నా దారి తీరు -21- కొన్ని కుటుంబ విషయాలు

నా దారి తీరు -21-

            కొన్ని కుటుంబ విషయాలు

     అప్పటికే మాకు నాలుగో అబ్బాయి వెంకట రమణ పుట్టాడు .ఇల్లంతా పిల్లల లతో సందడి గా ఉండేది .ఒక పక్క ట్యూషన్ ఇంకోపక్క పొలం పనులు ,పాలేళ్ళ మీద అజమాయిషీ ,’’పార్ధి గారి పార్లమెంట్’’ పార్ధి గారి పార్లమెంట్కు రాత్రిళ్ళు వెళ్లి కూచోవటం ,సాయంకాలం లో ఆర్ .ఎస్.ఎస్.శాఖా కార్యాలకు హాజరవటం .క్షణం తీరిక లేకుండానే కాలం గడిచి పోయేది .హైస్కూల్ లో సైన్సు రూమ్ నే సాహితీ క్షేత్రం గా సాహిత్య కార్యక్రమాలు నిర్వహించటం .వీటికి తోటి ఉపాధ్యాయుల సహకారం అందించటం అన్నీ జరిగాయి .సంక్ర్తాంతి, ఉగాది లకు స్కూల్ లోనే సాయం వేళ కవి సమ్మేళనాలు నిర్వహించాను వీటికి స్వర్గీయ టి.ఎల్.కాంతా రావు ,వి.రామ కృష్ణా రావు ,అన్నే పిచ్చి బాబు ,తెలుగు మేస్టారు జ్ఞానసుందరం ,లెక్కల మేస్టారు ఆంజనేయ శాస్త్రి ,హిందీ మేస్టర్ర్ కొడాలి రామా రావు నాకు బాసట గా నిలిచే వారు .బెజవాడ ఆకాశ వాణి నిర్వహించే కవి సమ్మేళనాలకు మమ్మల్ని ప్రోత్సహించి కాంతా రావు తీసుకొని వెళ్ళేవాడు .అక్కడ బాగా ఆనందించే వాళ్ళం .అప్పటికే కాంతా రావు రేడియో ప్రసంగాలు చాలా చేశాడు .భారతి పత్రిక అతడిని అడిగి వ్యాసాలూ రాయించు కొనేది .అతను మా ఇంటి ప్రక్కనే కాపురం ఉండేవాడు భార్య కమలమ్మ మంచి ఇల్లాలు .అప్పటికే ‘’మందు బాబు ‘’అయ్యాడు .సిగరెట్లూ బానే తాగే వాడు .ఒక ఆడపిల్ల, మొగపిల్లాడు .ఇదంతా ఒక బృందం గా గడిపాం.సూపర్వైజర్ పూర్ణ చంద్ర రావు గారు కూడా ఇందులో ముఖ్యులు. చాలా సరదా అయిన వారు .సాహిత్యం మీద మక్కువేమీ లేకపోయినా మాకోసం సరదా గా వచ్చేవారు .ఆయన ఇంటి దగ్గర మాకు టిఫిన్ పార్టీలు ఇచ్చేవారు బలే మాటకారి .అలాగే చెరుకు డెవలప్ మెంట్ ఆఫీసు అధికారి మీసాల వెంకట రెడ్డి గారు మాతో కలిసే వారు కాంతా రావు పక్క ఇంట్లోనే ఆయన కాపురం కూడా .పూర్ణ చంద్ర రావు గారమ్మాయి  నా దగ్గర ట్యూషన్ చదివింది .చిన్నబ్బాయి కూడా .కొందరు అబ్బాయిలు ,అమ్మాయిలూ మెట్రి పరీక్షల్లో లెక్కల్లో తప్పి నా దగ్గర ట్యూషన్ చదివే వారు .వాళ్లకు నా ట్యూషన్ పిల్లలు వెళ్ళిన తర్వాతో ఆది వారాల్లోనో ప్రైవేట్ చెప్పే వాడిని .వారంతా బాగా చదివి పాసయ్యేట్లు చేశాను .హైస్కూల్ లో ‘’వేమన త్రిశతి ‘’జయంతి ని చాల ఘనం గా నిర్వహించాం .ప్రఖ్యాత విమర్శకుడు ఆచార్య జి.వి.కృష్ణా రావు గారిని ముఖ్య అతిధి గా ఆహ్వానించి సత్కారం చేశాం.ఆ నాటి సభకు ఇంద్ర గంటి శ్రీ కాంత శర్మ గారిని ఆహ్వా నిన్చాం .ఆయన వచ్చి సభను సు సంపన్నం చేశారు అలాగే అద్దేపల్లి రామ మోహన రావు తరచుగా మా సభలకు వచ్చేవారు .శ్రీ కాంత శర్మ ఒక రోజంతా రాత్రి ఇక్కడే మాతో గడపటం చిరస్మరణీయం .అలాగే మా వంగల కృష్ణదత్త శర్మ గారింట్లో ఏ.బి.ఆనంద్ ,నండూరి సుబ్బారావు సుమన్ మొదలైన రేడియో ఆర్టిస్టులు మా కోరిక పై వచ్చి మధుర సాయంత్రం గడపటం మరిచి పోలేను .వెన్నెల రాత్రిలో మా ఇంట్లో సాహితీ సమ్మేళనం నిర్వహించాను .అందరికి వేడి వేడిగా టిఫిన్లు టీలు తో చర్చలతో కాలమే తెలియ కుండా గడిపాం .ఇవన్నీ మధురమైన అనుభవాలే .మా గురువు గారు పెద్ది భొట్ల సుబ్బ రామయ్య గారితో మను చరిత్ర పై ఉపన్యాసం ఇప్పించాం .మా మోపిదేవి మిత్రులు లెక్కల మేష్టారు రమణ రావు ,నరసింహా రావు ,’’వాసన మేష్టారు’’ సత్యనారాయణ లతో ఒక సాయంత్రం హుషారుగా గడపటం గురించి ఇదివరకే చెప్పాను .ఆర్.ఎస్.ఎస్.వారుపౌర్ణమి నాడు  నిర్వహించే ‘’కోజాగిరి‘’కి హాజరయ్యే వాడిని .ఇలా కాలక్షేపం బానే జరిగి పోతోంది .మాకు సాహితీ మిత్రులుగా ప్రముఖ అనువాదకులు‘’రావూరి భరద్వాజ ,ప్రముఖ నవలా కారుడు తమిళుడు అయిన ‘’శారద ‘’అనే శ్రీనివాసన్   లకు మిత్రుడు తెనాలి వాడు హిందీ మేష్టారు అయిన శ్రీ ఆలూరి భుజంగ రావు ,కే.సి.పి.లో కెమిస్ట్ టి.వి.సత్యనారాయణ ,మునసబు కోటేశ్వర రావు ఉన్నారు .

