జానకీ జాని గారి ‘’అరుంధతి’’ -1

        జానకీ జాని గారి ‘’అరుంధతి’’ -1

       1994 లో రాజమండ్రి లో భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యం లో మూడు రోజుల పాటు సాహితీ సదస్సు జరిగింది .ఆ నాటి పరిషత్ అధ్యక్షులు నాకు పరమ ఆప్తులు ,ప్రఖ్యాత కదా రచయితశ్రీ ఆర్.ఎస్.కే.మూర్తి గారు .కప్పగంతుల మల్లికార్జున రావు గారు రాజమండ్రి సభలను న భూతో గా జరిపించారు .రెండు పూట్ల కాఫీలు టిఫినీలు భోజనాలుపెళ్లి వారి వేడుక గా జరిగాయి . సాహిత్య సదస్సులు ,కవి సంమేలనాలతో ప్రాంగణం అంతా మరు మోగింది .ప్రఖ్యాత రచయిత శ్రీ వాకాటి పాండురంగా రావు గారిని మొదటి సారి చూసింది అక్కడే స్వర్గీయ .బండారు సదాశివరావు గారు డాక్టర్ జి.వి.సుబ్రహ్మణ్యం గారు వగైరా దిగ్దంతులు దిశా నిర్దేశం చేసిన సభల వి ఽఅ సమయం లోనే ప్రఖ్యాత నాటక ,సినీ నటుడు తనికెళ్ళ భరణి నీ చూశాం .  అప్పుడే  వాల్మీకి విశ్వనాదల రామాయణం పై సమగ్ర అధ్యయనం చేసి పుంఖాను పుంఖాలుగా ఉపన్యాస లహరి ని ఆంద్ర దేశ మంతాప్రవహింపజేసిన వారు, లబ్ధ ప్రతిస్తులైన కధకులు ,ఆంగ్లోపన్యాసకులు ,విశ్రాంత ప్రిన్సిపాల్ కాకినాడ నివాసి ,విశ్వనాధకు ముఖ్య అంతేవాసి అయిన శ్రీ సామవేదం జానకి రామ శాస్త్రి గారు అంటే జానకీ జాని గారు నాకు మా బావమరిది ఆనంద్ కు పరిచయ మయ్యారు మొదటి రోజునే .అంతే మిగిలిన రోజుల్లో ఆయన్ను మేము వదిలి పెట్టనే లేదు అప్పటి నుంచి జానకి జాని గారికి నాకు విపరీత మైన పరిచయం కలిగింది .ఉత్తరాలు రాయటం ,ఫోన్లు చేసుకోవటం జరుగుతూ ఉండేది ..ఒక సారి ఏలూరు లో వారి తల్లి గారిని చూడ టానికి వచ్చి నాకు ఫోన్ చేసి ‘’మిమ్మల్ని చూడాలని ఉంది .వస్తున్నాను ‘’అన్నారు .రెండు రోజులే వ్యవధి. నాకు తెలిసిన సాహితీ మిత్రులన్దర్నీ వారు వచ్చేరోజుకు మా ఇంట్లో సమావేశ పరచాను యాభై మందికి పైగా వచ్చారు .అందరికి‘’టిఫినాదులు’’ ఏర్పాటు చేయించి వారిని ‘’రామాయణం ‘’పై ప్రసంగించ వలసిందని కోరాను .రెండు గంటలు నాన్ స్టాప్ గా వాల్మీకం ,కల్ప వృక్షం లపై అనర్ళ ప్రసంగం చేశారు ఇదంతా టేప్ పై భద్రపరచాను .వారికి నా చేతనయినంత సన్మానం చేశాను ఎంతో ఆనందించారు .అది మొదలు నేను ఎప్పుడు కాకినాడ వెళ్ళినా (మా అమ్మాయి అత్తగారి ఊరు )జానకీ జాని గారి ని దర్శించి రావటం అలవాటు .ఆయనా ఎంతో సంతృప్తి చెందేవారు .వారి శ్రీ మతి కూడా గొప్పగా ఆదరించేవారు .శ్రీ జానకీ జాని గారు ఒక రోజు నాకు తమ కదా సంకలనం ‘’అరుంధతి ‘’పంపారు .నేను వెంటనే చదివి ,నా మనో భావాలను వారికి లేఖ మూలం గా 28-11-2000న తెలియ బర్చాను . ఆలేఖలోని అంశాలే ఇప్పుడు మీ ముందుంచుతున్నాను

