జ్ఞానపీఠ రావూరి
తెలుగు సాహితీవేత్తకు మరోసారి జ్ఞానపీఠం గుర్తింపు లభించింది. ప్రముఖ తెలుగు రచయిత డాక్టర్ రావూరి భరద్వాజను కేంద్ర ప్రభుత్వం సాహిత్యంలో అత్యున్నత స్థాయి జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపిక చేయడం తెలుగువారు నిజంగా గర్వించదగిన విషయం. ఆయన రాసిన ‘పాకుడు రాళ్లు’ గ్రంథానికి మూడున్నర దశాబ్దాల తరువాత 2012 సంవత్సరానికి గాను ఈ అవార్డును ప్రకటించింది. ‘జీవితంలో సంపన్నుడు కాకపోవడం పెద్ద విషాదమేమీ కాదు. ప్రేమించబడకపోవడం, తనను ప్రేమించేవారు ఎవరూ లేకపోవడం మాత్రం విషాదమే’ అని ‘పాకుడు రాళ్లు’ గ్రంథంలో ఆయన కథానాయికతో అనిపించడం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. చలన చిత్ర ప్రపంచంలో చిన్న తారలు ఎదుర్కునే కష్టనష్టాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ఆయన నవల రాసిన తీరు నిజానికి జ్ఞానపీఠ పురస్కారానికి మించింది. 1971లో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు, 1988లో డాక్టర్ సి. నారాయణ రెడ్డికి ఈ అత్యున్నత సాహితీ పురస్కారం లభించింది.
తన సాహితీ జీవితంలో 500కు పైగా కథానికలు, 19 నవలలు, అనేక శృంగార కథలు, బాలల కోసం ఏడు నవలికలు, 3 వ్యాస సంపుటాలు, జీవిత కథలు, డిటెక్టివ్ నవలలు, 33 వైజ్ఞానిక వ్యాసాలు, 8 నాటకాలు, మొత్తం మీద 150కి పైగా పుస్తకాలు రాసిన 86 ఏళ్ల రావూరి భరద్వాజను జ్ఞానపీఠ్ అవార్డు కమిటీ ఈ అవార్డుకు ఎంపిక చే సింది. ఏడవ తరగతి వరకే సాంప్రదాయిక చదువులు చదివిన భరద్వాజ ఆ తరువాత ప్రపంచాన్ని విస్తృతంగా చదివారు. ఆయన రాసిన పుస్తకాలు అనేక విశ్వవిద్యాలయాల్లో పాఠ్య పుస్తకాలయ్యాయి. ఆయన సాహిత్యంపై పరిశోధనలు చేసి పిహెచ్.డిలు సంపాదించిన వారెందరో ఉన్నారు. జీవితంలో ఆయన అనేక ఒడిదుడుకుల్ని చూశారు. అయినప్పటికీ ఎంతో పట్టుదలతో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించారు. ఆయన రాసిన కాదంబరి, కౌముది, పాకుడు రాళ్లు, జీవన సమరం, ఇనుప తెర వెనుక వంటి గ్రంథాలు ఇంగ్లీషు భాషలోకే కాక, అనేక భారతీయ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి.
కథలు చెప్పడంలో, కథలు అల్లడంలో ఆయనకున్న ప్రావీణ్యం అసమానమైంది. ఆయనలో సామాజిక స్పృహ ఎక్కువ. ఆయన గ్రంథాలలో మానవీయ విలువలు ప్రాధాన్యం పొందుతుంటాయి. ఆయనకు ఇంతకు ముందు సాహిత్య అకాడమీ అవార్డు, సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు, తెలుగు అకాడమీ అవార్డు, త్రిపురనేని గోపీ చంద్ అవార్డు, బాల సాహిత్య పరిషత్ అవార్డు వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలెన్నో లభించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనను డాక్టరేట్‌తో సత్కరించాయి. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు జ్ఞానపీఠ్ అవార్డుకు సరిసమానమైన లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డు కూడా ఆయనకు లభించింది.
