మా ఊరి నాటకంలో హీరో నేనే

మా ఊరి నాటకంలో హీరో నేనే“జోరుగా వచ్చే ముసీ ప్రవాహం, ఆ నీరు ఎక్కడి కక్కడ సుడులు తిరగడం నిజం ‘టైటానిక్’ నీటిని తలపించేది. ఇంతవరకు నేను అలాంటి సీన్‌ను నా సినిమాల్లో చూపించలేదు. కానీ దర్శకుడు గుణశేఖర్ ‘సైనికుడు’ సినిమాలో కొంతవరకు ఈ ప్రయత్నం చేశారు.”
‘టైటానిక్’ నీటిలో…
“మా ఊరు చాలా అందమైనది. మాకు ఒక వైపు ముసీ నది, (హైదరాబాద్ మూసీ నది కాదు, ప్రకాశం జిల్లాలోది) ఇంకో వైపు జామ, మామడి, సరుగుడు చెట్లు కాపలా ఉంటాయి. అప్పట్లో మా ఊరుకు రోడ్డు లేదు. మా పక్కూరు తిమ్మాడలో దిగి దాదాపు రెండు కిలో మీటర్లు నడిచి ఊళ్లోకి రావాలి. ఇప్పుడైతే ముసీ నదిపై బ్రిడ్జ్ నిర్మించారు. ఊరికి రోడ్లు కూడా పడ్డాయి. బస్సుల రాకపోకలు సాగుతున్నాయి. నా చిన్ననాటి రోజుల్లో ఇవేవీ ఉండేవి కాదు. దాంతో తిమ్మాడ నుంచి మా ఊరుకు రావడం ఒక్కోసారి గొప్ప సాహసంగా ఉండేది. మామూలు రోజుల్లో చెట్లు, డొంకలు, పుట్టలు దాటి వచ్చే మా పల్లె జనం వర్షాకాలంలో మాత్రం నీటితో పోరాటమే చేసేవారు.

తిమ్మాడకు ఆనుకుని ‘ఇనగలేరు’అనే ఏరు ఉంది. వర్షం వస్తే ముసీనది, ఇనగలేరు రెండూ దోస్తీ చేసేవి. దాంతో నిడమానూరు చుట్టూ ఎటు చూసినా నీరే. మా ఊరికి ఎం. నిడమానూరు అనే పేరు రావడానికి ముసీయే కారణం. దాని ఒడ్డునున్న ఊరని మా ఊరిని ముసీ ఒడ్డు నిడమానూరు అంటారు. ఏరు వచ్చినపుడు పొలాలకు, మా ఊరి పెద్ద చెరువుకు తేడా ఉండేది కాదు. ఆ నీటి మధ్యలో మా పల్లె జనం బతికేవారు. అయినా సాధారణ రోజుల్లాగే మా ఊరి నుంచి తిమ్మాడకు ఆ నీటిలోనే రాకపోకలు జరిగేవి. సుడులు తిరిగే ఆ నీటిని దాటడానికి పడవలు, నావలు, తెప్పలు వాడిన సందర్భాలు ఎప్పుడూ లేవు.

మరెలా? దాటే వారంటే…రెండు వెదురు కర్రలే ఆ సాధనం. వాటి సాయంతోనే దాటే వాళ్లం. వాటికి మరో ఇద్దరు సాయం. వాళ్లేం చేసేవారంటే బలిష్టమైన, పొడవాటి వెదురు కర్రలను తీసుకుని వాటిని రైలు పట్టాల్లా పెట్టి వాటి చివరలు మరో రెండు కర్రలతో కలిపి కట్టేవారు. ఆ వెదురు కర్రలకు ముందు వెనుక ఇద్దరు ఉండేవారు. మధ్యలో ప్రయాణీకులు. మన రెండు చంకల కింద వెదురు కర్రలు ఉంటాయి. మిగతా శరీరమంతా నీటిలోనే ఉండేది. ఆ ప్రవాహానికి తగ్గట్టుగా ముందుకెళుతూ ఆ ఇద్దరూ జాగ్రత్తగా ప్రయాణీకులను నిడమానూరుకు చేర్చేవారు.

ఒక ట్రిప్పులో ఏడుగుర్ని ఇలా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేర్చేవారు. ఈ పనిని చాకళ్లు చేసేవారు. నేను రెండు మూడు సార్లు ఇలాంటి ప్రయాణం చేశాను. ఏ మాత్రం పట్టు జారినా నీటిలో మునిగిపోవాల్సిందే. అలాంటిది నా ఎరుకలో ఒక్కసారి కూడా ఎలాంటి అపశ్రుతీ జరగలేదు. జోరుగా వచ్చే ముసీ ప్రవాహం, ఆ నీరు ఎక్కడి కక్కడ సుడులు తిరగడం నిజం ‘టైటానిక్’ నీటిని తలపించేది. ఇంతవరకు నేను అలాంటి సీన్‌ను నా సినిమాల్లో చూపించలేదు. కానీ దర్శకుడు గుణశేఖర్ ‘సైనికుడు’ సినిమాలో కొంతవరకు ఈ ప్రయత్నం చేశారు.


