నాలో నవరసాలకు చిరునామా!
సోగ్గాడు, సాహసవంతుడు, సావాసగాళ్లు వంటి నిన్నటి సినిమాల్లో విలన్, ఇప్పుడు ఫ్యామిలీమ్యాన్ ఎవరంటే గుర్తుకొచ్చేది గిరిబాబే. వెండితెర మీద నవరసాలనూ అలవోకగా ఆవిష్కరించే ఈ నటుడు తన సొంతూరు రావినూతల గురించి చెబుతున్నప్పుడు కూడా వాటిని అంతే సునాయాసంగా కురిపిస్తారు. తోపుల్లోకెళ్లి ఏం చేసేవాళ్లో, సినిమా వేషాలు ఎప్పట్నుంచి మొదలో… ఎన్ని ప్రశ్నలైనా అడగండి, ఆయన్నుంచి వచ్చే సమాధానం ఒకే ఒక్కటి. ‘రావినూతల’. ఆయన సొంతూరు విశేషాలు…
నా అసలు పేరు యర్రా శేషారావు. ఇంటాబయటా అందరూ అదే పేరుతో పిలిచేవారుగానీ, మా తాత మాత్రం ఎందుకో ‘గిరి’ అని పిలిచేవారు. అందుకే నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు నా పేరును గిరిబాబు అని మార్చుకున్నా. ప్రకాశం జిల్లా రావినూతల నా సొంతూరు. మరీ శుద్ధ పల్లెటూరేం కాదు. నేను పుట్టేనాటికే అంటే 1943 నాటికే అది మేజర్ గ్రామ పంచాయితీ. మాది వ్యవసాయ కుటుంబం. మా ఊరికి ఎలాంటి కాలవలూ లేవు. పూర్తిగా వ ర్షాధార వ్యవసాయం. అందువల్ల వరి పంటే వేసేవారు కాదు. జొన్న, కంది, సజ్జ, వరిగ వంటి చిరుధాన్యాలే పండేవి.
మా ఆహారపుటలవాట్లూ దానికి తగ్గట్టే ఉండేవి. ఉదయంపూట జొన్న, సజ్జ సంగటి తిని రాత్రి పూట మాత్రం వరిగ ధాన్యంతో వండిన అన్నం తినేవాళ్లం. మా తాతగారికి మా నాన్న ఒక్కడే కొడుకు. మా మేనత్తలు పెళ్లయి వాళ్ల కుటుంబాలతో మా ఊళ్లోనే విడిగా కాపురాలుండేవారు. నాకు ఏడెనిమిదేళ్ల వయసులో మా తాత, నాన్నమ్మ పోయారు. అప్పటికి మాకు పన్నెండెకరాల పొలం ఉండేది. ఇప్పటి లెక్కల్లో అది ఎక్కువే అనిపిస్తుందేమోగానీ, అప్పట్లో మాది మామూలు కుటుంబం కిందే లెక్క. మా నాన్న దాని కోసం ఆరు కాలాలూ పనిచేసేవాడు. పొలానికి పొద్దున వెళితే తిరిగొచ్చేది రాత్రికే. చేని తోడిదే లోకం ఆయనకు.
వినాయకుడి కంటే మాకే ఎక్కువ సరదా…
పండగల్లో మొదట వచ్చే వినాయకచవితి అంటే మాకు గొప్ప సరదా. దేవుడి మీద భక్తి అనుకుంటారేమో, భక్తీపాడూ ఏం లేదు. వేకువ జామునే లేచి పత్రి కోసం పొలాలు తోటలు తిరగడమే మాకు సరదానిచ్చే పని. ముందురోజే ‘అరేయ్, రేప్పొద్దునే వచ్చి లేపుతాం’ అని చెప్పేవాళ్లు స్నేహితులు. దాంతో అసలు ఆ రాత్రి నిద్ర పట్టేదే కాదు. ఎప్పుడు కోడి కూస్తుందా, ఎప్పుడు వాళ్లొచ్చి తలుపు తడతారా అన్నదే ఆలోచన. ఆ సమయం వచ్చి తలుపు చప్పుడవగానే సంచి తీసుకుని పరుగోపరుగు. ముందుగా శివాలయానికి వెళ్లి మారేడు దళాలు కోసేవాళ్లం. తర్వాత ఆ పూజ జాబితాలో చెప్పినవన్నీ సంపాదించాలి. అదీ మా లక్ష్యం.
