నాదారి తీరు -18 కాటూరు కాపురం

         నాదారి తీరు -18

              కాటూరు కాపురం

నన్ను ఆహ్వానించిన స్కూల్ కనుక మన జాగ్రత్తలో మనం ఉండాలని కుటుంబాన్ని  కాటూరు కు మార్చాను .బండిలో సామాను వచ్చింది .కడియాల వారి వడ్ల కొట్టు ఎదురుగా పంచాయితీ ఆఫీస్ దగ్గర ఒక చిన్న డాబా ,దాని ముందు పెంకుటిల్లు అద్దెకు తీసుకొన్నాను .

                     పెండ్యాల వారిల్లు

   ఎడమ వైపున ప్రముఖ సినీ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వర రావు గారిల్లు ఉంది .కుడి వైపు ఒక ఆర్.ఐ.గారిల్లు ..పెండ్యాల వారి అమ్మగారు ఇక్కడే ఉండేవారు .పెండ్యాల గారికి ఈవిడ సవతి తల్లి పెండ్యాల నాగాన్జనేయులు గారి అబ్బాయిలు, సోదరి పిల్లలను ఈ మామ్మ గారు పెంచుతున్నారు అన్నీ తానే అయి చూసుకొనే వారు. ఆమె చాలా మంచిది.అని మా ఆవిడ చెప్పేది .కలుపుగోలుగా మాట్లాడేదట .తెల్లవారు ఝామునే లేచి ఇంటి పని అంతా ఒంటి చేత్తో చేసుకొని ,పిల్లల్ని స్కూల్ వళకు తయారు చేసి పంపేది .ఆవిడ .ఆ తర్వాతమడికట్టుకోని వంట చేసుకొనేది ..మంచి ఆచార పరాయణురాలు .పాతకాలపు పద్ధతిలో తెల్ల బట్టలు తో ఉండేది మడీ ఆచారం బాగా పాటించేది సాయం వేళల్లో ప్రభావతి తో కబుర్లు బాగా చెప్పేదట .ఆవిడ తన మనుమరాల్లను మనవాళ్ళను మురిపెం గా పెంచేది .వారికి ఏ లోటు రానిచ్చేది కాదు .పెండ్యాల వారింటి ప్రక్కన ఉంటున్నామనే గర్వం నాకు ఉండేది ఆవిడ అత్తగారి ఆరళ్ళకు బాగా ఇబ్బంది పడ్డారట అమిత కష్టజీవి ఆమె చిన్నతనం లోనే కాదు పెద్ద తనం లోను ఆమెకు కస్టాలు తప్పలేదు .ఒక పిల్లల కోడి లా కన్పించేది ఎప్పుడూ వాళ్ళ సంగతే ,ధ్యాసే ఆవిడకు .మా ఆవిడకు ఆవిడ గొప్ప ప్రేరణ అని ఎప్పుడూ అంటూ ఉంటుంది . ఆమె లో ఎన్నో మంచి గుణాలను చూసి ప్రభావతి ప్రభావితం అయిందని అంటుంది అప్పుడే పెండ్యాల సంగీతం అంటే వెర్రి వ్యామోహం నాకు .ఇప్పటికీ అంతే .అలాంటి సంగీత సార్వ భౌముడిని కన్న గ్రామం కాటూరు .ఆయన కు అక్కడ ఇంత వరకు ఒక శిలా విగ్రహం కాని గుర్తింపు కాని లేక పోవటం నాకు ఆశ్చర్యమేస్తుంది నేను ఆ ఊరి వాళ్ళ కందరి  ద్రుష్టి లోకి  ఈ విషయం తెచ్చాను .కాని ఒక్కచిత్రపటం కూడా నాకు తెలిసి నంత వరకు ఏ ప్రభుత్వ కార్యాలయం లోను పెట్టించలేదు …

              ఆర్ ఐ గారు నియోగులు .భార్య యోగ్యురాలు .టీచర్ గా పని చేసేది .మా ఆవిడకు తాను ఎంతో సహాయం చేస్తానని అనేది అట .ఆయన అప్పుడప్పుడు మాట్లాడే వారు. పిల్లలు స్కూల్ లో చదివే వారు ఆయన చాలా పొట్టి ,ఆవిడ బాగా పొడుగు వింత గా ఉండేది