‘పొట్టి’గోపాల్..’ ది ఆర్టిస్టు’
నా సినిమా నేపథ్యానికి మా ఊరిలోనే పునాదులు ఉన్నాయి. మోహనరావని ఒకాయన ఉండేవాడు. పొడవుగా, తెల్లగా చూడగానే ఆకట్టుకునే రూపం ఆయనది. అలాంటి మోహనరావు ఏ మద్రాసులోనో ఉంటే సినిమాల్లో ‘హీరో’ అయ్యేవాడు. ఆయన ఉన్నది ఊర్లో కాబట్టి డ్రామాల్లో హీరో అయ్యాడు. అతని ఆధ్వర్యంలో నాటకాలు వేసేవారు. ఈయనకొక టీమ్ ఉండేది…సుబ్బయ్య, ఎర్రకోటేశ్వరరావు, కె.ఎస్.ఆర్ మూర్తి. వీళ్లు మోహనరావు డ్రామా సంఘంలో శాశ్వత సభ్యులు. వీరందరికీ చేదోడు వాదోడుగా మా బావ కోటేశ్వరరావు వ్యవహరించేవారు.

వాళ్లు ఏదో ఒక నాటకం రిహార్సల్ చేయడం… సందర్భం చూసుకుని వేసేయడం. ఇలా ఉండేది వాళ్ల సరదా. స్టేజ్ మీద వాళ్లని చూశాక రిహార్సల్ ఎలా చేస్తారో చూడాలనే ఆసక్తి కలిగింది. రిహార్సల్స్ స్కూల్‌లోనే, పంచాయితీ భవనంలోనే జరిగేది. లోపలికి ఎవరినీ రానిచ్చేవారు కాదు. రెండు మూడు సార్లు సొంతంగా ప్రయత్నించి విఫలమయ్యాక మా బావ కోటేశ్వరరావుతో లాబీయింగ్ చేసి ఎలాగైతేనేం చూశాను. అప్పటి నుంచి కొత్త ఉబలాటం మొదలైంది.

ఎలాగైనా స్టేజ్‌మీద నటించాలనే కోరిక రాత్రి, పగలు వెంటాడింది. దాంతో మళ్లీ బావతో లాబీయింగ్ చేస్తే పెడితే నా గోల భరించలేక ‘పోలీసు ఇన్‌స్పెక్టరు’ పాత్ర ఇచ్చారు. నేను పొట్టి కావడంతో ఆ బట్టలు బాగా లూజ్ అయిపోయాయి. నన్ను నేనే చూసి తెగ నవ్వుకున్నా. ఎలాగోలా స్టేజ్ మీద నటించాను. ఆ పాత్రలో నా నటన జనాలు గుర్తించారో లేదో కానీ మా డ్రామా కంపెనీ వాళ్లు తరువాత నాటకంలో నన్ను ఏకంగా హీరోని చేశారు.

నా పక్కన ఇందిర అనే స్టేజ్ ఆర్టిస్టు నటించారు. నాటకాన్ని రక్తి కట్టించాలనుకుని ‘పండంటి కాపురం’ సినిమాలోని ‘ఈ కోకకట్టుకున్న బొమ్మరిల్లు’ పాటను మేమే కంపోజ్ చేసి పెట్టుకున్నాం. ఆ ప్రయోగం బాగా విజయవంతమై నన్ను అందరూ మంచి ఆర్టిస్టు అన్నారు. తరువాత రోజు ఊర్లో తిరుగుతుంటే కొంతమంది స్త్రీలు నన్ను గుర్తుపట్టి ‘హీరో’ ‘హీరో’ అంటూ వాళ్లలో వాళ్లు కొంచెం గట్టిగానే అనుకోవడంతో నాకు చెప్పలేనంత సిగ్గేసింది.

అమ్మవార్ల ‘ డావెన్సీకోడ్’…
దేవుడు లేదా దేవతల అనుభవాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఒక్కోసారి నమ్మలేనంతగా ఆశ్చర్యపరుస్తాయి. మా నిడమానూరులో ‘గోగులమ్మ’, ‘గంగమ్మ’, ‘పోలేరమ్మ’ బాగా ఫేమస్. మొక్కులు చెల్లించాలనుకునేవారు ఈ అమ్మవార్లను ఊరంతా ఊరేగించేవారు. ఈ ముగ్గురమ్మల మీద మా ఊరి వాళ్లకు విపరీతమైన నమ్మకం. ఏం కోరినా కాదనరని అంటుంటారు. నాకూ ఈ అమ్మవార్ల మహిమతో ఒక అనుభవం ఉంది.


