ఆత్మగౌరవంలోంచే కళాకాంతులు -నటుడు కాకరాల -ఆంద్ర జ్యోతి -నవ్య లో

ఆత్మగౌరవంలోంచే కళాకాంతులు

 
పాత్ర నిడివి ఎంతని కాదు. చిన్న పాత్రే అయినా ఆ పాత్రకు ఎంత న్యాయం చేశారన్నదే ఏ నటుడికైనా కొలమానం అవుతుంది అంటారు ప్రముఖ రంగస్థల సినీనటులు కాకరాల. తాను నటించిన 200 సినిమాల్లో దాదాపు ఆయన పోషించినవన్నీ చిన్న పాత్రలే. కానీ, వాటన్నిటినీ సముచిత రీతిన పోషించారాయన. రంగస్థలం నుంచి సినీరంగంలోకి ప్రవేశించిన నటీనటుల్లో చాలా మంది తిరిగి రంగస్థలంలోకి ప్రవేశించరు. కానీ కాకరాల మాత్రం సినీరంగంలో ఉంటూనే సమాంతరంగా నాటకర ంగంలోనూ కొనసాగారు. దాదాపు ఐదు దశాబ్దాల కాకరాల నటజీవన ప్రస్థానంలోని కొన్ని అరుదైన సంఘటనలే ఈ వారం ‘అనుభవం’
ఇంట్లో కనిపించే దృశ్యాలే ప్రపంచానికి అద్దం పడతాయని అప్పట్లో నాకు తెలియదు. మా ఇంట్లో నేను చూసిన ఓ దృశ్యం ఆకాశమంత పెయింటింగ్‌లా ఎన్నో ఏళ్ల తరబడి నన్ను వెంటాడుతూనే ఉండిపోయింది. నాకప్పుడు మూడేళ్లు ఉంటాయేమో! ఒక రోజు నాన్నగారు మంచం మీద పడుకుని ఉన్నారు. ఆయన చాలా సీరియస్‌గా ఉన్నారు. అమ్మేమో ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తోంది? వాళ్లిద్దరి మధ్య జరిగిన ఘర్షణ ఏమిటన్నది ఆ వయసులో నాకు అర్థంకాని విషయమే. కానీ, ఆ దుఃఖానికి కార ణం ఏమై ఉంటుందనే ఆలోచన ఆ పసివయసు నుంచే నాలో పెరుగుతూ వచ్చింది. ఆ తరువాత ఎక్కడ ఏ స్త్రీ సంఘర్షణకు లోనవుతున్న దృశ్యం చూసినా నా మనోఫలకం మీద మా అమ్మ ముఖమే సూపర్ ఇంపోజ్ అవుతూ ఉండేది. రోజులు గడిచే కొద్దీ ఈ దుఃఖాల వెనుక స్త్రీ పట్ల సమాజ వివక్షే కారణమని తెలుస్తూ వచ్చింది. పురుషుడు ఏంచేసినా సమర్థింపు రావడం, స్త్రీ ఏంచేసినా విమర్శలు రావడం నన్ను బాగా కలవరపెట్టేది. ఈ వివక్షకు కారణమేమిటని నాకు తెలియకుండానే ఆలోచిస్తూ ఉండేవాడ్ని. అది నన్ను నిరంతరం వేధించే స్థితికి చేరుకుంది. స్త్రీ వివక్ష ఒక్కటే కాదు సామాజిక సమస్యల గురించిన ఆలోచన కూడా అప్పుడే మొదలయ్యింది. సరిగ్గా ఇదే సమయంలో పద్యాలమీద నాకున్న మమకారం కొద్దీ మా బావగారితో కలిసి లైబ్రరీకి వెళ్లడం అలవాటయ్యింది. ఒకరోజు అలా పుస్తకాలు తిరగేస్తుంటే రాహుల్ సాంకృత్యాయన్ రాసిన ‘ఓల్గా సే గంగా’ దొరికింది. అది అల్లూరి సత్యనారాయణ రాజు చేసిన అనువాదం. ఒక్కొక్కటిగా అందులోని మొత్తం కథలు చదివేశా.
