అరటి నార చీరలు

సీతారాములు వనవాసానికి వెళ్లినప్పుడు నార దుస్తులను ధరించారని విన్నాం. అడవుల్లో తపస్సు చేసుకునే ఋషులూ నార వస్త్రాలనే కట్టుకునేవారనే కథలూ తెలుసు. కాని నార వస్త్రాలేమిటో తెలుసా? ‘అరటి చెట్టు పీచుతో బ్రహ్మాండమైన వస్త్రాలు తయారుచేస్తున్నాం’ అని చెప్పారు ‘అనానాఫిట్’ అనే సంస్థవారు. ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు మామిళ్లపల్లి రాజశేఖర్, చెన్నైకు చెందిన చేనేతకారుడు సి.శేఖర్‌తో కలిసి చేస్తున్న అద్భుతమిది.
అర టి చెట్టుకు పూర్వులు కల్పతరువన్న పేరెందుకు పెట్టారోగానీ నూటికి నూరుపాళ్లూ అది నిజమే అంటున్నారీ యువకులు. కాయ, పండు, పువ్వులే కాదు అరటి చెట్టు కాండమూ మనకెంతో ఉపయోగకరమైదని నిరూపిస్తున్నారు వీళ్లు. మామూలుగానైతే అరటి చెట్టు కాండం వృధాగా పోయేదే. కాని అదే ‘అనానాఫిట్’కు ముడిసరుకుగా మారింది.
ఆరంభానికి బీజం
ప్రకాశం జిల్లా పొదిలి మండలం కాటూరివారిపాలెం గ్రామంలో పుట్టిపెరిగిన మామిళ్లపల్లి రాజశేఖర్ రూర్కెలా ఐఐటీలో నుంచి టెక్స్టైల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ చదివారు. ఒక సమావేశంలో శేఖర్‌ను కలిశారు. శేఖర్‌ది చెన్నైకి 20కి.మీ. దూరంలోని అనకపుత్తూరు అనే గ్రామం. అది ఒకప్పుడు చేనేతకు ప్రసిద్ధి చెందిన ఊరు. పూర్వం ప్రఖ్యాతమైన ‘మద్రాస్ రుమాళ్లు’ ఇక్కడే తయారయ్యేవి. కాలక్రమేణా నేతపనివారు ఉపాధికోల్పోయారు.
తాము బాగుపడుతూ అక్కడివాళ్లకేదైనా మంచి అవకాశం కల్పించాలనుకున్నారు ఈ యువకులు. కాస్త సృజనాత్మకంగా ఆలోచించి అరటి నార నుంచి వస్త్రాలు తయారుచెయ్యాలన్న ప్రతిపాదన గురించి చర్చించుకున్నారు. అలా 2009లో ‘అనానాఫిట్’ అంకపుత్తూరులో ఏర్పాటయింది. ‘అనకపుత్తూరు నేచురల్ ఫైబర్ టెక్స్టైల్స్’లోంచి మొదటి అక్షరాలను తీసుకుని తమ సంస్థకు ఆ పేరు పెట్టారు.
ప్రయోజనాల స్నేహం
అరటినార సహజమైన పీచు పదార్థం కావడం వల్ల దీనితో రూపొందించిన దుస్తులు వేడిని తక్కువగా గ్రహిస్తాయి. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అత్యుత్తమ నాణ్యత ఉన్న నారతో చొక్కాలు, చీరలు త యారుచేస్తే రెండోరకం నాణ్యత ఉన్న పీచుతో బ్యాగులు, చెవిరింగులు, చేతులకు గాజులు, చెప్పులు వంటి ఎన్నో రకాల వస్తువులను తయారుచేస్తోంది అనానాఫిట్ సంస్థ.
కేవలం అరటి పీచు మాత్రమే కాకుండా పైనాపిల్, వెదురు, జనుము, కలబంద వంటి ఇంకొన్ని సహజ పీచు పదార్థాల నుంచి కూడా దుస్తుల తయారు చేయాలని గురించి పరిశోధనలు చేస్తోందీ సంస్థ. ప్రయోగాత్మకంగా 25 రకాల సహజ పీచు పదార్థాలతో చీరల్ని తయారుచేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ఎక్కింది అనానాఫిట్. 2011లో ‘పరివర్తన్ లీడర్షిప్ అవార్డు’నూ అందుకుంది. ప్రస్తుతానికి నెలకు రెండొందల చీరల చొప్పున రూపొందించి చెన్నై, బెంగుళూరుల్లో అమ్ముతున్నారు. చీరలు రెండున్నర వేల రూపాయల నుంచి వివిధ ధరల్లో లభిస్తాయి.
నాణేనికి మరో వైపు
“నిజానికి మాకు చైనా ఎనిమిది లక్షల టీ షర్టులకు ఆర్డరిచ్చింది. ఒక స్వచ్ఛంద సంస్థ ఏకంగా లక్ష చొక్కాలకు ఆర్డరిచ్చింది. ఫ్రాన్స్, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలన్నిటా మాకు వినియోగదారులున్నారు. అయితే అంత పెద్దఎత్తున తయారుచెయ్యడానికి తగిన నిధుల్లేవు. అదే మా సమస్య’ అంటున్నారు రాజశేఖర్. కేవలం నిధులే కాదు, అంత ఎక్కువ సంఖ్యలో తయారుచెయ్యడానికి తగిన సాంకేతికత కూడా వాళ్లకు లేదు.
ప్రస్తుతానికి తిరుచిలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా దీనికి సాంకేతిక సాయం చేస్తోంది. కానీ అది సరిపోదు. నిధులు, సాంకేతికత సమస్యలను అధిగమించడానికి ప్రఖ్యాత డిజైనర్లను సంప్రదించి ఏకంగా లక్ష రూపాయల చొక్కాను తయారుచేసి ప్రదర్శనకు పెట్టబోతోంది అనానాఫిట్. ఈ రెండు సమస్యలనూ అధిగమిస్తే అంకపుత్తూరులోని నేత కార్మికులకూ పని దొరుకుతుంది, వినియోగదారులకు చవకలో మేలైన నారవస్త్రాలూ లభిస్తాయి.
అరుణ పప్పు
రాజశేఖర్ : 07845041192