నాన్న నేను కలిస్తే మా ఊరు : హీరో శ్రీకాంత్

నాన్న నేను కలిస్తే మా ఊరు : హీరో శ్రీకాంత్

June 16, 2013


పుట్టినూరూ కన్నతల్లీ అంటారు ఎవరైనా. కానీ హీరో శ్రీకాంత్ మాత్రం జన్మభూమీ, కన్నతండ్రీ అని కలవరిస్తున్నారు. ‘ఫాదర్స్ డే’ సందర్భంగా శ్రీకాంత్ చెబుతున్న సంగతుల్లో సొంతూరి సందడి, తండ్రి పట్ల అభిమానం రెండూ కలగలిసిపోయాయి. “నేను పుట్టింది కర్ణాటకలోని బసవపట్నం అనే ఊళ్లో. ఇది గంగావతి తాలూకా, కొప్పల్ జిల్లాలో ఉంటుంది. మా తాతగారిది చల్లపల్లి దగ్గర మేకావారిపాలెం. మా నాన్న పేరు మేకా పరమేశ్వరరావు. ఆయన మాత్రం తెనాలి దగ్గర ఎలవర్రులోనే పుట్టిపెరిగారు.

మా బంధుమిత్రుల్లో కొందరు అప్పటికే కర్ణాటకలోని తుంగభద్రా తీరంలో చవగ్గా వస్తున్నాయని పొలాలు కొని వ్యవసాయం చెయ్యడం ప్రారంభించారు. వారి ప్రభావంతో మా నాన్న కూడా కర్ణాటక దారి పట్టారు. మొదట మాన్వి అనే ఊరి దగ్గర యాభై ఎకరాలు కొన్నారట. అయితే అవి అంతగా నీటి వసతి ఉండే భూములు కావట. పైగా వరసగా మూడునాలుగేళ్లు వర్షాలు లేకపోయేసరికి తీవ్రంగా నష్టపోయారట. దాంతో వాటిని అమ్మేసి బసవపట్నానికి వచ్చేశారు. ఇదంతా నేను పుట్టకముందు జరిగిన సంగతి. బసవపట్నంలో ఇరవై ఎకరాలు కొన్నారటగానీ, నేను పుట్టి, నాకు ఊహ తెలిసేసరికి మాకున్నది పదెకరాల పొలం, జమ్మి కప్పిన గుడిసె ఇల్లొకటి.

ఇప్పుడు ఆటోలు అప్పుడు టాంగాలు

తెలుగునేల నుంచి వలస వెళ్లిన వారంతా అక్కడ తాము కొనుక్కున్న పొలాలకు సమీపంలోనే నివాసం ఉండేవారు. పైగా అందరూ దాదాపు ఒకేచోట ఉండటానికి ఇష్టపడేవారు. ఇలా ఉన్న తెలుగువారి ప్రాంతాలను ‘క్యాంపు’లనేవారు. చిరునామా బాగా తెలియడానికి పక్కనున్న ఊరి పేరు చేర్చి చెప్పేవారు. అలాగ మాది బసవపట్నం క్యాంపు అన్నమాట. మా ఊరనే కాదు, ఏ ఊరి క్యాంపయినా పదహారణాల తెలుగు పల్లెటూరనే లెక్క. నేను 1968లో పుట్టాను. అప్పటికి ఊళ్లో 40 – 50 తెలుగువారి ఇళ్లుండేవి. కనీసం నాలుగు వందల మంది జనాభా. పేరుకే కర్ణాటకలో ఉన్నాంగానీ మేమంతా తెలుగులోనే మాట్లాడుకునేవాళ్లం. తెలుగు మీడియమ్‌లోనే చదువుకున్నాం.

మాకు దగ్గరలో గంగావతిలో ‘శారదా హయ్యర్ ఎడ్యుకేషనల్ సొసైటీ’ వారి స్కూలుండేది. అక్కడే నేను ఏడో తరగతి వరకూ చదువుకున్నా. ఐదో క్లాసు వరకూ క్యాంపుల్లోని పిల్లలందరినీ చిన్నచిన్న గుర్రబ్బళ్లలో పంపేవారు స్కూలికి. ఇప్పుడు ఆటోల్లో పంపుతున్నట్టు. వాటిని టాంగాలనేవాళ్లు. ఒకోదానిలో ఐదారుగురు పిల్లలం కూర్చుని వెళ్లేవాళ్లం. ఎనిమిదో తరగతి నుంచి గొట్టిపాటి వెంకటరత్నం హైస్కూల్లోనే చదువు. అక్కడికి బస్సుల్లో వెళ్లొచ్చేవాళ్లం.

