అరకొరగా ఉన్నా ఆగనిదే జీవితం -కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించిన-. ఎన్. గోపి జీవనయానం

అరకొరగా ఉన్నా ఆగనిదే జీవితం


ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఎన్ని పాఠాలైనా చెప్పి ఉండవచ్చు. విద్యార్థుల జీవితాల్ని అవి ఎంతగానైనా ప్రభావితం చేసి ఉండవచ్చు. కానీ, ఆ చెప్పేవారిని కూడా నడిపించే పాఠాలు కొన్ని ఉంటాయి కదా! ఆ పాఠాల స్ఫూర్తితోనే ఇక్కడిదాకా రాగ లిగానని చెబుతారు డాక్టర్ ఎన్ గోపి. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా, తెలుగు యూనివ ర్సిటీ వైస్ చాన్సలర్‌గా కన్నా ఆయన ‘వేమన- గోపి’గా, 18 కవితా సంకలనాలు ప్రచురించిన ఒక ‘కవి- గోపి’ గానే ఎక్కువ మందికి తెలుసు. ఆయన రాసిన ‘కాలాన్ని నిద్రపోనివ్వను’ అన్న కవితా సంకలనానికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. ఎన్. గోపి జీవనయానంలోని కొన్ని అరుదైన సంఘటనలే ఈ వారం ‘అనుభవం’
మా స్వస్థలం నల్లగొండ జిల్లాలోని భువనగిరి. మా నాన్నగారు నెత్తిన చీరల మూట పెట్టుకుని ఊరూరూ తిరుగుతూ అమ్మేవారు. ఆయన ఇంట్లో లేనప్పుడు ఎవరైనా వస్తే మా అమ్మ, మా అక్క, నేను అమ్మేవాళ్లం. మా నాన్నకు ఆయుర్వేద వైద్యం మీద కొంత అవగాహన ఉండేది. జబ్బుతో తన వద్దకు వచ్చిన వారికి ఆయుర్వేద మాత్రలు, పసరు మందులు ఇచ్చేవారు. అవసరం అనిపిస్తే కొందరికి భస్మాలు కూడా తయారు చేసి ఇచ్చేవారు. ఈ మందులన్నీ ఆయన అందరికీ ఉచిత ంగానే ఇచ్చేవారు.

ఆయన వైద్యంతో ఒక మహిళకు ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న ఒక మొండి వ్యాధి నయమైపోయింది. ఆ సంతోషంలో ఆమె భర్త, కొడుకులు, బిడ్డలు, మనమలు మా నాన్నకు కృతజ్ఞతలు చెప్పడానికి పెద్ద గుంపుగా మా ఇంటికి వచ్చారు. ఆమె భర్త మా నాన్నను ఉద్దేశించి “చెన్నయ్య మహరాజ్! మీరిచ్చిన మందుతో నా భార్య వ్యాధి నయమైపోయింది. మీ చేతి చలవ వల్ల ఆమె పూర్తిగా కోలుకుంది. మాకు చాలా సంతోషంగా ఉంది” అంటూ తన జేబులోంచి 100 రూపాయల నోటు తీసి, నాన్నకు ఇవ్వబోయాడు. నాన్న ఆ నోటును ఒక పామును చూసినట్లు చూశాడు. “ఏందయ్యో నేను మందులు ఇచ్చిన ందుకు ఎప్పుడూ పైసలు తీసుకోను” అని ఎంతో చీదరింపుగా అన్నాడు. అప్పుడు నాకు పదేళ్లు ఉంటాయేమో.

ఆ రోజుల్లో 100 రూపాయల నోటంటే చాలా పెద్ద మొత్తం. నాన్న నిరాకరించ డాన్ని చూసి నివ్వెరపోయాను. ఆ రోజుల్లో ఒక మంచి జరీ చీర ఖరీదు మూడు రూపాయలు. ఒక వంద రూపాయలు చేతికి రావాలంటే 33 చీరలు అమ్మాలి. అంత డబ్బును మా నాన్న తృణప్రాయంగా తోసిపుచ్చడం ఎంతో అసాధారణ విషయంగా అనిపించింది నాకు. ఆయనెవరు? నెత్తిన మూట పెట్టుకుని బట్టలమ్ముకునే ఒక చిన్న బట్టల వ్యాపారి. ఎంత చేసినా ఇల్లు గడవడమే కష్టంగా ఉండే ఒక బడుగు జీవి.

