మూకీల నుంచే మహిళా దర్శకులు

మూకీల నుంచే మహిళా దర్శకులు
భారతీయ సినీ చరిత్రలో మొదటి దర్శకురాలు ఫాతిమా బేగమ్

 


అన్ని రంగాల్లో మాదిరిగానే సినీ రంగంలోనూ ఆది నుంచీ పురుషాధిక్యమే. నటనా శాఖని మినహాయిస్తే సినిమాకి సంబంధించిన కొన్ని శాఖల్లో మహిళా ప్రాతినిథ్యం నామ మాత్రం కాగా, కొన్ని శాఖల్లో అసలు ప్రాతినిథ్యమే లేదు. అన్ని శాఖల వారినీ సమన్వయపరిచి, తన మేధోప్రతిభతో సన్నివేశాల్ని కల్పించి సినిమాకి ఓ రూపాన్ని తీసుకువచ్చే దర్శకత్వంలోనూ మహిళల సంఖ్య చాలా తక్కువ. ఇటీవలి కాలంలోనే వారి సంఖ్య ముఖ్యంగా హిందీలో కొంచెం కొంచెంగా పెరుగుతూ వస్తుండటం శుభ పరిణామం. అయితే భారతీయ సినిమాకి మూకీ యుగం నుంచే లేడీ డైరెక్టర్స్ ఉన్నారనే నిజం ఈ కాలం వారికి ఆశ్చర్యం కలిగించే విషయమైనా అది నిజం. భారతీయ సినీ చరిత్రలో మొదటి దర్శకురాలు ఓ ఉర్దూ మహిళ కావడం విశేషం. ఆమె ఫాతిమా బేగమ్. స్వతహాగా నటి అయిన ఆమె అర్దేషీర్ ఇరానీ, నానుభాయ్ దేశాయ్ వంటి దర్శకుల వద్ద సహాయకురాలిగా పనిచేశారు. ఆమె దర్శకత్వం వహించిన మొదటి మూకీ సినిమా ‘బుల్‌బులే పరిస్తాన్’ (1926). మూకీల కాలంలో బాగా పేరుపొందిన తారలు జుబేదా, సుల్తానా, షెహజాది ఆమె కుమార్తెలే.

భానుమతి ‘చండీరాణి’
తెలుగులో ఐదో దశకంలోనే సృజనాత్మకమైన దర్శకత్వ శాఖలో మహిళల ప్రాతినిథ్యం మొదలైంది. ఈ రోజుల్లో అంటే దర్శకత్వ శాఖలో పనిచేసిన వాళ్లు దర్శకురాళ్లవడం కనిపిస్తోంది కానీ ఆ కాలంలో నటనారంగంలో రాణుకెక్కిన తారలే దర్శకురాళ్లవడం గమనించదగ్గ అంశం. తెలుగులో మొదటి దర్శకురాలిగా భానుమతీ రామకృష్ణ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతి నటనకి వ్యాకరణం నేర్పిన తారగా అన్నాదురై చేత ప్రశంసలు పొందారు. గాయనిగానూ గొప్ప కీర్తి ప్రతిష్ఠలు పొందిన భానుమతి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘చండీరాణి’ (1953). దీన్ని కేవలం తెలుగులోనే కాక తమిళ, హిందీ భాషల్లోనూ ఆమె రూపొందించడం విశేషంగా చెప్పాలి. ఆ తర్వాత ఆమె ‘విచిత్ర వివాహం’, ‘అమ్మాయి పెళ్లి’, ‘మనవడి కోసం’ వంటి చిత్రాలు రూపొందించారు.