కాంతు చెడగొట్టేస్తున్నాడు
ఊళ్లో పిల్లలంతా కలిసే ఆడుకునేవాళ్లం. ఆడామగా తేడాలేం లేవు. చింతగింజలు, తొక్కుడుబిళ్ల, సబ్జాటలు, కోతికొమ్మచ్చి, కర్రాబిళ్లా, గోళీలు, బచ్చాలాట.. ఎన్ని ఆటలో. నాకు కొంచెం గ్యాంగు ఉండేది. నేను ఆడటానికి వెళ్లేప్పుడు వాళ్లందరిళ్లకూ వెళ్లి పిలుచుకుని వచ్చేవాణ్ని. దాంతో కొందరు తల్లిదండ్రులకు కోపం వచ్చి మా నాన్నకు చాడీలు చెప్పేవారు. ‘కాంతు మా పిల్లల్ని కూడా చెడగొట్టేస్తున్నాడు’ అని.

మా నాన్న ఇంటికొచ్చి ‘నీ ఆటలేవో నువ్వాడుకోక అందర్నీ ఎందుకురా పోగుచేస్తావు’ అనేవారు. ఒకటి రెండు రోజులు కామ్‌గా ఉండటం, మళ్లీ మనదారి మనదే. బసవపట్నం ఊరికి దగ్గరలో తుంగభద్ర ఎడమగట్టు కాలవ ఉండేది. అది చాలా పెద్దది. మా ఇళ్లకు కొద్ది దూరంలో మరో చిన్న కాలవ ఉండేది. రోజూ మా స్నానపానాదులన్నీ అక్కడే. ఈతలు, సరదాలు మరి చెప్పనవసరం లేదు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఆ కాలవకు నీరు ఆపేసేవారు. ఆ సమయంలో మాకు వినోదంగా ఉండేది. నీళ్లు అయిపోయే ముందు మా తుండు గుడ్డలను ఉపయోగించి చేపలు పట్టేవాళ్లం. రాళ్ల కింద చేతులు పెట్టినా దొరికేసేవి చేపలు.

పొడుగ్గా పాముల్లా ఉండే చేపలు పడినప్పుడు అది పామో చేపో తెలియక కొంచెం భయపడేవాళ్లం. నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడనుకుంటా, ఈ కాలవలానే ఉంటుందనుకుని పెద్ద కాలవలో దూకేశాను. దాదాపు ములిగిపోయినంత పనయింది. అప్పట్నించి జాగ్రత్తగా ఉండటం మొదలెట్టాను. నేనొక్కణ్నేకాదు, పిల్లలెవరైనా అక్కడికి వెళ్లారని తెలిస్తే ఇంట్లో మోత మోగిపోయేది. అయినా పిల్ల జట్టంతా సాహసాలు చేస్తూనే ఉండేవాళ్లం. బ్రిడ్జి మీద నుంచి కాలవలోకి దూకడం, పందేలు పెట్టుకుని కాలవకు అడ్డంగా ఈదడం… ఒకటారెండా…?

దొంగాదొంగా
బసవపట్నం పొలాల్లో చెరకు వేసి నష్టపోయిన రైతులు ఆ తర్వాత వరి వెయ్యడం ప్రారంభించారు. సంవత్సరానికి రెండు పంటలొచ్చేవి. మా నాన్నకు పొలంలో పనిచెయ్యడం తప్ప వేరే ఏ వ్యాపకమూ ఉండేది కాదు. పొలానికి వెళ్లడం నాకు చాలా ఇష్టంగా ఉండేది. రాత్రుళ్లు పొలంలో పడుకోవడం, చుక్కల్ని చూస్తూ నిద్రలోకి జారుకోవడం బాగా నచ్చేది. మాసూళ్లప్పుడైతే మరీను. గడ్డివాముల్లో చిన్నచిన్న గుడిసెలు వేసుకోవడ ం, చలికాలం కోతలప్పుడు, కుప్ప నూర్పిళ్లప్పుడు వాటిలో దూరి పడుకోవడం భలే ఆనందంగా ఉండేది. వ్యవసాయం పనులు లేనప్పుడు తప్ప మిగతా అన్ని రోజులూ సాయంత్రం స్కూలు నుంచి వస్తూనే మా నాన్నకు కేరేజీ తీసుకుని పొలానికి వెళ్లిపోయేవాణ్ని. నాకు పొలం పనులన్నీ వచ్చు.