అలాంటి వాడు తనకు తెలిసిన వైద్యాన్ని సొమ్ము చేసుకునేందుకు కాకుండా ప్రజల మేలు కోసం ఉపయోగపెట్టాలని ఆలోచించటమే ఒక అద్భుతం. ఆయన బట్టలమ్మే సమయంలో పైసాపైసాకూ గీసిగీసి వ్యాపారం చేయడం నాకు గుర్తుంది. వాళ్లు అడిగిన ధర తనకు గిట్టుబాటు కాదనిపిస్తే పడదని విసురుగా మూట బిగదీసిన సందర్భాలూ ఉన్నాయి. అదేమో తన వ్యాపారం. కానీ, వైద్యం అతని సేవాకార్యం. జీవితం చివరి దశలో ఆరోగ్యం బాగా క్షీణించి తను వ్యాపారం చేయలేని స్థితికి చేరుకున్న నాడు కూడా తాను ఏనాడూ వైద్యంతో సొమ్ము చేసుకోవాలనుకోలేదు. జీవితం చివరి క్షణం దాకా అలాగే ఉండిపోయాడు. ఎవరికి వారు ఎన్ని జీవన సూత్రాలయినా పెట్టుకోవచ్చు కానీ, జీవితమంతా ఆ సూత్రానికి కట్టుబడి జీవించడంలోనే అసలైన జీవితం ఉందనే ఒక లోతైన సత్యాన్ని ఆ సంఘటన నాకు నేర్పింది.

ముద్ర వేసిన ఆరుద్ర వ్యక్తితం
1974లో నాకు ఉస్మానియా యూనివ ర్సిటీలో పిహెచ్‌డిలో సీటు వచ్చింది. ‘ప్రజాకవి వేమన’ అన్నది నా పరిశోధనాంశం. వేమనకు సంబంధించిన ఎంతో విషయసామగ్రి మద్రాసు యూనివర్సిటీ కేంపస్‌లోని ప్రాచ్య లిఖిత గ్రంధాలయంలో ఉన్నట్లు ఎవరో నాకు చెప్పారు. వాటి కోసం నేను మొట్టమొదటిసారిగా మద్రాసుకు వెళ్లాను. ఆరుద్ర గారికి అప్పుడో ఇప్పుడో ఉత్తరాలు రాస్తూ ఉండే వాడ్ని. ఆయన అప్పటికే వేమన మీద ఒక టి రెండు వ్యాసాలు రాశారు. నా పరిశోధన విషయంలో ఏమైనా సలహా ఇస్తారేమోనని ఆయన దగ్గరకు వెళ్లాను. అప్పటిదాకా ఉత్తరాలు రాయడమే తప్ప ముఖ పరిచయమేమీ లేదు. అయినా అంత పెద్దకవి ఏమీ తెలియని ఈ కుర్రాడి కోసం బయలుదేరారు.

పరిశోధన పట్ల ఆయనకున్న అవ్యాజమైన ప్రేమ కూడా అందుకు కారణం కావచ్చు. నన్ను తన కార్లో ఎక్కించుకుని వాళ్ల ఇంటికి దాదాపు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న మద్రాసు యూనివర్సిటీ క్యాంపస్‌కు తీసుకువెళ్లారు. ఆ లైబ్రరీలోని కొంతమంది సిబ్బందికి పరిచయం చేశారు. వేమనకు సంబంధించిన తాళపత్ర గ్రంధాలు, సి.పి. బ్రౌన్ రాయించిన కాగితపు గ్రంధాలు మొత్తం 100 దాకా ఆ లైబ్రరీలో ఉన్నాయి. వాటి ప్రతులు తీసుకోవడానికి ఆ రోజుల్లో జిరాక్స్‌లు లేవు. వేలాది పేజీలను రెండు వేసవి సెలవుల్లో కూర్చుని రాసుకున్నాను. రాసుకోవడం పూర్తయిన తరువాత ఆరుద్ర గారికి అవన్నీ చూపించాలనిపించింది. ఆటో కాదు కదా, బస్సులో వెళ్లడానికి కూడా నా వద్ద డబ్బుల్లేవు.

అందుకే దాదాపు 40 కిలోల బరువు ఉన్న ఆ మొత్తం ప్రతుల్ని తల మీద పెట్టుకుని ఆరుద్ర గారి ఇంటికి నడిచి వెళ్లాను. నేను రాసిన ప్రతుల్ని ఒకటి రెండు పేజీలు తిప్పి చూసి “అబ్బో చాలా విలువైన సమాచారం ఉందే!. ఇవి నేను చూడకూడదు. నేను చూశానంటే వ్యాసాలు రాస్తాను. నువ్వు ఎంతో కష్టపడి ఇవన్నీ సేకరించావు. ఏంరాసినా నువ్వే రాయాలి’ అన్నారు. నేను ఏమైనా రాసినా అది నువ్వు రాసిన తరువాతే అంటూ ఆ ప్రతుల్ని ఇంక తాకలేదు. నేను పిహెచ్.డి వర్క్ చేస్తున్న సమయంలోనే పారిస్‌లో వేమన పద్యాల ప్రతి ఒకటి ఉందని తెలిసింది. ఎంతో కష్టపడి ఒక స్నేహితుడి ద్వారా ఆ ప్రతిని తెప్పించుకున్నాను. దాన్ని ఫోటో కాపీ తీసి ఆరుద్రగారికి ఒక కాపీ పంపాను. ఆయన దాన్ని చదివి “నిజంగానే వీటిలో ఎన్నో విలువైన విషయాలు ఉన్నాయి. ఎప్పుడో ఒకప్పుడు అందులోని విషయాల్ని బయటికి తెచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాను.

