శ్రీ కంఠ కర్ణామృతం ,ఆత్మ నివేదనం పాషాణి నేతాజీ ,రామాయణ పావని ల పై సాభిప్రాయం
శ్రీ జానకీ జాని గారికి నేను 21-11-2008 న రాసిన లేఖాంశాలు
బ్ర..వే .శ్రీ జానకీ జాని గారికి నమస్సుమాంజలి –ఉభయ కుశలోపరి –
ఈ నెల 19 వ తేదీన కాకినాడలో మిమ్మల్ని మా దంపతులం దర్శించటం చాలా ఆనందం గా ఉంది .మళ్ళీ గొప్ప అను భూతి ని పొందాను .మీ చిరునవ్వు ,మాటల పోహలింపు మరపు రావు .మీ శ్రీమతి గారు మా శ్రీమతికి ఆరాధ్యులయారు .ఆప్యాయత తో కూడిన మీ ఆదరణ ఆహ్లాదాన్నిచ్చింది .కొంచెం సేపు మీతో గడిపిన ఆ క్షణాలు మధుర క్షణాలే .నాపై ఆత్మీయత తో మీరిచ్చిన పుస్తకాలు నిన్న ,ఇవాళ చదివాను
మీ తండ్రి గారు సామవేదం జానకి రామ శర్మ గారు జీవించి ఉంటె మరో ‘’సౌందర్య లహరి ‘’వ్రాసి ‘’లలితా సౌందర్య లహరి ‘’అనో ,’’శ్రీ సౌందర్య లహరి ‘’అనో పేరు పెట్టి ప్రచురించి ఉండేవారు .ఆంద్ర దేశానికి ఆ అదృష్టం వారి మరణం వల్ల పట్టకుండా పోయింది .ఈ మాట ఎందుకు అన్నానంటే ,మీ తండ్రి గారి ‘’శ్రీ కంఠకర్ణామృతం ‘’చదివిన తర్వాత అంతటి గౌరవం కలిగింది .కర్ణామృతం పేరుకు తగ్గట్టే అమ్రుతోపమానం .భగవత్పాదుల వారి ‘’శివానంద లహరి‘’స్థాయికి తగ్గంతగా ఉంది .’’శివ కేశవ నామ సారూప్య సామ్యాలను వివరిస్తూ చెప్పిన శ్లోకం రమణీయం గా ఉంది .ఒక్క ఈ శ్లోకమే ఏమిటి ,ప్రతి శ్లోకం హృదయపు లోతుల్లోంచి భక్తీ జ్ఞానాలను రంగరించి వెలువరించిందే .వైరాగ్య మార్గ దర్శనం చేసేవే .మంచి శతకం చదివానన్న ఆనందం ,పరవశం కల్గింది .ధన్య జీవులు శర్మ గారు .శ్రీ కైవల్య పదాన్ని శ్రీ కంఠపదలహరి తో పొందారు .దీనికి బ్రహ్మ విద్యా సరస్వతీ స్వరూపులు శ్రీ నూకాల రావు గారి వ్యాఖ్యానం అమృతానికి తావి అబ్బినట్లయింది .సూక్ష్మం లో మోక్షం గా ఉంది .’’పులవర్తి ‘’వారు ఆనంద పులకాన్కితం చేశారు .సరళ వ్యాఖ్యానం తో బంగారానికి తావి అబ్బింది .అట్టమీదిబొమ్మ ,శివరంజని లా ఉంది .అందుకే మరో సౌందర్య లహరి పొందే అదృష్టం ఆంద్ర దేశం జార విడుచు కొంది అని ముందే చెప్పాను ,
అయితేనేం మరో ధూర్జటిని మీ తండ్రి గారి ‘’ఆత్మ నివేదనం ‘’లో దర్శించాను .ప్రతి పద్యం ఆత్మా నివేదనమే .ఆ భవునికి హారతి గీతమే .చదివితే మృత్యువును జయించా గలమనే నమ్మకం కలుగుతుంది .పరిణతి చెందినా కవిత్వం .భావం నాట్యమే చేసింది .ప్రతి పదం సాభిప్రాయం గా ప్రయోగించారు .ఆయన నట ధూర్జటి అయితే ,శ్రీ శర్మ గారు దభావ ధూర్జటి గా మారి కంఠేకాలుడిని తనివి తీరా వర్ణించారు .భక్తీ భావానికి చక్కని సోపానం నిర్మించారు .ముగ్ధ మనోహరం గా ప్రతి పద్యం అలరారింది .కఠిన పద విన్యాసాలు లేవు .క్లిస్టాన్వయాలు లేవు .అంతా తేట తెల్లం గా మనసుకు హత్తుకోనేట్లుంది .సూటిగా గుండెకు తాకంది .ఈ రెండు శతకాలు అను క్షణ పారాయణీయాలు .ఈ కార్తీకం లో ఈ రెండు పుస్తకాలు చదివి శివ దర్శన వైభవాన్ని అనుభవించాను .ఇవి ముక్తి సోపానాలే .వారి రామాయణ కావ్యమూ ఇంతటి సారళ్యం తో నడిచిందే కదా .ఇలాంటి శివ స్వరూపులైన మీ తండ్రి గారు మీకు లభించటం మీ అదృష్టం తండ్రికి తగ్గ కొడుకు మీరు .అలాంటికవి ఆంద్ర దేశం లో జన్మించటం ఆంధ్రుల అదృష్టమే .