 

                   కాటూరు వారి లోగిలి

కాటూరు మెయిన్ రోడ్డు లో అప్పుడున్న గ్రంధాలయం ఎదురుగా ప్రముఖ కవి స్వతంత్ర సమారయోధులు కాటూరు వెంకటేశ్వర రావు గారి పెద్ద మండువా లోగిలి, విశాల మైన దొడ్డీ ఉండేవి వాకిట్లో అరుగు మీద వారు కూర్చునే వారని చెప్పుకొనే వారు. నేను వారిని కాటూరు లో చూసిన జ్ఞాపకం లేదు .పెద్ద వ్యవసాయ దారులు .వ్యవసాయం అంతా అన్నగారు చూసేవారని విన్నాను పాలేళ్ళు ,నౌకర్లు ,చాకర్లు ఇల్లు భలే సందడిగా ఉండేదని ఎందరో లబ్ధ ప్రతిస్టులైన కవులు రచయితలు కాటూరి వారింటికి వచ్చిఅతిధ్యం స్వీకరించేవారని చెప్పుకొనే వారు కాని నా చిన్నతనం లో కాటూరి వారు ,ప్రఖ్యాత కవి దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు మా ఇంటికి రావటం మా పెంకుటింటి సావడిలో తూర్పు గోడ దగ్గర కుర్చీలలో కూచుని మా నాన్న గారితో మాట్లాడటం నాకు యిప్పటికి గుర్తు .దేవుల పల్లి వారు మద్రాస్ లో ఉంటున్న మా పెద్దక్కయ్య కు పెదమామ గారి అంటే గాడేపల్లి పేద సూర్య నారాయణ అంటే రేడియో లో’’బావగారి కబుర్లు’’ చెప్పే ఇద్దరిలో ఒక బావగారన్న మాట ఏఎయన అల్లుడే కృష్ణ శాస్త్రి గారు …పేద సూర్య నారాయణ గారి  తమ్ముడే గాడేపల్లి సూర్యనారాయణ అంటే మా అక్కయ్య మామ గారు ..ఈయన గొప్ప స్టేజి నటులు చాణక్య చంద్ర గుప్త మొదలైన హిందీ నాటకాలు చాలా వేశాడు దర్శకత్వమూ వహించాడు .పాత వెంకటేశ్వర స్వామి మహాత్మ్యం అంటే సి.ఎస్.ఆర్ ఆంజనేయులు గారు కృష్ణుడిగా వేసిన సినిమాలో ఈయన భ్రుగు మహర్షి వేశారు .వింధ్యరాణి మొదలైన సినిమా లో నటించారు .ఆయన కుమారుడే కృపానిధి మా బావగారు ..ఈయనా తండ్రి తో కలిసి నాటకాలు ఆడారు .ఇద్దరిది మంచి పర్సనాలిటీయే . కృష్ణ శాస్త్రిగారితో మాకు బంధుత్వం ఉందన్న మాట . .ఆయన భార్య రాజ హంస గారు చాలా మంచి మనిషి నేను మద్రాస్ వెళ్ళినప్పుడల్లా టి.నగర్ లో ఉన్న వారింటికి నన్ను మా అక్కయ్య తీసుకొని వెళ్ళేది .కృష్ణ శాస్త్రి గారు చనువు గా మాట్లాడే వారు .ఆయన  మరణించ టానికినికి ఇరవై రోజుల ముందు మద్రాస్ లో వారిని దర్శించి ఎన్నో విషయాలను ‘’స్క్రిబ్లింగ్ పాడ్’’ మీద ముచ్చటించు కోన్నాం .ఉయ్యూరు లో మా ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు మంచి గిరజాల నల్ల జుట్టుండేది పంచా శాలువా తో చూసిన జ్ఞాపకం ఆయన పెట్టుకొన్న కళ్ళ జోడు ఇంకా నా స్మృతి పధం నుంచి వీడి పోలేదు .నెహ్రు కోటు వేసుకొన్నారు కాటూరు వారు దర్జాగా పంచా లాల్చీ తో ఉత్త్తరీయం తో ఉన్నారు చేతిలో విలాసవంత మైన చేతి కర్ర .చుట్ట కూడామా ఇంట్లో కాల్చిన గుర్తు .దాదాపు రెండు గంటలు పైనే మా ఇంట్లో ఈ కవి జంట గడిపారు.కాటూరి వారికి కూడా కాటూరు లో స్మృతి చిహ్నం లేక పోవటం విడ్డూరమే 