అదొక పెద్ద అడ్వెంచర్ మా దృష్టిలో. పొలాలన్నీ ఉత్తి కాళ్లతో తిరిగేవాళ్లం కాబట్టి, కాళ్లు తెగ నొప్పెట్టేవి. దానికితోడు నిద్రలేమి. మొత్తానికి నానా చావులూ చచ్చి అన్ని రకాలూ సంపాదించి ఇంటికొచ్చేసరికి తెగ నీరసపడిపోయేవాళ్లం. అప్పట్నించి పూజ ఎప్పుడవుతుందా, ప్రసాదాలు ఎప్పుడు పెడతారా అని ఎదురుచూడటమే. ఇంతలో పెద్దవాళ్లు వచ్చి కూర్చుని ‘అబ్బాయ్ కాస్త ఆ పుస్తకం తీసి మంత్రాలు చదివి పూజ చెయ్యరా, నీకు చదువొచ్చు కదా’ అన్నారంటే మా పనయిపోయినట్టే. అప్పటికే కళ్లు గిర్రున తిరుగుతూ ఉండేవి. అసలు సంగతి ఏంటంటే ఆ మంత్రాలు చదివేంత చదువు మాకూ రాదు! పైగా కథ చదవడానికి సిగ్గు. ఇవన్నీ చెప్పలేక, చెబితే తంతారని భయపడి ఏదో అయిందనిపించేవాళ్లం. వినాయకచవితి కేవలం ఒక రోజు సరదానే. అదే దీపావళి అయితే నెల రోజుల ముందు నుంచే సందడి మొదలయ్యేది.
అది మామూలు ఎంజాయ్‌మెంటు కాదు! పదిపదిహేను మంది కుర్రాళ్లం కలిసి పండక్కి చాలారోజులు ముందుగానే తాటి కండెలు, చింతపేళ్లు, కందిదుంపలు – ఇలాంటివన్నీ సేకరించేవాళ్లం. ఎవరింటిముందు వాళ్లు చిన్న గొయ్యి తీసి అవన్నీ వేసి మంటపెట్టి ఆరిన తర్వాత మట్టి అలికి ఉంచేవాళ్లం. మర్నాడుదయానికి అవి బొగ్గులుగా తయార య్యేవి. వాటిని తీసుకెళ్లి బజారు రోట్లో వేసి దంచుకునేవాళ్లం. ఆ మసికి సూరేకారం, సజ్జపొట్టు అవన్నీ కలిపి గుడ్డలో కట్టి వాటిని మూడు పుల్లల మధ్య కట్టి చివరనో తాడు కడితే ‘పొట్లాలు’ తయారవుతాయి. వాటికి నిప్పు పెట్టి గాలిలో చుట్టూ తిప్పితే నా సామిరంగా… వెలుగు రవ్వలు పువ్వుల్లా రాలుతూ ఉంటాయి. ఇవిగాక కంసాలాయన ‘రోలూరోకలీ’ అని మరోరకం చేసిచ్చేవాడు. దానిలో పొటాషియం, గంధకం దట్టించేవారు కనుక వెలిగించినప్పుడు పేలి పెద్ద శబ్దం వచ్చేది.
