తి.తి.దే వారి అన్నమయ్య ఉత్సవాలు
– వి.ఎ.కె.రంగారావు
పెద్ద పెట్టున ఏ రకం ఉత్సవాలు జరిపినా, జరిపింది ఎంతటి వారయినా దోషాలుండవచ్చు. అవి గమనించి యికపై జరగకుండా చర్య తీసుకోవటమే విజ్ఞత. కిందటి వర్ధంతి కార్యక్రమాలు ముఖ్యంగా రెండు చోట్ల జరిగాయి. ప్రసంగాలు అన్నమాచార్య కళా మందిరంలో ఉదయం 10.30 నుంచి 1.30 వరకు. సాయంత్రాలు యిక్కడ 6.00 నుంచి 9.00 వరకు రెండేసి సంగీత సభలు. మహతిలో 5.00 నుంచి 7.30 వరకు రెండేసి సంగీత సభలు, 7.45 నుంచి 9.00 వరకు నాట్యం, నాటకం.
నేనున్న మూడు రోజులలో (ఏప్రిల్ 10, 11, 12) రెండు రోజులు ప్రసంగాలు ఆలస్యంగా మొదలైనవి, ఎవరో ఒకరు రాలేదని. రాని వాడధ్యక్షుడైనా సరే, సకాలానికి రావడం అతని (రప్పించడం తి.తి.దే) బాధ్యత. రాని ఒక్కడి కోసం వచ్చిన వారి సమయం వృథా చేయడం దౌర్జన్యం. ఒకనాడధ్యక్షత వహించిన డా. టి. కోటేశ్వరరావు ముందే వచ్చి, 10.30 కంతా పిలవకపోయినా రంగమెక్కి కూచున్నారు. బ్రతికినట్లు తక్కిన వారూ చేరగా, సమయానికి కార్యక్రమం ప్రారంభమైనది. వేసవి కాలం కాబట్టి 10.00కే ప్రారంభించి 1.00 కంతా ముగిస్తే అందరికీ వీలుగా వుంటుంది. పిలిచిన వారినే పిలవడం, చెప్పినవే వేర్వేరు వక్తలతో చెప్పించడం అభియోగాలు కావు. వాస్తవాలు. ఒకే వ్యక్తి వేర్వేరు విషయాల గురించి మాట్లాడకూడదా, వేర్వేరు వ్యక్తులు ఒకే విషయం గురించి చెప్పని విషయాలు చెప్పగూడదా అన్న చొప్పదంటు ప్రశ్ననటుపెట్టి వేరు వేరు విషయాలూ, వ్యక్తులూ అన్న నియమం పెట్టుకొంటే మేలు.
అవినీతి కొడిగట్టిన వారిని పిలవటం తి.తి.దేకి ధర్మం కాదనే వారూ వున్నారు. ఎక్కడో జరిగిన దాని గురించి అధినేతలు పట్టించుకోలేదనుకోవడమెందుకు తి.తి.దేకే నామం పెట్టిన అవినేతలనే పిలవగా! ఈ అక్రమం జరిగిందన్న విషయం బయల్పడి ఋజువైన నెలలోనే యీ వ్యక్తినే పిలిచారు. ఇది ఆనాటి ఇ.ఓ. దృష్టికి తీసుకురాబడింది. ఈ సారీ అలాగే ఇ.ఓ. దృష్టికి తీసుకువస్తే, ఆ అధినేతకు పదవి పొడిగించారు. సమాధానం? “ఆ అవినీతిలో మేము పాలపంచుకోలేదు” అన్న మాటఏనా? అవినీతిపరులను యిలా వెనకేసుకురావటం అవినీతి కాదా? ఈ ప్రసంగాలను క్రితం కేసర్ల వాణి (అన్నమాచార్య పీఠం పెద్ద ఉద్యోగిని) నడిపేవారు.
ఇప్పుడాపని చిట్రాజు గోవింద రాజుది. ప్రసంగం చేసే వారిని పిలవడం ఎలా? ఒకసారి ఫోన్‌లో చెప్పి (డా. ఎల్.బి.శంకరరావుతో వాణి) తరువాత అతీగతీ పట్టించుకోకపోతే, గోవిందరాజు ద్వారా విషయాలు రాబట్టుకొని వెళ్లవలసి వచ్చింది. ప్రసంగాలకు పిలిచినవారికి యింత సమయం కేటాయిస్తున్నామని ముందుచెబుతున్నారా? లేదు. ఒకరోజు అధ్యక్షుల దీర్ఘ ప్రసంగం అయిన తరువాత, తక్కిన వారిని తొందరగా పదిహేను నిమిషాలతో ముగించమనడం ఏమి ధర్మం? ప్రసంగాలు జరుగుతుండగా పుచ్చుకొనే మొత్తాలకు రసీదులు సంతకాలు పెట్టించుకోవడం ఒక వికారం. ప్రారంభానికిముందో, ముగింపు తరువాతనో యీ పని చేయించుకొనడానికి ఎంత సేపవుతుంది! కార్యక్రమాలు నడిపే వాళ్లు వీరు. రంగస్థల నిర్వాహకుడంటూ (స్టేజి మేనేజర్) ఒకడుండ వద్దా? రంగస్థలానికి ముందు నుంచి ఎక్కివెళ్లే మెట్లు నిండా, కూర్చునే కుర్చీల చేతుల మీద, మందిరంప్రతిమూలలోను నివురు గప్పినట్లు దుమ్ము. శుభ్రం చేసే స్త్రీలు అక్కడే తచ్చాడుతుంటారు– బహుశః ప్రసాదాలకు కాబోలు– వారితో చెప్పి చేయించేవాడెవడు! ఇక బయట నుం చి వచ్చే ప్రేక్షకులకు సరియైన శౌచగృహాలుండాలా? లఘుశంక దీర్చుకొని చేతులు కడుగుకొందామంటే బేసినులో నీళ్లు రావు. మరుగుదొడ్ల గదుల్లోకి వెళ్లి కడుక్కోవాలి. ఆ క్షణానికి అది ఉపయోగంలో ఉంటే?
