పల్లె పిల్లల్లోనే ఫైర్ ఎక్కువ June 23, 2013–లాఉ రత్తయ్య -విజ్ఞాన్ సంస్థలు

పల్లె పిల్లల్లోనే ఫైర్ ఎక్కువ

June 23, 2013


‘విజ్ఞాన్’ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు లావు రత్తయ్య. ఆ విద్యాసంస్థల వ్యవస్థాపకులు ఆయనే. వేలమందిని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా తీర్చిదిద్దిన ఆయన తనను తీర్చిదిద్దింది మాత్రం తన ఊరేనంటున్నారు. సొంతూరు పెదనందిపాడు గురించి లావు రత్తయ్య చెప్పిన విషయాలే నేటి మా ఊరు..
“మాది గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు గ్రామం. మా ఊళ్లో వందల ఏళ్లనాటి సోమేశ్వరాలయం ఉంది. అందులోని నంది విగ్రహం చాలా కళగా ఉంటుంది. అందుకే మా ఊరి పేరు పెదనందిపాడు అయిందని చెప్పుకొంటారు. మా ఊరు ఇటు గుంటూరు పట్టణానికి, అటు బాపట్ల, చీరాల, పొన్నూరులకూ సరిసమానంగా ముప్పయ్యేసి కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చరిత్రలో కూడా మా ఊరికి ఘనమైన పేరుంది. స్వాతంత్రోద్యమం ఊపిరి పోసుకుంటున్న రోజుల్లోనే మా ఊళ్లో పర్వతనేని వీరయ్యగారనే ఆయన పన్నుల నిరాక రణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కొద్ది రోజుల్లోనే అది ఉధృత రూపం దాల్చింది. బ్రిటిష్ ప్రభుత్వానికి ఊరు నుంచి కట్టవలసిన పన్నులన్నీ ఆగిపోయాయి.

దాంతో సెగ మొదలయింది. పత్రికలు మా ఊరి గురించి బాగా రాశాయి. అప్పుడు గాంధీగారు స్వయంగా మా ఊరికి వచ్చారు. ‘మన స్వాతంత్రోద్యమం ఇంకా ఇంత ఉధృతంగా దేశమంతా వ్యాపించలేదు. మీరు అందరికన్నా తీవ్రంగా దీన్ని అమలుచే స్తున్నారు. దీన్ని కొంచెం తగ్గించి దేశవ్యాప్తంగా ఒకే తీరున నడిస్తే బాగుంటుందేమో…’ అని సూచించిన మీదట మా గ్రామస్థులు కాస్త పట్టు విడిచారని చెప్పుకుంటుంటారు. ఆ తర్వాత మా ఊళ్లో బ్రిటిష్ ప్రభుత్వమే హైస్కూలును ప్రారంభించింది. ఇప్పటికి తొంభయ్యారేళ్ల చరిత్ర కలిగిన స్కూలది. దానివల్ల ఊళ్లోనూ, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ విద్య త్వరగా వ్యాప్తి చెందింది.

రైతుల కాలేజీ
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొన్నేళ్లపాటు కమ్యూనిస్టు భావజాలం బాగా పెరిగింది. మా ఊళ్లో లేదు గానీ మాకు దగ్గర్లోని పాలపర్రు వంటి కొన్ని గ్రామాల్లో కమ్యూనిస్టులను వెతుకుతూ పోలీసులు రావడం, చాలా క్రూరమైన అకృత్యాలకు పాల్పడటం వంటివి జరిగాయి. అయితే ఆ భావజాలం వల్లనే అనుకుంటా, మా ప్రాంతంలో చదువు పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉండేది. అలాగే సామాన్యులకు సైతం అన్ని విషయాలకు సంబంధించిన చైతన్యం బాగా ఉండేది. ఇటువంటి చైతన్యం కోసం ఎంతోమంది తమ జీవితాలను త్యాగం చేశారు. దీనికో ఉదాహరణ చెప్పాలి. అయితే ప్రభుత్వమో లేదంటే జమీందార్లో, భూస్వాములో ముందుకొస్తే తప్ప కాలేజీ ఏర్పడటం అసాధ్యం అనుకున్న రోజుల్లోనే మా ఊళ్లోని రైతులంతా కలిసి చందాలు వేసుకుని తమ పిల్లల కోసం ‘పెదనందిపాడు కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్’ను స్థాపించుకున్నారు.