పిట్టల్ని కొట్టి… తేనె తాగి…
వ్యవసాయ కుటుంబం కావడం వల్ల మా ఇంట్లో జత ఎడ్లు, ఒక గేదె ఉండేవి. మా ఊళ్లో యానాదులు, వడ్డిరాజులు నిర్వహించే కోడిపందేలంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. వాటికోసం నాకు పదిహేను పదహారేళ్లు వచ్చినప్పటి నుంచీ నేను మా ఇంట్లో కోళ్లను ప్రత్యేకంగా పెంచేవాణ్ని. అప్పట్లో ఇలా డబ్బులు పందెం కాసే పద్ధతి లేదు. గెలిస్తే మనకో కోడి వస్తుందంతే. అదే ఎంతో గొప్పగా అనిపించేది. సంక్రాంతి వస్తోందంటే చాలు ఈ హడావుడి మొదలయ్యేది. పండగ తర్వాత ఒక పదిహేను రోజుల పాటు ఇలాంటి సరదాలు ఉండేవి. అయితే చిన్నప్పుడు మేం నలుగురైదుగురు స్నేహితులం కలిసి ఉదయాన్నే ఒక్క రోజు తోపులకు వెళ్లి పిట్టల్ని కొట్టేవాళ్లం. అక్కడే చితుకులు పోగుచేసి కాల్చుకుని తినేవాళ్లం. ఇదిగాక తేనెపట్టు ఎక్కడున్నా వెతికి కనిపెట్టడం మాకో ఘనకార్యం. ఎక్కడైనా, ఎంత రహస్యంగా అయినా ఉండనీ, మేం దాన్ని కనిపెట్టేసేవాళ్లం. కింద మంటపెట్టి తేనెటీగలు పారిపోయాక హాయిగా తేనె తాగేసేవాళ్లం. తప్పూఒప్పూ పాపంపుణ్యం ఏమీ తెలియని వయసది.
చిన్నప్పట్నుంచీ హీరోనే
మా ఊళ్లో పూర్వం నుంచే హైస్కూలుండేది. అందువల్ల మేం చదువుకోవడం కోసం పెద్ద దూరాలు వెళ్లనవసరం లేకపోయేది. కానీ మా స్కూలుకు చుట్టుపక్కల పది గ్రామాల నుంచి నడుచుకుంటూ వచ్చేవారు విద్యార్థులు. వాళ్లను చూసి చాలా కష్టమనిపించేది. నేనయితే స్కూల్లో అన్నిట్లో ఫస్టే. ఆటలు, పాటలు, పోటీలు… అన్నిట్లో నాదే మొదటి బహుమతి. దానికితోడు ఎర్రగాబుర్రగా ఉండేవాణ్నేమో, సినిమాల్లో హీరోల గురించి చూపిస్తారు చూడండి, అలా ఉండే దన్నమాట నా హవా. నాకు తొమ్మిదిపదేళ్ల వయసున్నప్పుడు ఊళ్లో సినిమాలు వేసేందుకు ఒక టూరింగ్ టెంట్ ఉండేది.
ఏడాదికో రెండుమూడు నెలలు వాళ్లు వేరే ఊళ్లకు వెళ్లేవారుగానీ, మిగిలిన కాలమంతా ఇక్కడే. టెంట్ ఉందంటే నేను ఫస్ట్ షో చూడవలిసిందే. ఒక సినిమా ఎన్ని రోజులు వేసినా నాకు బోర్ కొట్టదు. ప్రతిరోజూ సాయంత్రం ఆట తప్పకుండా చూసేవాణ్ని. టికెట్టు పావలా అనుకుంటాను. దీనికిమాత్రం మా అమ్మానాన్నా ఏమీ అభ్యంతరం చెప్పేవాళ్లు కాదు. అప్పటినుంచే నాకు సినిమా వ్యామోహం పట్టుకుంది. నేను కూడా నటుణ్నవాలి. అదే నా లక్ష్యం. టెంట్ తీసేసి సినిమాల్లేనప్పుడు చుట్టుపక్కల ఏ ఊళ్లో నాటకాలు వేసినా మా ఊరి నుంచి కుర్రాళ్లందరం సైకిళ్లేసుకుని పొలోమని వెళ్లిపోయేవాళ్లం.
చింతామణి, హరిశ్చంద్ర, రామాంజనేయయుద్ధం… ఒకటేమిటి? ఎన్ని చూసేవాళ్లమో లెక్కేలేదు. చివరికి మేమే ఒక నాటకసమాజం స్థాపించి సామాజిక, చారిత్రక నాటకాలు వేసేవాళ్లం. ఒక నవలనో, కథనో నాటకంగా మలుచుకునేవాళ్లం. ఒకసారి పల్నాటియుద్ధం వెయ్యాలనుకున్నాం. కాని నాయకురాలు నాగమ్మగా వెయ్యడానికి తగిన నటి దొరకలేదు. దాంతో నేను ఆడవేషం వెయ్యకతప్పింది కాదు. అదొక్కటే నేను ఆడవేషం వేసిన సందర్భం. ఇప్పటికీ మా ఊరి కుర్రాళ్లు మంచి నాటకాలు వేస్తుంటారు.