అన్నమయ్య కళామందిరంలో అన్నిటికంటే భయావహమైన లొసుగు; అగ్నిప్రమాదానికి అస్కారమిచ్చేది. ఈ మందిరానికి రెండు ప్రక్కల వసారాలున్నవి. ఒకటి ఉపయోగంలో వుంది. మరొకటి దిగ్బంధం చేసి, అందులో పనికిరాని వస్తువులు పడవేశారు. ప్రవేశ రుసుము వసూలు చేసే ప్రదర్శనశాలయితే యీ పని చట్ట విరుద్ధము. అనుమతి యివ్వరు. అయితే రుసుము వసూలు చేయడం లేదని అగ్నిప్రమాదాలు ఆగవు కదా! వెంటనే యీ చెత్తను తొలగించి తలుపులు తెరచే వీలు కల్గించాలి.
అగ్నిప్రమాదమంటే గుర్తుకు వచ్చింది. తి.తి.దే ముద్రణాలయం వెనుకనున్న పుస్తకాల గిడ్డంగి భవనంలో మొదటి అంతస్తుకి వెళ్లే మెట్లున్నవి. ఈ మెట్ల వెనుకప్రక్క ఖాళీ స్థలంలో ముద్రణాలయంలో తయారయే చెత్త, తొలగింపబడిన కాగితపు ముక్కలు యిత్యాది, అప్పుడప్పుడక్కడ కుప్పలుగా ఉంటాయి. ఇది కూడా పరశురామ ప్రీతి అయే అవకాశాలెక్కువ. ఇటువంటి చెత్త అక్కడ నిలవ ఉండకుండా చూసుకోవడం ముఖ్యం. అలా జరగకూడనిదే జరిగితే తి.తి.దే నిర్వాహక వర్గం తల తీసి ఎక్కడ పెట్టుకోవాలి? ఇక ఆ సభలకు వచ్చేదెవ్వరు? బయట ఎండ నుంచి ఉపశమనం పొందాలని వాయువనుకూలిత ప్రాంగణానికి (ఎ.సి. హాలు) వచ్చే దానయ్యలే ఎక్కువ. తక్కిన వారెందుకు రారు? పిలుపులందకపోవడం చేత. అక్కడి సిబ్బందిలో ఒకరన్న మాట “వేయడానికి వెయ్యి, రంగు రంగుల ఆహ్వాన పత్రికలు వేస్తారు. ఈసారి పంపడం మాత్రం ముప్ఫయ్యో, ముప్ఫై అయిదో పంపారు.
” ఇది నిజమా, దీనికెవరు బాధ్యులు? ఊరంతా వున్న విద్యాసంస్థలన్నిటికీ కాకపోయినా తి.తి.దే అనుబంధ సంస్థలకైనా పంపాలా? పంపితే వారెందుకు రారు? ఆహ్వానపత్రిక చూద్దామని అడిగితే రవ్వా శ్రీహరి వద్ద లేదు (వీరు తి.తి.దే ఎడిటర్-యిన్-చీఫ్)! ఇక మహతి గురించి. ఇక్కడ స్టేజి మేనేజర్ అవసరం మరింత. ఒక నృత్య కార్యక్రమం ముగిసిన పావుగంటకు అదే రంగంపై రెండవది ప్రారంభం కావాలంటే ముందుగానే దానికి తయారవ్వాలి. మొన్న జి.రేవతి గానం సకాలానికి (6.30) ముగియగా 6.45కి ప్రారంభం కావాలసిన ‘అన్నమయ్య సంకీర్తన విజయం’ గంట, ఒక్క గంట ఆలస్యంగా మొదలయ్యింది. అందులో త్యాగరాజు చూడడానికి పురందరదాసులా, పెద తిరుమలయ్య, సిక్స్‌పాక్ శివాజీలా వుండడం వేషరచనలో వింతలు. కొంతకాలం క్రిందట మహతిలో ఏర్పాటుచేసిన అన్నమయ్య కార్యక్రమం రద్దు చేసి (ఒక అంశాన్ని హఠాత్తుగా కళామందిరానికి తరలించి) తి.తి.దే ఉద్యోగస్థుల సమావేశం నిర్వహించారు. తరలించబడిన కార్యక్రమం వారు లబో, అది చూడాలని వచ్చినవారు దిబో మంటే వినేవారెవ్వరు?
మహతిలోనే నా కార్యక్రమాలు నడపమని అన్నమయ్య అడగడు, సరే. ఇలా కార్యక్రమం వుందని ముందు తెలియదా? ఆ ఉద్యోగస్థుల కార్యక్రమానికి తి.తి.దే పెద్దలే వచ్చారు. ఎందుకిలా జరిగిందని ఒక్కరు, ఒఖ్ఖరు అడిగారా? తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ అనుకొన్నారా?
ఇటువంటి ప్రవర్తన ఎవరికి గౌరవం? తి.తి.దే వారికా, అన్నమాచార్య పీఠానికా?
– వి.ఎ.కె.రంగారావు
(తి.తి.దే ప్రతి యేటా అన్నమాచార్య వర్ధంతులూ జయంతులూ తిరుపతిలో జరుపుతుంది. ఈ యేడు అన్నమయ్య జయంతి వచ్చే నెల 24 వ తేదీ)