‘శివతాండవ’ మాడిన నిత్య విద్యార్థి–సరస్వతీ పుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యులు -శత జయంతి సందర్భం గా

‘శివతాండవ’ మాడిన నిత్య విద్యార్థి
– శశిశ్రీ

తాను రచించిన కావ్యాన్నే తానే పాఠ్యపుస్తకంగా చదివి పరీక్ష రాసిన అరుదైన కవి సరస్వతీపుత్ర పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు. పదునాలుగు భాషలలో పాండిత్య శోభతో ఒక్క గొంతుకై అబ్బురపరచిన బహుభాషా చక్రవర్తి ఆయన. తెలుగు ప్రబంధాలలోని ప్రబంధ నాయికలకు సాహిత్య చరిత్రలో సముచిత సమయోచిత స్థానం పదిలపరచిన సాహిత్య విమర్శకుడాయన. ప్రాచీన సాహిత్యంతోపాటు ఆధునిక సాహిత్యం సమదృష్టితో అధ్యయనం చేసిన సాహిత్యజీవి ఆచార్యులు. పద్యం గద్యం ఇరుకారుల సేద్యంగా శతాధిక గ్రంథాలు రచించిన శక్తత గల రచయిత ఆయన. గొప్ప వక్త. సమర్థుడైన విమర్శకుడు. శక్తత గల అనువాదకుడు. ఛాందసభావాలు గిట్టనివాడు. సంప్రదాయం మరువనివాడు. ఆధునికాన్ని అభిమానించేవాడు. 

వందేళ్ల క్రితం 1914 మార్చి 28న అనంతపురం జిల్లా పెనుగొండ తాలుకా చియ్యేడు గ్రామంలోని విద్వత్ కుటుంబంలో నారాయణాచార్యులు జన్మించారు. పుట్టపర్తి శ్రీనివాసులు, లక్ష్మీదేవమ్మ ఆయన తల్లిదండ్రులు. ఎనిమిదో తరగతి వరకు చదివి బడి మానేశారు. వీధి పిల్లలతో కలసి పెనుగొండ కోటలో తిరుగుతూ ఆటపాటల్లో కాలం వెల్లబుచ్చేవారు పుట్టపర్తి. విద్వత్ కుటుంబంలో జన్మించిన నారాయణాచార్యులు చదువుసంధ్యలు లేక ‘పండితపుత్ర శుంఠః’ అని ఎక్కడ మారిపోతాడోనని శ్రీనివాసాచార్యులు భయపడ్డారు. ఇక తానే గురువయ్యారు. తెలుగు, సంస్కృతం నేర్పారు. ఆ సందర్భంలోనే ఆ కుటుంబానికి శ్రేయోభిలాషి అయిన టి.శివశంకరం, నారాయణాచార్యులను వెంటతీసుకుపోయి పెనుగొండలోని సబ్‌కలెక్టర్ భార్య అయిన పిట్ దొరసానికి పరిచయం చేశారు. ఆమె ఆంగ్లంలో గొప్ప విద్వాంసురాలు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో షేక్స్‌పియర్, బ్రౌనింగ్ మీద గొప్ప పరిశోధన చేశారామె. ఆమె, ఆచార్యులకు ఆంగ్లభాషను నేర్పడమే కాకుండా గెట్టిగా ఆంగ్లసాహిత్యాన్ని పరిచయం కూడా చేశారు.

అప్పట్లో పెనుగొండలోని నాగనాయని చెరువు గ్రామంలో రంజకం మహాలక్షుమమ్మ అనే ప్రసిద్ధ నర్తకి ఉండేది. ఒకరోజు ఆమె ఇంటి ముందు నుండి ఆచార్యులు వెళుతున్నారు. అప్పుడు శ్రావ్యమైన మువ్వల సవ్వడి వినిపించింది. ఆచార్యులు ఆ ఇంటి కిటికీ నుండి చూశారు. లోపల నర్తకి అద్భుతంగా నృత్యం చేస్తూ కనిపించింది. నృత్యం అయిపోయాక తనను గమనిస్తున్న బాలుడైన ఆచార్యులను ఆమె దగ్గరికి పిలిచింది. ‘నృత్యం చేర్చుకుంటావా?’ అని అడిగింది. వెంటనే ఆచార్యులు ఔనన్నట్లు తలాడించారు. ఫలితమే ఆచార్యులు ఆమె ద్వారా సంగీతం, నృత్యం రెండు కళల్లో ప్రావీణ్యం సంపాదించారు.

