శ్రీ విజయ ఉగాది కవికోకిల కల స్వనాలు -7
16- ఉగాది హేల–కవిత –శ్రీ అగ్ని హోత్రం శ్రీ రామ చక్ర వర్తి –కూచిపూడి –
అనురాగ కుసుమాలు వికశించగా –ఆనంద జేగంట మది మ్రోగగా
అందరి హృదయాలు పులకించగా –ఈ విజయ నామ సంవత్సరం –సరసభారతి ప్రోత్సాహం
శ్రీ రస్తు శుభ మస్తు –ప్రపంచ శాంతి రస్తూ –విచ్చేసిన కవి పున్గవులకు విజయోస్తు .
శ్రీకర నూత్న వత్సరమ శీఘ్రము రమ్మిక స్వాగతమ్మునున్
ప్రాకట లీల బల్కదము పావన భక్తి విజయనామ సు
శ్లోక శుభాబ్దమా ప్ర,ణప్రతులన్ గొనుమ బహుధా సుదీ సుధా
మా ,కరుణించి బ్రోవుము సుమా మము నీవు శుభ క్షమా రమా .
అరయ సుందర ప్రకృతి నంత జ గాన ఉగాది హేల సొం
పార వహించే ,మించే ఫలభాషిత పుష్ప సుగంధ బంధురో
దార విలాస కోకిల వితాన కుహూధ్వని కేకి నాట్య వి
స్తార శుకారవలి కుల ఝాంక్రుతి దక్షిణ మారుతమ్ములన్ .
రెండేండ్ల పసి పాప ,రెక్కలాడిన వగ్గు –మగవాని కామాన మ్రగ్గిపోవ
గద్డైన దుడ్డైన ‘’గర్భాత్ర పరులరౌ ‘’—స్వార్ధ సురాలికి స్వాహ కాగ
రోజుకో పార్టి సరోజుల గుమగుమల్ –రాజకీయ వనాల బ్రబలు చుండ
బాబాలు స్వాములున్ వాడ వాడల –జనము లో పిచ్చగా ఘనులు కాగ
నేటి స్వాతంత్ర భారతి నేమ్మనంపు –స్వర్ణ కాంతులతో గామ్క్షింప వచ్చు చున్న
యో విజయా ,యొకింత నీ వొదిగి యుండి –మంచి శకునమ్ము జూచి యేతెంచి రమ్ము .
అవినీతి కనురీతి నభ్యుదయంముతో –శుక్ల పక్షపు చంద్రు సోబగులీనే
మమకార మనురాగ మనువనువు నశింప –మానవత్వము తాను మచ్చ నూనె
హింసలు ,ద్వేషాలు హెచ్చులై మెచ్చులై –రాహుకేతుల పాత్ర రచన చేసే
కులములు ,మతముల గుమ్మలాటలబడి –సర్వాత్మ భావమ్ము చంపి వేసే
నిట్టి దుర్ముహూర్తమ్ములో నేట్టులీవు –రాగలవు ,మా మదుల కనురాగ మీయ
గలవు ?ఐన నీ గ్రహ గతుల్ కఠిన మౌచు –నిన్బడగా జూచే కర్మముం దీర్చి కొనుము
17—అప్పుడే అసలు ఉగాది –కవిత –శ్రీమతి పెళ్ళూరి శేషుకుమారి –విజయ వాడ .
నిరంతర స్రవంతి –నిత్య నూతన తేజస్వి –అవిశ్రాంత సమ వర్తి –అపరిష్కృత అభినేత్రి–కాలం
ఈ భ్రమణం లో మనిషి జీవన విధాన పరిణామ క్రమం విపరీతమై –వైపరీత్యాలకు తావిస్తోంది
కుటుంబ వ్యవస్థ కుంటుపడి పోయి –వృద్ధాశ్రమాల ఎదుగుదలకు కాపు కాస్తోంది
మాత్రుత్వపు కు తీరికే లేదు –పేగు తెంచుకొన్న మరుక్షణమే అమ్మ తనానికి కరువొచ్చి
పసి కందు పరాయితనపు ఆలనా పాలన లో ఒదిగి పోతోంది
బుడి బుడి నడకలు –చిటిచిటి పలుకులు –శైశవాన్ని మురిపెంగా ఆహ్వానిచే అమ్మతానాలు లేవు
స్తన్య మిచ్చి ధన్యమైన అమ్మ –ఏనాటికైనా ఆదర్శమే
ఏం దౌర్భాగ్య మోచ్చిందో మమతానురాగాల కోవెల మూసుకు పోతోంది
ఏమయితేనేం కళ్ళున్నా చూడలేని అంధకారం లో ఉన్నాడు మనిషి
అడుగు తడబడుతున్నా –మనసులో ఒంటరితనం ఎగబడుతున్నా
కర్ణభేరి ని కరాబు చేసే సెల్లుతో –శాటి లైట్ల కింద ఆహ్లాదాన్ని ఆవిష్కరిస్తున్నాడు .