ఇంట్లో పాడి ఉండేది. గేదె పాలు తియ్యడం, నురుగుతో వేడిగా ఉండే గుమ్మపాలను అలాగే తాగెయ్యడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. మన వాళ్లు ఇక్కడ నుంచి వెళ్లి పొలాలను కొనడమైతే కొన్నారుగానీ, అక్కడ వ్యవసాయం మరీ అంత లాభదాయకంగా అయితే ఉండేది కాదు. కుటుంబం నడిస్తే చాలన్నట్టు ఉండేది పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఇంట్లో దొంగలు పడితే? తెలుగువాళ్లుండే క్యాంపుల్లో అప్పుడప్పుడు దొంగతనాలు జరిగేవి. మామూలు బట్టలు, చీరలు, వంట సామాను… ఏది దొరికితే అది పట్టుకుపోయేవారు దొంగలు.

అంటే అక్కడివాళ్ల పేదరికం ఎలాంటిదో అర్థం చేసుకోండి. మరోసారి దొంగ కిటికీలోంచి చూస్తుంటే నాకు భయంతో ఒళ్లు జలదరించింది. నెమ్మదిగా మా అక్కను గిల్లి లేపాను. కాస్త అలికిడికే వాడు పారిపోయాడు. ఈలోగా ఊరుఊరంతా లేచి కర్రలు, టార్చిలైట్లు పట్టుకుని ‘రేయ్ దొంగంట్రా… పట్టుకోండి పట్టుకోండి…’ అంటూ వెతికేశారు. వాడు దొరికితే కదా! వేసవి కాలంలో ఇళ్లలో పడుకోలేక వాకిట్లో మడత మంచాలు, నులక మంచాలు వేసుకుని వరసగా పడుకునేవాళ్లం. అప్పుడు మాత్రం పెరటివైపు తలుపులు తీసుకొని వచ్చి ఇల్లు చక్కబెట్టేసేవారు దొంగలు. ఈపని మా ఇంట్లోనూ ఒకసారి అయింది.

అమెరికా వెళ్లొచ్చినట్టే…
నేను మొట్టమొదటిసారి ఆంధ్రా వచ్చింది నాన్న చెయ్యి పట్టుకునే. ఏలూరు దగ్గర సత్యనారాయణపురం అనే ఊళ్లో మా నాన్న బంధువులు ఎక్కువమంది ఉండేవారు. నేను ఐదో తరగతి పాసయ్యాక వేసవిలో వాళ్లింటికి వెళ్లాం. నేను అదే మొదటిసారి రైలెక్కడం. నేనేదో అమెరికా నుంచి వచ్చినట్టు ‘పరమేశ్వర్రావు కొడుకొచ్చాడంట…’ అని చూడ్డానికి వచ్చారు మా బంధువులంతా. అక్కడినుంచి మా ఊరికి తిరిగొచ్చాక ‘కాంతు ఆంధ్రా వెళ్లొచ్చాట్ట…’ అంటూ అందరూ చుట్టూ మూగి విశేషాలు చెప్పించుకున్నారు.

అట్లతద్దెలు నోచాను
బసవపట్నంలో అందరికన్నా పెద్దవారు ధనుంజయగారని ఉండేవారు. ఊరంతా ఆయన మాటను మన్నించేవారు. ఊళ్లో వాళ్లింట్లో మాత్రమే టీవీ ఉండేది. మామూలప్పుడు మాకు టీవీ అవసరం ఉండేదికాదు గానీ, క్రికెట్ మ్యాచ్‌లప్పుడు మాత్రం కుర్రాళ్లంతా వాళ్లింటి అరుగుల మీదే సెటిలయిపోయేవాళ్లం. వాళ్లబ్బాయిలు కూడా మా ఈడువాళ్లే కావడంతో హాయిగా అందరం కలిసి కూర్చుని చూసేవాళ్లం. ఊళ్లో శ్రీరామనవమి అంటే పెద్ద పండగ. మూడు రోజులూ ఊరుఊరంతా అక్కడే. గొప్ప సందడిగా ఉండేది. పానకాలు పంచడం, మజ్జిగలివ్వడం, భోజనాల బంతుల్లో వడ్డనలు… అన్నీ కుర్రాళ్ల పనులే. చివరి రోజు దేవుడి ఊరేగింపు ఉండేది. అందరిళ్ల ముందూ దేవుడి పల్లకీ ఆగేది.