తేళ్ల కృష్ణమూర్తి చౌదరిగారనే ఆయన ఈ ప్రయత్నానికి నేతృత్వం వహించారు. కొంతమంది రైతులు తమ పొలాలను తాకట్టు పెట్టి మరీ ఆ కాలేజీ నిర్మాణానికి అవసరమైన విరాళాలను పోగుచేశారంటే ఇప్పటి తరానికి గొప్ప ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఆ కాలేజీని ప్రారంభించింది నలభైఐదేళ్ల క్రితం. దాని నిర్వహణ కూడా మొదట్నుంచీ రైతులే చేస్తున్నారు.

కూరగాయలు కొంటారా?
నేను 1952 జూలై 28న పుట్టాను. మా నాన్న అంకమ్మ, అమ్మ తులసమ్మ. మేం ముగ్గురన్నదమ్ములం, నేనే పెద్దవాణ్ని. అక్కచెల్లెళ్లు లేరు మాకు. మా నాన్నకు ఎనిమిదెకరాల పొలం ఉండేది. నీటి వసతి ఉన్న ప్రాంతం కానందువల్ల వ్యవసాయమంతా వర్షాధారమే. ఎప్పటికప్పుడు కష్టంగానే ఉండేది. శెనగ, మినుము, జొన్నలు వంటివి వేసేవారు. అప్పుడప్పుడు పొగాకు వేసేవారనుకుంటాను. ఇప్పట్లాగా టిఫిన్లు ఏమీ తెలియవు మాకు. మూడుపూటలా అన్నమే. ఇంట్లో పాడి ఉండేది గనక పెరుగు, ఆవకాయ వేసుకుని లాగించేసేవాళ్లం. అప్పుడప్పుడు జొన్న అన్నం తినేవాళ్లం. రోజుకో కూర చేసుకుని తినడమూ తెలియదు.

బజార్లో కూరగాయలు కొనడం అంటే ధనవంతులు మాత్రమే చేసేవారని అనుకునేవాళ్లం. రైతులు ఇళ్ల పెరళ్లలో దొండ, బెండ, దోసకాయలు వంటివి వేసుకునేవారు. అక్కడ కాసినప్పుడు కోసుకుని కూర చేసుకోవడమే మాకు తెలుసు. అలాగే మా ఊరి చెరువులో స్నానాలు చేసి ఆ నీళ్లే తాగేవాళ్లం. చేత్తో పట్టుకుంటే పచ్చగా కనిపించేవి ఆ నీళ్లు. రోజూ పెద్ద పోషకాహారం తినకపోయినా, పరిశుభ్రమైన మంచినీరు అందుబాటులో లేకపోయినా మేం ఎప్పుడూ అనారోగ్యం బారిన పడేవాళ్లం కాదు. ఇప్పుడు అందరూ ఆహారం, నీరు విషయాల్లో తీసుకునే శ్రద్ధ చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. మా నాన్న పెద్దగా చదువుకోలేదుగానీ, తెలివిగా ఆలోచించేవారు.

మేం బాగా చదువుకోవాలని ఆకాంక్షించేవారు. అలాగని ఇప్పట్లా బలవంతాన రుద్దేసి అదేపనిగా చదివించడం లేదు. ‘బాగా చదువుకుంటే బాగు పడతార్రా’ అని మాత్రం చెప్పేవారాయన. ఏ సీజన్‌లోనైనా పగలూరాత్రీ మా అమ్మానాన్నలిద్దరికీ వ్యవసాయప్పనులతోనే సరిపోయేది. అందుకని మమ్మల్ని మరీ కనిపెట్టుకుని కూర్చునే తీరిక వాళ్లకుండేది కాదు.

జుట్టు కాలిపోయేది
చిన్నప్పుడు మాకు ఆరవుతూనే అన్నాలు పెట్టేసేవారు. తర్వాత చిన్న లాంతర్లు లేదా బుడ్డి దీపాలు పట్టుకుని ట్యూషన్ మాస్టారి దగ్గర కూర్చుని చదివేవాళ్లం. నేను కునికిపాట్లు పడుతూ ఒక్కోసారి ముందున్న బుడ్డిదీపం మీదికి ఒరగడం వల్ల జుట్టు కాలిపోయేది. ఇలా చాలాసార్లే జరిగింది. నేను క్లాసులో బద్దకంగా ఉండేవాణ్నిగానీ పరీక్షల్లో మాత్రం మంచి మార్కులొచ్చేవి. బీఎస్సీ ఎమ్మెస్సీ చదివేటప్పుడు మా మేనమామలు నన్ను ఆర్థికంగా ఆదుకున్నారు. మా ఊరి పక్కన నల్లమడ వాగుండేది. ఇతర కాలాల్లో మామూలుగా ఉండే ఆ వాగుకు ప్రతి వర్షాకాలంలోనూ తీవ్రమైన వరద వచ్చేది. అక్కడికి తరచూ వెళ్లేవాళ్లం.

