కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -2
ఆధునిక విమర్శక రా.రా.(జు?)
ఆయన విమర్శ పదునైన ఆయుధం .మొహమాటం లేదు .అయిన వాడు అన్న బంధం లేదు .సరుకు ఉంటె ఎవర్నైనా బుజం తట్టి ప్రోత్సహించాడు .ఆధునిక సాహిత్య విమర్శ కు ఒక దిశా నిర్దేశం చేశాడు .సూటిగా నిర్మొహమాటం గా విమర్శిస్తాడు .అతనిది ‘’లో చూపు ‘’..విమర్శ అతని శ్వాస .అందుకోసం ఒక సాహితీ పత్రికనే నడిపిన సాహసి .రచయిత తో సహవేదన పొందాలన్న ఆశయం తో ఆ పత్రికను ‘’సంవేదన ‘’గా తీర్చి దిద్దాడు .ఆ తర్వాతే ఎందరో ఆయన మార్గాన్ని అనుసరించారు .అలాంటి నిర్మోహ మాట విమర్శకుడే రాచమల్లు రామ చంద్రా రెడ్డి .అందరికి రా.రా. గా సుపరిచితుడు .కడప జిల్లా పులివెందల తాలూకా పైడి పాళెంగ్రామం లో 1922 లో జన్మించాడు .మద్రాస్ లో ఇంజినీరింగ్ చదివాడు .అప్పుడే మార్క్సిస్ట్ భావనలు ఆకర్షించాయి .ఏ ఉద్యోగమూ చేయలేదు .మార్క్స్ ,ఎంగెల్స్ రచనలు వంట బట్టిన్చుకొన్నాడు .విశాలాంధ్ర దిన పత్రిక లో ఆరు నెలలు ఈనాడు పత్రిక లో రెండేళ్ళు మాత్త్రమే పని చేశాడు .1969 -75వరకు రష్యాలో ఉండి మూడు డజన్ల పుస్తకాలను అనువదించాడు .అందులో పిల్లల పుస్తకాలూ ఉన్నాయి .1988 లో66ఏళ్ళ వయసు లో తనువు చాలించి కీర్తి శేషడయ్యాడు .
సాహితీ ప్రస్తానం
రా.రా.అలసిన గుండెలు కద రాశాడు .’’శ్రీ శ్రీ తాత్విక చిత్త వృత్తి ‘’పై వ్యాసాన్ని ‘’వేకువ ‘’పత్రిక కు రాశాడు .ఇది చాలా ప్రాచుర్యం పొందిన వ్యాసం .ఇది రారా కు చాలా ఇష్టమైనది కూడా .’’శ్రీమాన్ వేయి పడగల సత్యనారాయణ ‘’,’’విరసం భవిష్యత్తు ‘’’’సాహిత్యం లో ఆధునికత ‘’,’’బైరాగి అవగాహన ‘’,’’పాఠకులు మెచ్చుకుంటున్నారు జాగ్రత్త ‘’’’అనువాద సమస్యలు ‘’,అభ్యుదయ సాహిత్యోద్యమం లో అతివాద ,మితవాద ధోరణులు ‘’,’’సాహిత్యం లో నిబద్ధత ‘’’’,చాసో రచనా తత్త్వం ‘’,మొదలైన వ్యాసాలూ సవ్య సాచి ,వీచిక ,సంవేదన ,విశాలాంధ్ర పత్రికలకు రాశాడు .కొడవటి గంటి ,మల్లారెడ్డి మొదలైన రచయితల పుస్తకాలకు పరిచయ వ్యాసాలూ రాశాడు .ఎన్నో పుస్తకాలను సమీక్ష చేశాడు .వచన కవితా సమీక్షా చేశాడు .విమర్శ వ్యాప్తి కోసం సంవేదన పత్రిక నిర్వహించి తన భావాలను ప్రకటించాడు .తన అభిమాన పత్రికలకు తన భావ ధారకు ప్రతిస్పందించే పత్రికలకు మాత్రమె రాసే వాడు .నిబద్ధత గల విమర్శకుని గా ప్రసిద్ధి చెందాడు .తనకంటూ నిర్డుస్ట సిద్ధాంత భావజాలం గల వాడుగా నిలబడ్డాడు .అనువాద సమస్యలు గ్రంధానికి కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం అందుకొన్నాడు .