సహజత్వం తలవంపుతనమై –మనిషి మానవ మూల్యాలను సమూలంగా పెకలించుకొంటు
మరమనిషి లా మారిపోతున్న ఈ నైజం –దిగ జారుడు తనానికి పరాకాష్ట
పచ్చదనాన్ని ఓర్వలేనితనం పురుడు పోసుకొని –సహజీవనానికి స్వస్తి వాక్యం ఇచ్చింది
పెరుగుతున్న విజ్ఞానం లో విచక్షణ కోల్పోతున్న మనిషి
క్షనాలన్నింటిణీ కరెన్సీ కి డాలర్లకు మూట గట్టి
జీవితం తాలూకు ఆనందాలకు ఇరుకు బతుకుల్లో ఈడ్చుకుంటూ
ఏమీ మిగలని జీవితం పొడవును వెనక్కి తిరిగి చూసు కొంటె
‘’నందన ‘’విలాసం గా నవ్వుతు వీడ్కోలు అందుకోంది
ఇదే సృష్టి రహస్యం అంటూ –నూతనోత్తేజం పొంగులు వారుతుంటే
‘’విజయ ‘’నామ వత్సరం ఆహ్వనానికి వచ్చింది
షడ్రుచుల ఉగాది పచ్చడి చప్పరిమ్పులతో సరికాదు
స్వచ్చమైన చైతన్యపు చిరు నవ్వులతో
రేపటి లోగిలిలో –మనిషి అసలు మనిషి గా మారినపుడేఅసలు ఉగాది
18-మానవత్వం –శ్రీమతి వడ్డాది లక్ష్మి సుభద్ర –విజయ వాడ -0866-2541543
మొగ్గగానే చిదిమేసిరి –అడిగే నాధుడే లేడాయే
గర్భశోకం గుర్తించే వారే లేరై నారిప్పుడు
కల్తీ ఎరువులు కల్తీ విత్తనాలు –రైతులకు శత్రువులాయే
ఇదిగో డాము ,అదిగో బారేజి –ఊహల చిత్రాలు ఆశలు నింపే
అన్నెం పున్నెం ఎరుగని యువకులు –బాంబులకు అన్కితమాయే
కన్న వాళ్లకు శోకం మిగిలే –ఉన్నవాదోక్కడు వీధుల పాలాయె
పాశ్చాత్య సంస్కృతి –వేర్రితలలేసే
కుర్రకారు మతి తప్పి –కర్తవ్యమ్ తెలియక
అడ్డదారులు వెతుకు తుంటే –తపన లేని చదువు
శ్రమ లేని ధనము –కోరు చుండే నేటి యువత
కాలేజీలలో చదువే పూజ్యం –వెంటాడే వేధింపులు
ఆడపిల్లలు అదిరి బెదిరి వంచనకు గురై మోసపోయి
బతుకు భారమై దిక్కు తోచక గగ్గోలు
చదువు సున్నా –జీవితం శూన్యం
కడుపు కొట్టి బాటలు వేసిన –మూన్నాల్లకు బోర్డులు తిప్పేసి
కక్కలేక మింగలేక సతమత మయ్యే వేతన జీవులు అందరాని మానవత్వం
ఆలోచన లేని జీవితాలు ఇలానే ఉంటాయి
ఈ విజయ వత్సరమైనా అందరికి శుభాల నివ్వాలని ఆశ .