నా తొమ్మిదో క్లాసులో ఈత రాకపోయినా ధైర్యం చేసి అందులో దిగాను. అది వరదల సమయం అనుకుంటా. మునిగిపోబోతే కాళహస్తి సత్యనారాయణ అనే స్నేహితుడు బైటికి లాగి రక్షించాడు. చలికాలంలో కూడా ఇప్పట్లాగా రగ్గులూ దుప్పట్లూ ఏమీ ఉండేవి కాదు. అయినా ఏమీ చింత లేకుండా గడిపేసేవాళ్లం. వేసవి కాలంలో మా స్కూలుకున్న పెద్ద గ్రౌండులో ఆటలే ఆటలు.

నాటుకుపోయిన పాఠాలు…
మా ఊళ్లో నాకు గుర్తుండిపోయిన మనుషులు చాలామందే ఉన్నారు. వాళ్లలో మొదట చెప్పుకోవలసింది మా బడి ఉపాధ్యాయుల గురించే. ఇతరత్రా ఏ రకమైన వ్యాపారాలూ వ్యవహారాలూ లేకుండా తమ పూర్తి శ్రద్ధను విద్యార్థుల మీదే కేంద్రీకరించిన గొప్ప వ్యక్తులు వాళ్లు. తమ దగ్గర చదువుకుంటున్న పిల్లలందరూ జీవితంలో పైకి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రేమగా వ్యవహరించేవారు. ముఖ్యంగా మా తెలుగు టీచర్ నాజర్‌గారు. ఆయన పాఠం ఎంతసేపు చెబుతారో, అంతసేపు జీవితం గురించి కూడా చెప్పేవారు. పెరిగి పెద్దయ్యే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో, వాటినెలా ఎదుర్కోవాలో, జీవితాన్ని కొన్ని విలువలతో ఎలా తీర్చిదిద్దుకోవాలో, ఎదుటివారితో ఎంత సంస్కారంగా మెలగాలో…. ఇవన్నీ పసి మనసుల్లో నాటుకుపోయేలా చెప్పేవారు.

ఆయన ప్రభావం నామీదే కాదు, మా బ్యాచ్‌లో చాలామంది మీద ఉంది. అలాగే కోటయ్య చౌదరిగారని లెక్కలు చెప్పే మాస్టారుండేవారు. గణితశాస్త్రమంటే భయం కలిగించకుండా తెలుసుకోవాలన్న ఉత్సాహం కలిగేలా బోధించేవారాయన. ఆయన వల్లే మా ఊళ్లో చాలామంది మ్యాథ్స్ అంటే ప్రేమతో పైచదువులు చదువుకున్నవాళ్లున్నారు. క్లాసులో నలభై మంది అబ్బాయిలుంటే ఏడెనిమిది మందే అమ్మాయిలుండేవారు. వాళ్లతో ఆటలుపాటలు, స్నేహాలు, అలకలు, జగడాలు, ఓరచూపులు, కోరచూపులు… అన్నీ ఉండేవి.

