జ్ఞానదుడు మహర్షి నారదుడు -18
ఏకాదశ స్కంధం
‘’నిరుపమ సుందర శరీరం ధరించి సమస్త కర్మ తత్పరుడైన పరమేశ్వరుడు యాదవులను అడగింప దలచు కొన్నాడు‘’.ఆ సమయం లో విశ్వామిత్ర అసిత దుర్వాస భ్రుంగి అంగీరస కశ్యప వామదేవ వాలఖిల్య అత్రి వసిష్ట నారదాది మునివరులు ద్వారకా నగరానికి విచ్చేశారు .ఆయనను స్తుతించారు .ఆయనా చక్కగా మర్యాదలు జరిపాడు .
‘’తరణంబులు భవ జలధికి హరణంబులు దురిత లతల కాగమ మూల కా
భారణంబులార్త జనులకు శరణం బులు నీదు దివ్య చరణంబులిలన్ ‘’
మత్తకోకిల –‘’ఒక్క వేళను సూక్ష్మ రూపము నొందుదీవణు మాత్రమై
యొక్క వేళను స్తూల రూపము నొందు దంతయు నీవయై
పెక్కు రూపులు దాల్తు నీదగు పెంపు మాకు నుతిమ్పగా
నక్కజంబగుచున్న దే మానసంబుజాక్ష రమాపతీ ‘’
‘’శ్రీ నాయక నీ నామము –నానా భవ రోగ కర్మ నాశము నకు ,వి
న్నాణంబగు ,నౌషధమిది –కానరు దుస్టాత్ములకట కంజ దళాక్షా ‘’
అని ముక్త కం ఠం గా ప్రస్తుతించారు .యదునాయకుడు సంతోషించి ‘’మదీయ ధ్యాన నామ స్మరణంబులు భవ రోగ హరణాలు .బ్రహ్మ రుద్రాది శరణాలు .మంగళ కరాలు అయినా నా రూపం గల వారైన బ్రాహ్మణుల పరితాపాలను పరిహరించు .పురుషు నైశ్వర్య సమేతులు గా చేస్తాను ‘’అని యోగీశ్వరేశ్వరుడు ఆనతిచ్చాడు .’’ఇక్కడికి మీరంతా వచ్చిన కారణ మేమిటి ?’’అని ప్రశ్నించాడు .వాళ్ళు ‘’భవదీయ పదార విందదర్శనం కంటే మిక్కిలి విశేషమేమున్తుంది‘’అని వాసుదేవ వదన చంద్రామ్రుతాన్ని నిజ నేత్ర చకోరాలతో గ్రోలారు ‘’యధేచ్చగావాసుదేవుని అనుమతితో
బయల్దేరి ద్వారకకు దగ్గరలో ఉన్న ‘’పిడారకం ‘’అనే పుణ్య తీర్దానికి వెళ్ళారు .
అక్కడ యాదవులు సామ్బునికి గర్భిణీ స్త్రీ వేషం వేయించి ఈ మునులను దర్పం తో కన్నూ మిన్నూ కానకుండా ‘’ఆడ పిల్ల పుడుతుందా మగపిల్లాడా ?’’అని అడిగారు .రోషం తో కనుగోనల్లో నిప్పులు రాలగా
‘’వాలాయము యదుకుల ని –ర్మూలనకరంబైనట్టి ముసలంబొకటి
బాలిక కుదయిన్చును బొం—డాలస్యము లేదటంచు నట బల్కటయున్ ‘’
ముసలం అంటే రోకలి పుట్టటం దాన్ని అరగదీసి సముద్రం లో కలపటం ,యాదవులంతా ఒకరి నొకరు కొట్టుకొని చావటం అందరికీ తెలిసిన కధే .ఇదే ‘’యాదవ కులం లో ముసలం పుట్టటం ‘’అనే సామెత కు దారి తీసింది .పరస్పర హననం తో యాదవ వంశం నిర్వంశ మయింది .’
