మా నీళ్లలోనే వెటకారం ఉంది శ్రీను వైట్ల.

మా నీళ్లలోనే వెటకారం ఉంది

‘అసలు గోదావరి జిల్లాలంటేనే సినిమా పిచ్చికి పెట్టింది పేరు. ఇక నేనెంత’ అంటున్నారు ప్రముఖ దర్శకులు శ్రీను వైట్ల. ఆయన సినిమాల్లో కామెడీ విలక్షణంగా ఉంటుంది. ‘వెంకీ, ఢీ, రెడీ, కింగ్, నమో వెంకటేశా, దూకుడు, బాద్‌షా వంటి చిత్రాల్లో కనిపించిన కామెడీ కి మూలం అంతా మా ఊళ్లోనే ఉంది’ అంటూ తన సొంతూరు కందులపాలెం గురించి చెబుతున్నారాయన.
మా ఊరు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని కందులపాలెం. చాలా తక్కువ మంది జనాభాతో చిన్న పల్లెటూరది. మాది పెద్ద కుటుంబం. మా తాత వైట్ల బుల్లి వీర్రాజు వ్యవసాయదారులు. ఆయనలాగే ఆయన ఐదుగురు కొడుకులూ వ్యవసాయమే చేసేవారు. తాతగారికి మా నాన్న మూడో సంతానం. అప్పట్లోనే ఆయన ఏజీ బీఎస్సీ వరకూ చదువుకున్నారు. అయినా ఉద్యోగాలు వద్దని పొలం పనులే చేసుకునేవారు. నాకిద్దరు పెదనాన్నలు, ఇద్దరు చిన్నాన్నలు. ఐదుగురు మగపిల్లలున్నా, ఒక్క ఆడపిల్లయినా లేకపోతే ఇంటికి అందమే లేదంటూ మా నాన్నమ్మ ఒకమ్మాయిని తీసుకొచ్చి పెంచుకుంది. ఆమే మాకు మేనత్త. చెప్పొచ్చేదేమంటే, అన్నదమ్ముల ఐదుగురి ఇళ్లూ ఒకే కాంపౌండ్‌లో ఉండేవి.

పేరుకి ఇళ్లు విడివిడిగా ఉండేవేగాని, ఎప్పుడు చూసినా మా కుటుంబం అంతా ఒక్కచోటనే ఉండేది. మాదొక్కటేకాదు, అప్పట్లో పల్లెటూళ్లలో చాలా కుటుంబాలు అలాగే ఉండేవనుకుంటా. ఉమ్మడిగా ఉండటంలోని సరదాలు, సంతోషాలు అనుభవించి తెలుసుకోవలసిందేగాని, ఆ మాధుర్యం మాటల్లో చెప్పలేనిది. అలాగని ఏదో సినిమాల్లో చూపించినట్టుగా ఎప్పుడు చూసినా నవ్వుతూ తుళ్లుతూ మాత్రమే ఉంటారని కాదు. అంతమంది కుటుంబసభ్యులున్నాక చిన్నాచితకా అలకలు, గొడవలు కూడా ఉంటాయి. కానీ అవీ అందంగానూ ఆత్మీయంగానూ ఉంటాయి తప్ప సీరియస్‌గా ఉండవు. నన్నడిగితే పెద్ద కుటుంబాల్లో పుట్టి పెరగడం ఒక అదృష్టమనే అంటాను. నా కుటుంబ నేపథ్యం నామీద ఎంత ప్రభావం చూపించిందంటే – నా ప్రతి సినిమాలోనూ కుటుంబమంటే అంత పెద్దదే చూపిస్తాను.

అమ్మానాన్నలతో పాటు పెదనాన్నలు, మేనత్తలు, చిన్నాన్నలు, మేనమామలు, వాళ్ల కుటుంబాలు… ఇలా కళకళ్లాడుతూ చూపించడానికే ప్రయత్నిస్తాను. దానికోసం నేను బోలెడంతమంది నటులను తీసుకుంటాను. ఆప్యాయతలు నిండిన ఆనాటి వాతావరణాన్ని వెండితెర మీద మళ్లీమళ్లీ సృష్టించాలని ప్రయత్నిస్తుంటాను.