వాళ్లు కొబ్బరికాయ కొట్టి, హారతిచ్చి దండం పెట్టుకునేవారు. దీపావళి సమయంలో మాత్రం తెలుగువాళ్లంతా పేకాటలు విపరీతంగా ఆడేవారు. మా నాన్నకు వేరే వ్యసనాలేమీ లేవుగానీ అప్పుడు మాత్రం రెండేసి రోజులు ఇంటికే రాకుండా ఆడుకునేవారు. అలాగని పెద్ద పందేలు, వచ్చేదిపోయేదీ ఏమీ లేదు. అదో సరదా అంతే. కానీ ఆ రెండు రోజులూ మాకు రెండు యుగాలన్నట్టు ఉండేది. ఎందుకంటే నాన్న రావాలి, ఐదో పదో రూపాయలివ్వాలి, ఆ డబ్బుతో మేం టపాకాయలు కొనుక్కోవాలి. అందుకని చూసిచూసి పిల్లలంతా పెద్దవాళ్లు పేకాడే దగ్గరకే వెళ్లి డబ్బులడిగి తెచ్చుకునేవాళ్లం.

అలాగే దీపావళి సమయంలోనే కబడ్డీ పోటీలు జరిగేవి. వాటిల్లో యువకులంతా పాల్గొనేవారు. మా నాన్న చాలా సీరియస్‌గా ఆడేవారు. వ్యవసాయ కుటుంబాలు కావడంతో భోగి, సంక్రాంతి కూడా ఘనంగా జరుపుకునేవాళ్లం. ఆ సమయంలో ఆంధ్రా నుంచి గొర్రెపొట్టేళ్లను తెచ్చి పోటీలు పెట్టేవారు. అట్లతదియ అమ్మాయిల నోము అని మాకు చిన్నప్పుడు తెలిసేది కాదు. ఇళ్లలో ముందురోజు రాత్రే పులిహోర వంటివి చేసి ఉంచేవాళ్లు. తెల్లవారుజామునే మూడింటికల్లా లేచి అది తినేసి తెల్లారేదాకా బాగా ఆడుకునేవాళ్లం.

నాటకాలు చూసే ఓపిక లేదు
మా ఊరి నుంచి అడ్డదారిన వెళితే హంపీ కేవలం పదకొండు కిలోమీటర్లు. దాంతో ఎప్పుడైనా కేరేజీలు కట్టుకుని సైకిళ్ల మీద అక్కడికి పిక్నిక్‌లాగా వెళ్లేవాళ్లం. బసవపట్నంలో వినోదమంటే జెమిని సర్కస్ వచ్చినప్పుడే. అప్పుడప్పుడు కన్నడ నాటకాలు చూసేవాళ్లం. అందులో గుబ్బి కంపెనీ చాలా ఫేమస్. కానీ వాళ్లు రాత్రంతా నాటకం ఆడుతూనే ఉండేవారు. మాకంత ఓపిక లేక చూసినంత చూసి వచ్చేసేవాళ్లం. పండగలప్పుడు ఆంధ్రా నుంచి హరికథలు చెప్పేవారు, ఇతర కళాకారులు వచ్చేవారు. ఊళ్లో పెళ్లంటే అందరింట్లోనూ సందడే.

ఇప్పట్లాగా పనివారిని పెట్టి చేయించే పద్ధతి లేదుగనక, ఊరందరూ తప్పనిసరిగా సాయం చెయ్యాల్సిందే. బసవపట్నంలో సినిమా థియేటరేమీ లేదు. గంగావతికి వెళ్లి చూడాల్సిందే. తెలుగు సినిమాలు రావడం తక్కువే అయినా మేం మాత్రం సినిమాలు, హీరోల గురించి జోరుగా మాట్లాడుకునేవాళ్లం. ‘మావాడు చేసినట్టు మీవాడు ఫైటింగులు చెయ్యలేడు’ అని ఒకడంటే ‘మావాడు స్టెప్పులేసినట్టు మీవాడెయ్యలేడ్రా’ అని ఇంకోడనేవాడు. ఈ చర్చలు మరీ శృతి మించుతున్నాయన్నప్పుడు అక్కడున్న పెద్దవాళ్లెవరైనా ‘చాల్లెండి, ఇళ్లకు పొండి’ అని కసిరి పంపేసేవారు.