నాకు ఒకటి అని పించింది .శ్రీ కంఠకర్ణామృతం ‘’ను ఆడియో కేసెట్ గా ఎవరైనా ప్రయత్నించి తెస్తే అద్భుతం గా ఉంటుంది .
మీ ‘’పాషాణి’’ఇతి వృత్తం బాగుంది .లోకేశ్వరి మహా రాణి లో మార్పు అనివార్యం .ఆమె లోని పాషానత్వాన్ని నిర్మూలించి కరుణాంత రంగిత గా మారటానికి తధాగతుని శాంతి సందేశం పొందటానికి వీలుగా ఉంది .శాంతి మాత్రమే ప్రపంచాన్ని జయించాలి పగ, ద్వేషం కాదు అన్న గొప్ప సందేశాన్ని అద్భుతం గా చెప్పారు ఈ ఏకాంకిక లో .మీరు .’’రవి కవి ‘’శత జయంతి కి ఇది ప్రచురిమ్పబడటం విశ్వ శాంతికి సంకేతం .అయితే సంభాషణలు దీర్ఘం గా ఉన్నాయేమో నని పించింది నాకు .ఇంకొంచెం క్లుప్తం గా ఉంటె మనసుకు పట్టేవి .ఏమైనా మంచి ప్రయత్నం .సఫలయత్నం..ఎన్నో ప్రదర్శనలు పొందిన నాటిక గా తెలిసి ఆనందించాను .
మీ రెండో పుస్తకం ‘’నేతాజీ ‘’.కల్నల్ డి.ఎస్.రాజు గారి శత వార్షికం సందర్భం గా ద్వితీయ ముద్రణ పొందటం ఆంధ్రుల అదృష్టం .నేతాజీకి డాక్టర్ గా రాజు గారిసేవ ,,వైద్య రంగం లో అసమాన ప్రతిభా చూపి ,వైద్య రంగ విస్తరణ కోసం కాకినాడ లో రంగరాయ వైద్య కళా శాల నేర్పరచిన వారి దూర దృష్టికి నిదర్శనం .వారికి అంకితమిచ్చి అమరజీవిని చేశారు మీరు .నేతాజీ తో బాటు రాజు గారి గురించి తెలియని ఆంధ్రుడు లేదు .నేతాజీని అభిమానించని దేశీయుడూ లేదడు .సర్వులకు ఆరాధనీయుడు బోసుబాబు .ఆ హుందా ,ఆ ఠీవీ ,ఆ రాజసం ,ఆ విగ్రహం అందరి మనసుల్లోను ముద్ర పడి పోయింది .నేతాజీ తర్వాతే ఏ నాయకుడైనా .అన్నభావం అందరిదీ .దీనికి తగ్గట్టు తగిన సమయం లో బాలల కోసమే అయినా అందరికి ఉపయోగపడే పుస్తకం గా తెచ్చారు .మీ రచన కూడా అంత ఉదాత్త స్తాయి లో సాగింది .రాజుగారితో సంభాషించి చాలా విశేషాలు చేర్చారు .అందరు తప్పక చదవాల్సిన పుస్తకం .అయితే మలి ముద్రణ లో గ్రాంధికాన్ని మార్చి రాస్తేప్రస్తుతకాలానికి తగినట్లు గా ఉండేది అని పించింది .అలా చేయ వచ్చో లేదో తెలీదు కాని చేస్తే చదివించే పుస్తకం గా నిల బడుతుంది .చక్కని ముద్రణా ఫోటోలు పుస్తకానికి నిండుదనం తెచ్చాయి .
