగా అడగరు. ఈ నాటికైనా ఎంత మంది మహిళలు ఉన్నతాధికారులుగా ఉన్నారు. ఎన్ని బోర్డులలో మహిళలు ఎంత శాతం డైరెక్టర్లు ఉన్నారు? ఎంత మంది సిఇఓలుగా ఉన్నారు? మహిళలు ఆ స్థాయికి రావడానికి ఇప్పటికీ సమాజంలో అనుకూలించే పరిస్థితులు లేవు. ఇప్పటిదాకా మనం బయటికి కనిపిస్తున్న వాటి మీద పోరాటం చేశాం. ఇకనుంచి అంతరంగాన్ని టార్గెట్‌చేసి పోరాటం చేయాల్సి ఉంది.

లోపలున్న ఆలోచనను మార్చాల్సి ఉంది. ఈ అంశాన్నే మేము తీసిన ‘ఆల్ ఐ వాంట్ ఈజ్ ఎవ్విరీ థింగ్ ‘అనే మా ఫీచర్ ఫిల్మ్‌లో కూడా చూపే ప్రయత్నం చేశాం. ఈ నూరేళ్ల మహోద్యమాలు పోరాడి తెచ్చుకున్న చట్టాలెన్నో ఉన్నాయి. కాకపోతే తెచ్చుకున్న ఆ చట్టాలు ఉపయోగపడకుండా చేస్తున్న భావజాలం ఒకటుంది. దానిమీద కూడా పోరాటం చేయాల్సి ఉంది, నేను ఫెమినిస్టును ఏమీ కాదు. హ్యూమనిస్టునంతే.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.