బుడ్డి కధల్లో దొడ్డ భావాలు
ఒక చిన్న ఆంగ్ల కదల పుస్తకాన్ని చదివి ప్రభావితులై ఇవి తెలుగు వారికి చేరాలనే తపనతో శ్రీ చిలకలపాటి రవీంద్రకుమార్ సరళం గా తెలుగులోకి అనువదిస్తే, దేవి నేని సీతారావమ్మ ఫౌండేషన్ తరఫున శ్రీ దేవి నేని మధుసూదన రావు గారు ‘’కదా చిత్రాలు –బతుకు పాఠా లు ‘’పుస్తకం గా ప్రచురించి బాల బాలికలకు అందించే మహత్కార్యాన్ని చేబట్టారు ఇవి చిన్న కధలే కాని ‘’చిన్నమంత విలువగల బంగారు కధలు’’ ..అన్ని వయసుల వారికి అవసరమైన కధలు .అన్నీ ఆణి ముత్యాలే అన్ని జీవిత సత్యాలే .జీవితానికి అవసరమైన పాఠాలే ఆవిష్కరింప బడ్డాయి మానవీయ కోణాలను తట్టిలేపిన కధలే . వయోభేదం లేకుండా అందరు చదివి తీరాల్సినవే రచయిత ,ప్రచురణ కర్తా ఇద్దరూ అభినందనీయులే .ఇందులో 25 కధలున్నాయి .ఈ మార్చ్ లోనే వెలువడిన తాజా సంపుటి ఇది ..ముచ్చటైన ముద్రణా అందమైన ప్రకృతి దృశ్యం ఉన్న ముఖ చిత్రం పుస్తకానికి మరింత శోభను ,విలువను పెంచాయి . నిజం గా ఇవి ఉత్తమ కదా చిత్రాలే .చిత్ర కదా భావాలే జీవిత పాఠాలే .
పల్లెటూరి ముసలాయనకు ఉన్న కొద్దిపాటి పొలం లో బంగాళా దుంపలు పండించుకోవాలను కొన్నా వయోభారం తో చేయలేక, జైలు లో ఉన్న కొడుక్కు తన నిస్సహాయతను ఉత్తరం లో తెలిపాడు .అతను తండ్రిని దుక్కి దున్నద్దని పొలం లో తుపాకీలు పాతిపెట్టానని జవాబు రాశాడు .అది జైలు అధికార్లు చదివి అ పొలం లోకి వెళ్లి ప్రతి అంగుళం తవ్వి చూశారు .ఏమీ కనీ పించలేదు .కొడుకు మళ్ళీ ఉత్తరం రాస్తూ చేను తవ్వటం అయి పోయింది కనుక దుంపలు నాటమని రాశాడు .మనం ఎక్కడున్నా మంచి చేయాలనుకొంటే చేయగలం అని తెలియ జెప్పే ఈకధ పేరు ‘’ఉత్తరం దున్నిన పొలం ‘’
ఇద్దరన్నదమ్ములు కడుపేదవారు ఇద్దర్నీ చదివించే స్తోమత 18 మంది సంతానాన్ని కన్న తండ్రికి లేదు .ఈ అన్నదమ్ములు ఒక నాణెం ఎగరేసి అది ఎవరి కి అనుకూలం గా పడితే వారు ముందు కళల ఎకాడమీ లో చేరి కోరిక సాధించుకోవాలని అతనికి ఓడిపోయిన వాడు గనులలో పని చేసి డబ్బు పంపించాలని ఒప్పందం చేసుకొన్నారు .తర్వాత మొదటి వాడు రెండో వాడికి సాయం చేయాలని ఒప్పందం చేసుకొన్నారు .ఒకడు గెలిచి న్యు రేమ్బర్గ్ వెళ్లి కళల్లో నిష్ణాతుడై తిరిగి వచ్చాడు ఇతనికి గనుల్లో పని చేసి రెండో వాడు తోడ్పడ్డాడు. తనకు సాయం చేసిన సోదరుడి కోసం కళా నిష్ణాతుడు విందు ఏర్పరచి పానీయం గ్లాస్ అందుకోమన్నాడు .కళాశాలలో చేరమని అర్ధించాడు .కాని రెండవ వాడు తాను ఆ పని చేయలేనన్నాడు .కారణం తన చేతులు గనిపని లో పనికి రాకుండా పోయాయన్నాడు ఇది జరిగి 450ఏళ్ళయింది తన సోదరుడు చేసిన త్యాగానికి గుర్తుగా అతని అరచేతులు చేతులు కలిసి ఉండేలా సన్నని వేళ్ళు ఆకాశం వైపు సాచి ఉండేలా చిత్రించాడు దీనికి ‘’చేతులు ‘’అని పేరు పెట్టాడు .ఈ కళా ఖండానికి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది .అభిమానులంతా దీనికి ‘’ప్రార్ధిస్తున్న చేతులు ‘’అని అతని త్యాగానికి చిహ్నం గా పిల్చుకొన్నారు ఆ చిత్రకారుడే ఆల్బ్రేర్ట్ ద్డ్యూరార్ అతని సోదరుడే గానికార్మికుడైన ఆల్బ్రేక్ట్ .త్యాగానికి అద్భుత మైన కానుక ఈ చిత్రం దీన్ని అందరు గీసిన భావన ఉంది .
