భలే సుందరం

భలే సుందరం


కొందరే జీవితాన్ని ఇంత సుందరంగా, ఈ సుందరంలా తీర్చిదిద్దుకోగలరు. ఈ కథనం చదివితే మా మాటతో మీరూ ఏకీభవిస్తారు. జికె సుందరం. ఒట్టి రంగు పిచ్చోడు. పాతికేళ్ళ కిందట పట్టుకున్న పిచ్చి ఇది. ఫ్యాను కింద చొక్కా నలగకుండా చేసుకునే బ్యాంకు ఉద్యోగం. గుట్టుగా ఉండొచ్చుకదా! పాటలంటాడు, పద్యాలంటాడు, ఏకపాత్రలంటాడు, పౌరాణికాలంటాడు, నాటికలంటాడు. పెళ్ళీపెటాకుల్లేవు, క్షణం తీరిక ఉండదు. పగలు బ్యాంకు, రాత్రి రిహార్సల్స్. అలసటే ఉండదా ఈ మనిషికి అనిపిస్తుంది చూస్తుంటే. ఉత్సాహం ఉరకలెత్తుతూ ఉంటుంది.

బళ్ళారి, గుంటూరు, శ్రీకాకుళం, హైదరాబాద్, కర్నూలు..ఎక్కడికైనా సరే సవాల్, ఎంత దూరమైనా ఎర్ర బస్సెక్కి వెళ్ళిపోతాడు, రంగు పూసుకుని నాటకం ఆడడానికి. అన్నా తమ్ముళ్ల మందలింపులు, అమ్మ ఆందోళన.. నాటకం ముందు బలాదూర్!

రంగు మాయ కమ్మిన మనిషి, మన్ను తిన్నవాడిలా మెత్తగా కనిపిస్తాడా..గొంతు విప్పితే కాటిసీనుతో టాపు లేచిపోద్ది. స్టేజి లైట్ల జిలుగు వెలుగుల వేడిలో ముఖానికి పూసుకున్న రంగు ధారలై కారుతున్నా, పలుకు పెళ్ళు మంటూనే ఉంటుంది,ఎండకి పేలే పెంకులాగ. జికె సుందరం పూర్తి పేరు గోపాల కృష్ణ సుందరం. పుట్టిందీ, చదువుతూ పెరిగిందీ నెల్లూరులో. డిగ్రీ అవగానే, పరీక్ష రాస్తే పిలిచినట్టుగా వచ్చేసింది భారతీయ స్టేట్ బ్యాంకులో ఉద్యోగం. తెల్ల కాలరు నౌకరీ. మంచి కట్నంతో, నగా నట్రాతో కోడలు గ్యారంటీ. తిరుపతి బస్సెక్కాడు ఉద్యోగంలో చే రడానికి. చేరింది ఉద్యోగంలోనే కానీ చేరువైంది మాత్రం రంగుల ప్రపంచానికి.

నోట్లు లెక్క పెట్టడం, నోటు పుస్తకాల్లో రాసుకోవడం- బ్యాంకంటే ఇంతే కాదని, ఏటా జరిగే కల్చరల్ పండగ చూశాక అర్ధమైంది. ఇంట్లో అమ్మ సహా అందరూ పాటలు పాడే వాళ్లే. ‘ఓహో..కిన్నెరసాని..’ అంటూ విశ్వనాధ గీతాన్ని అందుకున్నపుడు ఓహోహో అన్నారు అందరూ. ‘అలికిడైతే చాలు..’ అంటూ నెల్లుట్ల గీత లాలిత్యాన్ని ఒలకబోస్తే బ్యాంకు మైమరచింది. పాడుతా తీయగా, సరిగమలు..ఇంక దున్నుకున్నాడు. ఎర్రగా బుర్రగా నునులేతగా ఉన్న నెల్లూరు పిలగాడు భలే పాడుతున్నాడబ్బా అన్నారు.

