నా గెలుపు బాణి నాన్నదే
ఆయనకు తెలియని రంగమంటూ లేదు. చిత్రలేఖనం, సంగీతం, కవిత్వం, కథారచన, దర్శకత్వం… ఇలా అన్ని కళారూపాలను ఆయన ఔపోసన పట్టారు. ఆరేడు భాషలలో కవిత్వాలు రాయగల పాండిత్యం ఆయన సొంతం. అయితే రావలసిన గుర్తింపు ఆయనకు రాలేదు. ఎనిమిది పదుల వయసులో సైతం విజయం కోసం ప్రయత్నాన్ని మానలేదు ఆయన. ఆయనే ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి తండ్రి శివదత్త. తన విజయానికి బాటలు వేసిన తన తండ్రి గురించి కీరవాణి చెబుతున్న విశేషాలే ఈ వారం ‘నాన్న-నేను’.
పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన ఉండే కొవ్వూరు మా స్వగ్రామం. మా తాతగారు మంచి స్థితిమంతులు. అప్పట్లో స్థానికంగా తిరిగే పది, పన్నెండు ప్రైవేట్ బస్సులుండేవి మా తాతగారికి. ఆయనకు ఏడుగురు సంతానం. నాన్నగారు మూడవ కుమారుడు. ఒక అక్క, ఒక అన్న, నలుగురు తమ్ముళ్లు నాన్నగారికి. నాన్నగారి చివరి తమ్ముడే దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌గారు. నాన్నగారికి చిన్నప్పటి నుంచి చదువు మీద కన్నా కళల మీదే మక్కువ ఎక్కువ.
చదువు సంధ్య లేకుండా కళలంటూ కలలు కంటున్నాడని బస్సులను తనిఖీ చేసే బాధ్యతను నాన్నగారికి అప్పగించారు తాతగారు. అది ఆయనకు ఇష్టంలేని పని. దీంతో కొంత డబ్బు తీసుకుని ఇంట్లో చెప్పాపెట్టకుండా బొంబాయికి వెళ్లి అక్కడ జెజె ఫైనార్ట్స్ కాలేజ్‌లో చిత్రలేఖనంలో డిప్లొమా సంపాదించి ఊరుకి తిరిగి వచ్చారు. నాన్నగారు అద్భుతంగా చిత్రాలు వేస్తారు. అప్పట్లో ఆయన వేసిన వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవార్ల చిత్రాలు ఇప్పటికీ చాలా ఇళ్లలో దర్శనమిస్తాయి.
రచయితలకు కలం పేరు ఉన్నట్లే నాన్నగారి బ్రష్ నేమ్ ‘కమలేష్’. నాన్నగారు వేసిన చిత్రాలతో ఈ మధ్యనే ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టాము. కేవలం చిత్రకారుడిగానే నాన్నగారి ప్రయాణం సాగి ఉంటే గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చి ఉండేవేమో! కాని, నాన్నగారికి ఇదొక్కటే కాదు ఇంకా చాలా అభిరుచులు, ఆసక్తులు ఉన్నాయి.
కథలు, కవితలు, నాటకాలు రాయడం నాన్నకు ఇష్టమైన వ్యాసంగాలు. గిటార్, సితార్, హార్మనీ వంటి వాయిద్యాలను నాన్నగారు సొంతంగా నేర్చుకున్నారు. ఏ ఒక్క కళారూపాన్నో అంటిపెట్టుకోకుండా ఎప్పుడు ఏది ఇష్టమో దాన్ని చేసుకుంటూ పోవడం ఒక్కటే ఆయనకు తెలుసు. నాన్నగారికి వాళ్ల పెద్దలు పెట్టిన పేరు సుబ్బారావు. అది నాజూకుగా లేదని బాబురావుగా మార్చుకున్నారు. మిత్రులు నాన్నగారిని ‘బాబ్జీ’ అని పిలిచేవారు. కొన్నాళ్ల తర్వాత ఆ పేరులో కూడా కొత్తదనం లేదని ‘శివదత్త’ అని ఖాయం చేసుకున్నారు. నాకు ఊహ తెలిసినప్పటినుంచి నాన్నగారి పేరు అదే.