                                మామ్మ మరణం

          మా రెండో అబ్బాయి శర్మ పుట్టిన తర్వాత మా మామ్మ నాగమ్మ గారు పెద్ద అనారోగ్యం పాలు అవకుండా చని పోయింది సుమారు 85 ఏళ్ళుఆప్యాయత కు మరో పేరు మామ్మ నాగమ్మ గారు మంచి ఆరోగ్యం తో జీవించింది మామ్మ .చిన్నతనం లోనే అంటే మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గారు జన్మించిన కొద్ది నెలలకే భర్తను కోల్పోయిన అభాగ్యురాలు మామ్మ .అప్పటి నుంచి ఉయ్యూరు లో పుట్టింట్లోనే ఉందికొడుకు ను పెంచుకొంటూ .ఇప్పుడు మేముంటున్న ప్రక్క ఇల్లే మామ్మ పుట్టిల్లు .మా మామ్మ కు ఒక అక్కయ్య ,ఇద్దరు చెల్లెళ్ళు .వీళ్ళలో ఎవరికి ముందు మగ పిల్లాడు జన్మిస్తే వారికి తన ఆస్తి నంతా రాసిస్తానని మా మామ్మ తండ్రి గుండు లక్ష్మీ నరసింహవధనులు గారు అన్నారట .మా నాన్న గారు ముందు పుట్టటం వల్ల ఆయన పేరా ఉన్న ఉయ్యూరు లోని కాటూరు లోని ఇల్లు ,పొలాలు మా మామ్మ గారి కొడుకు మా తండ్రి గారు అయిన మృత్యుంజయ శాస్త్రి గారికి ‘’దౌహిత్రుని ‘’హోదాలో సంక్రమించేట్లు విల్లు రాశారు .ఇది మా మిగిలిన నాయనమ్మలకు గుర్రు గా ఉన్నా తప్పక ఒప్పుకోన్నారట .మళ్ళీ అందరూ కలిసి పోయారు .నరసిమ్హావదాను లు గారే ఉయ్యూరు లో రావి చెట్టు బజారు లో స్వంత స్థలం లో శ్రీ సువర్చ లాంజనేయ స్వామి వారిని ప్రతిష్టించి దేవాలయం నిర్మించారు సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు.అప్పటి నుండే అది ‘’గబ్బిట ‘’వారి దేవాలయం అని పిలువ బడేది .మా తాత గారి తర్వాత మా నాన్న గారు వంశ పారంపర్య ధర్మ కర్తలయారు .ఆ తర్వాతా నేను ధర్మ కర్త గా వ్యవహరిస్తూస్వామి సేవ లో  జీవితాన్ని పండించుకొంటున్నాను ..