మా ఊరి తీరే వేరు
ఇప్పటికీ మా ఊరికి సాగు నీటి సౌకర్యమేదీ లేనందున రెక్కలుముక్కలు చేసుకుని పిల్లల్ని బాగా చదివించుకున్నారు తల్లిదండ్రులు. వారి కృషి ఫలితంగా బాగా చదువుకుని విదేశాల్లో స్థిరపడిన మా ఊరి వాళ్లు 70-80 మంది ఉన్నారు. హైదరాబాద్‌లోనే ఓ వంద కుటుంబాలు రావినూతల వాళ్లున్నారు. ఇక వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నవాళ్లు బోల్డుమంది. అందరం కలిసి ఓ పదిహే నిరవై ఏళ్ల క్రితమే ‘రావినూతల డెవలప్‌మెంట్ సొసైటీ’ని ఏర్పాటుచేసుకున్నా. నిధులు సమకూర్చుకున్నాం. పూర్వం నుంచీ ఉన్న విష్ణు, శివాలయాలను బాగుచేసుకున్నాం. కొత్తగా సాయి మందిరాన్ని, నిలువెత్తు అభయాంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాం.
అన్ని హంగులతో కల్యాణమంటపం, కళా వేదికలను నిర్మించుకున్నాం. సిమెంటు రోడ్లు, మంచి హైస్కూలు, మంచినీళ్ల ట్యాంకు… అన్నీ ఉన్నాయి మాకు. ఈ సొసైటీ కాకుండా ‘రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్’ అని ఇంకోటుంది. దానిలో కూడా మేమంతా భాగస్తులమే. అయితే అది పూర్తిగా ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసమే పనిచేస్తుంది. ఆ సంఘం కృషి ఫలితంగా మా ఊళ్లో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆడగలిగిన అద్భుతమైన స్టేడియమ్ ఉంది. క్రికెట్ ఆడే మంచి ఆటగాళ్లున్నారు.
ప్రతిఏటా రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలూ జరుగుతాయి. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు జట్లొచ్చి మరీ ఆడతాయి. కొన్నిసార్లు సినిమా నటులను తీసుకెళ్లి ఆడిస్తుంటాను. మా ఊళ్లోని సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా సినిమా రంగంలోని నా స్నేహితులను తీసుకెళుతుంటాను. మా ఊరికి సంబంధించి ముఖ్యమైన విషయం ఇంకోటుంది. అదేంటంటే అన్ని ఊళ్లలోనూ ఉన్నట్టే మా ఊళ్లోనూ రాజకీయ పార్టీలున్నాయి కానీ ఎన్నికల వేడి మొదలయినప్పుడే అవి మాకు గుర్తొస్తాయి. ఊరి బాగు కోసం ఏ పని మొదలెట్టినా అందరూ ఒక్కటైపోయి దాన్ని సాధించుకుంటాం తప్ప, పార్టీల పేరిట రాజకీయాలు చేసి ఊరికి వచ్చే సౌకర్యాలను కాలదన్నుకోం.
తీరని వెలితి
మా నాన్నకిప్పుడు 103 ఏళ్లు. నాతోనే ఉన్నారు. ఆయన ఇచ్చిన పొలాన్ని నేను కొంత పెంచాను. నాకు షూటింగులు లేనప్పుడల్లా హుటాహుటిన మా ఊరికెళ్లిపోతాను. వ్యవసాయ పనులను దగ్గరుండి చూసుకుంటాను. పాతదికాక అన్ని వసతులతో మరో కొత్త ఇల్లు కట్టించుకున్నాను. విచిత్రమైన విషయం ఒకటి చెప్పనా, నాకు పదకొండేళ్లో పన్నెండేళ్లో ఉన్నప్పుడు మా అమ్మ ఇల్లు బాగుచేయిస్తుంటే ‘ఎందుకమ్మా ఈ శ్రమంతా, ఇక్కడ ఎల్లకాలం ఉండబోతామా?’ అన్నవాణ్ని నేను. ‘అదేంట్రా అలా అంటావు? ఈ ఊరొదిలి ఎక్కడికి వెళ్తావు’ అని అమ్మ ఆశ్చర్యపోయింది.
