చిగురాకుల ఊయలలో ‘ఇల’ మరిచిన ఓ చిలుకా..

చిగురాకుల ఊయలలో ‘ఇల’ మరిచిన ఓ చిలుకా..


‘ప్రతివాద భయంకర’ ఇంటి పేరు గల శ్రీనివాస్ నిజానికి అతిసున్నిత మనస్కుడు. ‘పఠనం, గానం’ ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ‘నిత్యయవ్వనుడి’గా చెప్పుకుని మురిసిపోయే నిత్య దరహాసి. ఒక పరిశోధనాంశం గురించి సలహా కోసం చెన్నయ్‌లోని ఆయన ఇంటికి వెళ్లినప్పుడు అనేక ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఆయన మహాప్రస్థానానికి సరిగ్గా ఆరు రోజుల ముందు ఆయనతో ముచ్చటించే అదృష్టం కలిగింది. అప్పటికే కాస్తంత నలతగా ఉన్నా ఓపికగా సంభాషించారు. ఆ వివరాలను ‘ప్రశ్నలు-జవాబులు’గా క్రోడీకరిస్తే ఆవిష్కృతమైన ఈ ముఖాముఖి ‘సుస్వర’ శ్రీనివాసుడికి అక్షర నివాళిగా… 

మీ చలన చిత్ర ప్రయాణం…? సినిమా అవకాశాల గురించి….
చిత్రసీమలో ఏదో కావాలని వచ్చి ఏదో విభాగంలో స్థిరపడిన వారు ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు భగవత్ కృపవల్ల అనుకున్నది పొందగలిగాను. గాయకుడు కావాలనే వచ్చాను. ఆ కలను సాకారం చేసుకోగలిగాను.అయితే అందరంటున్నట్లు తెలుగులో వేల పాటలు పాడలేదు.వందలే. కాని పాడినవన్నీ విజయవంతమైనవే, గుర్తింపు తెచ్చినవే. ఇక..అవకాశాలు అంటే…గాత్ర ధర్మాన్ని బట్టి అవకాశాలు వస్తాయి తప్ప ఇందులో ఇతరత్రా కారణాలు వెదకవలసిన అవసరం లేదేమో? అవకాశాలు రాకపోవడానికి ఇతరులను తప్పుపట్టలేం.

తప్పు పట్టీ ఏం చేయలేం. ‘గుమ్మడికాయంత కృషికి ఆవగింజంత అదృష్టం తోడు కావాలి’అంటారు. ఆ అదృష్టానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇతరుల పరపతి (సిఫార్సు)తో రంగ ప్రవేశం చేసినా ఆ తర్వాతైనా మనమేమిటో రుజువు చేసుకోవాలి కదా! కన్నడంలో ‘కనకదాస్’ చిత్రంలో నా పాటలు విని మహానటుడు రాజ్‌కుమార్ కదిలిపోయారు. అప్పటివరకు తన పాత్రలకు తానే పాడుకునే ఆయన నాకు అవకాశం ఇచ్చి రెండు దశాబ్దాలు తన నటనతో నా గాత్రానికి గౌరవం పెంచారు. అది దైవ నిర్ణయం.


సంగీతంలో గురువు ఎవరు?
సంగీతంలోనే కాదు…జీవితంలోనూ ఆది గురువు మా అమ్మ శేషమ్మే. అలా అని ఆమె పండితురాలో, సంగీత విద్వాంసురాలో కాదు. సాధారణ ఇల్లాలు. ఆమె నుంచే స్వరజ్ఞానం అబ్బింది. ఆమె పాడిన ‘చందమామ రావే…జాబిల్లి రావే…’లాంటి లాలి పాటలే నాలో సంగీతం పట్ల ఆసక్తిని రేపాయి. వృత్తి పరంగా కూడా నేను ప్రత్యేకించి సంగీతం నేర్చుకోలేదు. ‘అభ్యాసం కూసు విద్య’ అన్నట్లు పాడగా పాడగా, పరిశీలన వల్ల స్వరజ్ఞానం అలా వచ్చి ఉంటుంది. దానిని రసజ్ఞులు ఆమోదించి ఆశీర్వదించారు.

