నా దారి తీరు -28
ముసురు వానల్లో చి.సౌ.వేద వల్లి వివాహం
అసలే శ్రావణ మాసం .ఆరోజుల్లో ముసురు వర్షాలు జనానికి తీవ్ర ఇబ్బంది కలిగించేవి .1974శ్రావణ మాసం లో వివాహం .పెళ్ళికి పెద్ద ముసురు పట్టింది అప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తీ చేశాము .చోడవరపు చంద్ర శేఖర రావు గారింట్లో విడిది .డాబా ఇల్లు కనుక ఇబ్బంది లేదు .పెళ్లి వారంతా ఎడ్ల బండీలలో,కార్లలో మొటారులో తరలి వచ్చారు .ఆ ముసురు లోనే వారిని సాదరం గా ఆహ్వానించాం.ఏ ఇబ్బందీ కలగ కుండా అన్ని ఏర్పాట్లు చేశాము .వంటకు ప్రఖ్య సీతా రామయ్య ను మాట్లాడుకొన్నాం .చాలా రుచికరం గా శుభ్రం గా చేయగలవాడు .నా ఒడుక్కి అతనే చేశాడు. బాగా పరిచయం ఉన్న మనిషి .ఉయ్యూరు వాడు .తువాలు కట్టుకొని పైన ఏమీ లేకుండా అలా నుంచుని పురమాయిస్తూ వంట చేయించే వాడు .అతనికి సహాయం గా మనుష్యులను తెచ్చుకొన్నాడు .కూరలు వంట సరుకులు అన్నీ సిద్ధం చేశాం .మా పడమటిల్లె సామాన్ల గది ఆదినారాయణ ,నరసింహం అనే నా స్నేహితులు దానికి ఇంచార్జి .చాలా జాగ్రత్తగా చూసుకొనే వారు .
పెళ్ళికి, కట్నానికి కలిపి సుమారు పన్నెండు వేలు పైగానే కావాలి .మా దగ్గర అయిదారు వేలు వేలు మాత్రమె ఉంది .మా మయ్య సలహాతో కోమటి సాంబయ్య అంటే వెంట్రప్రగడ సాంబయ్య గారి దగ్గర నేను నోటు రాసి నాలుగు వేలు అప్పు తీసుకొన్నాము ..పెళ్లి వారికి కట్నం ఇచ్చేశాము .మిగిలిన ఖర్చులకు బోటా బోటీ గా డబ్బులున్నాయి. కూర గాయాలు చిన ఒగిరాల ,పేద ఒగిరాల నుండి మామయ్యకు తెలిసిన రైతులు అందజేశారు వాళ్లకు డబ్బులు తరువాత ఇవ్వచ్చు .పెళ్లి బట్టలు బెజవాడ లక్ష్మీ జెనరల్ స్టోర్స్ లో శిస్తలా సీతా పతి శాస్త్రి గారి దగ్గర అప్పుతెచ్చాం మామయ్యా ‘’అవాల్తీ ‘’ఉన్నాడు .తరువాత తీర్చే పధ్ధతి . సరుకులు ఊర వారి కొట్లో అప్పు తెచ్చాం. వాకిట్లో, దొడ్లో తాటాకు పందిళ్ళు వేయించాం .ఇవి పదహారు రోజుల పండుగ దాకా ఉంచటం ఆన వాయితీ .
ఆ రోజుల్లో కళ్యాణ మండపాలు ఇంకా ఉయ్యూరు లో రాలేదు పెళ్ళిళ్ళు ఇళ్ళ దగ్గరే చేసే వారు .మా కు వాకిలి విశాల మైనది అక్కడే మా చిన్నక్కయ్య పెళ్లి చేశారు వేద వల్లి వివాహమూ వాకిట్లోనే చేద్దామని అన్ని ఏర్పాట్లు చేశాము కాని వారం ముందు నుండి భూమి ఆకాశం ఏక ధారగా వర్షాలు .కనుక మా ఇంటి లోనే వివాహం చేయాలని నిర్ణ యించాం మా కు బాగా విశాల మైన హాలు ఉంది మాది అప్పటికి మండువా ఇల్లు .నీళ్ళు మండువా లోంచి దోనే ద్వారా దక్షిణం వైపు సందులో పడేట్లుండేది మేము తర్వాతా దాన్ని మార్చి ఉత్తరం నుంచి తూర్పుకు పడేట్లు మార్చాం .వర్షం వస్తే పెంకుటిల్లు ఆగవు నీరు ఎక్కడో అక్కడ కారుతూనే ఉంటుంది కారే చోట చిన్న బొక్కెనలు పెట్టె వాళ్ళం లేక ఏదో పాత్ర ఉంచేవాళ్ళం అవి నిండితే పాలేళ్ళు బయట పారబోసే వారు ..ఇలాంటి పరిస్తితి వివాహానికి మేము అసలు ఊహించలేదు .
