నా దారి తీరు -30 మా మిత్ర బృందం

   నా దారి తీరు -30

                    మా మిత్ర బృందం

          నేను ఏ స్కూల్ లో పని చేసినా నాకు ముఖ్యమైన మిత్రులు సైన్సు మేస్టార్ల కంటే సాహితీ అభిరుచి గలవారే ఎక్కువ .అందులో తెలుగు మేస్టార్లతో భలే జోడీ కుదిరేది .పెద్ద తెలుగు మేష్టారు శ్రీ హేమాద్రి తిమ్మరుసు గారు నాకు గురు తుల్యులు ,పితృ సమానులు .వారి అబ్బాయి అప్పుడు స్కూల్ లో చదివే వాడు .అలానే జి.ఎస్.వి అని పిలుచుకొనే గండ్రం వెంకటేశ్వర రావు గారు అనే లెక్కల మేష్టారు ,సెకండరి గ్రేడ్ టీచర్ ఆచారి గారు ఆయన అన్నగారు మల్లేశ్వర రావు గారు గుంటూరు సుబ్రహ్మణ్యం గారనే తెలుగు మేష్టారు ,ఘట్టి  శ్రీ రామ మూర్తి గారనే సెకండరి మేష్టారు కానూరు చంద్ర శేఖర రావు గారనే సెకండరి మేష్టారు ,గుమాస్తా అంజి రెడ్డి ,సంస్కృతం మేష్టారు ఎస్.ఆనంద రావు దాదాపు ఎప్పుడూ కలిసి ఉండే వాళ్ళం ఆనంద రావు గారు ముక్కు పొడి బాగా పీల్చేవారు సహృదయులు సంస్కృతాన్ని విద్యార్ధులకు చేతి వెన్న ముద్దా లా అందించేవారు వారబ్బాయి కూడా అప్పుడు చదివే వాడు స్కూల్ లో .ఇందులో కానూరి వారంటే మిగిలిన సెకండరి మేస్టర్లకు పడేది కాదు సూటీ పోటీగా ఏదో అనే వారు .ఆయనకు ఏమీ రాదనీ వీళ్ళ అభిప్రాయం ‘దానికి ఉదాహరణ గా వాళ్ళు ఆయన ఎప్పుడో ‘’నాకు ఫీవరీష్ వచ్చింది‘’అన్నాడట .ఇంగ్లీష్ చెప్పటం రాదనీ వీరి ఎద్దేవా .అయితేనేం ఆయన కుమారులు అమెరికా లో సెటిల్ అయి బాగా సంపన్ను లయారు ఈయన చాలా సార్లు అమెరికా వెళ్లి వచ్చారు గిల్డ్ కు ముఖ్యమైన వారు. రావు గారు అయన పొడవాసైన పాంటు దాని పై పొట్టి చేతుల పొడవైన చొక్కా తో ఉండేవారు డ్రెస్ ను బట్టి ఆయనే చంద్ర శేఖర రావు అని చెప్పచ్చు కొంచెం కోపం ఎక్కువ నాతో చాలా ఆప్యాయం గా ఉండేవారు .

             ఖాళీ పీరియడ్ లలో స్టాఫ్ రూమ్ లో మేము రాజకీయాలే మాట్లాడుకొనే వాళ్ళం తిమ్మరుసు గారు కాంగ్రెస్ అభిమాని. మేము వ్యతి రేకం ఆ నలభై నిమిషాలు తీవ్రం గా ఇందిరా గాంధి పాలసీలను విమర్శించే వాళ్ళం .రావు గారు మా పక్షం అంతే –మళ్ళీ మామూలే అంత స్నేహం మాది .ఆనందరావు గారు సరదాగా మాట్లాడే .వారు ఏదో ఒకటి చెప్పి నవ్వించేవారు అంజి రెడ్డి ఆయన తెగ సరదాగా మాట్లాడుకొనే వారు .నేను ఉయ్యూరు వచ్చిన తర్వాతా కూడా ఆనంద రావు గారు అంజి రెడ్డి కలిసి ఉయ్యూరు మా ఇంటికి వచ్చి వెళ్ళే వారు కొంత కాలం పిల్లల చదువుకోసం ఆయన ఉయ్యూరు లో కాపురమూ పెట్టారు తరచూ కలుసుకొనే వాళ్ళం ఆయనది ఉంగుటూరు ..రాళ్ళ భండి సాంబశివరావు సోషల్ మేష్టారు స్తానికుడు ఘడియారం వారికి, వీరికి అసలు పడేది కాదు .కొట్టుకొంటారేమో నన్నట్లు మాట్లాడుకొనే వారు .’’బావా బావా’’ అనుకొంటూనే తిట్టుకోనేవారు మాకు మహా ముచ్చటగా ఉండేది .సాంబశివ రావు ‘’ఎద్దనపూడి సులోచనా రాణి నా శిష్యురాలు .ఆ అమ్మాయిని తీర్చి దిద్దింది నేనే ‘’అని గొప్పలు చెప్పుకొనే వారు సన్నగా రివటలా పొడుగ్గా తెల్లపాంటు తెల్ల బుష్ షార్ట్ తో ఉండేవాడు ..ఆయనకు సవ్యం గా మాట్లాడటం రాదు .చెవి కింద చేరి నెమ్మదిగా వినిపించీ వినిపించకుండా అవతలి వారి మీద ముఖ్యం గా సీనియర్ సోషల్ మేష్టారు రంగమన్నారాచార్యుల మీద చాడీలు చెప్పే వాడు .అయన తమ్ముడేరాళ్ళ బండి కృష్ణ మూర్తి  సెకండరి మేష్టారు చాలా సౌమ్యుడు ,నాకు మంచి మిత్రుడు ,స్తానికుడు వీరిద్దరికీ హస్తి మశాకాంతరం