మా చెల్లాయి సుశీలకు ఒకసారి బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. దాన్ని నలభై ఒక్క రోజులు మద్రాసులోని విజయా ఆసుపత్రిలోనే ఉంచేశాము. రోజు రోజుకూ పరిస్థితి చేజారిపోతోంది. ఆఖరికి నలభై ఒకటో రోజు డాక్టర్లు సుశీల ఇంక బతకదని, తీసుకువెళ్లిపోవచ్చని చెప్పారు. మన చేతిలో ఏమీ లేదు కదా సరే అనుకున్నాం. అమ్మానాన్నలిద్దరూ నిస్పృహలోకి వెళ్లిపోయారు. డిశ్చార్జికి అన్ని ఏర్పాట్లు చేస్తుండగా నా దగ్గరకు తమ్ముడు సుబ్బారావు వచ్చి ” మన చెల్లమ్మకు తగ్గితే ‘గోగులమ్మ’, ‘గంగమ్మ’, ‘పోలేరమ్మ’లకు కొలుపులు పెడతానని మొక్కుకోనా?” అని అడిగాడు.

నిరాశగానే నేను “సరే” అన్నాను. గంట తర్వాత డిశ్చార్జి చేయాల్సిన డాక్టర్లు ‘కాసేపు ఆగండ’ని చెప్పారు. మాకేమీ అర్థం కాలేదు. మొత్తానికి మళ్లీ ట్రీట్‌మెంట్ మొదలుపెట్టారు. కొన్ని రోజుల్లో తేరుకున్న సుశీల ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. ఆ తరువాత చేసిన ‘గోగులమ్మ’, ‘గంగమ్మ’, ‘పోలేరమ్మ’ కొలుపులకు నేనూ వెళ్లాను. ఇప్పటికీ మా ఊరు ముగ్గురమ్మలను నేను బాగా నమ్ముతాను.

‘డార్క్‌నైట్’ రైడింగ్…
ఊరిలో నాకొక చిన్న గ్యాంగ్ ఉండేది. రమణారెడ్డి, కోటి రెడ్డి, బెజవాడ శ్రీక్రిష్ణయ్య, శ్రీరాములు, మూర్తి కె.ఎస్.ఆర్, కోటేశ్వరరావు, సుబ్బయ్య…వీళ్లంతా గ్యాంగ్ సభ్యులు. సినిమాలు చూడటానికి వీళ్లతోపాటు మరికొంత మందిమి కలిసి సైకిళ్లపై ఒంగోలు వెళ్లేవాళ్లం. ఒంగోలుకు మా ఊరి నుంచి 15 కిలో మీటర్ల దూరం. కొండల మధ్య నుంచి వెళ్లాలి. పాటలు, పందేలు, జోకులతో హాయిగా వెళ్లేవాళ్లం. ఒంగోలులో ‘కొచ్చిన్ కేఫ్’ అని ఉండేది. దానిని కేరళ వాళ్లు నిర్వహిస్తుండేవాళ్లు. అక్కడ టిఫిన్ చేసి మార్నింగ్ షో మొదలు సెకెండ్ షో వరకు ఏకధాటిగా సినిమాలు చూసేవాళ్లం. అప్పట్లో నేల టికెట్ 30 పైసలు. దాంతో సినిమా కోసం కొంత మొత్తం, భోజనాలకు కొంత ఏర్పాటు చేసుకునే వాళ్లం. సెకెండ్ షో అయ్యాక బీచ్‌కు వెళ్లడం ఆనవాయితీ. ఒంగోలు నుంచి 20 కిలో మీటర్ల దూరంలో ‘ఈతముక్కాల -మన్నూరు’ బీచ్‌లుండేవి. రెండో ఆట పూర్తవగానే మేమంతా ఈ బీచ్‌లకు బయలు దేరేవాళ్లం. కొంత దూరం వరకు తారురోడ్డు ఉండేది. ఆ తరువాతే అసలు సినిమా మొదలయ్యేది. కటిక చీకటి…పెద్ద డొంకలు…వాటి మధ్య సైకిళ్ల ప్రయాణం. మా మాటలు మాకే భయపట్టేవి. అయినా అక్కడకు వెళ్లడం అదొక ఆనందం. వెళ్లాక ఓపిక ఉన్నంత వరకు సముద్ర స్నానాలు చేసేవాళ్లం. బాగా అలసిపోయి ఎక్కడి వాడు అక్కడ సముద్రం నుంచి కొట్టుకొచ్చిన చేపల్లా బీచ్ ఒడ్డున పడుకునే వాళ్లం. ఉదయం లేచి ఇంటికి తిరుగుముఖం పట్టేటప్పుడు మాత్రం రాత్రి ఈ దారిలోనే కదా! వెళ్లింది అని ఆశ్చర్యపోయేవాళ్లం. లోపల ఎంత భయమున్నా వదులుకోలేని సరదాలే అవన్నీ.

బల్లెడ

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.