    ‘’. పూజ్యులు ,గౌరవనీయులు శ్రీ జానకీ జాని గారికి –హృదయ పూర్వక నమస్కారాలు .ఉభయ కుశలోపరి .ఆత్మీయం గా మీరు పంపిన మీ ‘’అరుంధతి ‘’నిన్ననేభద్రం గా  నా వద్దకు దిగి వచ్చింది  చాలా సంతోషం .నిన్న రాత్రే పూర్తిగా చదివాను .ఆనందం పొందాను .ఆ అనుభూతి తో ఈ ఉత్తరం రాస్తున్నాను .

   ‘’మీలో మీరు భావిస్తున్న బద్దకాన్ని వదిలించి ,కర్తవ్యం లోకి దింపి,ఈ కదా స్రవంతిని నిస్పృహ ఎడారి దారిలో ఇంకి పోకుండా వెలువరించటానికి ప్రోత్సాహ పరచిన ‘’విజయ భావన ‘’వారు అభి నందనీయులు .’’మీ భావన విజయం‘’చేయాలనే వారి సత్ సంకల్పం .మిమ్మల్ని విజయం వైపు నడిపించి ,మీలోని సుప్త భావనలను ప్రదీప్తం చేసింది .ఆంద్ర సాహితీ లోకానికి ఒక అమూల్య రచనను అందించింది .ప్రేరణ మానవులను ఏ ఉన్నత స్తితి కైనా తీసుకొని వెళ్తుంది అన్నదానికి ఇది ఉదాహరణ .సహృదయులైన మీరు అందరికి స్నేహ పాత్రులు .మీ సన్నిధానం ఒక సుమధుర లోకమే .కాలం ఎలా గడిచి పోతుందో చెప్పలేము .అదొక అనిర్వచనీయ అనుభూతి .ఆ ఆనందాన్ని మీ ద్వారా పొందిన నాకు వేరే సాక్ష్యం అక్కర్లేదు .

       మీ కధా ద్వాదశాదిత్యుల్ని లోకం పైకి తరలించారు .భావుకత ,సృజనాత్మకత తగ్గి పోతున్న కధలు వస్తున్న సమయం లో మీ ఆదిత్యుల కాంతి చ్చటలు దివ్యం గా ప్రభావితం చేసి కొత్త వెలుగుల నిస్తాయి .సందేహం లేదు .ఇవన్నీ పూర్వమే ప్రచురితాలైనా గుది గుచ్చి ,ఏర్చి కూర్చిన ఈ సరం ముత్యాల సరం ఓ వరం .మీ కధను మీ శ్రీమతి గారికి అంకితం చేయటమూ ఓ ప్రత్యేకతే .మీ అర్ధాంగి ప్రోత్సాహం మీకు కొండంత శక్తి .ఆమె వల్లనే మీ సాహిత్య వ్యాసంగం నిరాటంకం గా సాగిపోతోంది .దానికి కృతజ్ఞతా భావమే ఈ సమర్పణ .పుస్తకం కూడా మీమనసులా స్వచ్చంగా ,లోప రహితం గా ఉంది .

               కధ అంటే సంభాషణల మయం .అందులోను ఈకాలం లో వాక్యానికి రెండో మూడో తెలుగుపదాలు ,మిగతావి ఆంగ్ల మయాలు .మీ కధల్లో చక్కని తెలుగు గుబాళించింది .ఆంగ్ల వాసన సోకలేదు .నా పరిశీలన లో 91పేజీల ఈ కదా గుచ్చం లో సుమారు 185 మాత్ర్రమే సంభాషణలు .అంటే సరాసరి పేజికి రెండు మాత్రమె సంభాషణలు కన్పించాయి .చెప్పేదంతా రచయితే చెప్పితే ,సూటిగా స్పష్టం గా ఉంటుంది అన్న భావన మిమ్మల్ని ఇలా రాయించింది అని పించింది .ఉన్న సంభాషణలు కూడా చాలా క్లుప్తం గా ,సూటిగా ఉన్నాయి .’’between the lines ‘’భావం వెదకాల్సిన అవసరమూ లేదు .అంత నిసర్గం గా ఉంది .మీ పై శ్రీ విశ్వనాధ ప్రభావం అధికం కదా .ఆయన కదా సంవిధానం మీ రచనలలో నాకు కని పించింది ..లోకాన్ని అన్నికోణాల నుంచి గమనించారు మీరు .సమస్యల సుడిగుండాలు చాలానే ఉన్నాయి .వీటన్నిటికి మించి ఒక అద్భుత మైన సూత్రం జీవితాలను కట్టి పడేస్తుంది .దానిని పట్టుకొన్నారు మీరు .