రారా భావ ధార
నవలలో వస్తువు ఇతివృత్తాన్ని కాక విశాల జీవితాన్ని వర్ణించాలి .పాఠకుని సంస్కార వికాసానికి నవల దారి చూపాలి .సాంఘిక సాన్ఘికేతర శక్తుల మధ్య జరిగే సంఘర్షణ ను ,పాత్రల హృదయాలలోని అంతర్మధనం గా చిత్రించాలి .భిన్న పాత్రల హృదయాల్లోని ఘర్షణ ను ఒకే వ్యక్తీ అంతరంగం లో జరిగి నట్లు మహీధర రామ మోహన రావు ‘’కొల్లాయి గట్టితేనేమి ‘నవలలో చిత్రించటం వల్ల అది శిల్పం రీత్యా కొత్త సృష్టి అని మంచి ప్రయోగమనీ మెచ్చాడు .ఆయనే రాసిన‘’ఎవరికోసం ‘’నవల భిన్న శక్తుల మధ్య ఘర్షణ ను ,అంతర్మధనం గా చిత్రించిన మొదట నవల గా పేర్కొన్నాడు .రావిశాస్త్రి నవలలో పాండిత్య ప్రదర్శన ,ఉపదేశం ,వినోద చాపల్యం ఉన్నాయని ఘాటుగానే చెప్పాడు .’’పాఠకుని హృదయానికి నచ్చేది కళ .చర్మాన్ని తాకి గిలిగింతలు పెట్టేది వినోదం .’’అని హెచ్చరిస్తూ పాఠకుని మెప్పించాలని రాస్తే కళా విలువలుండవు అని స్పష్టం గా చెప్పాడు .
కధల గురించి రారా కు కొన్ని అభిప్రాయాలున్నాయి .’’జీవిత సత్యాలను క్లోజప్ లో చూపించి పాఠకునికి అవగాహన కల్గించి ,చైతన్య పరిధిని విస్తృతం చేయాలి .సామాజిక స్పృహ ,స్పర్శా ఉండాలి .సంస్కారాన్ని కలిగించాలి‘’అన్నాడు .అనుభూతి ఉండాలి .అది లేని సాహిత్యం లేదు .చాసో కధలు ‘’ప్లాటుల్లేనివి ‘’అన్నాడు .తన అభిప్రాయాలు చాసో కధల్లో ప్రతి ఫలించాయి కనుక ఆయననను ఉత్తమ కధకుడు అన్నాడు .వాస్తవిక జీవితం లో నుంచి కధలు రావాలని కోరాడు .చలం గురించి రాస్తూ ఆయన ప్రచారకుడేనని భావకవులకు అభ్యుదయ కవులకు చలం వారధి అని నిర్ధారించాడు .ఆయన నవలలు మైదానం ,కరుణ లను రారా నవలలు గా అంగీకరించలేదు .’’చలం గొప్ప తనం ఆయన విప్లవాత్మక భావాల్లో ఉంది .ఏ కళా నియమాలను పాటించకుండా ,సాహిత్య గుణం సంపాదించుకొన్న రచనలు చేసినందుకు చలాన్ని అభి నందించాలి ‘’అని అభిప్రాయ పడ్డాడు .చలం రాసిన ‘’యశోద గీతాలు ‘’కంటే విశ్వనాధ రాసిన పద్యాలు చాలా నయం అంటాడు .’’సుధా ‘’అనే గీతాలు రాయటం చరిత్రలో ఒక పెద్ద ‘’ట్రాజేడి ‘’గా భావించాడు రారా . రొమాంటిక్కు లలో విప్లవకారుడు చలం ఉన్నాడు .’’హేడోనిస్ట్ ‘’గా రారా చలాన్ని చూశాడు .అంటే ‘’స్వసుఖ వాది‘’రమణాశ్రమం చేరి నందువల్ల ఆ పేరు తో పిల్చాడు చలాన్ని .
రారా గుర జాడనూ ఉతికేశాడు .జాతీయోద్యమం పట్ల గురజాడ కు సదభిప్రాయం లేదన్నాడు .గురజాడ 21 శతాబ్ది వాడన్నాడు .కన్యా శుల్కాన్ని మహా భారతం తో పోల్చాడు .ఆ నాటకాన్ని జీవిత వాస్తవికత లోంచి చూడాలని హితవు చెప్పాడు .గురజాడ లో కవి అంశ కంటే మేధావి అంశ ఎక్కువన్నాడు .ఆయన ఖండికలలో విప్లవాత్మక భావ సంపన్నత ఉన్నంతగా కవితా సౌరభం లేదు ‘’అని తేల్చాడు .గిరీశం హాస్య గాడు కావటానికి కారణం గురజాడ లోని హాస్య దృష్టే నంటాడు రారా .