చివరిసారి ఆమె దర్శకత్వం వహించిన చిత్రం ‘అసాధ్యురాలు’ (1993). నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, రచయిత్రిగా తెలుగు సినిమాపై ఆమె వేసిన ముద్ర అనితరసాధ్యం. భానుమతి తర్వాత దర్శకురాలైన మరో తార సావిత్రి. తెలుగు సినీ సీమలోని రెండో తరంలో తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయిన సావిత్రిది స్వతహాగా అతి సున్నితమైన హృదయం. అందుకే ఆత్మ సంతృప్తి కోసం దర్శకురాలిగా మారిన ఆమె తొలిగా ఓ సున్నిత కథాంశంతో ‘చిన్నారి పాపలు’ (1968) చిత్రాన్ని రూపొందించారు. దీనితో గాయని పి. లీలను సంగీత దర్శకురాలిగా పరిచయం చేశారు. ఈ సినిమా మధ్యలో నిర్మాతలు చేతెలెత్తేస్తే, తనే డబ్బులు ఖర్చుపెట్టి చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత సావిత్రి ‘చిరంజీవి’, ‘మాతృదేవత’, ‘వింత సంసారం’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

మనదే ప్రపంచ రికార్డు
ఇక తెలుగు సినిమాని ప్రపంచ పటంపై నిలిపిన ఘటికురాలిగా విజయనిర్మల చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో ఏ భాషలోనైనా అత్యధిక చిత్రాలను (47) రూపొందించిన లేడీ డైరెక్టర్‌గా ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు పొందారు. ఇప్పటికీ ఆమె రికార్డు పదిలం. బాల నటిగా చిత్ర రంగంలో ప్రవేశించి, హీరోయిన్‌గా ఎదిగి, తారాపథంలో ఉండగానే దర్శకురాలి అవతారమెత్తి యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా తొలి చిత్రం ‘మీనా’ (1973)ను రూపొందించి విజయాన్ని అందుకున్నారు విజయ నిర్మల. ఆ తర్వాత కాలంలో పలు నవలల్ని తెరకెక్కించి, నవలా చిత్రాల దర్శకురాలిగా పేరుపొందారు. ఆమె దర్శకత్వం వహించిన వాటిలో దేవదాసు, హేమాహేమీలు, శంఖుతీర్థం, రామ్ రాబర్ట్ రహీమ్, భోగిమంటలు, అంతం కాదిది ఆరంభం, ముఖ్యమంత్రి, సూర్యచంద్ర, కలెక్టర్ విజయ, సాహసమే నా ఊపిరి, పుట్టింటి గౌరవం వంటి చిత్రాలున్నాయి. విజయనిర్మల తర్వాత అంత వేగంగా చిత్రాలు రూపొందించే దర్శకురాళ్లు ఆ తర్వాత ఏ భారతీయ భాషలోనూ రాలేదు. సరాసరిన ఏడాదికి ఆమె రెండు చిత్రాలు రూపొందిస్తూ వచ్చారు. ఆమె తర్వాత జీవిత, జయ బి., సుచిత్రా చంద్రబోస్ వంటి దర్శకురాళ్లు తెలుగులో కొన్ని చిత్రాలు రూపొందించారు.