                           కాటూరు లో సాయంత్రాలు

    ఉదయం ట్యూషన్ ,తర్వాతా బడీ రాత్రికి మళ్ళీ ట్యూషన్ సాయంత్రం నేను, గౌతమేశ్వర రావు గారు ఇంకొకరిద్దరూ కలిసి ప్రభుత్వ ఆసుపత్రి దాకా నడిచి వెళ్లి అక్కడ తూముల మీదో వంతెన మీదో కూర్చునే వాళ్ళం పిచ్చా పాటీ మాట్లాడుకొనే వాళ్ళం .సరదాగా గడిచి పోయేవి .గౌతమేశ్వర రావు గారు గొప్ప సంస్కారి, మిత భాషి గా ఉన్నా  లోకాన్ని ఎంతో చదివిన వారు .రాజకీయాలపై మంచి అవగాహన ఉంది .ఆ తర్వాత ఆయనకు రెడ్డి గూడెం హెడ్ మాస్టర్ గా ప్రొమోషన్ వస్తే వెళ్లి పోయారు మొలలతో  తో ఎక్కువ బాధ పడే వారు .రెడ్డి గూడెం బాగా వేడి ప్రాంతం .ఎలా తట్టుకొంటారో అను కొనే వాడిని  

                               పాలిటిక్స్

   ఆయన స్థానం లో కోనేరు దయాకర రావు అనే ఆయన వచ్చాడు .మంచి మాటకారి ఏ ఎండ కా గొడుకు రకం .గొప్ప కబాడీ ప్లేయర్ మమ్మల్ని అందర్నీ బరిలో దింపి ఆడించేవాడు సబ్ జోన్ లో కప్పు సాధించిన జ్ఞాపకం .ఈయన అన్న లోకేశ్వరరావు అనే సీనియర్ హెడ్ మాస్టర్ ఆ తర్వాతా ఎప్పుడో నేను పామర్రు లో వారి దగ్గర పని చేశాను .దయాకర రావు వచ్చిన దగ్గర్నుంచి పాలిటిక్స్ ఎక్కువైనాయి .నెమ్మదిగా సూర్య నారాయణరెడ్డి  గారితో చేరి ట్యూషన్ చెప్పేవాడు. నా దగ్గర  పదోతరగతి విద్యార్ధులు ప్రైవేట్ చదివే వారు అందులో పొట్లపాడు అమ్మాయి శేషుమాంబ చదివేది .ఆ ఊరి సర్పంచ్ మాదల అంజయ్య గారి అమ్మాయి .తమ్ముడు కూడా కాటూరు లోనే చదివే వాడని  గుర్తు .ఈ అమ్మాయి  చాలా ఫేషనబుల్ గా ఉండేది .సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ..ఈ అమ్మాయి నా దగ్గర చదవటం దయాకర రావు కు ఇష్టం ఉండేదికాదు .చాలా వ్యూహాలు పన్ని ఆమె ను మాన్పించాడు నా దగ్గర .ఆమె తర్వాతా రెడ్డి గారి దగ్గర చేరింది బోళ్ళపాడు వాడు శేషురేడ్డి ,ఇంకొకరిద్దరూ కుర్రాళ్ళు చదివే వారు ఊర్లో నాయీ బ్రాహ్మిన్ సుబ్బారావు గారి అబ్బాయి వెంకటేశ్వర రావు నా శిష్యుడే అలాగే అప్పుడు రమేష్ అనే కడవకొల్లు కుర్రాడు కాటూరు స్కూల్ లో చదివే వాడు .అతనే అ తర్వాతా గొప్ప కబాడీ ఆటగాడు అయాడు రాష్ట్ర వ్యాప్తం గా పేరున్న వాడు .కడవకొల్లు లో ,బాడీ పోటీలను చాలా కాలం నిర్వహించాడు .ఇప్పటికి అతనికి నేనంటే చాలా గౌరవం .ఎంతో మర్యాద గా నమస్కారం పెట్టి మాట్లాడుతాడు .ఉయ్యూరు హైస్కూల్ లో డ్రిల్ల్ మేష్టారు గా పని చేసి ఈమధ్యనే రిటైర్ అయ్యాడు .అతని కబాడీ అట చూసి ఆ నాటి కలెక్టర్ ఏ.వి.ఎస్.రెడ్డి గారు అతన్ని సెలెక్ట్ చేసి వ్యాయామ ఉపాధ్యాయుని గా నియమించి గొప్ప పని చేశారు సమర్ధతకు గొప్ప పట్టం కట్టారు కలెక్టర్ రెడ్డి గారు .క్రమంగా నా దగ్గర నుండి పిల్లలు జారిపోయారు .నాకు ఇదంతా బాధ గా ఉంది .కనుక వెంటనే ఒక నిర్ణయం తీసుకొని మూడు నెలల తర్వాతకుటుంబాన్ని ఉయ్యూరు పంపించేశాను .నేను రోజు ఉయ్యూరు నుండే సైకిల్ మీద వచ్చేవాడిని స్కూల్ కు .