అప్పటికి ఆ పుస్తకం నాకు మొత్తంగా అర్థమయ్యిందని కాదు గానీ, ఛాయామాత్రంగానైనా కొంత విషయం నా మనసును తాకింది. కొన్నాళ్ల తరువాత అదే పుస్తకాన్ని మరోసారి చదివినప్పుడు మరికొంత లోతుగా అర్థమయ్యింది. ప్రత్యేకించి అందులోని ఓ కథలోని పాత్రలతో రాహుల్ సాంకృత్యాయన్ “యజ్ఞవాదం, బ్రహ్మవాదం, రాజవాదం ఈ మూడూ తీరుబడిగా తినికూర్చునే వర్గాలకు తాత్విక సమర్థన నిచ్చే గ్రంథాలు మాత్రమే” అన్నమాట చెప్పిస్తాడు. ఆ మాట చదివిన నాటినుంచి నాలో ఏదో తెలియని అలజడి మొదలయ్యింది. నా ఆలోచనా విధానమే మారిపోయింది. దాని పర్యవసానం ఏమిటీ అంటే, అప్పట్నించి నాకు వైదిక సంప్రదాయాల మీద ఒక వ్యతిరేక భావన చాలా బలంగా ఏర్పడింది. ఆనాటి మా అమ్మ దుఃఖం నన్ను ఆలోచింపచేస్తే, ఈ బీజం నా ఆలోచనలకు పదును పెట్టింది. ఎన్నో వందల వేల సంవత్సరాలుగా మనుషుల్ని మౌఢ్యంలోకి నెడుతున్న భావజాలం మీద ఈ ఒక్క పుస్తకం ఎంత పెద్ద దెబ్బ కొట్టిందా అనిపించింది.
పదేళ్లు మాటలే లేవు
అస్తమానం గోడ కుర్చీ వేయించే ఆ రోజుల్లో నాకు చదువంటే భయం. అందుకే మా ఊళ్లో ప్రద ర్శించే నాటకాలు, తోలుబొమ్మలాటలు నన్ను అమితంగా ఆకర్షించేవి. అవే క్రమంగా నా దృష్టి నాటకాల వేపు వెళ్లడానికి కారణమయ్యాయి. వేరెవరో నాకు నాటకంలో పాత్ర ఇచ్చే పరిస్థితి లేని నా 12వ ఏట ‘జయంత జయపాల’ అనే జానపద పద్య నాటకాన్ని తీసుకుని నా మిత్రులతో కలిసి నేనే దర్శకత్వం వహించి నటించాను. అది నా మొట్టమొదటి నాటక ప్రదర్శన. ఆ తరువాత మా తెలుగు మాస్టారొకరు మరో రెండు నాటకాలు వేయించారు. అలా నాటక రంగం నా మనసులో పాతుకుపోయింది. మద్రాసుకు వెళ్లే ఆలోచనలు కూడా చేస్తున్న సమయంలో మా నాన్నగారు ఒక రోజు నన్ను పిలిచి “చూడు నువ్వు చదువుతావా చదువు. లేదా ఉద్యోగం చెయ్. రెండూ కాదనుకుంటే పౌరోహిత్యం చెయ్. అంతేగానీ నువ్వు నాటకాలు వేయడానికి మాత్రం వీలు లేదు” అన్నారు.
