జ్ఞానదుడు మహర్షి నారదుడు -11
శబళాశ్వు లకు నివృత్తి మార్గ బోధన
భాగవతం లోని ఆరవ స్కంధం లో నారద మహర్షి ఒక మహా గడుసైన పని చేస్తాడు .దక్ష ప్రజాపతికి ఆసిక్ని అనే భార్య వల్ల శబళాశ్వులు అనే కుమారులు జన్మిస్తారు .తండ్రి వారిని సృష్టి చేయమని కోరగా వారు నారాయణ సరస్సు దగ్గర తీవ్ర తపస్సు చేస్తున్నారు .ఆ సమయం లో తనను ఎవరో బొట్టు పెట్టి పిలిచి నట్లుగా పరిగెత్తుకొచ్చాడు మహతీ వీణా వాదనా నిపుణుడు నారదుడు ..ఆ పిల్లలను చూసి ‘’మీరు మూఢ మతుల్లా ఉన్నారు .పసి బిడ్డలు .సృష్టించటం లో ఏమి గొప్ప వుంది ?మీ అన్నలు హర్యశ్వులు సృష్టి చేయకుండానే నా మాటవిని ‘’తిరిగి ఎన్నడూ రానిలోకాలకు చేరారు .మీరు మీ అన్నలు నడిచిన మార్గం లో నడవరా ?బంధాన్ని వదిలి మోక్షం పొందండి .’’అని నివృత్తి మార్గం తెలియ జేశాడు .వీరూ అన్నల దారిలో పడి ‘’పూర్వజు లేగి నట్టియా చొప్పున ,నేన్నడుం దిరిగి చూడని త్రోవ విశేష పద్ధతిం దప్పక‘’పోయి నాట .ఇలా దక్షుని పుత్రు లందర్నీ ‘’అద్దరికి ‘’చేర్చి సృష్టి కార్యం కొంత కాలం నిలువరించాడు నారదుడు .అయితే దక్షుని కోపానికి గురై పోయాడు పాపం .’’భగావతోత్తములలో లజ్జా హీనుండవై ,యశో హానిం బొందు‘’తావని సకల భూతానుగ్రహం లేకుండా పోతుందని ,నిరంతరం లోక సంచారమే గతి అని శాపం పొందాడు దక్షుని చేత మహర్షి చంద్రుడు నారదుడు .
దక్షుని చేతిలో ‘’పీటీ దెబ్బ ‘’తిన్న నారదుడు జితేంద్రియుడు ,సర్వ లోకైక హితైషీ కనుక ‘’ఆ క్రోధ వాక్యాలకు అలుక చెందక ,’’అలాగే కానీ ‘’అని సమ్మతించాడు .దొడ్డ మనసే చూపాడు మహర్షి .లేక పోతే దక్షునికి ఏ తీవ్ర శాపమో ఇచ్చి ఉండేవాడు .అందుకనేనేమో మన నాటక కర్త లంతా నారదుడిని విదూషకుడిగా ,తార్పుడు గాడుగా అగ్గిపుల్ల గా ,తంపుల మారిగా మార్చేసి ఆ శాపాన్ని తమ కలాలకు వరం గా మార్చుకొన్నారు .నారదుడు అంటే ‘’అగ్గి పెట్టె –ఫెయిర్ బ్రాండ్ ‘’అని పించేశారు .పాపం మంచికి పోతే చెడు ఎదు రైంది అంటే ఇదేనేమో ?ఇక మగపిల్లల వాళ్ళ సృష్టి ఎలాగూ జరగదని తెలిసి ఆసక్ని వాళ్ళ ఆడపిల్లల్ని కనీ ధర్మ ,కశ్యప ,చంద్ర భూత ,ఆంగీరస ,క్రుశాశ్వులకు (10+13+27+2+2+2==56)’ఇచ్చి పెళ్లి చేశాడు .తార్కష్యుడు అనే పేరుగల కష్యపునికే ఇంకో ఆరుగురు ఆడపిల్లలను ఇచ్చి వివాహం జరిపించాడు దక్షుడు .పుట్టించటం లోను దక్షుడే ,శపించటం లోను దక్షుడే ,అల్లుడు శివుని అవమానించటంలోను దక్షుడే అని పించుకొన్నాడు .అల్లుళ్ళకే పెత్తనం ఇచ్చి సృష్టి చేయించాడు .ఇలా దక్షుని సృష్టి దక్షత్వం కుమారుల నుండి కుమార్తెలకు అంటే అల్లుళ్ళకు సంక్రమిమ జేసిన ఘనత మన ఘనత వహించిన నారద మునీన్ద్రులదే .తాను శాపం పొందినా కొడుకుల తో పాటు కూతుళ్ళకూ సమాన వాటా దక్కింప జేశాడు మన ‘’అన్న యెన్ టి .రామా రావు’’ కు మార్గ దర్శీ అయాడు .ఘనా ఘన సుందరుని ఘనం గా కీర్తించే ఈ ఘనుడు నారదుడు సర్వ విశారదుడు .ముందు చూపు ఉన్న .వాడు అందర్నీ సమానం గా చూసే తత్త్వం ఉన్న వాడు గా మనకు అని పిస్తాడు .ఒక చోట నిలిచి ఉంటె ‘’జ్ఞాన ప్రవాహం ‘’ఆగి పోతుంది కనుక ఆయనకు వచ్చిన శాపమూ మనకు వరమే అయింది అన్ని లోకాలు తిరుగుతూ క్షేమ సమాచారాలు తెలుసు కొంటు ఆపన్నులను దరికి చేరుస్తూ నిత్య హరి నామ స్మరణ తో తరించాడు .
సశేషం –మీ గబ్బిట.దుర్గా ప్రసాద్ –14-3-13-ఉయ్యూరు