             అలానే ఘంటా కోటేశ్వరరావు లెక్కలు చెప్పేవారు ఆయన ఒకప్పుడు ఉయ్యూరు లో మాతో కలిసి పని చేశారు .సైలెంట్ కిల్లర్ లా ఉండేవాడు పైకి నవ్వుతూ మాట్లాడే వాడు కాని మనసులో విషమే .ఘడియారం సుబ్రహ్మణ్యం కామేశ్వర రావు లు అన్న దమ్ములు .ఇద్దరిది వేరు ప్రవ్రుత్తులే కామేశ్వర రావు లౌక్యుడు చాక చక్యం ఉన్న వాడు సుబ్రహ్మణ్యం నోటి దూల వాడు అందరితో తగాదా గా ఉండే రకం .కాని ఊరి వ్యవహారాలలో ఘడియారం ,రాళ్ళ బండి కుటుంబాలు మంచి సహకారం ఇచ్చేవి .సుబ్రహ్మణ్యం కొడుకులు చదివారప్పుడు కామేశ్వర రావు అబ్బాయి అమ్మాయి కూడా స్కూల్ లో చదివారు అమ్మాయి పెళ్లి స్కూల్ ప్రక్కనే ఉన్న సత్రం లో చేశారు కామేశ్వర రావు మా అందరికి గొప్ప విందు ఇచ్చాడు .వీళ్ళబ్బాయి తర్వాతా స్టేట్ బాంక్ లో ఉద్యోగం సంపాదించి మాకు బాగా పరిచయం అవటమే కాక సహాయ కారిగా ఉండేవాడు ఘట్టి వారబ్బాయి ఆంధ్రా బాంక్ లో ఉద్యోగం పొంది చల్ల పల్లి లో చాలా కాలం పని చేశాడు నేను మంగళా పురం హెడ్ అయినప్పుడు ఆ బాంక్ లోనే స్కూల్ అకౌంట్ ఉండేది తరచుగా కలిసే వాళ్ళం ఘట్టి వారు నేను అపామర్రు లో పని చేస్తుండగానే హార్ట్ ఎటాక్ వచ్చి చని పోయారు మంచి మిత్రుడిని కోల్పోయామని పించింది .