అందుకు సమాధానంగా నేను “నాన్నగారూ! నేను చదివినా ఇప్పుడు నాకు చదువు రాదు. చదివిన టెంత్ ఫారానికే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటే ఆ ఉద్యోగం చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. పౌరోహిత్యం నాకు ఇష్టం లేదు. నాటకాలు వేయడం నేను మానుకోలేను” అనేశాను. నా మాటలు ఆయనకు బాగా కోపం తెప్పించాయి. ఆ కారణంగా ఆయన నాతో పదేళ్లు మాట్లాడలేదు. నేనూ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. 1967లో నేను కొంత ప్రాధాన్యం గల పాత్ర పోషించిన మొదటి సినిమా ‘రంగుల రాట్నం’ విడుదలైంది. అదే సమయంలో విశాఖపట్నంలో నాటకం వేయడానికి వెళుతున్నాను. నాటకం అయిపోయాక రాజమండ్రి వస్తానని ఉత్తరం రాశా. నాటకం అయిపోయింది. వెనుదిరిగి వ స్తూ రైలు దిగగానే మా బావగారు ఎదురొచ్చారు. “ఏరా ఎప్పుడొచ్చావు. ఏనాడూ సినిమా చూడ ని మీ నాన్న రంగుల రాట్నం చూశాడట. నువ్వు విశాఖపట్నం వెళుతున్నావని తెలిసి మీ నాన్న నీతో మాట్లాడాలని గోదావరి స్టేషన్‌కు వచ్చాడ్రా. ఆయన వస్తూ ఉండగానే బండి కదిలిపోయిందిట. ఆ తరువాత రాజమండ్రి స్టేషన్‌లో ఎక్కువ సేపు ఉంటుందని అక్కడికి వచ్చాడట. అప్పటికి అక్కడా వెళ్లిపోయిందిట. చేసేదేమీ లేక ఇంటికి వచ్చేశాడట” అన్నాడు. నా మనసంతా ఆ్రర్దమైపోయింది. నేను వెంటనే రాజమండ్రిలోని మా ఇంటికి వెళ్లిపోయి ఆయనతో మాట్లాడాను. ఆయన కళ్లల్లో ఆ రోజు ఆనంద బాష్పాలు చూశాను. ఏ కళా ప్రక్రియ మా ఇద్దరినీ విడదీసిందో, ఆ కళా ప్రకియే ఆ రోజు మా ఇద్దరినీ కలిపింది. ఒక విషయంలో ఈ రోజున్న భావోద్వేగాలు ఎప్పటికీ అలాగే ఉంటాయనుకోవడం సరికాదని ఆ రోజు నాకు స్పష్టంగా తెలిసింది.
కృతజ్ఞాంజలి
రంగస్థలానికి సంబంధించినంత వరకు డాక్టర్ జి రాజారావు నాకు గురుతుల్యులు. ఆయన సినిమా రంగంలోకి వచ్చాక 1952 ప్రాంతంలో ‘ పుట్టిల్లు’ అనే సినిమా తీశారు. దానికి నిర్మాత, దర్శకుడు, ప్రధాన పాత్రధారి ఆయనే. అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ దశలో రాజారావు గారు రెండో సినిమా తీసే ప్రయత్నాల్లో పడ్డారు. ఫస్ట్ షెడ్యూలు అయ్యింది. ఆ తర్వాత బండి కదల్లేదు. తాననుకున్న ఏ ఒక్క ఆర్థిక వనరూ అందుబాటులోకి రాలేదు. ఆర్థికంగా బాగా నలిగిపోయాడు. ఆ స్థితినుంచి తనను తాను బ్యాలె న్స్ చేసుకోవడానికి పీపుల్ థియేటర్‌ను చేపట్టాడు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలికి మాతృసంస్థ. కొన్ని నాటక ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. కానీ, మానసికంగా రోజురోజుకూ కుంగిపోయాడు. చివరికి 1962లో అంటే, తన 49 ఏట హఠాన్మరణానికి గురయ్యారు. నా కళ్లముందే ఎవరో వచ్చి నా జీవన సమస్తాన్నీ కొల్లగొట్టుకుపోయారనిపించింది. కొన్ని ఏళ్ల పాటు ఆ విషాదం నుంచి తేరుకోలేకపోయాను. ఒక దశలో ఈ విషాదం దేనికీ పనికిరాదనుకుని ఏం చేసినా ఏం చేయకపోయినా ఆయన పేరిట మద్రాసులో ఒక కల్చరల్ అసోసియేషన్ పెట్టి నాలో శక్తి ఉన్నంత కాలం నాటకాలు వేస్తూ ఉండిపోయాను. మనం ప్రేమించిన వారి వైఫల్యాలకు ఎన్నికారణాలైనా ఉండవచ్చు. వారి మరణానికి ఏ కారణమైనా ఉండవచ్చు. ఆ కారణాల్ని తలుచుకుంటూ కుమిలిపోయే కన్నా వారి జ్ఞాపకార్థం వారు ప్రేమించేదాన్ని నిలబెట్టడమే సర్వోత్తమం అనుకున్నాను. అదే నన్ను ఆయన మరణం తాలూకు విషాదంలోంచి విముక్తుణ్ని చేసింది.