మీ సాహితీ వ్యాసంగం గురించి వివరిస్తారా…?
నేను పుస్తక ప్రియుడిని. నా దినచర్య పఠనంతో మొదలై పఠనంతో ముగుస్తుంది. ‘పుస్తకం మంచి నేస్తం’ అని నమ్ముతాను. పుస్తక పఠనం కేవలం కాలక్షేపానికే కాదు….అది మానసికానందంతో పాటు విజ్ఞానాన్నిస్తుంది. చదువుకు, రచనకు వయస్సు, కాలమానాలతో నిమిత్తం లేదు. కలలో మంచి ఆలోచన తట్టినా వెంటనే లేచి అక్షర రూపం ఇవ్వడం నాకు అలవాటు. రచన, పఠనం నాకు నిద్రాహారాలను కూడా దరిచేరనీయవు. సరిగా లెక్కేయలేదు కానీ అంచనా లేదు కానీ.. అన్ని రకాల రచనలు అంటే పాటలు, కవితలు, గేయాలు, గజళ్లు, వ్యాసాలు వంటివన్నీ రెండున్నర లక్షల పైమాటే రాసి ఉంటాను. జీవించినంత కాలం సాహితీ వ్యాసంగం కొనసాగాలని, ఆ వ్యాసంగం సాగినంత కాలం జీవించాలన్నది నా ఆశ. భగవంతుడు నెరవేరుస్తాడనే అనుకుంటున్నాను.

గజళ్లు అంటే మీకు ప్రత్యేకాభిమానం అంటారు..?
ప్రత్యేక అభిమానమే కాదు…అవంటే ప్రాణం. సంస్కృతం సహా ఎనిమిది భాషల్లో గజల్స్ రాసి పాడాను. తమిళంలో గజల్ ప్రక్రియను ప్రవేశపెట్టింది నేనే. తెలుగులో దాశరథి – సి. నారాయణ రెడ్డి గజల్ ప్రక్రియలో విశేష కృషి చేశారు.నేను గజల్ ప్రియుడిని కావడం వల్ల అది నన్ను ఆ జంట కవులకు మరింత చేరువ చేసింది. దాశరథి కృష్ణమాచార్యులు అత్యంత సన్నిహితులు. ఆయన రూపంలో ‘వామనమూర్తి’ కాని ప్రతిభా పాటవాల్లో ‘త్రివిక్రముడు’. మెత్తని మనసులో దిట్టమైన భావాలు గల వ్యక్తి.

ఆయనతో సాగించిన కవితా గానం ఓ మధుర జ్ఞాపకం. ఆయన రాసిన అనేక గజళ్లకు వరుసలు కట్టి రేడియో కార్యక్రమాల్లో, కచేరీల్లో పాడేవాడిని. ఆయన గజళ్లలో ‘రమ్మంటే చాలు లేవే రాజ్యాలు విడిచిరానా’ అంటే నాకు అత్యంత ఇష్టం. గజళ్ల ఆలాపనకు నిర్దిష్ట సంగీత రీతి అంటూ లేదు. శాస్త్రీయ, పాశ్చాత్య, లలిత సంగీతం..ఇలా ఏ బాణీలోనైనా పాడవచ్చు. సినిమా పరంగా నాకు అమితమైన గుర్తింపు, పేరు తెచ్చినది దాశరథి రాసిన ‘ఓహో గులాబీ బాల…అందాల ప్రేమ మాల’ పాటే.

మంచి పాట అంటే….?
ఒక పాట వినిపించినపుడు నడిచే వ్యక్తి లిప్త కాలం ఆగి చెవి ఒగ్గడం. ఏ స్థితిలోనైనా అలవోకగా పెదవులపై ఆ పాట నర్తించడం. ఇలాంటి పాట పుట్టాలంటే ‘పాళీ, బాణీ, వాణి’ (రచన, వరుస, గాత్రం) సమపాళ్లలో సంగమించాలి. అందరూ మనసు పెట్టాలి. పాట శాశ్వతంగా నిలిచిపోయేది కనుక గానం విషయంలో రాజీకూడదు. అప్పట్లో ఒక్కొక్క పాటను కనీసం నెల రోజలు సాధన చేసేవారం. సంగీత దర్శకులు ‘చాలు’ అన్నా మరో(టేక్) సారి పాడిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు అంత వ్యవధి ఎక్కడ? మీకు తగినంత గుర్తింపు వచ్చిందనుకుంటున్నారా?.. పురస్కారాలూ అవీ…?

