శ్రీ పరమాచార్య పరమ పద పీయూషం
ఆధునిక జగద్గురువులు ,నడయాడే పర బ్రహ్మ స్వరూపం ,పరమాచార్యులు, కంచి కామ కోటి పీఠాదిపతులు శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి .కాలి నడకన ఆ సేతు హిమాచల పర్యంతం పర్యటించి దర్శించిన ప్రతి చోటా అనుగ్రహ భాషణం చేసి భక్తులకు సన్మార్గ దర్శనం చేశారు .వారు తమిళ నాడు లో పర్యటించినప్పుడు తమిళం లో చేసిన ప్రసంగాల సారాన్ని ‘’శ్రీ విశాఖ ‘’గారు సరళం గా తెలుగు లోకి అనువదించారు వీటిని సంపుటాలుగా తెనాలి లోని సాధన గ్రంధ మండలి సంస్థాపకులు శ్రీ బులుసు సూర్య ప్రకాశ శాస్త్రి గారుముద్రించి ఆస్తిక జన మనోభిరామం చేశారు .వీటికి శతావధాని వేలూరి శివరామ శాస్త్రి గారు పర్యవేక్షించి నిగ్గు తేల్చారు .ఇందులో పరమాచార్యుల వారి వచో వైభవం ,పరమ ప్రామాణికత ,వేద వేదాంగాల పై వారికున్న అపార వైదుష్యం, సంగీత సాహిత్య శాస్త్రాది విషయాలపై వారికున్న అనంత పాండిత్యం మనకు దృగ్గోచర మవుతుంది ఇదంతా ఒక అద్భుత జ్ఞాన భాండాగారం .మనం తెలుసుకోదగ్గవీ ఆచరించి తరించేవి .అందులోని కొన్ని ముఖ్య విషయాలను ‘’శ్రీ పరమాచార్య పరమ పద పీయూషం ‘’గా అందజేస్తున్నాను ..
పరమాచార్యుల వారి జన్మనక్షత్రం ‘’అనూరాధ ‘’.దాని ఆది దైవతం మిత్రుడు .వృశ్చిక రాశి .అనువాదం చేసిన విశాఖ గారి జన్మ నక్షత్రం విశాఖ .అదీ వృశ్చిక రాశియే వీరికి స్వామి సంపత్తార .స్వామికి వీరు పరమ మిత్ర తార. కనుక వారి అనుగ్రహం పుష్కలం గా వీరికి లభించింది .స్వామి వారికి జ్ఞాపక శక్తి ని కంప్యూటర్ తో పోల్చారు సుమారు ఇరవై ఏడేళ్ళ క్రితం తాము’’ చిన్న తిప్ప సముద్రం అనే గ్రామం ‘’లో విడిది చేసిన విషయాన్ని రచయిత కు గుర్తు చేశారట .స్వామి తమిళ నాడులోని ‘’తిండీ వనం ‘’గ్రామం లో జన్మించి పదమూడవ ఏటనే సన్యాసం స్వీకరించి కామ కోటి పీఠాన్ని అధిష్టించారు .
శివరామ శాస్త్రి గారికి స్వామి వారి పాండిత్య ప్రకర్ష పై గొప్ప గౌరవముండేది. స్వామి వారి ఉపన్యాసాలపై ‘’పెద్ద కారికలు ‘’రాయవచ్చు అని అనేవారట కాటూరి వెంకటేశ్వర రావు గారు పరమాచార్యుల కు శిష్యులు .స్వామి పై‘’నమోవాక షస్త్యన్తాలు ‘’రాసి నివేదించారట .అందులో ఒక పద్యం లో యతి భంగమైనట్లు వేలూరి వారు గమనించి‘’యతుల పై రాసిన పద్యం లోనే యతి పోతే యెట్లా ?’’అని బాధ పడ్డారట .ఒకసారి విశాఖ గారు స్వామి దర్శనానికి తల్లిగారు భార్యతో వెళ్లారు స్వామికి వీరు నమస్కరిస్తుంటే వద్దని వారిన్చారట .’’మీ రిద్దరు ముందు మీ తల్లి గారికి నమస్కరించి తర్వాత నాకు నమస్కారం చేయండి ‘’అని హితవు చెప్పారట మాతృదేవో భవ కు ఇది నిరూపణ .స్వామి పరమ శాక్తులు అంబికా తత్వాన్నే ఎక్కువ గా బోధించేవారట ..శ్రీ ఆదిశంకర మార్గం లో నడిచే స్వామి అద్వైతానికి పెద్దపీట వేస్తారు .వారికి సర్వమతాలు సమ్మతాలే .అద్వైతానికి దేనిలోనూ విరోధం కనీ పిందని వారి భావన .