              మా నాయనమ్మ ను మామ్మ అని పిలవటం మాకు అలవాటు .ఆవిడ జ్ఞాపకం తో ఇవన్నీ రీళ్ళు గా తిరిగాయి ,చివరి వరకు ఆమె పూర్తీ ఆరోగ్యం గా ఉండేది .పళ్ళు కూడా ఊడలేదు .కళ్ళు బాగా కని పించేవి కళ్ళ జోడు అవసరం లేకుండా సూదిలో దారం గుచ్చెది .నాకు మా తాతగారి పేరు దుర్గా పతి శాస్త్రి గారి పేరు పెట్టారు .నాకు గ్రాహకం తెలిసిన తర్వాతా నేనే ‘’దుర్గా ప్రసాద్ ‘’అని మార్చుకొన్నాను .అందుకని మామ్మ నన్ను పేరు పెట్టి పిలిచేది కాదు ‘’పెసాదూ’’అని మాత్రమె పిలిచేది .నేనంటే మామ్మకు విపరీత మైన అభిమానం .కానీ మేము ఆమె ను తక్కువ చూపు చూసే వాళ్ళమేమో నని పించేది వేళా  కోళ మాడే వాళ్ళం .ఆమె వంటను విమర్శించే వాళ్ళం .మేమే కాదు మా నాన్న కూడా ఆమె ను ఆట పట్టించేవాడు .కాని అన్నిటికి నవ్వే ఆమె సమాధానం .ఏమీ అనేది కాదు అత్తగారు అంటే మా అమ్మకు గౌరవమే కాని ఎందుకో అంతగా పట్టించుకోనేది కాదు .1961 లో మా నాన్న గారి మరణం మామ్మ  ను కుంగదీసింది .తను జీవించి ఉండగానే కొడుకు ను పోగొట్టుకొని గర్భ శోకాన్ని అనుభవించింది .అంతకు ముందు మా అన్నయ్య మరణం కుటుంబం లో విషాదాన్ని తెస్తే ,కొడుకు మరణం మళ్ళీ ఆమెను ఇబ్బంది పాలు చేసింది .అయితే మా నాన్న కాని మా అమ్మ కాని నేను కాని ఆమె కు ఏ లోటు రాకుండా చూసుకొన్నాం .అందుకే మేమంటే మహా ప్రాణం ఆమెకు .మా ఆవిడ ప్రభావతి ని బుగ్గలు గిల్లి ముద్దు పెట్టుకొనేది .మా పెద్దబ్బాయి శాస్త్రి ని ఉయ్యాల్లో  ఊపేది .ముని మనవడిని చూసుకొన్నది . అంతకు ముందే మా అన్న పిల్లలూ ,మా అక్కయ్య పిల్లలూ ఉన్నారనుకోండి …మా రెండో అబ్బాయి శర్మ పుట్టిన కొద్ది నెలలకే మామ్మ మరణించింది అని ముందే చెప్పాను .   కొద్ది రోజులు కొంచెం ఆరోగ్య భంగం కలిగింది మామ్మకు.తన పనులు తాను చేసుకొనేది .మాకేమీ ఇబ్బంది కలిగించలేదు .నేను ఒకసారి  ‘’ మామ్మా ! నాకు సెలవులన్నే అయి పోయాయి .కాస్త నా మీద దయుంచి సెలవల్లో చని పోతే మంచిది ‘’అన్నాను అమాయకం గానో, అతి తెలివితోనే ,ఒళ్ళు బలిసో .’’ఆవిడ దాన్ని లైట్ గా తీసుకొని‘’అలాగేరా పెసాదు .నీకు ఇబ్బంది కలిగించకుండా నే పోతాను .’’అంది .అలానే ఆవిడ దసరా సెలవుల్లో ‘’దుర్గాష్టమి‘’నాడు మామ్మ చని పోయింది .అదీ మనవడి మీద అభిమానం .కార్య క్రమాలన్ని మా మామయ్య ఆధ్వర్యం లో ఘనం గా నే నిర్వహించాం ఉడక శాంతి నిర్వహించాం .అప్పటి నుంచి అంటే1969 నుంచి  ఇప్పటి దాకా మామ్మ ఆబ్దికాలు పెడుతునె ఉన్నాను .అమెరికా వెళ్ళినప్పుడు తప్ప .లేక పోతే ఎవరైనా బ్రాహ్మడిని పిలిచి కాళ్ళు కడిగి దక్షిణా తాంబూలం ఇవ్వటం చేసే వాడిని .రెండేళ్ళ క్రితం శ్రీ శైలం దేవాలయం లో మామ్మ పేర ఆమె చనిపోయిన దుర్గా స్టమి  నాడు ఉచిత భోజనం పెట్టటానికి ‘’కరివేన వారి నిత్యాన్న దాన బ్రాహ్మణ సత్రం ‘’లో రెండు వేల రూపాయలు శాశ్వత నిధికి జమ చేశాను .ఒక వేళనాకు ఆమె తిది పెట్టె వీలున్నా లేకున్నా ఆ నాడు ఆమె పేర భోజనం పెట్టె ఏర్పాటు ఇది .అదొక తృప్తి మాత్రమె .