                        కాకాని వారికి ఘన సన్మానం

   ఉయ్యూరు లో ఓడిపోయినరాజకీయ కురు వృద్ధులు కాకాని వెంకట రత్నం గారిని గన్నవరం నియోజక వర్గం లో నిల బెట్టి ఆ నాటి ముఖ్య మంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గెలిపించి వ్యవసాయ శాఖా మాత్యులుగా మంత్రి వర్గం లో కి తీసుకొన్నారు .ఆ సందర్భం గా కాటూరు ప్రజలు ,పెద్దలు కాకాని వారికి ఘన సన్మానం చేయాలని సంకల్పించారు .వేదిక హైస్కూలె .కాకానికి ఆహ్వాన పత్రం ప్రశంశా పత్రాలను నేను తెలుగు మేష్టారు ములగలేటి శర్మ గారు తయారు చేశాం .బాగా వచ్చింది అన్నారు అందరు .శర్మ గారు పద్యాలు కూడా రాశారు .నాకు సన్మాన పత్రం రాయటం ఇదే మొదలు .అంత ఇష్టం లేకపోయినా రాసేశాను .సన్మాన కార్యక్రమం భారీగా జరిగింది .ఆ ఊరి కాంగ్రేస్   పెద్దలు వెల్లంకి శ్రీ వేణు గోపాల రావు గారు ,వీరినే అందరు ‘’శ్రీ వేణు ‘’అనేవారు .కడియాల వారు,వెల్లంకి ఇతర పెద్దలు ,ముదునూరు రాజకీయ దురంధరులు కలపాల సూర్య ప్రకాశ రావు గారు అందరు కలిసి అద్భుతం గా నిర్వహించారు .నేను సన్మాన పత్రాన్ని,’’శర్మ గారు పద్యాలను చదివిన జ్ఞాపకం ..హెడ్ మాస్టారు కోటేశ్వర రావు గారు ఎంతో సంతోషించారు .కాటూరు ప్రెసిడెంట్ గా చాల ఏళ్ళు పనిచేసిన కమ్యూనిస్టు నాయకులు ‘’నాదెళ్ళవారు’’. తక్కువ గా మాట్లాడేవారు ఎక్కువ పని చేసే వారు పార్టీకి అతి ముఖ్యమైన సేవకులు ఆయన కూతురు అప్పుడు స్కూల్ లో చదివేది .

