అపూ’ లాంటి జ్ఞాపకాలే నావన్నీ

అపూ’ లాంటి జ్ఞాపకాలే నావన్నీ


ఆరికెపూడి ప్రేమ్‌చంద్ అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో పరిశోధకుడిగా పనిచేసిన అధ్యయనశీలి అంటే కాస్త తెలుస్తుంది. ఫోర్డ్ ఫౌండేషన్ తరఫున అంతర్జాతీయ ద్రవ్యనిధి సంఘంలో ఉద్యోగం చేశారంటే ఇంకొంచెం తెలుస్తుంది. రిజర్వ్‌బ్యాంక్ పూర్వపు గవర్నర్ వై.వేణుగోపాలరెడ్డి వంటివారికి ఆప్తులైన ఆలోచనాపరుడని చెబితే మరికొంచెం తెలుస్తుంది.

ప్రభుత్వాలు ప్రజాధనాన్ని ఖర్చుపెట్టాల్సిన తీరు మీద ప్రేమ్‌చంద్ రాసిన పుస్తకాలను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ముద్రించిందంటే ఆయన గొప్పదనం ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. ‘వాటన్నిటికీ మూలాలు మా పల్లెటూళ్లో ఉన్నాయి’ అంటూ తన సొంతూరు గురించి ఆరికెపూడి ప్రేమ్‌చంద్ చెబుతున్న కబుర్లు ఆయన మాటల్లోనే…
కృష్ణా జిల్లా కడవకొల్లు అంటే ఎక్కువమందికి తెలియకపోవచ్చు. కడవకొల్లు, వీరవల్లి, పొట్లపాడు… మూడూళ్లనూ కలిపి చెప్పాలి. ఆంధ్రా మాస్కో అని పిలిచే కాటూరు మాకు రెండు మైళ్ల దూరం. నేను 1933 ఆగస్ట్ 22న కడవకొల్లులో పుట్టాను. అప్పటికి అంతా కలిపి పాతిక ముప్ఫయ్యిళ్లు ఉండేవేమో మా ఊళ్లో. అందరూ అతి సాధారణ రైతులు. రెండెకరాలూ, మూడెకరాల వాళ్లు. తిండికీ బట్టకూ లోపం లేకుండా గడిచిపోయే కుటుంబాలు. విలాసమంటే ఏమిటో తెలియని మనుషులు.

అయితే నేను పుట్టడానికి ఆరేడేళ్ల ముందు ఉయ్యూరులో కేసీపీ వాళ్లు చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించడంతో డెల్టా రైతుల దశ తిరిగింది. తిండిగింజల బదులు చెరుకు వేసి పంట చేతికి రాగానే ఫ్యాక్టరీకి తరలించడంతో డబ్బు రూపేణా ఆదాయాన్ని కళ్ల చూస్తున్న రోజులవి. మా నాన్న ఆరికెపూడి వెంకటరామయ్య జాతీయోద్యమంతో ప్రభావితులై తన వాటా రెండెకరాల పొలాన్ని అమ్మేసి మా ఊళ్లో పాఠశాల నిర్మించారు.

దీనికి ఉయ్యూరు రాజాగారు మరికొంత సొమ్ము సాయం చేశారు. తనకంటూ ఏ పదవీ లేకపోయినా మా నాన్న రోజంతా ఆ స్కూలు నిర్వహణలోనే గడిపేవారు. అందువల్ల మా నాన్నను అందరూ ‘పంతులుగారు’ అని, మా అమ్మను ‘పంతులుగారి భార్య’ అనీ అనేవాళ్లు. ఊరి బడి కోసం తన భూమిని అమ్మేసిన మా నాన్నను ఆయన అన్నదమ్ములు చాలా గౌరవంగా చూసేవారు.

ఉమ్మడి కుటుంబంలో అందరూ కష్టసుఖాలు పంచుకునేవారు. ప్రస్తుతం మూడొందల మంది విద్యార్థులున్నారా స్కూల్లో. మా నాన్న పుస్తకాలు కొనుక్కొచ్చి స్కూల్లో చిన్నపాటి గ్రంథాలయమూ నడిపేవారు. అప్పటికే ఆర్యసమాజంతో ప్రభావితులైన ఆయనకు కవిరాజు త్రిపురనేని రామస్వామి తోడయ్యారు. మా తాతగారిదీ అంగలూరే కావడంతో ఆ బంధం ఉండేది. నేను పుట్టకముందే మా పెద్దక్కకు పెళ్లయింది. మంత్రాలు, పురోహితుడి అవసరం లేకుండా జరిగిన తొలి పెళ్లి మా అక్కాబావలదే. కవిరాజు తాను రాసిన ‘వివాహవిధి’ పుస్తకం సాయంతో స్వయంగా చేసిన పెళ్లి అది.