కేవలం ఇంటి చదువుతో నారాయణాచార్యుల జీవితానికి భవిష్యత్ ఉండబోదని ఆయన తండ్రి శ్రీనివాసాచార్యులు అనుకున్నారు. అప్పట్లో కట్ట మంచి రామలింగారెడ్డి, మైసూర్ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌గా ఉండేవారు. ఆయన ప్రత్యేక ఆహ్వానంతో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, అదే యూనివర్సిటీలో తగు హోదాలో పనిచేస్తుండేవారు. ఆ రాళ్లపల్లివారు, పుట్టపరి వారికి దగ్గరి బంధువు. దీంతో ఆచార్యులను ఆయన వద్దకు పంపారు. అక్కడ ఆచార్యులు ప్రాకృతభాష అధ్యయనం చేశారు.

అక్కడ ఉన్నప్పుడే పెనుగొండకోట గతవైభవం, ప్రస్తుత దయనీయ స్థితిని దృశ్యమానం చేస్తూ 150 పద్యాలతో ‘పెనుగొండ లక్ష్మి’ అనే లఘుకావ్యం రచించారు ఆచార్యులు. ఆ కావ్యాన్ని రాళ్ళపల్లి చదివి భవిష్యత్తులో గొప్పకవి కాగలవని దీవించారు. ఆ తరువాత నారాయణాచార్యులు తిరుపతిలోని వేంకటేశ్వర సంస్కృత కళాశాలలో చేరడానికి వెళ్ళారు. అప్పుడు ఆచార్యుల వయస్సు 16 ఏళ్ళు. ఆ కాలేజీ ప్రిన్సిపల్‌గా, ప్రసిద్ధులైన కపిస్థలం కృష్ణమాచార్యులు ఉండేవారు. కాలేజీ అడ్మిషన్ ఇమ్మని ఆచార్యులు ఆయన్ను కోరారు. తగు ధృవీకరణపత్రం చూపమని ప్రిన్సిపల్ అడిగారు. ఉంటేకదా, చూపడానికి. దీంతో అడ్మిషన్ సాధ్యం కాదు పొమ్మన్నారు. ఆచార్యులకు కోపం వచ్చింది. ఆవేశంగా, ఆశువుగా పద్యాలు చెబుతూ బయటికి నడిచారు. ఈ చర్యతో ఆ ప్రిన్సిపల్ దిగ్భ్రమ చెందారు. నారాయణాచార్యులలోని అంతర్గత యోగ్యతను గుర్తించి అడ్మిషన్ ఇచ్చారు. అయితే అక్కడ కూడా పుట్టపర్తివారు కోర్సు పూర్తి చేయకుండానే పెనుగొండకు తిరిగి వెళ్ళిపోయారు.

ఆ తర్వాత కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కనకవల్లీదేవి (కనకమ్మ)తో పెళ్ళి జరిగింది. అప్పటికి ఆచార్యుల వయసు 20 ఏళ్ళు. ఆ విధంగా అనంతరపురం జిల్లా నుండి కడప జిల్లా ప్రొద్దుటూరుకు మకాం మారాల్సి వచ్చింది. ప్రొద్దుటూరులోనే శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయంలో సంస్కృతం నేర్పించే ఉపాధ్యాయునిగా పనిచేయసాగారు. అప్పటికి ఆచార్యులు ఇంకా విద్వాన్ పూర్తి చేయనే లేదు. ప్రభుత్వ ఉద్యోగం కోసం విద్వాన్ అవసరమని స్థానికులైన పెద్దలు సలహా ఇచ్చారు. దీనితో విద్వాన్ పూర్తి చేయడానికి తిరుపతిలోని ప్రాచ్యకళాశాలలో చేరారు. విద్వాన్ పూర్తిచేశాక ప్రొద్దుటూరులోని మునిసిపల్ హైస్కూల్‌లో తెలుగు పండితునిగా చేరారు.

అయితే తిరుపతిలో ఆచార్యులు చదువుకునేటప్పుడు తాను రాసిన కావ్యం ‘పెనుకొండ లక్ష్మి’ పాఠ్యపుస్తకంగా చదివి పరీక్ష రాశారు. విచిత్రమేమిటంటే ఆ పరీక్షలో ఆచార్యులు తప్పారు. తాను పరీక్ష బాగా రాసినా ఎందుకు ఉత్తీర్ణున్ని చేయలేదో చెప్పమని ప్రిన్సిపల్‌ను ఆచార్యులు అడిగారు. ఆ ప్రిన్సిపల్‌కు కూడా ఆశ్చర్యమే అనిపించి జవాబు పత్రం తెప్పించి పరిశీలించారు. అప్పుడు తేలిందేమిటంటే 2 మార్కుల ప్రశ్నకు ఒక సుదీర్ఘ వ్యాసం మాత్రమే జవాబు రాసి వ్యవధి ముగియడంతో పేపరు ఇచ్చేసి రావడంతో పరీక్ష తప్పారన్న విషయం గ్రహించారు. దీనితో ఆచార్యులు అవాక్కయ్యారు. తర్వాత మళ్ళీ రాసి ఉత్తీర్ణులయ్యారు.