కానీ, నువ్వు ఎంతో కష్టపడి పారిస్ నుంచి సేకరించిన ప్రతులవి. నువ్వు వాటిని పుస్తకంగా వెయ్యక ముందే నేను వాటి గురించి రాయడం భావ్యం కాదు” అంటూ ఉత్తరం రాశారు. కొన్నాళ్లకు శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వారు ఏదో ఉపన్యాసం ఇవ్వడానికి ఆరుద్ర గారిని ఆహ్వానించారు. అప్పుడిక అనివార్యమై ” గోపీ! నేను వాటిలోంచి కొన్నింటిని వాడుకోవాలనుకుంటున్నాను” అన్నారు. నేను మహా ఆనందంగా ఒప్పుకున్నాను. తాను వాడుకున్న ప్రతి పద్యం కింద ” ఈ పద్యాన్ని గోపి సేకరించాడు. మామూలుగా అయితే అవి పుస్తకరూపంలో రాకముందే నేను వాడుకోవడం భావ్యం కాదు. కానీ అనివార్య పరిస్థితుల్లో వాడుకోవలసి వచ్చింది” అంటూ రాశారు. రెండు సందర్భాల్లోనూ ఆయనలో చూసిన నిజాయితీ నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. ఒక పరిశోధకుడిలో లేదా ఒక సత్యాన్వేషిలో ఎంత నిజాయితీ ఉండాలో నేను ఆరుద్ర గారి నుంచే నేర్చుకున్నాను. ఇన్నేళ్ల ఉపాద్యాయ వృత్తిలో విద్యార్థులు ఏదైనా కొత్త విషయం చెబితే ఆ క్రెడిట్ పూర్తిగా వాళ్లకే దక్కాలని అనుకుంటాను. నా పరిధిలో వాళ్లకు దక్కేలా చేస్తాను కూడా.

అన్నీ కావాలంటే…
పరిశోధనలో భాగంగానే ఒకసారి రాజమండ్రి లైబ్రరీకి వెళ్లాను. కొన్ని పుస్తకాలు తీసుకుని రోజురోజంతా రాసుకుంటూ ఉండిపోయేవాడ్ని. అది నాకు రెండు రోజుల పని. భోజనం అయితే హోటల్లో చేశాను. కాని అక్కడ నాకు తెలిసిన వాళ్లెవరూ లేరు. రాత్రంతా ఎక్కడ ఉండాలి?లాడ్జ్‌లలో ఉండడానికి నా దగ్గర డబ్బులు లేవు. అందుకే రెండు రాత్రులూ ఆర్టీసి బస్‌స్టాండ్‌లోనే పడుకున్నాను. కాకపోతే ఎవరినీ క్రిమినల్స్‌గా అనుమానించే పరిస్థితులు ఆనాడు లేవు. సరిగ్గా 25 ఏళ్ల తరువాత నేను అదే ఊరికి తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా వెళ్లాను.

ఏ ప్రదేశంలో ఒకప్పడు నన్ను పలకరించే మనిషే లేడో అదే రాజమండ్రి స్టేషన్‌లో నేను అడుగు మోపగానే నన్ను వందల మంది రిసీవ్ చేసుకున్నారు. అందులో నా గొప్పతనం ఏమీ లేదు. అదంతా సర స్వతీ మహిమ. నన్ను చదివించలేని పరిస్థితులు మా ఇంట్లోనూ ఉన్నాయి. అయినా నన్ను చదివించారు. ఆ చదువే నన్ను ఇక్కడి దాకా తీసుకువ చ్చింది. వాస్తవానికి నా కన్నా చురుకైన వాళ్లు, నా కన్నా గొప్ప గ్రహణ శక్తి, విశ్లేషణా శక్తి గల వాళ్లు చదివించేవాళ్లు లేక అక్కడే ఉండిపోయారు. అన్నింటికీ సరిపడా డబ్బులు ఉంటేనే అడుగులు వేస్తానని, ఏ కాస్త తక్కువ బడినా అక్కడే ఆగిపోతామనుకునే ధోరణి కొందరిలో ఉంటుంది.

ఎన్నోసార్లు బస్సుల్లో వెళ్లాల్సిన దూరాల్ని కాలి నడకన వెళ్లాల్సి ఉంటుంది. నేను చేసిన పనీ అదే. అదే పనిగా సౌకర్యాలు కోరేవాడు తన ప్రయాణంలో అడుగడుగునా ఆగిపోతాడు. అరకొర సౌకర్యాలతో కూడా అడుగు ముందుకేసే వాడే అంచుదాకా వెళతాడనే సత్యం నా జీవితం నాకు నేర్పిన మరో ముఖ్యమైన పాఠం. – బమ్మెర
ఫోటోలు : సాల్మన్ రాజు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.