కాలవ కబుర్లు కొన్ని
కడవకొల్లుకు ఆనుకుని కృష్ణా నది కాలువ రైవస్ కెనాల్ ఉండేది. మా ఈత సరదాలు అన్నీ అక్కడే. పిల్లలకు చిన్న తువ్వాలొకటి ఇచ్చేవాళ్లు. దాన్ని కట్టుకుని స్నానం చెయ్యాలి. చేసిన తర్వాత పిండేసి ఒళ్లు తుడుచుకోవాలి. బైటకు ఒళ్లు కనిపించకుండా ఈ పని లాఘవంగా చెయ్యాలి. అందులో నేను సిద్ధహస్తుణ్ని. నిజానికి మా ఊరి కాలవలో దిగి స్నానం చెయ్యడం అసాధ్యం. ప్రవాహవేగం అంత తీవ్రంగా ఉండేది. కాలుపెడితే కొట్టుకుపోవడమే. అందుకని మా నాన్న ఊరికి దగ్గరగా మెట్లతో ఒక చిన్న రేవులాగా కట్టించి పెద్ద ఇనపగొలుసు పెట్టించారు.

దాన్ని పట్టుకుని నడుముల్లోతు దిగి స్నానం చేసేవాళ్లు పిల్లలూ, ఆడవాళ్లూను. కొద్దిగా తుప్పు పట్టిందిగానీ ఇప్పటికీ ఉందది. కాలవ దగ్గరగా ఉన్నందువల్ల మా ఊరి నూతుల్లో నీరు పుష్కలంగా ఉండేది. వానకాలంలోనయితే చేద అవసరమే ఉండేది కాదు. బకెట్లతో నేరుగా తోడుకోవడమే. వేసవికాలంలో కొబ్బరికాయలు కోసి తాడు కట్టి నూతిలో పడేసేవాళ్లం. చల్లగా అయ్యాక తాగేవాళ్లం. అదొక రిఫ్రిజిరేషన్ టెక్నిక్ అన్నమాట. చిన్నప్పుడు నా లాగు జేబులో ఉప్పు కారప్పొడి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవి.

మామిడికాయల సీజన్‌లో తోటలకెళ్లినపుడు వెంటనే తినడానికి వీలుగా. ఊళ్లో అందరికీ అందరూ తెలిసినవాళ్లే కనుక ఏమీ అనేవారుకాదు. ఏడాది పొడుగునా రాచఉసిరి కాయలు, జామకాయలు, చెరుకుగడలు ఏదోటి తింటూనే ఉండేవాళ్లం. ఉయ్యూరు ఫ్యాక్టరీకి చెరుకు బళ్లు వెళుతుంటే రైతులే మేం కనబడినప్పుడు ఓ గడ తీసిచ్చేవాళ్లు. కాలవ ఒడ్డున ఊరికి చివరగా ఉండే కల్లుపాక సాయంత్రం శ్రమజీవులతో నిండిపోయేది. ఎందుకో ఆ దృశ్యం నాపై చెరగని ముద్రవేసింది. కనుచీకటి పడుతుండగా అక్కడికి చేరే మనుషులు, వాళ్ల మాటలు, సందడి వాతావరణం – చూసి తీరవలసిందేగాని మాటల్లో చెప్పలేనిది.

చెరువున్నా లాభం సున్నా
మా ఊరి చెరువుకు ఎదురుగానే మా ఇల్లు. ఆ చెరువులో చేపలు పుష్కలంగా దొరికేవి. అయితే మా నాన్న గాంధీగారిని కలిసి ఇచ్చిన మాట ప్రకారం శుద్ధ శాకాహారిగా మారిపోయారు. ఇంట్లోనూ మాంసాహారం వండకూడదని గట్టి నియమం పెట్టారు. తాలింపులో సైతం మసాలా వాసన వస్తే ఒప్పుకునేవారు కాదు. అందుకని మా అమ్మ వండేది కాదుగానీ ఆమె తోబుట్టువులు చెరువు చేపలో, చికెనో వంటివి వండి తెచ్చిస్తే ఇంట్లో పిల్లలకు పెట్టేది. నేను ముందునుంచీ శాకాహారినే.

ఇక కరెంటూ టీవీలూ ఏమీ లేని కాలంకదా అది. ఎండాకాలమైతే ఆడవాళ్లంతా పచ్చళ్లు పెట్టడంలో మునిగిపోయేవారు. ఒక ఇంట్లో ఉలవచారు చేస్తే, అన్ని ఇళ్లకూ పంచాల్సిందే. అందువల్ల ఉలవచారొక పెద్ద పని. వేసవిలో కూరగాయలకు మొహం వాచే కాలం.