ఆచార్యులు శతాధికంగా గ్రంథాలు రాసినా, ఆయనకు కీర్తి ప్రతిష్ఠలు సమకూర్చి పెట్టినది ఒక లఘుకావ్యమైన ‘శివతాండవ’మే. రంజకం లక్షుమమ్మ వద్ద నేర్చిన నృత్యం, రాళ్ళపల్లి దగ్గర నేర్చుకున్న సంగీతం, కన్నడ భాషా సాహిత్యంలో అధ్యయనం చేసిన రగడ ఛందస్సులోని సాహిత్యం ఆ లఘుకావ్య రచనకు జవజీవాలు పోశాయి. పుట్టపర్తి నారాయణాచార్యులంటూనే ఇప్పటికీ అందరికీ గుర్తుకొచ్చేది ఆయన శివతాండవ కావ్యమే.

శివతాండవ కావ్యం వెలువడ్డానికి పూర్వ నేపథ్యం ఆసక్తికరమైనది ఒకటుంది. అది 1949వ సంవత్సరం. ఆచార్యులు అప్పటికి చాలా గ్రంథాలే రచించారు. ఆధ్యాత్మికంగా చాలా కృషి చేశారు. అష్టాక్షరి మంత్రం 13 కోట్లు మార్లు నియమ నిబంధనలతో జపించారు. అయి నా దైవసాక్షాత్కారం కలగలేదు. దీనితో జీవితంపైనే ఆచార్యులకు విరక్తి కలిగింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒక సన్యాసిగా మారి ఉత్తర భారతదేశం వెళ్లిపోయారు. హిమాలయాల్లో కొంతకాలం తపస్సు చేశారు. అప్పటికీ దైవ సాక్షాత్కారం సాధ్యపడలేదు. ఇక జీవితం పరిసమాప్తం చేయాలనుకున్నారు. ఆత్మపరిత్యాగం కోసం ఆ హిమాలయాల్లోని ఒక పర్వతాన్నెక్కి కిందికి దూకి చనిపోవాలనుకున్నారు. ఆ ఆలోచనతో వడివడిగా నడిచి వెళ్లసాగారు ఆచార్యులు.

సరిగ్గా అప్పుడు ఆచార్యులకు ఒక ఆకర్షకమైన స్వరం వినిపించింది. పేరుపెట్టి పిలుస్తున్న ఆ వ్యక్తిని చూశారు. ఆయన ఒక సన్యాసి దగ్గరకు వచ్చి ఆచార్యులతో మాట్లాడి తనతోపాటు ఆశ్రమానికి తీసుకెళ్లారు. చావురాత ఇప్పుడే లేదని సముదాయించి తన వద్ద ఆరు నెలలపాటు పెట్టుకున్నారు. చివరికి ఒకరోజు ఆ ఆశ్రమ పెద్ద తన దేశవ్యాపిత శిష్యులను హిమాలయాలకు పిలిపించుకున్నారు. వచ్చినవారిలో ఎందరో విద్వాంసులున్నారు. వారందరిచేత ఆచార్యుల విద్వత్ శక్తతను పరీక్షింపజేసినారు. పరీక్షించిన వారంతా ఆచార్యుల బహుభాషా పాండిత్య ప్రతిభను శ్లాఘించారు. అప్పుడు, ఆశ్రమపెద్ద నారాయణాచార్యులకు ‘సరస్వతీపుత్ర’ బిరుదు ప్రదానించి సత్కరించారు. మళ్లీ గృహస్థ జీవితం గడపమని ప్రొద్దుటూరుకు పంపారు. ఆచార్యులను ఆత్మహత్య పాలుకాకుండా కాపాడి, బిరుదుతో సత్కరించి పంపిన ఆ ఆశ్రమపెద్ద ఎవరో కాదు -స్వామి శివానంద సరస్వతి. మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం, ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు నండూరి రామమోహనరావులకు కూడా ఆ స్వామి శివానంద సరస్వతి గురువు.

అలా ఆచార్యులు ప్రొద్దుటూరు చేరాక అక్కడి అగస్తేశ్వర ఆలయానికి ప్రతిరోజు వెళ్లి ప్రదక్షిణలు చేసి రావడం దినచర్యగా చేసుకున్నారు. 40 రోజులు ప్రదక్షిణలు చేశాక ఒకరోజు ఒక అలౌకిక కవితావేశం ఆచార్యులలో పెల్లుబుకింది. అప్పుడు రచించిందే ‘శివతాండవం’ గేయకావ్యం. ఆ కావ్యం రగడ ఛందస్సులో రచించారు. ఆ కావ్యంలో సంగీతం, సాహిత్యం పోటీపడి అక్షరబద్దమయ్యాయి. ఆ కావ్యం ఆచార్యులకు మారుపేరుగా స్థిరస్థాయిగా నిలిచిపోయింది. కాలపరీక్షలో నిలిచింది. ఇంతచేసి ఆ గేయకావ్యం 70 పేజీలకు మించింది కాదు. అయితేనేం ఆచార్యులకు స్పెస్‌మెన్‌గా నిలిచిపోయింది.

