సంగీత పరమాచార్య

సంగీత పరమాచార్య

 

అటు సంగీతంలోనూ, ఇటు వైద్య రంగంలోనూ ఆయనొక అద్భుతం. ఏక కాలంలో రెండు వృత్తుల్లో కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించిన మహామహులు చాలామందే ఉండవచ్చు కానీ, డాక్టర్ శ్రీపాద పినాకపాణి ‘బాణి’ మాత్రం న భూతో న భవిష్యతి. తెలుగు సంగీతాభిమానుల కోసం కర్నాటక సంగీతాన్ని తిరగ రాశారు. ఈ సంగీతానికి మకుటాయమానమైన తంజావూర్ బాణీలో వేలాది మంది విద్యార్థులకు శిక్షణనిచ్చారు. సంగీతంపై తెలుగులోనే కాక, ఇంగ్లీషులో కూడా ప్రామాణికమైన గ్రంథాలు రాశారు. ఒకపక్క సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తూనే మరో పక్క వైద్యంలో ప్రొఫెసర్‌గా విద్యాసంస్థల్లో అసంఖ్యాకంగా శిష్యులను తయారు చేశారు.

1913 ఆగస్టు 3న శ్రీకాకుళం జిల్లా ప్రియా అగ్రహారంలో జన్మించిన పినాకపాణి 2013 మార్చి 11న తన 100వ ఏట పరమపదించే వరకూ సంగీత, వైద్య రంగాలకు దిక్సూచిగా వ్యవహరిస్తూనే ఉన్నారు. రాజమండ్రిలో ఎంబీబీఎస్ చేసిన తరువాత విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో ఎండీ పూర్తి చేశారు. ఒకపక్క వైద్యం చదువుతూనే ఆయన బీఎస్ లక్ష్మణ రావు దగ్గర, ఆ తరువాత వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు, సంగీతజ్ఞుడు శ్రీరంగ రామానుజ అయ్యంగార్‌ల వద్ద శిష్యరికం చేశారు. 1938ల మొదటిసారిగా ఆకాశవాణి ద్వారా సంగీతంలో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. వివిధ నగరాల్లో పాట కచ్చేరీలు నిర్వహించడంతో ఆయన కీర్తి ప్రతిష్ఠలు దేశవ్యాప్తమైపోయాయి. సంగీతం పట్ల అభిమానంతో ఆయన సంగీత విద్వాంసురాలు బాలాంబను వివాహం చేసుకున్నారు.

ఒకపక్క వైద్యుడుగా, అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా, వైద్య అధ్యాపకుడుగా, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా, ఆ తరువాత ఆస్పత్రి పర్యవేక్షకుడుగా ఎదుగుతూనే పినాకపాణి మరోపక్క సంగీత విద్వాంసుడుగా, సంగీత అధ్యాపకుడుగా, సంగీత గ్రంథకర్తగా గుర్తింపు పొందడం ప్రారంభించారు. మూడు దశాబ్దాల పాటు వైద్య సేవలందించి 1968లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేశారు. సోనియా గాంధీకి చికిత్స చేసిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, అమితాబ్ బచ్చన్‌కు చికిత్స చేసిన డాక్టర్ జగన్నాథ్‌లు ఆయన శిష్యులే. సంగీతంలో నూకల చిన సత్యనారాయణ, నేదునూరి కృష్ణమూర్తి, పెమ్మరాజు సూర్యారావు, శ్రీరంగం గోపాలరత్నం, ఓలేటి వెంకటేశ్వర్లు, మల్లాది సూరిబాబు, మల్లాది సోదరులు వంటి హేమాహేమీలు ఆయన శిష్యులే. 1978లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆయన సంగీతాన్ని రికార్డు చేసి భద్రపరచింది.