అప్పుడు ఎక్కువగా పచ్చిపులుసు లాంటివి తినేవాళ్లు. నా చిన్నప్పుడు టమాటా పంటే తెలీదు ఊళ్లో. వానకాలం వస్తోందంటే ముందుగానే కంద, పెండలం వంటివి ఆరపెట్టుకునేవాళ్లు. వానల్లో బురదబురద అయిపోయే మా ఊరి మట్టి రోడ్డు ఆ తర్వాత ఎండాక నడవలేనంత గట్టిగా అయిపోయేది. దాంతో అందరి కాళ్లూ చీలిపోయి రక్తాలొచ్చేవి. ఆంధ్రా యూనివర్సిటీలో ఆనర్స్ కోర్సు పూర్తిచేసేవరకూ నాకూ చెప్పుల్లేవు.

బట్టలకూ రేషనే
మా పిన్నమ్మ తె ల్లవారుజాము నుంచే రాట్నం వడికేది. దాన్నుంచి వచ్చే ‘మ్‌మ్‌మ్…..’ అనే శబ్దానికి నిద్రలేచి, ఆపై రోజంతా ఊళ్లోని పాతిక గడపలూ తిరగడమే చిన్నప్పుడు మా వ్యాపకం. ఆకలి సమయానికి ఏ ఇంట్లో ఉంటే అక్కడ అన్నం పెట్టేసేవాళ్లు, మేం తినేసేవాళ్లం. కేవలం రాత్రి పడుకోబోయే ముందు పిల్లలందరూ ఉన్నారో లేదో చూసుకునేవాళ్లు పెద్దవాళ్లు. ‘ఉదయం ఎక్కడరా తిన్నావు?’ అనే ప్రశ్న అడిగితే అడిగేవారు, లేదంటే లేదు.

తెల్లవారుజాము ప్రమిదల వెలుగులో మా అమ్మ మజ్జిగ చిలకడం నాకింకా గుర్తుంది. అప్పట్లో కరెంటు లేక ఊళ్లో అందరూ నూనె దీపాలే వాడేవాళ్లు. వంటక్కూడా మట్టి పాత్రలే తప్ప కనీసం జర్మన్ సిల్వర్ కూడా తెలియదు. ’40ల్లో యుద్ధం వలన అన్నిటికీ కరువుగానే ఉండేది. గుడ్డి వెలుతురునిచ్చే కిరోసిన్ అయినా దొరికేది కాదు. చివరకు కట్టుకునే బట్టకూ కరువే. తయారైన బట్ట అంతా మిలిటరీకి తరలిపోయేది.

ఆ సమయంలో అందరికీ పీసీ కోటింగ్ గుడ్డలే గతి. రంగును బట్టి చొక్కాలు, ప్యాంట్లు కుట్టించుకోవడమే. ఆడవాళ్లకు చిన్న అంచున్న తెల్లటి చీరలు వచ్చేవి. ఇప్పట్లాగా డబ్బు పెట్టి బజార్లో కొనితెచ్చుకోవడం కాదు. మా ఊళ్లల్లో గుడ్డ కావాలంటే క్యూలో నిల్చోవాల్సిందే. మా అక్కయ్యలకు చీరల కోసం నేనూ అలా వరసలో నిలబడ్డవాణ్నే. పాప్లిన్ గుడ్డ కావాలంటే మన పేరివ్వాలి. లాటరీ తీసి అందులో మన పేరుంటే అప్పుడు ఇస్తారు.

గుట్టు తెలియని ఊరు
మా కడవకొల్లు వాళ్లే కాదు, డెల్టాల్లోని పల్లెటూళ్లలో ఎక్కువమంది ఏదో ఒక లిటిగేషన్‌లో ఉండేవాళ్లు. ఉదయం పూట బెజవాడ కోర్టుల చుట్టూ తిరగడంతో అలసిపోయేవారు. సాయంత్రం చీకటి పడ్డాక ఊరికెళ్లలేరు కనుక గన్నవరం, బెజవాడల్లో తమ ఊరివాళ్లెవరైనా కాపురమున్నారేమోనని ఆరా తీసి వాళ్లింటికి వెళ్లిపోయేవాళ్లు. ఆ ఇంటి ఇల్లాలు వచ్చినవాళ్లకు వేన్నీళ్లివ్వడం, వేడివేడిగా భోజనం పెట్టడం, మంచాలివ్వడం ఇవన్నీ చెయ్యాలి. ఉదయాన్నే లేచి ఎవరి తోవన వాళ్లు వెళ్లేవారు.