తేడా లేనేలేదు
కన్నడనాట ఉన్నందువల్ల ఆ భాష రాయడం, చదవడం, మాట్లాడటం బాగా వచ్చు మా అందరికీ. ఊళ్లోని కన్నడ పిల్లలతో కలిసి ఆటపాటలు సాగేవి. ఇప్పటికీ ఏ రకమైన తేడాలూ లేకుండా ఆప్యాయంగా ఉంటారందరూ. ‘వీళ్లేదో వ్యవసాయం కోసం ఆంధ్రా నుంచి వచ్చారు. మన భూముల్లో స్థిరపడ్డారు…’ అన్న భేదభావాలేమీ అక్కడివారిలో లేనేలేవు. అంతా కలిసి క్రికెట్‌లాంటివి ఆడుకునేవాళ్లం. రాజకీయనాయకులు కూడా బాగా వ్యవహరిస్తారు. ఓట్లు కావాలి కనక. అక్కడి ఎన్నికలప్పుడు మేం హడావుడి చేసేవాళ్లం. జెండాలు, బ్యానర్లు కట్టడం, ఊరేగింపుల్లో నినాదాలివ్వడం – ఈ హంగామా అంతా మాదే. ఓట్లంటారా, మా ఊళ్లో ధనుంజయగారేది చెప్తే అదే ఫైనల్.

బసవపట్నం ఊరికి ఏం కావాలన్నా అక్కడివాళ్లొచ్చి నన్ను అడుగుతుంటారు, నేను సాయం చేస్తూనే ఉన్నాను. శ్రీరామనవమి రోజు ఊరందరికీ భోజనాల ఖర్చు నేను పెట్టుకుంటాను. ఊళ్లో కల్యాణమండపానికీ తోచిన సాయం చేశాను. మా ఊరితో సంబంధాన్ని సజీవంగా ఉంచుకోవడమే నాకు సంతృప్తి, అదే నేను మా నాన్నకిచ్చే బహుమతి.

కొత్త ఇల్లు కొనిచ్చాను
నాకు నాన్నతో ఎంత అనుబంధమో మాటల్లో చెప్పలేను. ఒక్కముక్కలో చెప్పాలంటే నేను పదో తరగతి పాసయ్యేవరకూ నాన్న పక్కలోనే పడుకున్నాను. మా చిన్నప్పుడు ఆయన సామాన్యమైన వ్యవసాయదారుడు. రైతులందరికీ ఉన్నట్టే ఆయనకూ సవాలక్ష సమస్యలుండేవి. పంటలు పండుతాయో లేదో, పండినదానికి రేటొస్తుందో రాదో… ఇలా. కానీ మాకెప్పుడూ వాటిని తెలియనిచ్చేవారు కాదు. అయినా ఆయన చేతిలో డబ్బులేక కటకటపడటం నాకు చిన్నవయసులోనే తెలిసేది. మా స్కూల్లో విద్యార్థులకు పిక్నిక్ ఏర్పాటుచేసేవారు.

నాకు వెళ్లాలని ఉన్నా, నాన్న దగ్గర డబ్బులుండవని తెలిసి నేను వెళ్తానని అనేవాణ్ని కాదు. ఒక్కసారి మాత్రం బేలూరు హలేబీడు వెళ్లాలని క్లాసులో నిర్ణయించుకున్నారు. అప్పుడు మాత్రం ఇక ఆగలేక అడిగాను. ‘నువ్వు వెళ్లాలంటే నేను అప్పు చెయ్యాల్రా’ అన్నారు నాన్న. అక్కడితో ఆగిపోయాను. ఎన్ని ఇబ్బందులున్నా ఆయనకు కోపం వచ్చేదే కాదు. ఒకసారి నేను మా పక్కింట్లోని మామిడికాయొకటి తెంపుకొచ్చాను. వాళ్లొచ్చి ‘మీవాడు దొంగతనం చేశాడు’ అని నాన్నకు చెప్పారు. అప్పుడు కొట్టారు తప్ప, మామూలుగా కొట్టడం, తిట్టడం వంటివి చేసేవారే కాదు. మేం పెరిగిపెద్దవుతున్న కొద్దీ మా అక్క పెళ్లికని, తమ్ముడి పైచదువులకని… ఒక్కో ఎకరమూ నా కళ్ల ముందే కరిగిపోయింది.

