ఫ్రేమ్స్ టు ఫేమ్
ఎన్టీఆర్ జీవిత విశేషాలను కొత్త కోణం నుంచి చూపించటానికి ఆయన కుమార్తె, కేంద్రమంత్రి పురందేశ్వరి చేసిన ప్రయత్నమే “ఫ్రం ఫ్రేమ్స్ టు ఫేమ్”. మంగళవారం ఢిల్లీలో విడుదల చేసిన ఈ పుస్తకంలో ఎన్టీఆర్ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన చిత్రాలతో పాటు ఆసక్తికరమైన లేఖ, టిట్‌బిట్స్ కూడా ఉన్నాయి.
నేల మీదే నిద్ర..
ఎన్టీఆర్ తరచూ నేల మీద పడుకుంటూ ఉండేవారు. ఆయనతో సన్నిహితంగా ఉండే ఒకాయన- ‘మీరు నేల మీద ఎందుకు పడుకుంటారు?’ అని అడిగారు. దానికి ‘అలవాటని’ ఎన్టీఆర్ సమాధానమిచ్చారు. నేల మీద పడుక్కొవటం కారణమేమిటని ఆయన ఎన్టీఆర్‌ను మళ్లీ అడిగారు. “మా చిన్నప్పుడు ఇంట్లో ఒకటే మంచం ఉండేది. దాని మీద మా నాన్న, అన్నయ్య పడుకునేవారు. నేను, అమ్మ చాప మీద పడుకునేవాళ్లం. ఎవరైనా చుట్టాలు వస్తే చాప వాళ్లకు ఇచ్చేసి నేల మీద పడుకునేవాడిని” అని సమాధానమిచ్చారు. ఎన్టీఆర్ హైదరాబాద్‌కు వచ్చేసిన తర్వాత ఆయన అన్నయ్య తరచూ వస్తూ ఉండేవారు. ఆయన ఎన్టీఆర్ తన గదిలోనే పడుకొనేవారు. రాత్రి ఎప్పుడైనా లేస్తే, మంచం చేసే చప్పుడుకు అన్నయ్య లేస్తారని- చాప వేసుకొనే పడుకొనేవారు.
మీసాల నాగమ్మ..
ఎన్టీఆర్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో ప్రముఖ కవి విశ్వనా«థ ‘రాచమల్లుని దౌత్యం’ అనే నాటికను విద్యార్థులతో వేయించారు. ఆ నాటికలో నాగమ్మ హీరోయిన్. ఆ పాత్రను ఎన్టీఆర్ చేత వేయించాలని విశ్వనాథ భావించారు. కాని ఎన్టీఆర్‌కు మీసాలు తీయటం ఇష్టం లేదు. విశ్వనాథకు ఎదురుచెప్పటం కూడా ఇష్టం లేదు. దీనితో మీసాలతోనే ఎన్టీఆర్ నాగమ్మ వేషం వేశారు. ఆ పాత్ర వేసినందుకు ఎన్టీఆర్‌కు మొదటి బహుమతి కూడా వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ను కొందరు మీసాల నాగమ్మ అని ఏడిపిస్తూ ఉండేవారట.
థాంక్యు విలువ..
ఎన్టీఆర్ ఇంట్లో కృష్ణ అనే డ్రైవర్ ఉండేవాడు. అతను ప్రతి రోజు ఎన్టీఆర్ పిల్లలను స్కూలుకు తీసుకువెళ్లి, తీసుకువచ్చేవాడు. ఒక రోజు కృష్ణ పిల్లలను తీసుకువచ్చిన సమయంలో ఎన్టీఆర్ బయట ఉన్నారు. ‘మీరు ఎప్పుడైనా కృష్ణకు థాంక్యు చెప్పారా?’ అని పిల్లలను అడిగారు. ‘కృష్ణ డ్రైవర్. అతనికి థాంక్స్ ఎందుకు చెప్పాలి?’ అని అడిగారట వాళ్లు. ఎన్టీఆర్‌కు చాలా కోపం వచ్చింది. ‘నేను కృష్ణకు జీతం ఇస్తున్నాను. మీరు ఇవ్వటం లేదు..మీరు అతను చేస్తున్న సేవకు కృతజ్ఞులై ఉండాలి..’ అని పిల్లల చేత అతనికి థాంక్యు చెప్పించారు.
ఒకే ఒక్కడు..