   స్కూల్ లో డ్రాయింగ్ మేష్టారు చిన్నగా ,పొట్టిగా బక్క పల్చగా ,ఎర్రగా ఉండేవారు .కోరా పంచె కోరా చొక్కా తో ఉండేవారు అక్కడే ఉద్యోగం లో చేరి అక్కడే రిటైర్ అయారు ..అయన కొడుకు మా స్టూడెంట్ .కాటూరు లో రెండు దేవాలయాలున్నాయి శివాలయం చాలా పురాతన మైనది విష్ణ్వాలయం కొత్తది శివాలయ అర్చకులకు మంచి పేరుండేది .ఆయన కొడుకు త్రయంబక రావు అప్పటికే ట్రెయినింగ్ పాసై ఉద్యోగం చేస్తున్నాడు అతని తమ్ముడు స్కూల్ లో చదువుతున్నాడు ..కడవకొల్లు వంతెన దిగ గానే కుడి వైపు మా పొలాలున్నాయి. బోరు వేసి పంట పండిస్తున్నాం .వర్రే వాళ్ళు చేస్తున్నారు .అప్పుడు .కడియాల నాగభూషణంఅనే రైతు పొలం మా పొలం ప్రక్కనే ఉంది .ఆయనది కాటూరు .ఆయన అన్న గారే సంజీవరావు గారితో కాటూరు లో దుకాణం నిర్వహిస్తున్నారు అలానే బాలయ్య గారు అనే పెద్ద మనిషిదీ ఇదే ఊరు వారిదీ మా ప్రక్క పోలమే నిత్యం పొలం దగ్గర కనీ పించి నవ్వుతు పలకరించేవాడు బాలయ్య గారు భలే పెద్ద మనిషి .మన్నే కోటేశ్వర రావు గారి పొలం మా పొలం దగ్గరే ఉంది ..

                    రైవస్ కాలువ ఈదటం

   ఒక సారి కార్తీక మాసం లో హెడ్ మాస్టారు తో సహా మేమంతా కడవ కోల్లుదగ్గర ఉన్న ‘’రైవస్ కాలువ’’కు స్నానానికి వచ్చాం .అందరం పందెం వేసుకొని రైవస్ కాలువను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు ఈది మళ్ళీఈ ఒడ్డుకు చేరాలి అని పందెం వేసుకోన్నాం  హెడ్  మాస్టారు కూడా దిగారు అందరి కంటే నేనే ముందు ఈది గెలిచాను .తర్వాతా సుంకర వెంకటేశ్వర రావు అనే డ్రిల్ మేష్టారు ,ఆ తర్వాతా హెడ్ మాస్టారు చేరుకొన్నాం .అంత వెడల్పైన కాలువ ను నేనెప్పుడూ అంతకు ముందు ఈ ద లేదు ఏదో చిన్నప్పటి నుండి మా ఉయ్యూరు లోని ‘’పుల్లేరుకాలువ ‘’లో ఈదేవాడిని. కనుక ఈత అలవాటు ఉంది మునిగి ఈదటం కూడా నాకు వచ్చు ..అది ఇక్కడ నాకు ఉపయోగ పడిందన్న మాట ..అందరు నన్ను మెచ్చుకొన్నారు .హెడ్ గారితో సహా ..అంత సాహసం నేను చేయగలనని అనుకో లేదు .కాని జరిగింది ..

    రాష్ట్రపతి ఎన్నికా ,హెడ్ మాస్టారి ప్రమోషను నూ మిగిలిన విశేషాలు తర్వాత చెబుతాను

   సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-3-13-ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

1 Response to నాదారి తీరు -18 కాటూరు కాపురం

  1. వంశీ కృష్ణ అంటున్నారు:

    మాస్టారు,
    ఇద్దరు ప్రముఖులు(పెండ్యాల నాగేశ్వర రావు గారు, కాటూరు వెంకటేశ్వర రావు గారు) కాటురు వారు అని తెలుసుకొవటం సంతోషంగా వుంధి. మీరన్నట్టు వారి స్మృతి చిహ్నంగా వూళ్ళొ ఏదయినా ఏర్పాటు చేసి వుంటే బావుండేధి.

    ధన్యవాదాలు
    వంశీ కృష్ణ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.