                         పదవతరగతి తో హైస్కూల్ చదువు పూర్తీ

       మేమంతా ఏ.ఎస్.ఎల్.సి.అంటే సెకండరి స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ చదివిన వాళ్ళం . .ఇప్పటిదాకా హైస్కూల్ స్థాయి అదే ఉంది కాని ప్రభుత్వం మార్పులు చేసింది .సెకండరి స్థాయి పదవతరగతి తో ఆఖరు చేసింది .కొంతకాలం ఎస్.ఎస్.ఎల్.సి ,పదవతరగతి అనే ఎస్.ఎస్.సి రెండు ఉండేవి తర్వాత మొదటిది రద్దు అయి రెండోదే. అంటే సెకండరి స్తాయి విద్య పదవ తరగతి తో ఆఖరు అన్నమాట ఈ సంధి కాలం లో ఉన్న వారందరూ పాస అవటానికి కొంతకాలం అవకాశమిచ్చారు .ఇప్పుడిదే ఎస్.ఎస్.ఎస్.సి.నడుస్తోంది .ఇంటర్ రెండేళ్ళు వచ్చింది .డిగ్రీ రెండేళ్ళు .అంతకు ముందు పి.యు.సి.ఉంది ఇంటర్ మూడేళ్ళ కోర్సు గా ఉండేది .జూనియర్ కళా శాలలేర్పడదతటానికి ముందు హయ్యర్ సెకండరి స్తాయి స్కూళ్ళు కొన్ని చోట్ల పెట్టారు .ఆకునూరు అడ్డాడడ నూజివీడు మొదలైన చోట్ల ఉండేవి .దీని లో బోధనకు ఏం.ఏ.లేక ఏం.ఎస్.సి అర్హత కావాల్సి వచ్చేది .అవీ క్రమం గా మూసేసి  మేస్టర్లకు లెక్చరర్లు గా ప్రిన్సిపాల్స్ గా అవకాశాలు వచ్చాయి .తర్వాత జూనియర్ కళా శాలలేర్పడ్డాయి ..ఇవన్నీ పదేళ్లలోపుజరిగిన  మార్పులే .,

                     సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –3-4-13- ఉయ్యూరు –

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.