ఒక సారి భక్త మీరా బాయి బృందావనం వెళ్ళింది అక్కడ వల్లభాచార్యులున్నారు వారిని దర్శిద్దామని కబురు చేస్తే ‘’నాకు స్త్రీ ని చూసే అలవాటు లేదు ‘’అని బదులు పంపారట . అప్పుడు మీరా ‘’ఈ బృందావనం లో శ్రీ క్రిష్ణుడోక్కడే పురుషుడు .మిగతా వారంతా స్త్రీలే అని అనుకొన్నాను మీకు ‘’నేను పురుషుడిని ‘’అనే భావం ఉంటె బృందావనం నుంచి నిరభ్యంతరం గా వెళ్లి పొండి‘’అని ఖరా ఖండి గా చెప్పి పంపింది .అప్పుడు వల్లభులకు జ్ఞానోదయం అయిందట ఈ విషయాన్ని స్వామి ‘’ఆనంద తాండవం ‘’వ్యాసం లో చెప్పారట .
స్వామి వారికి భక్తుడొకడు స్పటికమాలను ఇచ్చారు .అందులో ఒక పగడం ‘’మేరుగు’’ గా కట్టి ఉంది .అది అక్షమాల అని స్వామి గ్రహించారు .వెంటనే వారి ద్రుష్టి మాఘ కవి రాసిన ‘’మేఘ సందేశ కావ్యం ‘మీదకు పోయింది .నారదుడు ఆకాశ మార్గం లో వీణ ను వాయిస్తూ వస్తున్నాడు అయాన్‌ను మాఘుడు ఇలా వర్నిన్చడట ‘’మాలను తిప్పుతూ ఎప్పుడూ వీణ ను వాయించటం వల్ల యెర్ర బారిన నారదుని బొటన వ్రేలి ఎర్రదనం స్పటిక మాలలోని స్పటికాలను ఎర్రగా ప్రవాళములు గా మార్చేసింది ‘’అన్నాడు అందుకే స్పటిక మాలలో నిజంగా ప్రవాళాన్ని మేరువుగా ఎన్నుకొన్నాడు భక్తుడు అని తెలియ జేశారట అదీ వారి పాండిత్య గరిమ
స్వామి ‘’మనకు కావలసింది అల్లా హృదయం ద్రవించే భక్తి. ఏదో మూట కట్టుకొని ఈలోకానికి వచ్చాం .పాపమూ వద్దు ,పుణ్యమూ వద్దు ఈ మూటను ఇక్కడే దులుపుకొని వెళ్లి పోవాలి అందుకే ఆ పరమేశ్వరి లోక మాత దారి చూపే త్రిపుర సుందరి ‘’అని తరచు చెప్పేవారట .
సుమారు తొంభై ఏళ్ళ క్రితం చెట్టినాడు లో వీరప్ప స్వామి అనే ఆయన ఉండేవాడు .మహా భక్తుడే చిత్తశుద్ధి ఉంది కాని కోపిస్టి .ఎప్పుడూ ముక్కు మీదే కోపం .ఆయనకు సుబ్బరామయ్యర్ అనే బ్రాహ్మణ స్నేహితుడు ఉండేవాడు .ఆయన్ను తన కోపం పోవటానికి మార్గం సూచించమని వేడుకొన్నాడు అయ్యర్ ‘’తిరుక్కోయిలూర్ వెళ్ళు .దారి కనపడుతుంది‘’అని సలహా చెప్పాడు వెంటనే అక్కడికి చేరాడు .అక్కడ మూల విగ్రహానికి ఎదురుగా పరమ కోపిస్టి అయిన దుర్వాస మహర్షి విగ్రహం ఉంది .మహర్షి సేవ చేసి కోపం పోగొట్టుకోన్నారట.వీరప్పస్వామి .ఆలయాన్ని బాగుచేయించాడు దేవాలయం చుట్టూ గ్రుహారామలు ఏర్పరచి తానొక కుటీరం ఏర్పాటు చేసుకొని ఉన్నాడట .రధం నిర్మించి ఇచ్చాడు .రాధ యాత్రలో బలి ఇవ్వటం సంప్రదాయం వద్దు అని వారించి రధం కదలక పోతే తానే రధచక్రాల క్రింద పడుకొంటాను అన్నాడట ఆంతే నిరాటంకం గా రధ యాత్ర ఏ జంతు బలీ లేకుండా అప్పటి నుంచి సాగిందట .
సమస్త వస్తువులు తమ కాంతిని ,శక్తిని, ఆకారాన్ని ఆ సర్వేశ్వరుని మూలం గానే పొందుతున్నామని ఈ జగత్తును చిన్మయం గాభావించి భగవన్మయం గా చూడ గలిగితే దుఖం అనేది ఉండదు దుఃఖ తీరాన భగవత్ప్రేమ వృద్ధి చెందాలి అని పరమాచార్య భాషణం అందరికి శిరో దార్యం .