               తిమ్మరుసు గారు గొప్ప లోక జ్ఞానం కల వారు అన్నీ క్షున్నం గా తెలుసుకొనే వారు .మాకు పామర్రు లో మంచి మిత్రులు .నేను పెనమకూరు లో పని చేసినప్పుడు అయన కుమార్తే వివాహం పామర్రు లో జరిగితే వెళ్ళా. దురదృష్ట వశాత్తు ఆ పిల్ల పెళ్లి కలిసి రాలేదు .వారిద్దరి కాపురం సాగ లేదు .ఆమెకు మతి స్తిమితం తాప్పింది ఇదొక మానసిక బాధ అయింది మేస్తారికి .కొడుకు గుజరాత్ లో ప్రైవేట్ ఇంజినీర్ గా పని చేస్తుంటే పెళ్లి చేశారు అతనికి ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాతా ఏమై పోయాడో తెలీదు ఈ రెండు దెబ్బలకు తిమ్మరుసు గారు తల్లడిల్లి పోయారు .రిటైర్ అయాక గుడివాడలో కాన్వెంట్ ను దాదాపు పదేళ్ళు సమర్ధ వంతం గా నడిపారు చివరికి తోట్లవల్లూరు లో స్తిరపడ్డారు తరచు కలుస్తూందే వాళ్ళం ఆయన బావ మరిది కే/ఆర్.జి కృష్ణ మూర్తి మా ఇంట్లో దాదాపు పదేళ్లుగా అద్దె కుంటున్నాడు .అందరి మీద దయా సాను భూతి చూపించే తిమ్మరుసు గారికి రావలసిన కష్టం కాదిది .దైవ లీల .తప్పించు కోవటం అసాధ్యం .ఈయన పరిస్తితి గమనించి అమెరికా లోని కానూరి చంద్ర శేఖర రావు గారబ్బాయి అంటే తిమ్మరసు గారి శిష్యుడు ఒక లక్ష రూపాయలు బాంక్ లో వేసి దాని పై వడ్డీని తీసుకొనే ఏర్పాటు చేశాడు తండ్రీ కొడుకులు ఇండియా వచ్చినప్పుడల్లా తిమ్మరుసు గారిని చూసి పలకరించి వెళ్ళే వారు .తిమ్మరుసు గారు గొప్ప కవి కృష్ణా జిల్లా గిల్డ్ కు ఆయన ఆస్థాన రచయిత .స్వాగత పత్రాలు, పద్య నీరాజనాలు ఆయనతోనే రాయించేవారు .ఇటీవలే అయిదు ఏళ్ళక్రితం ముందుగా తిమ్మరుసు గారి అమ్మాయి చని పోయింది ఆ తర్వాతా ఆయన మరణించారు చని పోతానని తెలుసుకొని ముందే డబ్బు బాంకి నుంచి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు భార్య ఆరోగ్యమూ అంత బాగుండేది కాదు ..వెళ్లి పరామర్శించి వచ్చాను వల్లూరు ఎప్పుడు వెళ్ళినా నాకు ముందు టీ పెట్టించి మర్యాద చేసే వారు మేష్టారు చాలా అభిమానం ఆవిడ బక్క పలచగా సన్నగా ఉండేది మేమంటే మహా ఆప్యాయత కనపరచేది . అభిమానం గల మనిషి తిమ్మరుసు గారు .ఎవరినీ ఏదీ అడిగే వారు కాదు .ఎదిచ్చినా తీసుకొనే వారు కాదు నేనే బాల వంతం గా నాకు వీలు చిక్కి నప్పుడల్లా ఆయన చేతి లో కొంత డబ్బు పెట్టి వస్తూండే వాడిని .ఇంతటి స్నేహ శీలిని కోల్పోయి నందుకు చాలా బాధ గా ఉంది .విధి కృతం అంతే .

       గండ్రం వారు తరచుగా ఫోన్ చేసి మాట్లాడే వారు ఆయన్ను పామర్రు నుంచి చాలా దూరం గా ప్రొమోషన్ మీద ట్రాన్స్ ఫర్ చేసినప్పుడు నేనూ తిమ్మరుసు గారు ఆయన్ను వెంట బెట్టుకొని చైర్మన్ పిన్నమ నేనిని ,ఏం ఎల్ సి కొల్లూరి ని కలిసి గుడి వాడ దగ్గర గురజ కు ట్రాన్స్ ఫర్ చేయించాం.అక్కడే రిటైర్ అయ్యారు .కోపధారేరే కాని లెక్కలు బాగా చెప్పే .వారు ఆయన అంటే ఝడుసుకొనే వారు పిల్లలు ఆయనా హార్ట్ అటాక్ తో పదేళ్ళ క్రితం చని పోయారు హైదరాబాద్ లో స్వంత ఇల్లు నిర్మించుకొన్నారు .పోక ముందు ఒక సారి., పోయిన తర్వాతా భార్య గారిని పిల్లల్ని పలకరించటానికి ఒక సారి వెళ్లాను భార్య గారు ఏంటో ఆదరం గా ఉండే వారు .ఈ విధం గా జి.వి.ఎస్.గారినీ కోల్పోయాము .