ఏ కాస్త లోపం జరిగినా ఊరికొచ్చాక ‘వెళ్లకవెళ్లక ఫలానా సుబ్బయ్య కూతురింటికి ఒక్కపూట వెళితే కూరయినా చేసి పెట్టలేదు, పడుకోను మంచమైనా ఇవ్వలేదు’ అని ఊరంతా చెప్పేసేవారు. అది పెద్ద అవమానం. చెప్పొచ్చేదేమంటే ఏ విషయమైనా ఉన్నదున్నట్టు మాట్లాడేసుకోవడమేగానీ దాచుకోవడం తెలియదు అప్పట్లో. కోపం వస్తే కేకలేసుకోవడం, మళ్లీ మామూలుగా పలకరించుకోవడం, ఏదైనా ఉంటే ఉందని లేకపోతే లేదని – ఇంతే అక్కడి తీరు.

అయితే మా నాన్న దీనికి మినహాయింపు. ఆయన చదువుకుని దేశమంతా తిరిగొచ్చారు కనుక మేం కొంత సంస్కారయుతంగా ప్రవర్తించాలని ఆయన ఆశించేవారు. అంటే జాగ్రత్తగా మాట్లాడడం, ఇంటికెవరైనా వస్తే లేచి నిలబడి సరిగా సమాధానం చెప్పడం, కోపం వచ్చినా అరవకపోవడం… ఇలాంటివి.

ఉయ్యూరులో ఒకరోజు బడికి వెళుతున్నప్పుడు మా బంధువు మైనేని కనకం అనే ఆవిడ దారిలో కనపడి ‘అబ్బాయ్, ఇవాళేం కూర?’ అనడిగింది. ‘కూరేం లేదు, మా అమ్మ ఆవకాయ కలిపి పెట్టింది’ అని చెప్పేశా. వెంటనే నన్ను పక్కకు లాగి ‘అదేం మాటరా అబ్బాయ్? కాస్తయినా గుట్టు తెలియదా నీకు? కూర లేకపోయినా ఏదోటి ఉందని చెప్పాలిగానీ అలా చెప్పుకుంటారా? గుట్టు నేర్చుకో’ అంది. మా ఊరు కడవకొల్లులో అలాంటివేమీ ఎరుగనివాణ్ని కనక నాకు ఆవిడ మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి.

నన్ను నడిపింది ఆ బొమ్మే
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) సంస్థలో విదేశీ పట్టాలేవీ లేకుండా, పేరు వెనుక కనీసం పీహెచ్‌డీ అన్న మూడక్షరాలైనా లేకుండా పనిచేసిన మనిషిని నేనొక్కణ్నేనేమో. కానీ దానికి అవసరమైన పునాదిని వేసింది, ప్రాథమిక విద్యనందించిందీ మా కడవకొల్లును, ఉయ్యూరులే. విదేశాల్లో నివసిస్తున్నా మా ఊరితో బంధమనే తల్లి వేరును తెంచుకోలేదు నేను. ప్రఖ్యాత బెంగాలీ రచయిత బిభూతిభూషణ్ రాసి, సత్యజిత్‌రే సినిమాగా తీసిన ‘పథేర్ పాంచాలి’, ‘అపరాజితుడు’ వంటి నవలల కథానాయకుడు ‘అపూ’ లాగానే నా లోపల కూడా మా ఊరికి సంబంధించి నా బాల్య జ్ఞాపకాలతో ఒక అందమైన చిత్రం ముద్రపడిపోయింది.

నేను పదేళ్లు ఢి ల్లీలో, మరో నలభయ్యేళ్లు అమెరికాలో నివసించిన సమయమంతా ఆ చిత్రమే నాకు ఊపిరినిచ్చేది. ఐఎమ్ఎఫ్‌లో పనిచేస్తున్నప్పుడు, వివిధ దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు, ప్రభుత్వాలు ప్రజాధనాన్ని వినియోగించే తీరు మీద పెద్ద పెద్ద పుస్తకాలు రాస్తున్నప్పుడు సైతం మా ఊరి చిత్రమే నాకు అవసరమైన బలాన్నిచ్చేది.

ఇప్పుడు మావాళ్లెవ్వరూ అక్కడలేరు. అయినా మా గ్రామానికి అవసరమైనది ఏదైనా చెయ్యడానికి నేను సిద్ధమే. ఒక బడో, గుడో, రోడ్డో… ఏ నిర్మాణమైనా చేస్తాం, ఏ సౌకర్యమైనా కల్పిస్తాం. కానీ దాన్ని పది కాలాల పాటు సరిగా నిర్వహించడానికి ముందుకొచ్చేదెవరు? కేవలం డబ్బు పెట్టి ఏదైనా చేసెయ్యగానే సరిపోతుందా చెప్పండి? బాధ్యత తీసుకునేవాళ్లుంటే గ్రామాల బాగు కోసం ముందుకొచ్చేవాళ్లు నేనే కాదు, చాలామందే ఉన్నారు.

అరుణ పప్పు
ఫోటోలు : రాజ్‌కుమార్, డి.కోటేశ్వరరావు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.