ఆచార్యులు స్వయంగా తానే శివతాండవాన్ని పాడు తూ నృత్యం చేస్తుంటే, ఆ అద్భుత దృశ్యం, ఒళ్లు గగుర్పొడుస్తుంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలోని శివాలయం ప్రారంభోత్సవం జరిగినప్పుడు తిక్కవరపు రామిరెడ్డి ఆచార్యులను ఆహ్వానించారు. ఆరోజు ఆచార్యులు శివతాండవం గానం చేస్తూ, చేసిన తాండవాన్ని చూసినవారంతా, మహాశివుడే శివతాండవం చేస్తున్నట్లు అనుభూతించారని ఆనాటి పెద్దలు చెబుతారు. ఆచార్యులు ఎక్కడికి, ఏ సాహిత్య సభలకు వెళ్లినా శ్రోతలు, తొలుత శివతాండవమే వినిపించమని కోరేవారు. విశేషమేమిటంటే పరమవైష్ణవుని చేతిలో పరమశివుని కావ్యం శివతాండవం రూపుదాల్చడం, ఆచార్యులలోని శివకేశవ అభేద్య భావానికి ప్రతీక.

ఆచార్యులు రచించిన శతాధిక గ్రంథాలలో పెనుగొండ లక్ష్మి, మేఘదూతము, పురోగమనము, శివతాండవము, అగ్నివీణ చాలా కీర్తిప్రతిష్ఠలు ఆయనకు సమకూర్చాయి. ఈ గ్రంథాలన్నీ లఘుకావ్యాలే కావడం విశేషం. ఒక్క పెనుగొండ లక్ష్మి తప్ప మిగిలినవన్ని గేయ కావ్యాలు కావడం, అవన్నీ ఆచార్యులు తన యవ్వనదశలోనే రాసినవి కావడం గమనార్హం. అలాగే ఆచార్యులు ‘జనప్రియ రామాయణం’ కూడా గేయఛందస్సులోనే రచించారు. అయితే ఈ కావ్యం రెండు సంపుటాలు మాత్రమే వెలువడింది. 1972లో ‘పద్మశ్రీ’ అందుకున్న ఆచార్యులకు 1975లో శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, 1987లో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి.

భారతీయ సుప్రసిద్ధ సాహిత్య నిర్మాతల్లో పుట్టపర్తి నారాయణాచార్యులకు అరుదైన స్థానం ఉంది. గొప్ప వక్త. సమర్థుడైన విమర్శకుడు. శక్తత గల అనువాదకుడు. ఛాందసభావాలు గిట్టనివాడు. సంప్రదాయం మరువనివాడు. ఆధునికాన్ని అభిమానించేవాడు. అటువంటి మహాకవి, బహుభాషా చక్కవర్తి ‘నేను నిత్య విద్యార్థిని’ అని జీవితం కడవరకు చెప్పుకున్న నిగర్వసాహిత్యవేత్త. ఆయన ఏ యూనివర్సిటీ గడప ఎక్కకుండానే 14 భాషల్లో పాండిత్యం హస్తగతం చేసుకున్నారు. అది ఆయనకు భాషలపట్ల ఉన్న తడిఆరని దాహం. ఆయన 1990 సెప్టెంబర్ 1న కడపలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గ్లాస్‌నోస్త్, పెరిస్త్రోయికా పుస్తకాల్ని చదువుతూ కన్నుమూశారు.

ఆచార్యులు జన్మించి వంద వసంతాలు. ఈ సందర్భంగా కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంయుక్తంగా కడపలో 2013 మార్చి 28న ఆచార్యుల శత జయంతికి గుర్తుగా సాహిత్య సదస్సు ఏర్పాటు చేశాయి. ఆ సదస్సులో కేంద్ర సాహిత్య అకాడమి ప్రచురించిన ఈ వ్యాసకర్త రచన ‘భారతీయ సాహిత్య నిర్మాతలు – పుట్టపర్తి నారాయణాచార్య’ గ్రంథాన్ని ఆవిష్కరించనున్నారు. ఆరోజు ఆ గ్రంథం 800 ప్రతుల్ని ఆచార్యుల అభిమానులు కొనుగోలు చేయడానికి ముందస్తు ఏర్పాటు చేసుకోవడం విశేషం.

– శశిశ్రీ
93479 14465
(ఈ నెల 28న పుట్టపర్తి నారాయణాచార్యులు శత జయంతి)

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.