మనోధర్మ సంగీతం, పల్లవి గాన సుధ, గానకళా సర్వస్వము, మేళ రాగమాలిక వంటి గ్రంథాలు ఆయన సంగీతానికి అందించిన విలువైన కానుకలు. ఆయన రచనలను టీటీడీ ‘సంగీత సౌరభం’ పేరుతో నాలుగు సంపుటాలుగా ముద్రించింది. అం దులో పినాకపాణి స్వరపరచిన అన్నమాచార్య, త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితార్ వంటి వాగ్గేయకారుల కృతులున్నాయి. ఆయన రాసిన 18 సంపుటాల ‘గానకళా సర్వస్వము’లో సంగీతానికి సంబంధించిన ప్రతి వివరణా లభ్యమవుతుంది. 1973లో ఆయన టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ అవార్డు, సంగీత శిఖామణి, గాన కళా సాగర, సప్తగిరి సం గీత విద్వన్మణి, సంగీత కళానిధి, గాన కళా వారధి, కళాప్రపూర్ణ పురస్కారాలు ఆయనకు లభించాయి. కాగా, 1984లో ఆయనను ‘పద్మభూషణ’ బిరుదు వరించింది.

పక్షవాతం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడిన పినాకపాణి తన చివరి క్షణం వరకూ లోలోపల ఏదో ఒక కీర్తనను ఆలపిస్తూ కనిపించేవారు. ఆయన 98వ ఏట ఒకసారి వందలాది మంది శిష్యులు ఆయనను చూడడానికి వచ్చారు. వారిని చూసి కుటుంబ సభ్యులు కలవరపడ్డారు. కానీ, ఆయన ఒక్కసారిగా ‘నాదా తనుమనిశం’ అంటూ కీర్తనను ఆలపించడం, దాన్ని శిష్యులు అందుకోవడం అక్కడున్నవారందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ‘సంగీతమే నా ప్రాణం, నా జీవం’ అని ఆయన అనేవారు. చివరి రోజుల్లో కూడా ఆయనలో సంగీత సాధన కనిపిస్తుండేది.

ఆయన గురు శిష్య సంప్రదాయాన్ని అభిమానించేవారు. శిష్యులు ఆయన ఇంట ఉండి, శుశ్రూష చేస్తూ ఉచితంగా సంగీతాన్ని అభ్యసించేవారు. ఆయన ఇంట్లో సంగీత సాధనకు ప్రత్యేక సమయమంటూ ఉండేది కాదు. ఎప్పుడు తోస్తే అప్పుడే సంగీత సాధన. ఆయన తన కుమార్తె, ముగ్గురు కుమారుల పట్ల ఎంత ఆప్యాయంగా వ్యవహరించారో శిష్యుల పట్ల కూడా అంతే ఆప్యాయంగా ఉండేవారు. ఆయన సంగీత, వైద్య రంగాల్లోనే కాక సంస్కృతంలో కూడా ప్రజ్ఞాశాలి. ఆయనకు సంగీతం తప్ప సంపాదన గురించి ఏనాడూ పట్టలేదు. ఆయన తనకు వచ్చిన స్వర్ణ పతకాలతో భద్రాచలంలో సీతాదేవికి కిరీటం చేయించారు. ‘సంగీతమే జీవితం, జీవితమే సంగీతం’ అన్నంతగా ఆయన సంగీతానికి అంకితమైపోయారు. కర్నూలులో ‘గాయక వైద్యుడు’గా ఆయన స్థిరపడ్డారు. ఓ ఉత్తమ సంగీత విద్వాంసుడు కావాలంటే, ఉత్తమ సాంప్రదాయిక గురువుల నుంచి సంగీతాన్ని నేర్చుకోవడంతో పాటు, విద్యార్థులకు సంగీతం నేర్పగలిగే స్థాయిని కూడా సంపాదించగలగాలని, కచ్చేరీల ద్వారా సంగీతానికి ప్రాచుర్యం కల్పించాలని, చివరికి తన సంగీత పరిజ్ఞానాన్ని గ్రంథస్తం చేసి భావి తరాలకు అందించాలని ఆయన తన శిష్యులకు చెబుతుండేవారు. శిష్యులు ఆయన వారసత్వాన్ని పదిలంగా భావి తరాలకు అందించగలిగితే అదే ఆయనకు నివాళి కూడా.

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

2 Responses to సంగీత పరమాచార్య

  1. sreedevi అంటున్నారు:

    sri pinakapani gari goppatanam gurinchi enta talchukunna adi, maha samudram lo chinna binduvante!

    ayanaki nivaligaa meeru rasinanduku ento santosham gaa undi.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.