19—ఓ శాంతి కపోతమా –కవిత –శ్రీ పాణిగ్రాహి రాజశేఖర్ –విజయవాడ –9292 006075
ఓ శాంతి కపోతమా ఇటురాకు సుమా
అస్సాం ఘటనలకు –నీ గుండె బెదురుతుందేమో
ముంబై పేలుళ్లకు –నీ రెక్కలు ఊడిపోతాఎమో
తమిళనాడు ,కేరళల జలయుద్ధమేఘాలు
నిన్ను కప్పెస్తాయేమో
ఆంద్ర కర్నాటక హద్దు గొడవలలో దెబ్బలు తింటావేమో
తెలంగాణా ఉద్యమ సెగలో మాడి మసి అయి పోతావేమో
కుటిల రాజకీయ నేతల కబంధ హస్తాలలో చిక్కడిపోతావేమో
ధన వంతుల పంజరాల్లో బొమ్మవై పోతావేమో
శాంతివనం కాదిది –అవినీతి సామ్రాజ్యమే
ఇక్కడ నీకు చోటే లేదు చోటా నాయకుల మధ్య
నిన్ను స్వాగతించే నైతిక హక్కే కోల్పోయిన అభాగ్యులం
అక్కున చేర్చుకొనే శాంతి దూతలే కరువైనారు
మిత్రమా ణీ దారి మార్చుకో –అశాంతి గూటి నుంచి పారిపో –శాంతి సీమ లో తల దాచుకో
20-మల్లెపూవు మనువాడింది –కవిత శ్రీ మైనే పల్లి సుబ్రహ్మణ్యం –ఆకునూరు 9490420476 –
చిన్నారి పువ్వా –చిరుమల్లె పువ్వా
చిన్నారి మాలా మరుమల్లె మాలా
మరువాన్ని నీవు మను వాడినా –మట్టుగుండే మరువ మంటే
గుండు మల్లె నవ్విందట
వాలు చూపుల వయ్యారంతో ,వరుసలేమో కలిపావా
చెట్టాపట్టా లేసుకొని కొప్పులోకి చేరావా
మండు టెండలో మరువాన్నే మరిచావా
శృంగార శరాలతో వేధించావే
మత్తుగుండే మరదలు పిల్లకి లోకువ నీవే నంటా
తోటలోని ఆకుల మధ్య శ్వేత బిందువు నీవంటా
కోటలోని తోబుట్టువులు తుల్ళ్ళీ తుల్ళ్ళీ గిల్లా రంటా
గంపలోని గుంపు తోటి గుబాళించినావే –
పెళ్లి లోని జంట మధ్య కులుకుతావే జంటగాను
జడలోనే చేరి నీవు నాగకన్యలా ఉంటావు
కొప్పులోకి చేరి నీవు కోటి కాంతులిస్తావు
మజా గుండె మరదలు పిల్లకి నీతోడుంటే
చిరుచేమటే పన్నీరంటా
సశేషం
మీ—గబ్బిటదుర్గా ప్రసాద్ –14-4-13-ఉయ్యూరు
Reblogged this on srinivasakavi and commented:
తేట తెలుగు సంవత్సరాది
రానే వచ్చింది షడ్రుచుల ఉగాది
చిగురాకులతో ప్రకృతికి ఆకు పచ్చని అలంకారాలు
తీయ తీయని కోకిల కిలకిలలు
వసంత రుతువు ఆగమనం
అందరి మదిలో ఆహ్లాదం
విజయా నామ సంవత్సరం
ఇక వలదు మనకు ఓటమి భయం
క్రోధం రుచి కారం
చేదు గుర్తు చేస్తుంది విచారం
ఆనందం అందరికి తీపి
అవమాన భారం పులుపు
ఉప్పు నేర్పుతుంది భయం
మామిడి వగరు అంటే అర్థం ఆశ్చర్యం
ఇవన్ని కలిస్తేనే జీవితం
ఇదే ఉగాది పచ్చడి సారం
తోటి వారికి అవమానం
కాకూడదు నీకు రాజ్యపూజ్యం
ఆరోగ్యమే నిజమైన ఆదాయం
దానగుణమే అసలైన వ్యయం
మంచి చెడు చెప్పడమే రాశి ఫలం
ఇక ఆపై అంతా నీ కష్ట ఫలం
ఇదే పంచాగ శ్రవణ సారాంశం
భక్ష్యాలు బొబ్బట్లు పానకం వడపప్పు
ఏది వదలొద్దు వ్యాయామం మరవొద్దు
ఇదే నా ఉగాది సందేశం
ధన్యవాదాలు ఇచ్చినందుకు అవకాశం