ఆ రోజుల్లో బంధుగణం అందరు వారం రోజులు ముందుగానే వచ్చి ,పెళ్లి పనులకు సాయం చేస్తూ పదహారు రోజుల పండుగ వరకు ఉండటం ఒక ఆన వాయితీ .అలానే మా వాళ్ళూ తరలి వచ్చారు .ఇల్లంతా సందడీ సందడి .అప్పటికి మా మామయ్యా తారస రాయితో డాబా వేసి పైన ఒక గది కూడా ఏర్పరచాడు .ఇది కొంత ఉపయోగ పడింది .పెళ్లి రోజున ఉదయం విపరీతం గా వర్షం పడింది ముహూర్తం తొమ్మిది గంటలకు .ముహూర్త సమయం లో వాన దయ తలిచింది .ఒక గంట విశ్రాంతి తీసుకోంది వర్షం ..హమ్మయ్య అనుకొన్నాం .మా ఇల్లు సందులోపల ఉంటుంది బయటి నుంచి లోపలి రావాలంటే మోకాలి లోతు బురద లోంచి ఇంట్లోకి రావాలి .ఏం చెయ్యాలో పాలు పోలేదు .ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగ కూడదని అనుకొన్నాం .మా పాలేరు కనకయ్య ‘’అయ్యగారూ !మీరు ఏమీ అనుకోకుండా ఉంటె నాదొక సలహా‘’అన్నాడు నా దగ్గరకొచ్చి ‘’ఏమిట్రా ! చెప్పు .పరవాలేదు ‘’అన్నాను .’’మనకు పెద్ద గడ్డి వాము ఉంది .దాని లోంచి గడ్డి తీసి కట్టలుగా గానో ,పనలు గానో పరచి సందు అంతా కప్పెద్దాం .ఇంక ఎవరికి కాలికి బురద అంటదు .’’అన్నాడు .’’మంచి ఆలోచనరా !వెంటనే కానివ్వండి ‘’అన్నాను అంతే వాడు ,మా మామయ్యగారి పాలేళ్ళు అందరు కలిసి క్షణాలలో గడ్డి సందు అంతా పరిచేశారు అందరు కాలికి బురద కాకుండా పెళ్ళికి ఇంట్లోకి వచ్చారు .వాకిట్లో కాళ్ళు కడుక్కోవటానికి గంగాళాలు నీరు ఏర్పాటు చేశారు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొన్నాం .’’ఒక అయిడియా జీవితాన్నే మార్చేస్తుంది’’అన్నది నిజమో కాదో కాని ‘’కనకయ్య అయిడియా సీన్ నే మార్చేసి సుఖాంతం చేసింది’’ .ఈ ఏర్పాటు ను చూసి అందరు మురిసి పోయారు క్రెడిట్ నాకు దక్కినా దక్కాల్సింది మా పాలేరు కనకయ్యకే .
ఆ రోజుల్లో వంట అంటే గాడి పొయ్యి మీదే చేసే వారు మాకు దొడ్డి వైపు అంతా గచ్చు ఉంది .అయినా ఒక అడుగు వెడల్పు ఆరడుగుల పొడవుతో గాడి పొయ్యి దక్షిణం వైపుకు ఎప్పుడో మా చిన్న తనాల నుండి ఉంది దానిలోనే ఎంత వంట అయినా .వర్షానికి పందిరి ఇబ్బంది కల్గించలేదు అక్కడే వంట కొంత, కొంత మా వంటింట్లో సీతా రామయ్య చేశాడు ఉదయం కాఫీ టిఫిన్లు మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిన్ టీ రాత్రి భోజనం అన్నీ బాగా చేసి సమయానికి అందించాడు .గాడి పొయ్యి లోకి ఎండిన తుమ్మ పోరాట్లను ఎప్పుడో కొని దొడ్లో ఉన్న పాకలో తడవకుండా జాగ్రత్త చేసుకోన్నాం .కనుక వంట సరుక్కు ఇబ్బంది లేదు .