వాటి గురించి అంతగా ఆలోచించను నేను. మన వ్యాసంగం, మనుగడ కోసం, మనస్సు తృప్తి కోసమే కానీ అవార్డులు, రివార్డుల కోసం కాదు. అవి ప్రోత్సాహకాలే కానీ ప్రతిభకు కొలమానాలు కావు. పురస్కారాలు వచ్చినంత మాత్రాన మంచి కళాకారుడని, లేకపోతే కాదని ఎక్కడుంది? కన్నడంలో నటగాయక సార్వభౌముడు రాజ్‌కుమార్ ఏరికోరి నాతో పాటలు పాడించుకున్నారు. తెలుగులో ఘంటసాల తిరుగులేని గాయకుడు. ఆయన సంగీత దర్శకత్వంలోనూ పాడాను. ఇలాంటి వాటి కంటే గుర్తింపు, గౌరవం ఏముంటాయి? అయినా ఆదరించిన వారు గౌరవిస్తూనే ఉంటారు, ఉన్నారు.

ఈ ప్రస్థానంలో మరువలేని సంఘటనలు..?
ఒకటా రెండా?…ఎన్నో. అమ్మ ఒడిలో విన్న జోలపాట స్ఫూర్తితో మహానటులు, గాయకులకు పాడే స్థాయికి చేరుకునే అదృష్టం కలిగింది. గాయకుడిగా మిగిలిపోక సినీగీత రచయితైన అదృష్టమూ దక్కింది. అదీ ఒక భాష సినిమాలో మరో భాషా గీతంతో. అంటే…హిందీ సినిమాలో తెలుగు పాట, తెలుగు సినిమాలో మరోభాష పాట. ‘ఆకలి రాజ్యం’లో ‘తూ హై రాజా’ హిందీ గీతం, కన్నడ చిత్రం ‘మక్కళ భాగ్య’లో తెలుగు, తమిళ, మలయాళ హిందీ భాషా చరణాలు అందుకు ఉదాహరణలు. చిత్తూరు నాగయ్య గారు మా అందరికి పితృ సమానులు. అంతటి మహానటుడు, గాయకుడు, సంగీత దర్శకుడికి ‘శాంతినివాసం’ చిత్రంలో పాడడం (శ్రీ రఘురాం జయరఘురాం…) పూర్వజన్మసుకృతం. ఈ విషయంలో ఘంటసాల గారి తర్వాత నాకు దక్కిన అరుదైన అవకాశం అది.

ఆయన నాగయ్య గారికి ‘లవకుశ’లో పాడిన సంగతి తెలిసిందే కదా! చిత్రరంగ ప్రవేశానికి ముందు ఘంటసాల, లతామంగేష్కర్, రఫీ ..తదితరుల పాటలు వింటూ సాధన చేసిన వాడిని. ఆ తర్వాత వారితో గొంతు కలపడం మహద్భాగ్యం కదా?
ఆస్తికవాదులై ఉండీ జ్యోతిష్యులను, జాతకాలను నమ్మరట…?

ఇక్కడ ఆస్తికవాదానికి, జాతకాలు నమ్మకపోవడానికి సంబంధం లేదు. ఏదైనా నిర్మాణాత్మకంగా ఉండాలి. జాతకాలను విమర్శించను. మానవ ప్రయత్నాన్ని మానవద్దంటాను. మన ప్రయత్నం లేకుండా జాతకాలే అన్నీ సమకూర్చి పెడతాయనుకుంటే ఎలా? సుడిగాలిలో దీపం పెట్టి ‘దేవుడా నీదే భారం’ అనడం సమంజసమా? నా సంగతే చూస్తే… నా చిన్నతనంలో ఒక జ్యోతిష్యుడి మాటలు వినివుంటే ఇప్పుడు ఈ స్థాయికి చేరేవాడిని కాదేమో…!నేను సినిమాల్లో రాణించలేనని ఆయన చెప్పారు. ‘మీరు చెప్పింది యధాతథంగా జరుగుతుందా?’ అని ప్రశ్నిస్తే, ఒకటి రెండు సార్లు జరక్కపోవచ్చని సమాధానమిచ్చారు. ఆ ‘ఒకటి రెండు సార్లలో ఇదెందుకు ఉండకూడదు’ అనిపించి ప్రయత్నించాను.