బ్యాంకు ఉద్యోగులతో నాటకాలు వేయించే పని పడింది. నేర్పించేది శివప్రసాద్, ప్రస్తుతం చిత్తూరు ఎంపీ. ఒక సారి ఒక పాత్ర వేసే ఉద్యోగి రాలేదు. ‘అబయా..నువ్వే కట్టగూడదా ఆ వేషం’ అన్నాడాయన. ‘పుటుక్కు జర జర డుబుక్కు మే’ తొలి నాటకం. అట్లా పడ్డాడు రంగులో. నాటిక పూర్తయినా చప్పట్లు నిలవనివ్వలా. ఒకటా రెండా వందలాది నాటకాలు. బ్యాంకుని దాటేశాడు. తిరుపతి థియేటర్ ఆర్ట్స్, మహతి లలితకళాసమితి, విజయసారధి ఆర్ట్స్ అసోసియేషన్, సుబ్బరాజు నాట్య కళాపరిషత్..ఇట్లాంటి సంస్థలతో కలిసిపోయి ఊరూరూ తిరిగాడు, వేషాలేసుకుంటూ. శ్రీనివాస కల్యాణంతో బంగారు నంది కొట్టేశాడు. విరాటపాండవీయానికి రెండు నందులు. హరిశ్చంద్ర, ధృతరాష్ట్ర, అన్నమయ్య, రామదాసుల ఏకపాత్రలను ప్రదర్శించి ఎన్నో గరుడ అవార్డ్స్ అందుకున్నాడు.

శ్రీనివాసుడు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, అర్జునుడు, ధర్మరాజు, బృహన్నల, నక్షత్రకుడు, నారదుడు, లక్ష్మణుడు..వేషాలు మారుతూనే ఉన్నాయి. పరిషత్‌లకు పరుగులు. ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ గుణ నటుడు, ఉత్తమ సంగీతం, ఉత్తమ దర్శకత్వం- బహుమతుల సునామీ. బావా బావా పన్నీరు, తపస్సు, కొయ్యగుర్రం, మిస్డ్‌కాల్, శ్రీచక్రం, భేతాళప్రశ్న, విపులాచ పృధ్వి, భూమి గుండ్రంగా ఉంది, శ్రీకారం, స్వర్గారోహణం, నువ్వు ప్లస్ నేను మైనస్ ప్రేమ ఈజ్ ఈక్వల్ టూ పెళ్ళి, మొక్కు, సత్యాగ్రాహి..ఇంకా ఎన్నో సాంఘికాలు, సందేశాలు. పరుగు..పరుగు..పరుగు..అర క్షణం అన్నా ఆగితే కదా! ఒక అమ్మాయికన్నా లైనేయలేదు. వేసిన వాళ్ళకి పడలేదు. అబ్బే, తీరిక ఎక్కడిదీ? నాటకాల్లో బిజీ. ‘ఏం సుందరం.. మంచి సమ్మందం..’ అంటే, విరిసీ విరియని చిరునవ్వుతో సరి. భుక్తికి ఉద్యోగం, బతుకు నాటకం. ‘ఏం బా.. ఇంకింతేనా?’ అంటే, పెరుగులో దోస ముక్కలు వేసి ఆవ పొడి చల్లి కమ్మని పచ్చడి వడ్డిస్తాడు. తింటే, సుందరం వంటే తినాలనిపిస్తుంది. సుందరం లంచ్‌బాక్స్ విప్పేక గానీ, పెళ్ళాం ప్రేమతో వండి పంపిన కేరియర్లు తెరవరు బ్యాంకులో కొలీగ్స్.

అరవై నాలుగులో ఇరవై నాలుగు కళలయినా పండిస్తాడు జికె. సాంగ్స్, నాటకమ్స్, ఫ్రెండ్స్, పార్టీస్..వాట్ నాట్? వెనక్కి తిరిగి చూసుకోక ముందే అరవై నిండిపోయాయి. నిగ నిగలాడే ఆ మనిషిని చూస్తే నమ్మడం కష్టమే, ఈ నెలాఖరున రిటైరవతాడంటే. ‘సుందరయ్యా, తర్వాత మరేంటయ్యా?’ అంటే, రెండు చేతులూ ముఖం ముందు పెడతాడు, అప్పల్రాజు సినిమాలో సునీల్‌లా. అంటే, స్టేజీ మీద నుంచి తెర మీదకు దూకేద్దామనేనా? సరే, కానీ. ఆల్‌ది బెస్ట్ అబ్బాయీ!

సందేశం: ‘రంగస్థలం మీద నువ్వు పొందినదేమిటీ, పోగొట్టుకున్న దేమిటీ?’ అని సంధిస్తే, ‘పోగొట్టుకున్నది ఒంటరితనం. పొందినది ఆనందం’ అంటాడు గోపాలకృష్ణ సుందరం. ఇట్టాంటి పిచ్చి సుందరాలుండ బట్టే కదా, తెలుగు నేల మీద నాటకం ఈ మాత్రం అయినా బతికున్నది. సుందరం వర్ధిల్లు గాక! సుందరం పిచ్చి మరింత వర్ధిల్లు గాక!!

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.