మనం మారితే ప్రపంచమూ మారుతుందన్న సూక్ష్మాన్ని చెప్పే కధలో ఒక కోటీశ్వరుడికి కంటి జబ్బు వచ్చి ఎన్ని మందులు వాడినా నయం కాకపోతే ఒక సన్యాసి ఆకుపచ్చరంగు మాత్రమె చూడమని సలహా ఇస్తే కనుచూపు మేర ఉన్న ప్రతి వస్తువుకు ఆ రంగు పులిమించాడు’’కోటి’’ .మళ్ళీ సన్యాసి యెర్ర బట్టలతో వస్తే సేవకులు ఆయన పై ఆకు పచ్చ రంగు కుమ్మరించారు .ఆయన నవ్వి ‘’మీ యజమాని ఆకు పచ్చ రంగు కళ్ళ జోడు పెట్టుకొంటే కొద్ది ఖర్చుతో పోయేది .అనవసరం గా డబ్బంతా ఆకుపచ్చ మీద తగలేశాడు ‘’అని వెళ్ళిపోయాడట .
కుటుంబం తో గడిపే క్షణాలు మధురమైనవి అని తెలిపే ‘’గృహమే కదా స్వర్గ సీమ ‘’కద ,.మాతృప్రేమ విలువను కళ్ళకు కట్టించింద కధలో తల్లికి ఒకే కన్ను ఉండటం తో ఆమెను చూడటానికి,ఆమె దగ్గర ఉండటానికి ఇష్టం లేని ఒకడు తన కూతురు పుట్టిన రోజు పండక్కి నాయనమ్మ వస్తే వెళ్లి పొమ్మని కఠినం గా చెప్పి ఆమెఎవరో తెలీనట్లు ప్రవర్తిస్తాడు .పాఠశాల పూర్వ విద్యార్ధుల సభకు కొడుకు వస్తాడని ఆశించి భంగపడింది తల్లి .తన పాత ఇంటి వైపు వెళ్తున్న కొడుక్కి తల్లి నేల మీద పడి ఉండటం చూశాడు ఆమె పై ఉన్న ద్వేషం తో ఒక్క కన్నీటి బొట్టుకూడా విదల్ల్చని కర్కటకడయ్యాడు .ఆమె చేతిలో ఉత్తరం తీసి చదివాడు ..అందులో అతని పసితనం లో అతను కన్ను ప్రమాదవశాత్తు పోతే తనకన్ను దానం చేసి చూపునిచ్చానని అందుకే తనకు ఒక్క కన్నే మిగిలిందని రాసి ఉంది .ఇదంతా అతనిపై ప్రేమే అని ఉంది .అతనితోనే తన ప్రపంచం అని తెలియ జేసింది ఆ మాతృమూర్తి .కళ్ళు చెమర్చే కధ..ఒక త్యాగమయి జీవిత విషాద గాధ ఇది .
తాను ప్రేమించే వారికోసం తన పద్ధతిని మార్చుకొనే వాడే అత్యంత సంతోషం గా ఉంటాడని ‘’నిజమైన స్నేహితుడు‘కదచెబుతుంది .లుకేమియా తో బాధ పడే తోటి విద్యార్ధి జుట్టు అంతా రాలి గుండు అయిపోతే అతన్ని అందరు దూరం గా ఉంచితే తోటి విద్యార్ధిని తండ్రి అనుమతి తో గుండు గీయించుకొని స్వార్ధం లేని ప్రేమ అంటే ఏమిటో చేసి చూపించింది .
ఆహింస కు ఉన్న శక్తి గొప్పదని గాంధీ మనుమడు తెలుసుకొన్న కద చదివి తీరాల్సిందే .అమూల్య మైన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కారు నడిపే టప్పుడు జాగ్రత్త గా ఉండాలని బోధించేకద ,ద్రుష్టి కోణాన్ని మార్చి చూస్తె ఇంద్రధనుస్సే బతుకు లో దర్శించ వచ్చు .పిల్లలతో గడపాల్సిన అవసరం గురించి ,ఆదర బాదరా ఏదో దాన్ని నమ్మి మిగతావేవీ లేవనే మూర్ఖత్వం పనికి రాదనీ ,చెప్పిన కధలు మనసుకు హత్తుకొంటాయి .
ఒక వడ్రంగి జీవితకాలమంతా ఆ పనిలోనే గడిపి చివరికి విసుగొచ్చి మానేయాలనుకొంటున్నానని యజమానికి, చెబితే తనకు చివరి సారిగా ఒక ఇల్లు కట్టమని కోరితే అన్య మనస్కం గా అయిష్టం గా కట్టి పెట్టాడు .ఇల్లు పూర్తికాగానే యజమాని ఆ ఇంటి తాళం చెవి అతని చేతిలో పెట్టి ఆ ఇల్లు వద్ర్న్గిదే అని చెబితే అవాక్కయ్యాడు .తాను అంకిత భావం తో ఆ ఇల్లు కట్టితే ఎంత అందం గా గొప్ప గా ఉండేదో అనివాపోయాడు .వివేకం ,అంకిత భావం ప్రతి పనిలోనూ అవసరం అని చెప్పేకద .