పామర్రు హైస్కూల్ స్టాఫ్ అందర్నీ పెళ్లి రోజు మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించాను దాదాపు అరవై మంది పైనే .అందరు నా మీద ఉన్న అభిమానం తో వచ్చారు హెడ్ మాస్టారు రామ క్రిష్నయ్య గారుముహూర్తం సమయానికి వచ్చారు మిగిలిన వారిని అందర్నీగుమాస్తా అంజి రెడ్డి వెంట బెట్టుకొని తెసుకొని వచ్చాడు రాగానే అందరికి కాఫీ లు ఇప్పించాం .తరువాత భోజనాలు అప్పటికి కొంత తెరిపి వచ్చింది వీరందరికీ భోజనాలు మా మామయ్య గారి డాబా మీద నిమిషాల మీద ఏర్పాటు చేశారు మా వాళ్ళందరూ అందరు ఎంతో బాగా వివాహం జరిగిందని మమ్మల్ని మెచ్చుకొన్నారు ..మా స్టాఫ్ కూడా ఎంతో అభినందించారు ..ఇంత మంది స్టాఫ్ ఇక్కడికి రావటం నాకు మహదానందం గా ఉంది .ఆ తర్వాత రెండు రోజులకు స్కూల్ కు వెళ్లి నప్పుడు ఒకరిద్దరు రాని వాళ్ళు ‘’మేస్టారూ !పెళ్లి బాగా చేశారట కదా .మన వాళ్ళు చెప్పారు .మేమూ వద్దామనుకోన్నాం వర్షం కదా మీకు ఇబ్బంది కలిగించటం ఇష్టం లేక రాలేదు‘’అన్నారు .అప్పుడు నేను ‘’నేను ఇబ్బంది పడాల్సి వస్తే మిమ్మల్నేవర్నీ పిలిచే వాడిని కాదండీ .మీ రందరూ వచ్చి ఆశీర్వదిన్చాలనే మా కుటుంబం కోరుకొన్నది .ఇలాంటి మాటలు నాకు నచ్చవు ‘’అన్నాను‘’సారీ సారీ .మీరిలా బాధ పడతారనుకోలేదు ‘’అని ఏదో అన్నారు వారు రాక పోవటం నాకు బాదే కలిగించింది సరే గతం గతః .హాయిగా మా అన్న గారి అమ్మాయి చి సౌ వేద వల్లి వివాహం చి రామ కృష్ణ తో అనుకొన్న ముహూర్తానికి దివ్యం గా వైభవం గా భగవంతుని దయ వల్ల జరిగింది .మా అన్న గారు చేయాల్సిన వివాహం ఇది.ఆయన 1957 లోనే చని పోవటం వల్లా, ,మా నాన్న గారు 1961లో మరణించటం వల్ల నేనూ, మాశ్రీమతి ప్రభావతి పీటల మీద కూర్చుని వివాహం జరిపించాము . నవంబర్ డిసెంబర్ లలో చెరుకు కొట్టటం ఫాక్టరికి తోలటం తో జనవరి నాటికి పంట డబ్బులు పుష్కలం గా చేతికి వచ్చాయి చేసిన అప్పులన్నీ తీర్చేశాము ..ఈ మధ్యలో అల్లుడు వచ్చినప్పుడు కూడా బట్టలు పెట్టటానికి ఊరిలో కోట్లో అప్పు తో కొని తెచ్చి పెట్టాము .అయితే కర్తవ్యమ్ ముందు ఇవేమీ పెద్ద ఇబ్బందులని పించలేదు బంధువర్గానికి అందరికి నూతన వస్త్రాలు పెట్టించింది మా అమ్మ .ఆవిడే మా వెనక నిల బడి ఆదేశించి నడిపించి కార్యక్రమాన్ని సంతృప్తిగా జరిపించింది .మా ఇద్దరక్కయ్యాలు లోపాముద్రా దుర్గా బావలు కృపానిధి వివేకానందం ,వారి కుటుంబం చిర్వాడ నుంచి వేలూరి కృష్ణ మూర్తి మామ గారు భార్య అత్తమ్మత్తయ్య గారు మా పాపాయి పిన్ని, సీత పిన్ని లక్ష్మీ కాంతం అమ్మక్కయ్యా శివరామ దీక్షితులు బాబాయి ,బుల్లిమామ్మ రాధ కృష్ణ మూర్తి అందరూ వచ్చారు .అందరు మేము పూనుకొని ఈ వివాహాన్ని ఇంత బాధ్యత గా చేసి నందుకు మెచ్చుకొన్నారు .ఇది మా బాధ్యత గా చేశాం .మెప్పులకోసం కాదు .వసిస్తూ గారు మా ఇంటి పురోహితులు శ్రీ వంగల సుబ్బావధాని గారే .ఇలా విపరీత మైన ముసురు లో వేదవల్లి వివాహం ఘనం గా జరిగి అందరికి ఆనందం కలిగించింది వియ్యాల వారు కూడా ఎంతో సంతృప్తిని తెలిపారు ఎక్కడా అపార్ధాలు అలకలు నిస్టూరాలు లేకుండా అంతా సవ్యం గా జరిగింది .
సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -16-6-13- ఉయ్యూరు
ఆ రోజుల్లో ని పధ్ధతుల్ని ప్రేమను ,మధ్యతరగతి ఆర్ధిక ఇబ్బందులు ,బాధ్యతల్ని పెద్దల పట్ల గౌరవాన్ని .అన్నీ కళ్ళకు కట్టినట్లు చెప్పారు . చాలా .చాలా బావుందండీ .