సెటైర్ కింగులు మావాళ్లు విడివిడిగా సంఘటన లే వీ నాకు పెద్ద గుర్తు లేవుగానీ, ఊళ్లో అందరూ అభిమానంగా ఉండేవారన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా నా మనసు మీద ముద్ర పడిపోయింది. ఊళ్లో ఎక్కువగా మా బంధువుల కుటుంబాలే ఉండేవి. కేవలం అందువల్లే అభిమానం అని కాదు. మా పొలాల్లో పనిచేసేవారు, ఇరుగుపొరుగులు… అందరూ ఒకరితోనొకరు చాలా ప్రేమగా, ఆత్మీయంగా మసలుకొనేవారు. వ చ్చిపోయే మనుషులతో మా ఇల్లే కాదు, మా ఊరుఊరంతా భలే సందడిగా ఉండేది.

అయితే రోజువారీ పలకరింపుల్లో, వ్యవహారాల్లో ఎంత వెటకారం ఉండేదంటే కొత్తవాళ్లెవరైనా చూస్తే వాళ్లకు ఈ మాటతీరు అర్థం కాక తికమక పడేంత. ఒక మాట విరుపుతో ఎంతో అర్థాన్ని తీస్తారు గోదావరి వాసులు. అసలు ఆ గోదావరి నీళ్లలోనే ఆ వెటకారం, హాస్యం ఉన్నాయనుకుంటా. చిన్నాపెద్దా అని లేకుండా అందరి ధోరణీ సెటైరేసినట్టే ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సెటైర్ కింగులు మా ఊరివాళ్లు. ఇది కూడా నా సినిమాల్లో ప్రతిఫలించాలనేది నా ఉద్దేశం. దానికోసమే నేను నా కథల్లో కామెడీ పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ పెడతాను.
నేనెక్కడ కొట్టానండీ, ఆయ్
నా చిన్నప్పుడు ఇంట్లో పెదనాన్న పిల్లలు, చిన్నాన్న పిల్లలు… ఇలా ఇంట్లో ఏడెనిమిది మంది మగపిల్లలం ఉండేవాళ్లం. మా అందరికీ నెలకోసారి క్రాపులు చెయ్యడానికి మంగలి తాతారావు ఇంటికి వచ్చేవాడు. క్రాపులు చెయ్యాలి, తర్వాత అందరికీ నీళ్లు పొయ్యాలి. అదీ ఆరోజు అతని పని. అందరూ బుద్ధిగా కానిచ్చేస్తే నేను మాత్రం అతన్ని అల్లరిపెట్టి వాకిలంతా పరిగెట్టించేవాణ్ని. ఒకసారి ఏమయిందంటే నా అల్లరి సహించలేక పెరట్లోకి నా వెనకాలే పరుగెత్తి పట్టుకుని ఒక్క జెల్ల ఇచ్చాడు. నేను వీధి వాకిట్లోకి వచ్చి మా తాతకు చెప్పాను. ‘నన్ను తాతారావు కొట్టాడు…’ అని. ‘అబ్బే, నేనెక్కడ కొట్టానండీ, అసలు నాకెక్కడ అందుతాడండీ మీవాడు… ఆయ్…’ అంటూ ఏమీ తెలియనట్టు బిల్డప్ ఇచ్చేశాడతను.