సినిమాల్లో చేరతానంటే దెబ్బలు పడతాయని తెలుసు గనక ‘అదేనమ్మా నేను చదువుకుని ఉద్యోగస్తుణ్నవుతాను కదా…’ అని సర్దేశాను. నేను సినిమారంగంలో పేరుతెచ్చుకుని స్థిరపడ టాన్ని మా అమ్మ చూడలేదు. అది నాకు ఎప్పటికీ తీరని వెలితి. తన యాభయ్యేళ్ల వయసులోనే అమ్మ పోయిందంటే నాకు అదొక పెద్ద షాకు. ప్రపంచమంతా శూన్యమే అనిపించింది. పూర్తి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ‘అమ్మ లేదు’ అన్న వాస్తవాన్ని అంగీకరించి, మామూలు జీవితం గడపటానికి నాకు పూర్తిగా పదేళ్లు పట్టింది. ఇప్పటికీ మా అమ్మ గురించిన ఏ ప్రస్తావ న వచ్చినా నాకు కన్నీళ్లొచ్చేస్తాయి.
కష్టజీవుల ఊరది
మా నాన్న పేరు నాగయ్య, అమ్మపేరు నాగరత్నమ్మ. వాళ్ల పేర్లు కలిసినట్టే, శ్రమ కూడా కలిసే చేసేవారు. నాన్న వెంటే నీడలా మా అమ్మ ఎంత పని చేసేదో చెప్పలేను. ఆమాటకొస్తే ఆడామగా అని తేడా లేకుండా మా ఊరివాళ్లంతా కష్టజీవులే. వంచిన నడుం ఎత్తకుండా పనిచేసేవాళ్లే. రెక్కాడితేగాని డొక్కాడదు అంటారు చూడండి, అందరూ అలాంటివారే. జన్మభూమినే కాదు, రెక్కలుముక్కలు చేసుకుని తమని బాగా చదివించిన తల్లిదండ్రులనూ బాగా చూసుకుంటున్నారు మా ఊరి పిల్లలు. వాళ్లు అభివృద్ధి సాధించి అమ్మానాన్నలను సుఖపెట్టాలని సమస్త సౌకర్యాలనూ క ల్పిస్తున్నారు. ఇక్కడొక విషయం చెప్పాలి. పిల్లలు అన్ని సదుపాయాలనూ కలగజేస్తున్నారుకదాని పెద్దవాళ్లు సోమరిగా కూర్చోవడం లేదు. జీవితమంతా చేసిన శ్రమను వాళ్లు మర్చిపోలేకపోతున్నారు. ఎంత పెద్దవాళ్లయినా, ఇప్పుడు సంపదకేం కొదవలేకపోయినా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు వాళ్లు. ఇది నాకు ఎంత స్ఫూర్తినిస్తుందో చెప్పలేను.
అమ్మ పెద్ద స్పై
నేను మా అమ్మానాన్నలకు ఏకైక సంతానాన్ని. నాకు అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు ఎవరూ లేరు. అయినా సరదాలకు కొదవ లేని బాల్యం నాది. చెడుగుడును బలిగుడ్డు అనేవాళ్లం. ఎక్కువ సమయం ఆ ఆటలోనే గడిచిపోయేది మాకు. ఇక కోతికొమ్మచ్చి, బచ్చాలాట, బొంగరాలు, గోళీలు… ఒకటారెండా, ఎంత ఆడుకున్నా తనివి తీరేదే కాదు. నేను ఆటల్లో యమా బిజీగా ఉండగా పెద్ద స్పై(గూఢచారి)లాగా నేనెక్కడున్నానో తెలుసుకుని వచ్చేసేది మా అమ్మ. నాలుగు తన్ని నన్ను ఇంటికి తీసుకుపోతూ ఉండేది. ఆ నిమిషానికి ఏడ్చినా, మర్నాటినుంచీ మళ్లీ నా దారి నాదే. ఒక్కణ్నే పిల్లవాణ్ని గనక నాపట్ల చాలా శ్రద్ధగా ఉండేది మా అమ్మ.