అప్పయ్య దీక్షితుల వారు గొప్ప శివ భక్తులు ఒక సారి వారికే అనుమానం వచ్చి తనకున్నది భాక్తియా లేక భక్తి అభాసమా ఆని వితర్కిన్చుకోన్నారట .పరీక్షించుకోవటానికి ఉన్మత్త అవస్థను పొందారు .కావాలనే .ఆ స్తితిలో మన ఆలోచనలు ఎలా ఉంటాయో అదే మన నైసర్గిక గుణం అవుతుంది అని తీర్మానించుకొని మందు తిని పిచ్చి వాడై పోయాడు .తాను పిచ్చితనం లో చెప్పినదంతా రాసి ఉంచమని శిష్యులకు చెప్పారు అప్పుడు దీక్షితుల వారు ఏక ధాటిగా యాభై శ్లోకాలు చెప్పారట .అవి గ్రంధాసస్థమైనాయి వీటికి ‘’ఉన్మత్త పంచశతి ‘’అని పేరు .అందులో ఒక శ్లోక భావం తెలుసు కొందాం ‘’శివా !నీ అనుగ్రహం అంతం లేనిది .సులభం గా లభించే జిల్లేడు పూలు తమ్మిపూలు భక్తులనుంచి గ్రహించి వారికి మోక్ష సామ్రాజ్య లక్ష్మి నే అనుగ్రహిస్తున్నావు ఇది తెలియక మేము మా కాలాన్ని వృధా చేసుకొంటున్నాం ‘’అని ఈకదను పరమాచార్య ఒక చోట వర్ణించి చెప్పారు .
కామ కోటి పీఠం ఉంది కంచిలో .’’కద కంచికి వెళ్ళింది ‘’అనే సామెత మనకు తెలిసిందే అంటే అర్ధం మాత్రం మనకు చాలా మందికి తెలీదు .కంచికి వెళ్లి కామాక్షి అమ్మవారిని కనులారా దర్శించి తే మళ్ళీ ఆ జీవికి జన్మ ఉండదు అంటే మనకద కంచికి చేరింది అన్నమాట .అ మ్మ వారి ప్రభావం అంత గొప్పది అని అర్ధం ఇక్కడి స్వామిఏకామ్రనాధుడు .ఆయనే ఆదిమ పురుషుడు .అమ్మవారు ‘’నయన పీయూషం’’ గా కన్పించి జన్మ రాహిత్యాన్నిస్తుంది. శ్రీ శంకర భగవత్పాదులు దక్షిణా మూర్తి స్తోత్రం లో ‘’భూమి నీరు నిప్పు ,గాలి ,ఆకాశం సూర్యుడు ,చంద్రుడు ,పురుషుడు అనే రూపం లో భవుడు ఉన్నాడని చెప్పారు .ఆ భవుని పత్ని భూమి ,సూర్యుడు , వాయువు ,ఆకాశము, అగ్ని సోమయాజి ,ఉదకం చంద్రుడు అనే అష్టమూర్తుల రూపం ఉన్న ఆదిమ జనని అనితాను ఆ జగజ్జననిని కంపా తీరం లో చూస్తున్నాననిమూక కవి వర్ణించారు వీరిద్దరిని చూస్తె ‘’సౌందర్యం ఆనందాన్ని వివాహం చేసుకొన్నది ‘’అనిపిస్తుంది అంటారు పరమాచార్యుల వారు (.beauty has married bliss )
స్వామివారొక సారి ‘’ఆర్యా వృత్త ములో ఉన్న కావ్యాలను గురించి అడిగారు తమకు తెలిసిన ఆర్యా శతకం ఒక్కదానినే శిష్యులు పేర్కొన్నారు అప్పుడు స్వామి సదాశివ బ్రహ్మేన్డ్రుల వారు రాసిన ‘’ఆత్మవిద్యా విలాసం ‘’అనే వేదాంత గ్రంధం ఆర్యా వృత్తం లోనే రాయబడిందని చెప్పారు ఇంకా ఏమి ఉన్నాయని అడిగితే అందరు నోళ్ళు వెళ్ళ బెట్టారట అప్పుడుపరమా చార్యుల వారు భక్త్యావేశం లో చేతులు పైకెత్తి ‘’అమల కమలధి వాసిని –మనసో వైమల్య దాయిని మనోజ్ఞే –సుందర గాత్రి సుశీలే –తవ చరణంణాంభోరుహం నమామి సదా ‘’అనే శ్లోకం తో ప్రారంభించి 14 శ్లోకాలను ఆర్యా వృత్తం లో ఉన్నవాటిని వినిపించి శ్రోతలను రసోన్ముఖులను చేశారట ఇవి శ్రీ శంకర భగవత్పాదుల ‘’ప్రపంచసారం ‘’లో ఉన్నాయని చెప్పి అందర్నీ సంభ్రమాశ్చర్యం లో ముంచెత్తేశారట. .అదీ వారి దిషాణా ,ధారణా జ్ఞాపకశక్తీ .ఇదే వారి పరమ పద పీయూష లహరి .
సమాప్తం మీగబ్బిట దుర్గా ప్రసాద్ –21-3-13- ఉయ్యూరు