‘’భావుకుల రచయిత కో.కు ‘’అని కిరీటం పెట్టాడు రారా .ఆయన లో శాస్త్రీయ ఆలోచన ,మార్క్సిస్టుభావజాలం ,మానవతా వాదం ఉన్నాయని ఎస్టిమేట్ చేశాడు .ఆయన భాషకు ప్రవాహ గుణం ,ధారా శుద్ధి ఉన్నాయి .అదే కుటుంబ రావు శైలి అయింది అని మెచ్చాడు .
‘’ కవిత్వం అంటే శబ్ద ,భావ సౌందర్యం కాదు .అనుభూతియే కవిత్వం .హృదయాన్ని కదిలించేది కవిత్వం .’’అని అభిప్రాయ పడ్డాడురారా..బోయి భీమన్న కవిత్వం లో కవిత్వాంశ లేదని కొట్టిపారేశాడు .’’విశ్వం ‘’లో గాఢత్వం లేదు .ఆవంత్స వస్తువుకు న్యాయం చెయ్యలేదన్నాడు .రూపం విశ్వరూపం ఎత్తింది .కవిత్వం మేధో వ్యాపారం కాదు .హృదయ నివేదన అని చక్కని విశ్లేషణ చేశాడు .మనసును ఆకర్షించే కవిత్వం ‘’ఖలీల్ జీబ్రా ‘’ది అంటాడు .మాయ మర్మం లేని వాడుగా కాళోజి ని భావించాడు .దిగంబరులది కవిత్వమే కాదు పొమ్మన్న ధైర్య శాలి రారా .తెలుగు జాతి జీవితం యొక్క ‘’పేరడీ ‘’ఏ మల్లారెడ్డి కవిత్వం అంటాడు .నినాదానికి ,నిర్వేదానికి మధ్య సాహిత్య లక్ష్యం ఉండాలి .శ్రీశ్రీ కవిత్వం లో ‘’లయ ‘’మాత్రమే ఉంది .బాల గంగాధర తిలక్ ను ఉత్తమ కవి గా కొని యాడాడు రారా .బైరాగి రాసిన‘’నూతిలో గొంతుకలు ఏకైక తాత్విక కావ్యం’’ అని ప్రస్తుతించాడు .అభ్యుదయ నిరాశావాది ,సందేహం ,సందిగ్ధత ,బైరాగిలో ఉన్నాయి .శ్రీ శ్రీ ది స్పందన అన్నాడు .కోకు ది ఆలోచన ..సిద్ధాంత స్తాయి లో ఆలోచించే వాడే మేధావి అంటాడు రారా .విమర్శకు శాస్త్రీయ ప్రతి పత్తి కల్గించిన వాడు రారా .రాగద్వేషాలు చూపలేదు .వ్యక్తీ స్తాయి నుంచి ,సామాజిక స్తాయికి విమర్శను ఎదగ జేసినా గొప్ప విమర్శకుడు రారా .మొక్కుబడి గా చేసే పుస్తక సమీక్ష కు విమర్శ స్తాయికి తెచ్చిన వాడు రారాయే అనటం లో సందేహం లేదు .రారా లో ‘’ఇంటలెక్త్యువల్ ఆనేస్టీ ఉంది ‘’అని అందుకే అందరు ఆయన్ను మెచ్చుకొన్నారు .అభిరుచి కంటే సామాజిక ద్రుష్టి కే ప్రామాన్యత నిచ్చాడు .ఆయన ప్రయత్నం గొప్పది, మార్గ దర్శక మైనదీ కూడా .ఆయన పదాలకు కొత్త వాసన వచ్చింది అంటాడు యాకూబ్ .క్రూర కర్కోటక విమర్శకుడు గా బిరుదు పొందాడు శ్రీ శ్రీ చేత .క్షీణ విలువల్ని సహించని సాహితీ ప్రియుడు రారా .అందుకే ‘’ఆధునిక విమర్శక రారాజు ‘’అని పించుకొన్నాడు రా.రా.
మరోకవి కోసం ఎదురు చూడండి
సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –1-4-13-ఉయ్యూరు