ప్రేమ ఉన్న చోటే ఐశ్వర్యం ,విజయం కూడా ఉంటాయని తెలిపే కధ ముచ్చట గా ఉంది .విజయం అనేది ఒంటరిగా లభించదు సామూహిక ప్రయత్నం వల్ల సిద్ధిస్తుంది అన్న సామాజిక విషయం ,సుహృద్భావం తో మెలిగే వారు తన పొరుగు వారు ,సహచరులు ప్రశాంతం గా ఉండేందుకు సాయ పడాలి సామాజిక బాధ్యతా ఉన్న కధా ఆలోచనలను గిల కొడతాయి .ఓటి కుండ కూ ఒక పరమ ప్రయోజనం ఉంది ఏదీ వ్యర్ధం కాదు .అనే భావం ఒక కధలోనూ ,విజయ సాధకులకు తరచు అపజయాలు ఎదురవుతాయి కాని ప్రయత్నం మానరు .మనం కనే లలను మనమే సాకారం చేసుకోవాలని చాటే కధా ,భవిష్యత్తుకోసం అర్రులు చాస్తూ వర్తమానాన్ని వదిలేస్తే అధోగతే .అన్న కధా ,మేలు చేయటానికి తొందరపడాలి కీడు చేయటానికి కాసేపు ఆలోచించాలన్న విషయమూ ,సరైన ఆలోచన చేస్తే క్లిష్టమైన సమస్యకూ పరిష్కారం దొరుకుతుందనే నీతి ,నిజం తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడి మన అవివేకాన్ని బయట పెట్టుకొంటే అపహాస్యం పాలౌతామన్న సూత్రం ,మన జన్మ సార్ర్ధకత కు ఉపయోగించేవే .
‘’మనం భగవ దంశ ఉన్న వాళ్ళం .జనం వ్యధలను మానపటానికి మన వంతు బాధ్యత చేబట్టాలి .దానితో మన వ్యధలూ తీరుతాయి ‘’అనే గొప్ప సత్యాన్ని ఆవిష్కరించిన కధే ‘’ఓ చిరు నవ్వు ‘’.
ఒకరు చేసిన తప్పుకు మరొకరు బలి అవటం మనం నిత్యం చూస్తున్న విషయమే తలిదండ్రుల మాట అనుసరిస్తూ తాగకుండా కారును నెమ్మదిగానే నడుపుతున్నా, స్నేహితుడి కారు వేగం గా వచ్చి గుద్దటం తో బలమైన గాయాలు తగిలి మృత్యు ద్వారం దగ్గర ఉండికూడా తన కోసం ఏడవ వద్దని తనను గుద్దిన వాడు తాను పడిఉన్నా పట్టించుకోకుండా నడిచి వెళ్తుంటే అది వాడికి ధర్మం కాదేమో నని ,వాడు తాగి నడిపాడని ,వాడి తాగుడికి తాను మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని వాడికి ఎవరైనా తాగి కారు నడపోద్దని చెప్పి ఉంటె తాను తానింకా బతికే ఉండేవాడి నని ఆ ప్రాణి విల విల్లాడటం ప్రేవుల్ని దేవేస్తుంది .హృదయ విదారక మైన సంఘటనను మరణించే వాడి ఒక్కడి డైలాగ్ లతో గుండెలు పిండేట్లు చెప్పిన చివరి కద‘’అమ్మా నాకెందుకిలా ?’’కన్నీరే తెప్పిస్తుంది ఆలోచింప జేస్తుంది .’’డ్రంకెన్ డ్రైవ్’’ ఎంత ప్రమాదమో తెలియ జేస్తుంది .ఒకరి తప్పుకు ఇంకొకరి బలి . ఇది విధ్హి విలాసం అని ఊరుకో రాదు ఇదొక సాంఘిక సమస్య .అందరం నిలబడి మార్పు తేవాలి అని వాచ్యం చేయకుండానే సూచించిన కద.
ఇన్ని మంచి కధలను ఆంద్ర పాఠక లోకానికి అందించిన రవీంద్ర కుమార్ మధుసూదన రావు గార్లకు మరో సారి అభినందనలు .
ఈ అమూల్య మైన కదా గుచ్చాన్ని ‘’అమూల్యం ‘’గానే అందించారు దేవినేని వారు కావాల్సిన వారు ఈ కింది చిరునామా ను సంపరదించండి
దేవినేని మధుసూదన రావు –చైర్మన్ –దేవినేని సీతా రావమ్మ ఫౌండేషన్
తెన్నేరు –పోస్ట్ 521260 –కృష్ణా జిల్లా –ఫోన్ -9989051200 – email -mdevineni@gmail.com .
మీ –దుర్గా ప్రసాద్ –30-3-13 ఉఉయ్యురు