భానుమతి-భాగ్యవతి
నాన్నగారికి అలనాటి గాయక నటీమణి భానుమతి గారన్నా, సంగీత దర్శకులు ఎస్. రాజేశ్వరరావు గారన్నా వల్లమాలిన అభిమానం. ‘మల్లీశ్వరి’ సినిమాను ఆయన కొన్ని వందల సార్లు చూసి ఉంటారు. పెళ్లి చూపులకు వెళ్లినపుడు అమ్మ వీణ వాయించడాన్ని చూసి ఆనందించారట. పేరు ‘భానుమతి’ అని తెలుసుకుని మారుమాట్లాడకుండా పెళ్లి చేసుకున్నారట. అయితే ఆ తర్వాత తెలిసింది నాన్నగారికి తనలాగే అమ్మ పేరు కూడా ‘ఒరిజినల్’ కాదని! సూర్యభగవానుడి నక్షత్రంలో పుట్టిందని అమ్మకు సూర్యనారాయణ అని నామకరణం చేశారట.
అయితే మగ పిల్లాడిని పిలిచినట్లుగా ఉందని ఆ తర్వాత భానుమతి అని మార్చారట. అదీ భానుమతిగారి పేరు మహత్యం! మా అమ్మానాన్నలకు మేము ఆరుగురం సంతానం. నేనే మొదటివాడిని. చాలామంది నా పేరులో ముందు ఉండే మరకతమణే ఇంటి పేరుగా భావిస్తుంటారు. నిజానికి మా ఇంటిపేరు కోడూరి. నాకు మా అమ్మానాన్నలు పెట్టిన పేరు మరకతమణి కీరవాణి. మరకతమణి అంటే ఎమరాల్డ్ స్టోన్(పచ్చ రాయి).
ఇక కీరవాణి అన్న పేరు రావడానికి కారణం ‘విప్రనారాయణ’ సినిమాలోని తనకు ఇష్టమైన ‘ఎందుకోయి తోటమాలి’ పాట ఏ రాగంలోనిదని ఎస్. రాజేశ్వరరావుగారిని కలిసినపుడు నాన్నగారు అడిగారట. అది ‘కీరవాణి’ రాగం అని ఆయన చెప్పడంతో ఎంతో ఇష్టంగా ఆ రాగాన్ని నా పేరులో చేర్చారు నాన్నగారు. నా తర్వాత చెల్లెలు కర్ణప్రియ, తమ్ముడు శ్వేతనాగ, చెల్లెలు శ్రీసప్తమి, తమ్ముళ్లు శివశ్రీకాంచి, కల్యాణి మాలిక్. నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో నాన్నగారి పాత్ర ఎంతో ఉంది. ఏడెనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఒకసారి వీధిలో కనిపించిన పిల్లిని రాయితో కొట్టాను.
అది చూసిన నాన్నగారు నా చెంప చెళ్లుమనిపించారు. “అది నిన్నేం చేసిందని దాన్ని రాయితో కొట్టావు. దాని వల్ల నీకేం అపకారం జరిగింది. మూగజీవాలపైనా నీ ప్రతాపం?” అంటూ తీవ్రంగా మందలించారు. ఆనాటి నుంచి జీవహింసకు నేను దూరమయ్యాను. అలాగే మా ఇంట్లో నరసమ్మగారని ఒక మామ్మగారు ఉండేవారు. ఒకరోజు నేను సరదాగా ‘ఏయ్! నరసమ్మా’ అంటూ ఏకవచనంతో ఆటపట్టించాను. అది నాన్నగారి కంటపడింది. “ఆవిడ వయసెక్కడ, నీ వయసెక్కడ? పెద్దలను అలా పేర్లతో పిలుస్తారా? మామ్మగారు లేదా నరసమ్మగారు అని పిలు” అంటూ కొట్టకపోయినా నాన్నగారు బాగా చివాట్లు పెట్టారు.