దాంతో మళ్లీ నాకే పడ్డాయి దెబ్బలు. ‘క్రాపింగ్ చేయించుకోరా అంటే పరుగులు పెట్టడమే కాకుండా అబద్ధాలు కూడా చెబుతున్నావురా…’ అని వాయించేశారు. చెప్పొచ్చేదేమిటంటే అబద్ధమైనా మంచి సెన్సాఫ్ హ్యూమర్‌తో, చక్కగా గోడ కట్టినట్టు చెప్పగలరు, కావలసిన పని చేయించుకోగలరు మావాళ్లు. ఎంత కష్టమొచ్చినా సరే, హాస్యాన్ని మాత్రం వదులుకోరు తూ.గో.జి. వాసులు. మా ఊరివాళ్లలో నాకు బాగా నచ్చే లక్షణం ఆ హాస్య ప్రియత్వమే.
డబ్బులు కొట్టేసి గోదావరి జిల్లాల్లోనే సినిమా పిచ్చి చాలా ఎక్కువ. దానిలో మా ఊరేం తీసిపోదు. చిన్నవయసులోనే నాకు సినిమాలంటే మక్కువ ఏర్పడిందంటే దానికి కారణం మా ఊరే. మా ఊరి నుంచి ద్రాక్షారామం నాలుగు కిలోమీటర్లు. అక్కడ మూడు థియేటర్లుండేవి. అక్కడకెళ్లి సినిమా చూడనివాడు ఊళ్లో ఒక్కడు కూడా లేడంటే న మ్మండి. మా చిన్నప్పుడు రిలీజ్ సినిమాలు వచ్చేవి కాదు. దాంతో మా కుర్రాళ్ల బ్యాచ్ అంతా ధైర్యం చేసి ఓ అడుగు ముందుకేసి రామచంద్రపురమో మండపేటో వెళ్లిపోయేవాళ్లం. మరీ కొత్త సినిమా వచ్చింది వచ్చినట్టు చూసెయ్యాలంటే మాత్రం కాకినాడ వెళ్లాల్సిందే. మా అన్నయ్యలు నాకు చెప్పకుండా సినిమా కార్యక్రమం పెట్టుకుంటే మాత్రం నాకు ఎలాగోలాగ తెలిసిపోయేది.

నేను పొలాలకు అడ్డం పడి పరుగెత్తి వాళ్లను వెంబడించి కలుసుకునేవాణ్ని. ‘ఎలాగూ ఇంత దూరం వచ్చాడు పాపం’ అనుకుని తర్వాత వాళ్లే సైకిలు మీదెక్కించుకుని తీసుకుపోయేవారు. అందరికన్నా నాకు సినిమా పిచ్చి మరీ ఎక్కువ. డబ్బులు అడిగితే ఇవ్వరని తెలిసి మా నాన్నమ్మ ఎక్కడ దాచుకుంటుందో కనిపెట్టి కొట్టేసేవాణ్ని. మా నాన్న జేబులోంచి కూడా రెండుమూడు సార్లు తీసుకుని సినిమాలకు చెక్కేస్తే తర్వాత తెలిసిపోయి ఉతికేశారు.
తోట మాదే, దెబ్బలు నాకే మా ఊళ్లో బడి ఐదో తరగతి వరకే ఉంది. తర్వాత ఏడో తరగతి వరకూ హసన్‌వాడలో చదువుకున్నా. హైస్కూలంటే ద్రాక్షారామమే. మా ఊరి నుంచి పద్నాలుగు పదిహేను మంది కుర్రాళ్లం ఆ బడిలో చదివేవాళ్లం. అందరం ఉదయాన్నే ఊళ్లో ఓచోట కలుసుకుని అక్కడ నుంచి సైకిల్ రేసులు పెట్టుకునేవాళ్లం. స్కూలుకు ముందు ఎవరు వెళ్తే వాళ్లే ఆరోజు విజేతలు. అలాగే ఊళ్లోని పిల్లలంతా కలిసి గోళీకాయలు, కబాడీ వంటివి బాగా ఆడుకునేవాళ్లం. మా అన్నయ్యలెవరైనా చూస్తే బలవంతంగా ఇంటికి తీసుకుపోయేవారు.

ఊరు చుట్టూరా గోదావరి కాలవలు, చెరువులు ఇన్ని ఉండగా పిల్లలెవరైనా ఈతలు కొట్టకుండా ఉంటారా? వేసవి వచ్చిందంటే చాలు ఈదడమే మా పని. ఒకసారి నేను ములిగిపోయినంత పనయింది. అప్పుడు మా అన్నయ్యే నన్ను జుట్టుపట్టుకుని పైకి లాగి రక్షించాడు. పిల్లలంటే వేసవిలో మావిడి చెట్లెక్కడం, దెబ్బలు తినడం మామూలే. కానీ నా సంగతి దీనికి విరుద్ధం. తోటలు మాకే ఉండగా నేను వేరేవాళ్ల తోటల్లోకి వెళ్లి దొంగతనంగా కోసుకుతినాల్సిన పనేమీ లేదు. అయితే ‘వీడు ఊళ్లోని పిల్లలందర్నీ పోగేసి మన తోటల్లోకి దండయాత్ర చేస్తున్నాడు’ అని మా ఇంట్లోవాళ్లే నన్ను వాయించేసేవాళ్లు.