ఒకసారి పంట చేతికొచ్చి ఇంటి ముందు బస్తాలు పేర్చాం. అంతకు ముందు అప్పు ఇచ్చిన ఒకాయన వాటిని తీసుకుపోతానంటూ ఏకంగా లారీ తీసుకుని వచ్చేశాడు. ఇంటి మీదికొచ్చి నానా మాటలూ అంటుంటే నాకు కోపం వచ్చి పెద్ద కర్ర తీసుకుని ఎదురెళ్లాను. ‘బస్తాల మీద చెయ్యి వేశావో జాగ్రత్త’ అని నిలబడ్డాను. ఆ సమయానికి నాన్న ఎక్కడికో వెళ్లారు. ఇలా జరుగుతోందని తెలిసి ఆయన పరుగెత్తుకుంటూ వచ్చేసి ఆ పెద్దమనిషికి సర్దిచెప్పి పంపించారు. ఆ వయసులో అది నాకు చాలా అవమానంగా, బాధగా అనిపించింది. ఇంట్లోకి వచ్చి నేను, అమ్మానాన్నా అందరం బావురుమని ఏడ్చేసాం. చివరికి ఇల్లు కూడా అమ్మేస్తున్నప్పుడు ఎంత బాధపడ్డామో, ఆ క్షణాలు గుర్తొస్తే ఇప్పటికీ ఏడుపొస్తుంది. నేను 90లో హైదరాబాద్‌లో అడుగుపెట్టేనాటికి పొలమూ ఇల్లూ ఏమీ లేదు, నాన్న ఉన్నారన్న ధైర్యం తప్ప.

సినిమాల్లో రాణించడం మొదలెట్టాక ‘నాన్నా నీకేం కావాల’ని అడిగాను. ‘నీకు వీలైతే బసవపట్నంలో మన ఇల్లు, పొలమూ కొనిపెట్టరా’ అని అడిగారు. అడుగుతున్న ఆయనకు, వింటున్న నాకూ – ఇద్దరికీ కళ్లమ్మట నీళ్లొచ్చేశాయి. కొంత డబ్బు పోగయ్యాక అక్కడ పొలాలు కొన్నాను. నా స్నేహితులే వాటిని చూసుకుంటున్నారు. మేమున్న ఇల్లు కొందామని వెళ్లానుగానీ అక్కడుంటున్నవాళ్లు ‘మాకిది కలిసొచ్చింది, మేం అమ్మం’ అన్నారు. దాంతో బసవపట్నం సమీపంలోనే వడ్డరహట్టి అనేచోట నేను వేరే స్థలం కొని ఇల్లు కట్టించాను.

ఆ పనంతా నాన్నే చూసుకున్నారు. అప్పుడప్పుడూ అక్కడికెళ్లి వస్తుంటారు అమ్మానాన్నా. ఎప్పుడైనా డే అండ్ నైట్ షూటింగ్ అయితే నేను ఇంటికొచ్చే వరకూ నాన్న ఎదురుచూస్తూ కూర్చుంటారు. ‘ఎందుకురా అంత శ్రమ పడతావు’ అని దెబ్బలాడతారు. ఇప్పుడు కూడా మా ఇంటికి సంబంధించిన విషయాలన్నీ నాన్నే చూసుకుంటారు తప్ప నాకేమీ తెలియదు. మాకోసం ఎంతో శ్రమపడిన అమ్మానాన్నలను ఇప్పుడు శ్రమపెట్టకుండా చూసుకోవడమే నాకిష్టం.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

2 Responses to నాన్న నేను కలిస్తే మా ఊరు : హీరో శ్రీకాంత్

  1. నేటి హీరోకూడా ఒకప్పుడు నవయువకుడే !శ్రీకాంత్ బాల్యంలో వాళ్ళ నాన్నతో ఊరితో ఎలాంటి అనుబంధాలు కలిగి ఉన్నారో హృద్యంగా సేకరించారు దుర్గాప్రసాద్ గారు!

  2. జ్యో తి says:

    చాలా అందంగా వ్రాశారు. ఆమె మూవీ ఆక్టింగ్ తో నేను మీ ఫ్యాన్ ని అయ్యాను. క్రితం సంవత్సరం నేను మిమ్మల్ని ఫ్రిస్కాలో కలిశాను. మీరు వెళ్లే వరకు చూసి బై చెప్పాను.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.