                           ఏ అధికారీ రానిస్కూలు

        పామర్రు మంచి సెంటర్ .రోజూ ఎంతో మంది అధికారులు అనధికారులు విద్యా ధి కారులు అటువైపు నుండి వెళ్ళే వారు కలెక్టరు రెవిన్యు వారు మొదలైన వారందరూ అటు వైపు వెళ్తున్నా ఎవరూ స్కూల్ లో కాలు పెట్టె వారు కాదు కారణం ఇక్కడ సమర్ధులైన వేమూరి రామ క్రిష్నయ్య గారు అనే ఆదర్శ వంత మైన ప్రధానోపాధ్యాయులు ఉండటమే .ఆయన ఖ్యాతి అంత గొప్పది .ఒక్క సారి మాత్రం కాంగ్రెస్ సోషలిస్ట్ నాయకుడు ఆ తర్వాత గవర్నర్ గా పని చేసిన రఘునాధ రెడ్డి గారు  ముందే చెప్పి, స్కూల్ కు వచ్చారు ఇక్కడి వాతా వవరణం,హెడ్ మాస్టారి సామర్ధ్యం చూసి స్కూల్ అసెంబ్లీ లో తెగ మెచ్చుకొన్నారు .గొప్ప సందేశాత్మక మైన స్పీచ్ కూడా ఇచ్చారు అందరికి గొప్ప ప్రేరణ కలిగించారు .నాకు తెలిసి నంత వరకు ఆయనేవచ్చిన వి.ఐ.పి..అలా నడిచింది స్కూలు .

                     ముదురు విద్యార్ధి

       కోటి రామ మూర్తి అనే కామర్సు మేష్టారు ఉండేవాడు .పొట్టిగా కు మట్టం గా తెల్ల డ్రెస్ తో ఉండేవాడు మహా చలాకీ గా మాట్లాడే వాడు .అయన దగ్గర ఉంటె నవ్వుల పూవులే ..సోషల్ చెప్పే వాడు .ఒక సారి ఆయన తొమ్మిదో క్లాస్ కు వెళ్ళాడట .సహజం గా నే సోషల్ క్లాస్ లో అల్లరి ఎక్కువ.ఈయన మరీ అలుసు ఇచ్చేవాడు .కోప్పడ్డాడు అందులో ఒక కుర్రాడు మరీ అల్లరి చేస్తుంటే ‘’ఒరే దున్న పోతా !సిగ్గు లేదా “’?అని తిట్టాడట.వాడు వెంటనే ఆనందం గా ‘’మేస్టారూ ! తిట్టితే తిట్టారు కాని నన్ను దున్న పోతు అన్నందుకు చాలా గర్వం గా ఉంది ‘’అన్నాడట .ఆయన ‘’అదేమిట్రా !దున్నపోతు అంటే అంత సంతోష పడతావు తల వాల్చుకోవాలి కాని ‘’అన్నాడట .వాడు ‘’సార్ ! మాది కురుమద్దాలి .మా ఊళ్ళో ఒకే ఒక దున్న పోతు ఉంది .ఊళ్ళో గేదేలన్నిటికి అదే గతి నేను దున్న పోతునైతే రోజూ ఎన్నో గేదెలతో ‘’జల్సానే’’ .అందుకని నవ్వ్వాను‘’ఆన్నాడట ఆముదురు విద్యార్ధి .ఈ మాటకు  కడుపు చేక్కలయ్యేట్లు నవ్వాడట రామమూర్తి  మేష్టారు .ఆ తర్వాతా ఈ విషయం మా అందరికి చెప్పి నవ్వించాడు .పెద్ద స్కూళ్ళలో ఇలాంటి ముదుర్లూ ఉంటారు.

                      ఆప్కో చేనేత బట్టలు

          ఆ రోజుల్లో ఆప్కో వారు ఉద్యోగస్తులకు ,స్కూల్ స్టాఫ్ కుఅప్పుమీద  బట్టలు కొనేందుకు అవకాశామిచ్చేవారు ఫారాలు పూర్తీ చేసి హెడ్ మాస్తారితో సంతకం పెట్టించుకొని వెళ్తే కావలసిన బట్టలు కొనుక్కో వచ్చు నెల నేలా జీతం లో వాయిదాల ప్రకారం హెడ్ మాస్టారు మినహాయించి వారికి చెల్లించే వారు చాలా నాణ్యమైన దుప్పట్లు జంపఖానాలు ,దోమ తెరలు చొక్కా గుడ్డలు చీరలు అందరు కొనుక్కొనే వారు నేనూ చాలా సార్లు తెచ్చాను అప్పుడు పామర్రు లో షాప్ లేదు గుడి వాడ వెళ్లి తెచ్చుకోవాల్సి వచ్చేది అలా సరదాగా స్కూల్ అవగానే అందరో ,కొందరో కలిసి వెళ్లి తీసుకొని వచ్చే వాళ్ళం అదొక తిరణాల లా గా ఉండేది .

              సశేషం –మీ –గబ్బిట .దుర్గా ప్రసాద్ -20-6-13-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.