ఆచార్యుల వైద్యం మా ఊళ్లో చాలా ఏళ్ల నుంచీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. అక్కడ స్వామివారికి కల్యాణం చేసే సమయంలో తీర్థం జరుగుతుంది. మా చిన్నప్పుడు తీర్థమంటే ఎంతో సంబరం. రకరకాల అంగళ్లు, చిత్రవిచిత్రమైన గారడీలు… పూర్తిగా రెండు రోజులు వినోదమే వినోదం. ఆ రెండు రోజులూ కాళ్లరిగేలా ఊరంతా తిరిగేసి తీర్థం అయిపోయిన మర్నాడు ఒళ్లు తెలియకుండా నిద్రపోయేవాళ్లం. వేంకటేశ్వరస్వామి దేవాలయం ఎదురుగా కోనేరుంది. దాని ఒడ్డున బొగడ చెట్లుండేవి. ఊళ్లోని పిల్లలం ఎక్కువగా కోనేటి ఒడ్డున ఆ చెట్ల నీడల్లో ఆడుకునేవాళ్లం. ఆ చెట్లెక్కి బొగడకాయలు తినేవాళ్లం. మా ఊళ్లో ఆచార్యులని ఒక సుప్రసిద్ధ వైద్యులుండేవారు. మానసిక రోగాలను కుదర్చడంలో ఆయనకు చాలా పేరుండేది. దాంతో చాలా దూరాల నుంచి మానసిక రోగులు మా ఊరొచ్చి కొన్నాళ్ల పాటు ఉండి, ఆచార్యులు గారిచ్చిన మందులు తీసుకుని నయమయ్యాక వెళ్లేవారు. అలాంటివారు ఎక్కువగా కోనేటి దగ్గరే ఉండేవారు. మేం అక్కడ ఆడుతుంటే గ్రామస్థుల్లో పెద్దవాళ్లు ఎవరో ఒకరు చూసి కేకలేసేవారు – ‘పిచ్చాళ్ల దగ్గర ఏంట్రా ఆటలు, ఇళ్లకి పదండి’ అని.

కానీ ఎందుకో మేం మాత్రం వాళ్లతో చాలా మాట్లాడేవాళ్లం, నిర్భయంగా ఆడుకునేవాళ్లం. ఊళ్లో రామాలయం ఒకటి ఉండేది. అక్కడ శ్రీరామనవమి కూడా వైభవంగా జరిగేదిగానీ, వేంకటేశ్వర తీర్థానిదే ఫస్ట్ మార్కు. అదిగాక అమ్మవారి తీర్థాలు కూడా బాగా చేసేవారు గ్రామస్థులు. పూజలు, బలులు, విందువినోదాలతో అప్పుడు కూడా చాలా సంబరంగా ఉండేది ఊరంతా. ఇక పండగల్లో సంక్రాంతి అంటే చెప్పలేనంత ఇష్టం మాకు. నెల రోజుల ముందు నుంచే కలప సేకరించడానికి పోటీలు పడేవాళ్లందరూ. భోగి రోజు ఎవరు పెద్ద మంట వేస్తే అంత గొప్పన్నమాట. దానికోసం చలిని కూడా లెక్కచెయ్యకుండా తెగ తిరిగేసి చెక్క దుంగలు సేకరించేవాళ్లం. ముఖ్యంగా రాత్రిపూట వెళ్లి చిన్నచిన్న తాటి దూలాల్ని ఇంటికి తీసుకురావడం గొప్ప సాహసోపేతంగా అనిపించేది.