ఆశిస్తేనే నిరాశ
నాలో ఒక బలమైన పాజిటివ్ దృష్టిని నింపిన ఇద్దరిలో ఒకరు నిర్మాత, దర్శకుడు తాపీ చాణక్య. తాపీ చాణక్యతో నాకు అంతకు ముందు ఏ పరిచయమూ లేదు. కానీ, ఆచార్య ఆత్రేయ ‘భయం’ నాటకంలో నేను న టించడం చూసి ఆయన నా గురించి భోగట్టా చేశారట. ఆ విషయం తెలిసి ఏదైనా వేషం ఇస్తారేమోనని నేను ఆయన వద్దకు వెళ్లాను. నన్ను చూడగానే, “మీకోసమే చూస్తున్నా… రండి రండి. ‘భయం’ నాటకంలో మీ నటన చూశా. చాలా గొప్పగా చేశారు. మీరు ఏ పాత్రనైనా బాగా చెయ్యగలరు. నాకు ఆ నమ్మకం ఉంది. కానీ, వేషం కోసం మాత్రం మీరెప్పుడూ నావద్దకు రాకండి” అన్నాడు. ఆ మాటతో అప్పటిదాకా నాలో ఉన్న ఉత్సాహమంతా చప్పున చల్లారిపోయింది. నా ముఖంలోకి చూస్తూ “నేనిలా మాట్లాడినందుకు మీరు కష్టపెట్టుకుంటారని నాకు తెలుసు. కాని సినిమా పరిశ్రమ స్వభావమేమిటో మీకు తెలిసి ఉండడం మంచిది. సినిమా ఫైనార్సర్స్ దగ్గరినుంచి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్‌లను సప్లై చేసే వారిదాకా ఉండే అన్ని అంతరాల్లోనూ వాళ్ల వాళ్లకు కావలసిన మనుషులు ఉంటారు. ఒక్కొక్కసారి ఫైనాన్సర్ ఫెయిల్ కావ చ్చు. సరఫరా చేసే వారు సక్సెస్ కావచ్చు. ఇది ఈ పరిశ్రమ స్వభావం. మిమ్మల్ని ఇప్పుడు నేను పిలిచానని మీరు ఉత్సాహపడతారు. రేపు పొద్దున మీరు వేషం కోసం నా వద్దకు వస్తే నేను వేషం ఇవ్వలేని పరిస్థితిలో ఉండవచ్చు.
అందువల్ల మీరు ఎక్కువగా ఊహించుకుని ఆశపడొద్దు. ఇవి పరిశ్రమ సత్యాలు. నేను మీకు మంచి వేషం ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. ఆ విషయాలతో సంబంధం లేకుండా మనం మాత్ర ం స్నేహితులుగా కలుసుకుంటూ ఉందాం” అన్నారు. ఆ మాటల్ని నేనెప్పుడూ మరిచిపోలేదు. బి ఎన్ రెడ్డిగారు రంగుల రాట్నంలో ఇచ్చిన వేషం కన్నా ముందు నేను వేసిన చిన్న వేషాల్లో అత్యధిక శాతం తాపీ చాణక్య గారు ఇచ్చినవే. మౌలికంగా పరిశ్రమ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి, ఎన్ని కష్టాలొచ్చినా నేను మానసిక క్షోభకు గురికాకుండా ఉండడానికి ఆ మాటలు నన్ను కాపాడాయి. నాతో పాటే మద్రాసు వచ్చిన నా మిత్రులెందరో తీవ్రమైన ఆత్మక్షోభకు గురికావడం నాకు తెలుసు. అయితే నేనా స్థితికి చేరుకోకపోవడానికి జీవితం నుంచి గానీ, పరిశ్రమ నుంచి గానీ పెద్దగా ఆశించకపోవడమే ప్రధాన కారణం. ఏ రంగం నుంచైనా పెద్దగా మనం ఆశిస్తున్నామూ అంటే ఆ రంగానికి మనమేమీ చేయలేకపోతామనేది నా భావన. కళారంగం విషయంలో అయితే ఇది వెయ్యిరెట్లు నిజం.
ం బమ్మెర

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.