సినిమా మాధ్యమంపై రకరకాల వ్యాఖ్యలు ఉన్నాయి…
అవును ఉన్నాయి. అప్పుడప్పుడో, అక్కడక్కడో వచ్చే సాహిత్యాన్ని బట్టి ఈ మాధ్యమాన్ని తక్కువగా అంచనా వేయడం సబబు కాదనుకుంటాను. ఒక విషయాన్ని సులువుగా జనానికి చేర్చగల శక్తిమంతమైన మాధ్యమం ఇది. సాహిత్యంలో మార్పు వచ్చిన మాట నిజిమే. అయితే సినిమా నిర్మాణం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వ్యాపారం అందులో ఒకటి. ఒకవేళ సినిమా సాహిత్యంలోనే విలువలు లేవనుకుంటే దశాబ్దాల క్రితం నాటి పాటలు ఆ’పాత’మధురాలుగా ఎలా మనగలుగుతాయి? మారుతున్న కాలంతో పాటే సినీ సంగీత సాహిత్యాలునూ.

అదీకాక, తరానికి తరానికి అంతరం ఉన్నట్లే అభిరుచులు మారుతుంటాయి. కాలానుగుణంగా అన్నీ మారుతున్నప్పుడు సంగీత సాహిత్యాలకు మాత్రం మినహాయింపు ఎందుకుంటుంది? నేనెప్పుడూ చెబుతుంటాను- వైవిధ్యం కోసం భగవంతుడే కాలాన్ని ఆరు రుతువులుగా విభజించాడు. అయితే ఎన్ని మార్పులు వచ్చినా సంగీతానికి సంబంధించినంత వరకు మాధుర్యానికే(మెలోడీ) పెద్ద పీట వేయాలి. మాధుర్య రహిత సంగీతం రసహీనంగా ఉంటుందని నా ప్రగాఢ నమ్మకం.

కోపంగా పాడే పాటల్లోనూ మాధుర్యమే ప్రధానాంశంగా ఉండాలి. ఇప్పుడూ మంచి పాటలు వస్తూనే ఉన్నాయి. కాకపోతే అరుదుగా..! సత్తా ఉన్న కవులున్నారు. తీయగల నిర్మాత దర్శకులున్నారు. మంచి గాయకులున్నారు. ఆదరించే రసజ్ఞ ప్రేక్షక శ్రోతలున్నారు. మరి మాధుర్య గీతాలు వెనకబడి పోవడంలో లోపం ఎక్కడో అంతుపట్టదు. సినిమా పాట ఎన్ని పోకడలు పోయినా మాధుర్యానికి పట్టం కట్టాలన్నది నా ఆకాంక్ష. ఆ సమయం వస్తుందని నా ఆశ.

ఆరవల్లి జగన్నాథస్వామి

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

2 Responses to చిగురాకుల ఊయలలో ‘ఇల’ మరిచిన ఓ చిలుకా..

 1. TVS SASTRY అంటున్నారు:

  స్వర్గీయ పి.బి. శ్రీనివాస్ గారిని గురించి నేను వ్రాసిన వ్యాసం april నెల ‘యువ యక్షిణి’ అనే పత్రికలో ప్రచురించబడింది. దాని పిడిఎఫ్ ను జతచేస్తున్నాను.

  భవదీయుడు,
  టీవీయస్.శాస్త్రి

 2. TVS SASTRY అంటున్నారు:

  దయచేసి మీ మెయిల్ id ని తెలుపగలరు.
  భవదీయుడు,
  టీవీయస్.శాస్త్రి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.