తెలుగు కంటే ముందు తమిళంలోనే
తమిళంలో మొదటి దర్శకురాలిగా టి.పి. రాజలక్ష్మి చరిత్రకెక్కారు. తెలుగులో కంటే చాలా ముందుగానే ఆమె తన స్వీయ నవల ఆధారంగా ‘మిస్ కమల’ (1936) చిత్రాన్ని రూపొందించారు. ఆ తర్వాత ఆమె ‘మదురై వీరన్’ (1938) అనే మరో చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. రేవతి, సుహాసిని వంటి తారలు కూడా తమిళంలో కొన్ని సినిమాలు రూపొందించారు. బెంగాలీలో మొదటి దర్శకురాలు అరుంధతీ దేవి. ‘యాత్రిక్’ (1952)తో నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఆమె నలభై రెండేళ్ల వయసులో ‘ఛూటి’ (1967)తో దర్శకురాలిగా మారారు. తర్వాత ‘మేఘో రౌద్ర’, ‘పడి పషీర్ బర్మి బక్ష’, ‘దీపార్ ప్రేమ’, ‘గోకుల్’ చిత్రాల్ని రూపొందించారు. తన చిత్రాలతో ఆమె సమాజంలోని కొన్ని ఆచార వ్యవహారాల్ని తూర్పారబట్టడం గమనార్హం. న్యూవేవ్ డైరెక్టర్‌గా ప్రఖ్యాతుడైన బి.వి. కారంత్ జీవన సహచరి ప్రేమా కారంత్ పేరుపొందిన రంగస్థల కళాకారిణి. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ పొందిన ఆమె సినీ రంగంలో ప్రవేశించి మొదట్లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా, ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశాక, ‘ఫణియమ్మ’ (1983) అనే చిత్రాన్ని రూపొందించారు. కన్నడంలో ఓ మహిళ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం అదే. ‘బంధ్ జరోకే’ (1997) అనేది డైరెక్టర్‌గా ఆమె చివరి చిత్రం. తన చిత్రాల్లో మహిళల్ని ఆమె శక్తివంతంగా మలచిన తీరు విమర్శకుల ప్రశంసలు పొందింది.

ఆంగ్ల చిత్రాలకు ఊపు
భారతీయ సినిమాకి వన్నె తెచ్చిన దర్శకురాళ్లలో సాయి పరంజపే, అపర్ణా సేన్, మీరా నాయర్, దీపా మెహతా ముఖ్యులు. ‘జాదు కా సంఖ్’ (1974)తో డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సాయి పరంజపే స్పర్శ్, కథ, చష్మే బద్దూర్, సాజ్ వంటి సినిమాలతో భారతీయ సినిమాపై తనదైన ముద్రని బలంగా వేశారు. సత్యజిత్ రే ‘తీన్ కన్యా’లో నటిగా పరిచయమైన అపర్ణా సేన్ ’36 చౌరంఘీ లేన్’ (1981)తో డైరెక్టర్‌గా మారి, తొలి చిత్రంతోటే ఉత్తమ దర్శకురాలిగా జాతీయ అవార్డు పొంది సంచలనం సృష్టించారు. భారత దేశంలో ఇంగ్లీష్ సినిమాల నిర్మాణానికి ఆ సినిమా ఊతమిచ్చింది. ఆ తర్వాత ఆమె తీసిన పరోమా, సతి, యుగాంత్, మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్, 15 పార్క్ అవెన్యూ, ద జపనీస్ వైఫ్ వంటి చిత్రాలు ఆమెకి మంచి పేరు తీసుకొచ్చాయి.

సలామ్ బాంబే, మిసిస్సిపి మసాలా, కామసూత్ర, మాన్‌సూన్ వెడ్డింగ్, ద నేమ్‌సేక్ వంటి చిత్రాలతో మీరా నాయర్, ఫైర్, ఎర్త్, వాటర్, మిడ్‌నైట్స్ చిల్డ్రన్ వంటి చిత్రాలతో దీపా మెహతా భారతీయ సినిమాకి అంతర్జాతీయంగా వన్నె తెచ్చారు. కల్పనా లజ్మి, తనూజా చంద్ర వంటి వాళ్లు కూడా దర్శకత్వంలో తమ ముద్రను వేశారు. ప్రస్తుతం మేఘనా గుల్జార్, లీనా యాదవ్, జోయా అఖ్తర్, రీమా కగ్తి, కిరణ్ రావ్, ఫరా ఖాన్ వంటి లేడీ డైరెక్టర్లు ప్రధాన స్రవంతి చిత్రాలతో పురుషులకు ఏ మాత్రం తీసిపోమని నిరూపిస్తూ ముందుకు సాగుతున్నారు. రానున్న కాలంలో ఈ తరహా దర్శకురాళ్లతో భారతీయ సినిమా మరింత సంపన్నవంతం అవుతుందని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాబోదు.

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.