‘జీవన సమరం’ పేరుతో ఆయన 52 వృత్తుల గురించి 52 వారాల పాటు ఓ దినపత్రికలో ధారావాహికంగా రాసిన కథలు పాఠకులను బాగా ఆకట్టుకున్నాయి. భార్య మరణించిన తరువాత ఆయన ఆమె జ్ఞాపకాలతో రాసిన స్మృతి కావ్యం ఎటువంటివారికైనా మనసుకు హత్తుకుపోతుంది. గొర్రెల కాపరిగా, పేపర్ బాయ్‌గా, కంపోజర్‌గా, ఆ తరువాత జర్నలిస్టుగా(ఆకాశవాణిలో) వివిధ వృత్తులతో జీవితాన్ని ముందుకు నడిపించిన భరద్వాజ చివరికి రచయితగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తెలుగు సాహిత్యంలో చలం, తరువాత ఆ కోవలోని గొప్ప రచయితగా పేరుపొందిన భరద్వాజ తన రచనల ద్వారా జీవిత కాలమంతా పేదరికంపై పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ‘పేదరికం, అవమానాలు, చదువు, అవసరాలు నాకు పుట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఉపాధ్యాయులే’ అంటారాయన. ‘నన్నూ, నా ఆకలినీ తృప్తి పరచడానికే నేను రచనా వ్యాసంగాన్ని చేపట్టాను’ అని కూడా చెబుతారాయన. తనకు అవార్డుల ద్వారా వచ్చిన సొమ్మును ఆయన ఎప్పటికప్పుడు తన శ్రీమతి కాంతమ్మ, భరద్వాజ ట్రస్టుకు మళ్లిస్తూ పేద విద్యార్థులకు ఏటా రూ. 5,000 చొప్పున అవార్డుగా అందజేస్తున్నారు.
విశ్వనాథ సత్యనారాయణ తరువాత 17 ఏళ్లకు సి. నారాయణ రెడ్డికి ఈ జ్ఞానపీఠ అవార్డు రాగా, ఆ తరువాత 25 ఏళ్లకు భరద్వాజకు ఈ అవార్డు రావడం నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఇంతవరకూ దేశంలో 48 మందికి జ్ఞానపీఠ పురస్కారాలు లభించగా అందులో ముగ్గురు తెలుగువారికి మాత్రమే ఈ పురస్కారం దక్కడం తెలుగువారి పట్ల అవార్డు కమిటీకి ఉన్న చులకన భావానికి అద్దం పడుతోంది. గతంలో ఈ అవార్డు లభించిన యు.ఆర్. అనంతమూర్తి, ఓ.ఎన్.వి. కురూప్, జయకంఠన్, నిర్మల్ వర్మ, మహాశ్వేతా దేవి, కురతుల్లాయిన్ హైదర్, అమృతా ప్రీతమ్ వంటి హేమా హేమీలను తప్ప ఇతర భాషా రచయితలలో చాలామంది పేర్లను సాహితీవేత్తలు సైతం విని ఉండరు.
జాతీయ స్థాయిలో సాహితీ రంగాన్ని ప్రభావితం చేసిన శ్రీ శ్రీ, చలం వంటి మహా రచయితలను, దాశరథి వంటి ప్రతిభాశాలిని, జాషువా వంటి అద్భుత పద్య కవిని, పుట్టపర్తి వంటి పండితుడిని సైతం జ్ఞానపీఠ పురస్కార కమిటీ విస్మరించింది. నిజానికి బెంగాలీ, కన్నడ, హిందీ సాహితీవేత్తలకు దీటుగా, అంతకు మించీ తెలుగు సాహితీవేత్తలు అద్భుతమైన గ్రంథాలను తీసుకు వస్తున్నప్పటికీ, రెండు దశాబ్దాలకు ఒకసారి తప్ప తెలుగువారు ఈ కమిటీ దృష్టికి రాకపోవడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. ఈ ధోరణి వల్ల తెలుగువారికి నష్టం జరగకపోవచ్చు కానీ, జ్ఞానపీఠ పురస్కారం స్థాయిని తగ్గించినట్టే అవుతుంది.