వసుదేవుడికి నారద మహర్షి చెప్పిన ‘’విదేహర్షభ సంవాదం ‘’
శ్రీ కృష్ణుని దర్శించి మునులంతా వెళ్ళారు .కాని నారద మహర్షి చేయవలసిన పని ఇంకా మిగిలి ఉంది కనుక దేవకీ వసుదేవులను దర్శించాడు .వారు సమాదరించారు .’’ఏ నరుడు నారాయణ చరణ సరసీరుహ భజన పరాయణత్వం నిరంతరం పొందడో అలాంటి వాడికి మృత్యువు ఎప్పుడూ అతి సమీపం లోనే ఉంటుంది .మీ దర్శనం సుభప్రదం . భాగవత కధల్లో ధర్మ సందేహాలున్నాయి .అవి తీర్చండి మహాత్మా .గోవిందుని పుత్రునిగా పొందాలనుకొని నెరవేరక దేవతా మాయలో చిక్కి చిత్త వ్యసనాన్ధకారం లో ఉన్నాను .హరి కదామృతంఅందివ్వండి .అలాగైతే సుఖం కలుగుతుంది ‘’అని కృష్ణుని తండ్రి వాసుదేవుడు మహర్షిని వేడుకొన్నాడు ..
‘’పరమేశ్వర భక్తీ జనకమై ,కైవల్య పద ప్రాప్తికర మైన విదేహర్షభ సంవాదం అనే పురాతనపుణ్య కద‘’చెప్తానని నారదుడు కదా విధానం వివరించాడు .పూర్వం విదేహుడు అనే రాజు యజ్ఞం చేశాడు .యజ్ఞం చివర ‘’కవి ,హర్యంత రిక్షా ప్రబుద్ధ పిప్పలాయనవిర్హోత్ర ద్రమీల చమస కరభాజను ‘’లు అనే తొమ్మిది మంది ఊర్ధ్వ రేతస్కులైన బ్రహ్మ విద్యా విశారదులు అక్కడికియేతేన్చారు .రాజు యధావిధి వారిని పూజించాడు .వారితో ‘’మీరు విష్ణువును దర్శించిన మహా భూరితపోధన వర్యులు ‘’కనుక ‘’క్రూరులు ,బహుడుఖ రోగ కుత్సిత బుద్ధులు నీరసులు నరులు కనుక సుజ్ఞాన బుద్ధిని నాకు అందించండి ‘’అని వేడుకొన్నాడు .’’పరమేశ్వరుడు ప్రపత్తి నిసస్టలకు సారూప్యాన్ని ఎలా ఇస్తాడు ?’’అని వివరించమని కోరాడు .
అప్పుడు కవి అనే ముని ‘’కరణ త్రయాలతో చేసే ప్రతి పని హరి సమర్పణం అని పలికి చేయాలి .శ్రీహరిని ఉత్తమోత్తముని గా మనసులో నిలపాలి .నిరంతర హరి నామ స్మరణ చేయాలి .అలాంటి వానికి కైవల్యం సులభం గా లభిస్తుంది .
‘’సంతసంబు గృష్ణ సంకీర్తనంబులు వీనుల విందుగా వినగా వలయు
హర్షంబు తోడుత హరినామ కధనంబు పాటల నాటల బరగ వలయు
నారాయణుని దివ్య నామాక్షరంబులు హృద్వీది సతతంబు నిలుప వలయు
గంజాక్షు లీలలు కాన్తారముల నైన భక్తీ యుక్తంబుగా బాడవలయు
వెర్రి మాడ్కిని లీలతో విశ్వ మయుని –నోడువుచు లోక బాహ్యత నొంద వలయు
నింతయు విష్ణు మయమని ఎరున్గ వలయు –భేద మొనరింప వలదు మేదినీశ ‘’
అని చెప్పాడు విదేహ రాజుకూ సందేహం తీరలేదు ‘’భాగవత ధర్మం అంటే ఏమిటి ??’’వివరించమన్నాడు భాగవతుడేవాడు ?ఆతని లక్షణాలులే-యేమిటి ?తెలుపమని అర్ధించాడు దీనికి హరి అనే ముని సమాధానం ఏమి చెప్పాడో తర్వాత తెలుసు కొందాం .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-3-13- ఉయ్యూరు