ఎన్టీఆర్ ఏకసంథాగ్రహి. ఆయనకు ఎన్ని పేజీల డైలాగ్లనైనా గుర్తుపెట్టుకొనే శక్తి ఉండేది. కొన్ని సార్లు ఎన్టీఆర్‌కు, దాసరికి పడేది కాదు. దాసరికి సెట్లోకి వచ్చిన తర్వాత డైలాగ్‌లు రాసే అలవాటు ఉండేది. కొన్ని సార్లు ఎన్టీఆర్ సహనాన్ని పరీక్షించటానికి దాసరి సెట్లోకి వచ్చిన తర్వాత 3 నుంచి 4 పేజీల డైలాగ్‌లను రాసి ఇచ్చేవారు. ఆ కాగితాలను ఎన్టీఆర్‌కు ఇచ్చి వెంటనే షాట్‌కు రెడీ చెప్పేవారు. ఎన్టీఆర్ ఆ తక్కువ సమయంలోనే డైలాగ్లన్నిట్నీ ఒక సారి చూసుకొని షాట్‌కు రెడీ అయిపోయేవారు. బహుశా చలనచిత్ర పరిశ్రమలో అంత వేగంగా డైలాగ్‌ను కంఠతా పెట్టగలిగిన వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమేనేమో!
మనవి: – పాఠకమహాశయులు నాపై చూపిన ఆదరణకు హృదయపూర్వకాభివందనములు. అపేక్ష కలవారందరికీ స్థలాభావం వల్ల సమాధానం యీయడం సాధ్యపడనందుకు విచారిస్తున్నాను. నా స్వవిషయాలలో చాలామంది ఒకే విధమైన ప్రశ్నలు పంపారు. వారికి యీ దిగువ విశదంగా వివరాలిస్తున్నాను.
నా పూర్తి పేరు: నందమూరి తారక రామారావు
మేము యిరువురు సోదరులం
స్వగ్రామం: గుడివాడ తాలూకా, నెమ్మికూరు
వయస్సు 28 సంవత్సరములు… వివాహమైంది… యిరువురు కుమాళ్లు. యీ రంగంలో నన్ను ప్రవేశపెట్టినది దర్శకులు శ్రీ ప్రసాద్ గారు
అడ్రస్: నెం.15. విజయరాఘవాచారి రోడ్డు,
త్యాగరాయనగరం, మదరాసు17.
ముఖ్యంగా నేనీ రంగంలో ప్రవేశించింది కళ కోసమా? ధనం కోసమా? అన్న ప్రశ్నలు చాలా వచ్చాయ్. యీ పరిశ్రమ వ్యాపార దృష్టితో కూడిన కళ. యీ విధంగా చూస్తే వ్యాపార దృష్టి గల యీ పరిశ్రమలో లగ్నమైన నటుల సేవ కూడ వ్యాపారయుతమైనదనే నా భావం కళాసేవ అంటే… కళను దేశం కోసం, సంఘ పురోభివృద్ధి కోసం. అభ్యుదయ ఆశయాలతో స్వార్ధరహితంగా ఆచరించే నిష్కామకర్మగాని వ్యాపారయుతమైన జీవనోపాధికాదేమో!!! కాని వ్యాపారదృష్టి గల యీ రంగంలో ఆదర్శ సేవానిరతులైన ధన్యజీవులు లేకపోలేదు.
కళ కళకోసమేనని తన జీవితమంతా కళాసేవకే అంకితం చేసిన అమరజీవి శ్రీయుత బళ్లారి రాఘవాచార్యులుగారు. ఘోర భూకంపాలకూ. దారుణ కరువుకాటకాలకూ లోనైన తోటి అభాగ్య దేశీయులను కళాపూరితమైన సేవానిరతితో ఓదారుస్తూ. దుఃఖాప్తయైన దేశమాత కన్నీరద్దుతూ. కళ-దేశంకోసం, కళ-మానవసేవకోసమేనని కళాప్రయోజనాన్ని ఆదర్శయుతంగా నిరూపిస్తున్న మహత్తరకళాజీవి శ్రీయుత పృధ్వీరాజ్కపూర్గారు… మొదలైనవారు.
నా విషయంలో ఆశయమేదైనా నేడు మాత్రం కళాసేవ చేయగల్గుతున్నానని చెప్పజాలను. ముందేమో!!!