         ఈ కధల్లో దాంపత్య ధర్మానికి విలువ నిచ్చి దాన్ని కాపాడుకోమని అంతస్సూత్రం గా చెప్పారు .బహుశా మీకు ,మాకు మనందరికీ ఆ దిశలో ఆదర్శం కనీ పించేది ‘’అరుంధతీ దేవి ‘’.అందుకే ఆ పేరు ను మీ కధల్లో స్త్రీలకూ ఎక్కువ సార్లు ఉపయోగించారని పించింది .వివాహం అయిన వెంటనే ‘’అరుంధతీ నక్షత్రాన్ని ‘’నూతన వదూవరులకు చూపించి ,ఆదర్శ వంతుల్ని చేయటం మన సంప్రదాయం .కులాలకు అతీతం గా దీన్ని అవిచ్చిన్నం గా పాటిస్తూనే ఉన్నాం ఈనాటి వరకు .

          ‘’దిగి వచ్చిన ‘’కధ లో కృష్ణ మూర్తి కమ్మర్షియల్ టాక్స్ ఉద్యోగి .జీవితం లో కస్టపడి పైకి వచ్చినా నిండుకుండలా ఉన్నా ,కమ్మర్షియల్ గా జీవితాన్ని కాష్ చేసుకోలేక పోయిన అభాగ్యుడు .దాంపత్య  సుఖమూ అవసరమే కదా .భార్య అభీష్టాలు తీర్చాలన్న విషయం ఆలోచించలేక పోయాడు .ఆమెకు అదొక అసంతృప్తి .అది బీజం గా ఉండి మొలకెత్తి ఆమె పాలిటి ఓ వృక్షమే అయింది .ఆ నీడలో నిలువ లేక పోయింది .మొహం ఆమెను మోహన రావు రూపం లో ఆవహించింది .ఆ మాయ లో పడి గాడి తప్పింది .తప్పు తెలిసింది కాని అప్పటికే ఆలస్య మై పోయింది .వంటలక్క గా జీవితం గడపాలని నిర్ణయించుకొని ,భర్త పంచ నే చేరింది .అనుకో కుండా కాలమూ ,అవకాశమూ ,అవసరం ఆ భార్యా భర్తల్ని కలిపింది .కష్టపడకుండా ,కనకుండా కొడుకూ లభించాడు .ఆ ఆనందం శాశ్వత మైంది .క్షణికా నందం జీవితాన్ని అస్థ వ్యస్తం చేసింది అతనికీ ఆమెకు కాలం కలిసి వచ్చింది .మళ్ళీ ఆనందం అరుంధతి రూపం లో దిగి వచ్చింది .ఆశల ఆకాశం లో చిక్కుకున్న ఆమె స్వంత స్తితి తెలియ టానికి చాలా సమయం పట్టింది .తప్పని సరి గా నేలకు దిగి వచ్చింది .ఈ కధలో పేర్లు చాలా బాగా నప్పాయి .మోహన రావు మాటల్లో మొహం ,ఆడదాన్ని మాటలతో మోసం చేసే నేర్పు ఉన్న వాడు .కృష్ణ మూర్తి నిండు కుండ .కస్టాల కడలి ఈదిన వాడు .అయితే ఆ మహానుభావుడికున్న‘’దక్షిణ నాయకత్వం ‘’లేనిఅమాయకుడు .ఉద్ధరించే ఓపికా ,జ్ఞానం ఉన్న వాడు .ఇక అరుంధతి గురించి ఇప్పటిదాకా చెప్పిందే .మంచి ముగింపు దిశగా  కద చక్కగా నడిపారు విశ్వనాధ వారి చెలియలి కట్ట లా సాగి చివరికి సుఖాంతమయింది ..ఆదర్శాన్ని ఆచరణ లో చూపారు .సంతోషం ..

              సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -26-3-13- ఉయ్యూరు 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.