సుభాష్ బాబు ఎప్పుడూ ‘’శెభాష్ బాబే ‘’రెండో అభిప్రాయమే లేదు .నేతాజీ శత జయంతిని1997 జనవరి23 న శ్రీ మండలి బుద్ధప్రసాద్ అవని గడ్డ గాంధి క్షేత్రం లో నిర్వహించారు .అప్పుడు నేనూ వెళ్లాను .ప్రఖ్యాత చిత్రకారుడు మరో పికాసో, క ళా తపస్వి ఎస్వి.రామా రావు అమెరికా నుంచి వచ్చారు .ప్రసిద్ధ కధకులు నా ఆత్మీయ మిత్రులు శ్రీ ఆర్.ఎస్.కే మూర్తి (బందరు )గారూ,లబ్ధ ప్రతిష్ట కధకులు విశ్లేషకులు జర్నలిస్టూ శ్రీ వాకాటి పాండురంగా రావు గారుచిరస్మరణీయ ప్రసంగాలు చేశారు .మన కేంద్ర ప్రభుత్వం ,నెహ్రూ వంశంనేతాజీ ని మర్చి పోయినా ప్రభుత్వ పరం గా శతజయంతిని జరపక పోయినా ఒక వేళఎక్కడైనా మొక్కుబడిగా జరిపినా సంస్కారి ,సౌజన్య మూర్తి దేశం పై అపారమైన భక్తీ విశ్వాసాలున్న వారు ,జాతి సంస్కృతీ పరి రక్షణకు ఎప్పుడూ ముందుండే వారు, విలువలతో కూడిన జీవితాన్ని ఆదర్శ వంతం గా గడుపుతున్న శ్రీ బుద్ధ ప్రసాద్ చాలా ఘనం గా నేతాజీ శత జయంతిని నిర్వహించి అందరి ప్రశంశలు అందుకొన్నారు .మీ ‘’నేతాజీ ‘’ని చదవటం తో ఇవన్నీ ఒక్క సారి సినిమా రీల్ లా తిరిగాయి .ఆ ఊసులు మీతో కలబోసుకోన్నాను .
మీ మూడో పుస్తకం ‘’రామాయణ పావని ‘’ద్వితీయా వృత్తి .ప్రధమావృత్తీ పుస్తకం నాకు ఎప్పుడో మీరు పంపారు .చదివాను .మీ రచన గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు .వాల్మీకి మహర్షిపై, వాల్మీకం పై ,కల్పవృక్ష రామాయణం పై రామదాసు అయిన పావని పై మీ భక్తీ ప్రపత్తులు పద పదాన జ్యోతకంయ్యాయి ..ఆర్తిగా రాసిన పుస్తకం .అందులో ఆచార్య ఎస్.వి.జోగా రావు గారి ముందుమాట లో చెప్పిన పద్యం ‘’ఒక భూతంబున కుద్భవించి ‘’నాకు కంఠతా వచ్చేసి ఎప్పుడు ఏ సభలో నైనా ఉదాహరిస్తున్నాను .అలాగే వాల్మీకి పై ఆచార్యుల వారు ‘’ఆ కవితా తపస్వి ‘’పద్యం రామాయణ కావ్య పరమార్ధాన్ని సంగ్రహం గా మనోహరం గా చెప్పారు .మంచి పుస్తకం .మళ్ళీ నా చేతికి వచ్చి నందుకు మహదానందం గా ఉంది .మీ దంపతులకు మా దంపతులం ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూ –సెలవ్ –దుర్గా ప్రసాద్-21-11-2008 .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29-3-13-ఉయ్యూరు