సంక్రాంతి పండగకు ముందు, పంట కోతలకు వచ్చాక దానికి కాపలాగా పొలాల్లోనే పడుకుంటారు కొందరు. మా అన్నయ్యలు వెళ్తే నాకూ అలా వెళ్లాలని ఉండేది. కానీ నేను చిన్నవాణ్నని, చలి, పురుగూపుట్రా ఉంటే చూసుకోలేనని నన్ను వెళ్లనిచ్చేవారు కాదు మా నాన్న. ఇంట్లో అందరూ పడుకున్నాక నేను చప్పుడు చెయ్యకుండా లేచి మా అన్నయ్యలున్న దగ్గరికి వెళ్లిపోయేవాణ్ని. ఉదయాన్నే మళ్లీ బడితె పూజ జరుగుతుందన్న భయం లోపల పీకుతున్నా, రాత్రికి మాత్రం ఆ పని చెయ్యకుండా ఉండలేకపోయేవాణ్ని.
మట్టితో అనుబంధం
ఇప్పటికీ ఏడాదికి రెండుసార్లు తప్పనిసరిగా మా ఊరెళతాను. ముఖ్యంగా వేంకటేశ్వరస్వామి తీర్థం జరిగేటప్పుడు. కానీ ఎందుకో మా చిన్నప్పుడున్నంత సందడిగా ఊరు ఇప్పుడు లేదనిపిస్తుంటుంది. ఊరికి వెళ్లిన ప్రతిసారీ నన్ను చూడటానికి పలకరించడానికి కొంతమంది వస్తారు. వాళ్లతో కలిసి ఊళ్లోని వీధులన్నీ చుట్టిరావడం నాకిష్టం.

అయితే అలా నడుస్తున్నప్పుడు చాలా ఇళ్లు తాళం పెట్టి ఉండటాన్ని గమనిస్తాను. చదువులని, ఉద్యోగాలని మా ఊరివాళ్లు చాలామంది దగ్గర్లోని కాకినాడకు, హైదరాబాద్‌కూ తరలిపోయాక ఇప్పుడు అక్కడ దర్శనమిస్తున్నవి ఖాళీ ఇళ్లే. వాటిని చూసినప్పుడు నాకు మనస్సులో కలుక్కుమంటుంది. మా నాన్న మాత్రం ఒంటరిగా ఇప్పటికీ మా ఇంట్లో ఉంటున్నారు. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చి రెండ్రోజులుండి చూసి వెళ్లిపోతారు తప్ప ఇక్కడే ఉండటం ఆయనకిష్టం లేదు. నాకూ ఆ మట్టితో ఎంత అనుబంధం ఉందంటే నేను సినిమాల్లోకి చేరి తగినంత సంపాదించాక మొదట చేసిన పని మా ఊళ్లో పొలం కొనడమే.
అమ్మ గుర్తుగా ఏమైనా చేస్తా ఆటపాటల్లో మునిగితేలుతున్నా ఏడో తరగతి దాకా నేను తెలివైన విద్యార్థి కిందే లెక్క. నా ఎనిమిదో తరగతిలో మా అమ్మ గుండె సమస్యతో చనిపోయింది. అదొక తట్టుకోలేని షాక్ నాకు. దాంతో అప్పటి నుంచి నా అల్లరి అంతా ఆవిరయిపోయింది, చదువు కూడా నెమ్మదిగా తగ్గిపోయింది. మా అమ్మ పోయినప్పటి నుంచి మా నాన్నమ్మే నాకు అన్నీ అయింది. మొదట్లో చెప్పాను చూడండి, ఉమ్మడి కుటుంబం మంచిదని. ఆరోజు మాది ఉమ్మడి కుటుంబం కావడం వల్లే నాకు మేలు జరిగింది.

అంతగా ప్రేమించే అమ్మ లేని లోటు తెలియనివ్వకూడదని మా పెదనాన్నలు, చిన్నాన్నలు, వాళ్ల పిల్లలు… అందరూ తపనపడేవారు. అమ్మ జ్ఞాపకంగా నేను పుట్టిపెరిగిన ఊరికి ఏదైనా చెయ్యాలని తపనగా ఉంది. ఊరికి బాగా ఉపయోగపడే పనుల జాబితా ఒకటి రూపొందించాలని నా చిన్నప్పటి స్నేహితులను అడిగాను. వాళ్లు అదే పనిలో ఉన్నారు. ఏమేం చెయ్యాలో జాగ్రత్తగా నిర్ణయించుకున్నాక పనులు మొదలుపెడతాను.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.