మనకన్నా వయసులో పెద్దవారిని గౌరవవచనంతో పిలవాలని నాన్నగారు ఆనాడు చెప్పిన మాటలను ఈనాటికీ పాటిస్తున్నాను. ‘చివరకు మిగిలేది’ అనే సినిమాలో శివరంజని రాగంలో స్వరపరిచి శ్రీరంగం గోపాలరత్నంగారు పాడిన ‘చిన్నారీ నీ సొగసే’ అనే పాట నాన్నగారు నాకు నేర్పించిన మొదటి పాట. నాన్నగారికి ఇంగ్లీషు భాషపైన మంచి పట్టుంది. మేము పెద్ద చదువులు చదువుకోకపోయినప్పటికీ ఇంగ్లీషులో మేము అనర్ఘళంగా మాట్లాడడానికి నాన్నగారు నేర్పించిన ఆనాటి ఇంగ్లీషు పాఠాలే కారణం.
ఏ రంగాన్నీ వదిలిపెట్టలేదు
నాన్నగారు కేవలం చిత్రకారులే కాదు…మంచి కవి, రచయిత కూడా. గంగావతరణం, వైణతేయం లాంటి పద్యకావ్యాలు రాశారు. హంసమంజీరాలు అనే నవల రాశారు. ఎన్నో క«థలు, నాటకాలు రాశారు. కాళీమాత మీద దాదాపు 150 శ్లోకాలు రాశారు. ఆయన తెలుగు, సంస్కృతం, కన్నడ, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనర్ఘళంగా మాట్లాడడమే కాదు పాటలు కూడా రాస్తారు. ఇవిగాక హార్మోనియం, సితార్, గిటార్ వాయిస్తారు. పాటలు కూడా పాడతారు. చక్కని హావభావాలతో నటించి చూపిస్తారు.
ఒక్కమాటలో చెప్పాలంటే నాన్నగారు ప్రవేశించని రంగం లేదు. నాన్నగారికి బాడీ బిల్డింగ్ అంటే కూడా చాలా ఇష్టం. నాన్నగారు తాను రాసిన కథలతో సినిమాలు తీద్దామని దర్శకత్వం చేసి చేతులు కాల్చుకున్నారు. నిర్మాణ రంగంలో అనుభవం లేక కొంతమంది భాగస్వాములతో కలిసి రెండు, మూడు సినిమాలు తీయడం, అవి మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత ‘అర్ధాంగి’ అనే సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం నాన్నగారికి వచ్చింది. నాన్నగారు ఈ మధ్యనే ‘చంద్రహాస్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రానికి నంది అవార్డు వచ్చినా పెద్దగా ఆడలేదు.
నాన్నగారు తన పెళ్లి కాకముందు ఒక్కరే మద్రాసు వెళ్లి ఎల్.వి. ప్రసాద్‌గారి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ రోజుల్లో ప్రసాద్‌గారికే పెద్దగా పనిలేదు. అప్పుడప్పుడే ఆయన నిలదొక్కుకుంటున్నారు. చేతి నిండా పనిలేకపోవడంతో నాన్నగారికి బోర్ కొట్టి వాపసు వచ్చేశారు. ఆ తర్వాతి కాలంలో ఎల్.వి. ప్రసాద్‌గారు అగ్రదర్శకులుగా ఎదిగారు. అక్కడే కొనసాగి ఉంటే ఈ రోజు కె. విశ్వనాథ్‌గారి సరసనో, బాపుగారి సరసనో నాన్నగారి పేరు కూడా నిలబడి ఉండేదేమో!
సంగీతంలో సరిగంగస్నానాలు
రాయచూరులో భూములు చవకగా దొరుకుతున్నాయని తెలిసి కొవ్వూరులో పొలాలు అమ్మేసి నాన్నగారు మకాం అక్కడికి మార్చారు. పొలాలు కొని వ్యవసాయం చేయించడం మొదలుపెట్టారు. అయితే స్వీయ అజమాయిషీ కొరవడడంతో లాభాలు గుమాస్తాల పరమైపోయాయి. అక్కడే ఇంటర్మీడియట్‌తో నా చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టేశాను.
ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ రాశాను కాని సీటు రాలేదు. నేను చదువు మానేసినందుకు అందరూ బాధపడుతుంటే సంతోషించింది ఎవరైనా ఉంటే అది నాన్నగారే. “చదువు నీకు కూడు పెట్టదు. తీసి అవతల పారెయ్. ఇప్పుడు నీకు కావలసినంత సమయం దొరికింది. సంగీతం మీదే పూర్తిగా ఏకాగ్రత పెట్టు. దేవుడిచ్చిన సంగీత జ్ఞానం నీకుంది. దాన్ని మెరుగుపరుచుకో” అంటూ నాన్నగారు నాకు మార్గదర్శనం చేశారు.
ఇప్పుడైతే సినిమా పాటలకు బాణీలు కడుతున్నాను కాని ఆ రోజుల్లో నాన్నగారు రోజుకో పాట రాయడం నేను బాణీలు కట్టడం. అలా కొన్ని వేల పాటలు మేమిద్దరం సృష్టించాము. అన్నపానీయాల మీద ధ్యాస లేకుండా ఏళ్ల తరబడి జరిగింది ఆ కఠోర సాధన. నాన్నగారు ఇచ్చిన ఆ తర్ఫీదే కళాతపస్వి కె. విశ్వనాథ్‌గారి చిత్రాలకు సంగీత దర్శకత్వం చేసే అవకాశాన్ని నాకు కల్పించింది.
నాన్న వేసిన మెట్ల మీదుగా…
జీవితంలో అందరికీ ఆశలు, ఆశయాలు ఉంటాయి. వాటిని సాధించుకోవడానికి అందరమూ కష్టపడతాము. కాని…విజయం అందరినీ వరిస్తుందన్న భరోసా లేదు. మనలో ఎంత ప్రతిభ ఉన్నా సక్సెస్‌తోనే అది వెలుగులోకి వస్తుంది. నాన్నగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. అన్ని రంగాలను ఆయన స్పృశించారు. ఆయన ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేకపోయారు. ఒక్క రంగానికే పరిమితమై ఉంటే ఆయనకు రావలసిన గుర్తింపు వచ్చి ఉండేదేమో! కాని నాన్నగారిది అందుకు పూర్తి విరుద్ధమైన మనస్తత్వం. తన ఇష్టాయిష్టాలకు వస్తే ఆయన రాజీపడే ప్రసక్తి ఉండదు.
నాన్నగారికి ఇప్పుడు 80 ఏళ్లు. ఇప్పటికీ అలుపెరుగని అవిశ్రాంత యోధులాయన. దేవుడి దర్శనం కోసం కొండ ఎక్కాలంటే మెట్ల దారిలో వెళ్లకతప్పదు. మనల్ని భగవంతుడి దర్శనానికి పంపే మెట్లు మాత్రం ఆ దేవుడిని చూడలేవు. నాన్నగారు కూడా ఆ మెట్లలాంటివారు. మా ప్రగతికి ఆయనే మెట్టుగా మారారు. తన జీవితంలో తాను ఆశించిన విజయం దరికి చేరకపోయినా మా విజయానికి తానే ఆలంబన అయ్యారు. జీవితంలో నేనేమైనా సాధించి ఉంటే అది నాన్నగారు వేసిన పునాదే.