పిల్లల్లో పిల్లాడిగా…
నాకు తెలిసి మాది వెయ్యి గడప ఊరు. నాలుగైదు వేల జనాభా. ఊళ్లో శ్రీనివాస అనే థియేటరుండేది కానీ, అప్పట్లో సినిమా మా ప్రధాన వినోదం కాదు. ఎప్పుడైనా వెళ్లాలన్నా టికెట్టు పావలానో అర్థరూపాయో అయినా అంత డబ్బు మా చేతిలో లేక వెనకడుగు వేసేవాళ్లం. ఒక్కసారి మాత్రం సినిమాకి వెళ్లాలనో, లేదా ఇంక దేనికో గుర్తు లేదుగానీ నాకు డబ్బు అవసరమయింది. పొగాకు కాడలు పీకితే డబ్బులిస్తారని తెలుసు. దాంతో నేనూ పీకడానికి వెళ్లాను. అలవాటు లేని పని కావడం, ఆ పనిలో నేర్పున్న వాడిని కాకపోవడం వల్ల అరిచేతులు గీక్కుపోయి చర్మమంతా ఊడొచ్చింది. మా ఊళ్లో ఈదర వెంకటేశ్వర్లు అనే ఆయన కిళ్లీ దుకాణాన్ని నడిపేవారు. అక్కడ ఆంధ్రప్రభ, పత్రిక, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర వంటి దినపత్రికలన్నీ అమ్మేవారు. ఇంటికి పత్రికలు తెప్పించుకునేవాళ్లు కూడా పొద్దున పూట అక్కడికొచ్చి బల్లల మీద కూర్చుని ఆ వార్తల మీద చర్చోపచర్చలు చేసేవారు.

మా ఊరికి చెందిన కొల్లా వెంకయ్యగారనే పెద్దాయన అప్పట్లో పార్లమెంట్ సభ్యులుగా ఉండేవారు. అయినా ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. అసలాయన అటువంటి స్థాయిలో ఉన్నాడని కూడా మాకు తెలియనంత సాధారణంగా ఉండేవాడు. ఆయన కూడా ఉదయాన్నే ఈదర వెంకటేశ్వర్లు దుకాణానికే వచ్చి పేపర్లు తిరగేసేవాడు. అలాంటప్పుడు నేనూ ఆయన పక్కన కూర్చుని వాదాలు చేసేవాడిని. ‘కమ్యూనిజం మంచిదైతే ఈపాటికి ప్రపంచమంతా ఆ దారినే నడిచేది కదా. మనుషులంతా ఒక్కటే ఎలా అవుతారు. అసలు కమ్యూనిజం ప్రకృతికి విరుద్ధం కదా? కమ్యూనిస్టులు మాత్రం అన్ని వర్గాల గురించీ ఆలోచిస్తారా చెప్పండి…’ అంటూ తోచిందల్లా మాట్లాడేవాడిని. ఆయన పెద్ద మార్క్సిస్టు నాయకుడు.

చాలా జ్ఞానమున్న మనిషి. కొన్నాళ్లు జైల్లో కూడా ఉండొచ్చాడు. అయినా నాకు ప్రతీదీ అర్థమయ్యేలా వివరించడానికి ప్రయత్నించేవారు తప్ప విసుక్కునేవారే కాదు. ఆయన ప్రభావం నామీద చాలానే ఉంది. నేను కూడా ఆయనలా సింపుల్‌గా ఉండటానికి ప్రయత్నించేవాడ్ని.

బెరుకు తగ్గించుకుంటేనా..
ఆరోజుల్లో మేం ఒక్కరమే కాదు, ఊళ్లోని రైతు కుటుంబాలన్నీ కూడా మరీ చిన్నచిన్న అవసరాలు సైతం తీరక కటకటపడేవాళ్లు. ఒకసారి మా నాన్నకు అత్యవసరంగా ఎపెండిసైటిస్ ఆపరేషన్ చెయ్యవలసి వచ్చింది. అప్పట్లో అది చాలా చిన్నమొత్తమే. కానీ అదే సర్దుబాటు కాక అవస్థ పడ్డాం. బహుశా అలాంటి పరిస్థితుల వల్లే మాలో చాలామందికి జీవితంలో ఏదైనా సాధించాలన్న ఫైర్ ఉండేది.

ఇప్పటికీ విద్యాసంస్థల్లో గమనించి చూస్తే అన్నీ అమరిన పట్టణ ప్రాంతాల పిల్లల కన్నా గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లోనే పట్టుదల ఎక్కువగా కనిపిస్తుంది. కానీ వాళ్లకు తమలోని శక్తియుక్తులు సరిగ్గా తెలియవు. దాంతో ఆత్మవిశ్వాసం లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఆ బెరుకు జీవితాంతం ఉండిపోతుంది కొందరిలో. దీనికి నేనే ఉదాహరణ. బస్టాండుకో, రైల్వే స్టేషనుకో వెళితే మామూలుగానే ఉంటాను. అదే విమానాశ్రయానికి వెళితే మాత్రం నాకెందుకో తెలియని బెరుకు ఆవహిస్తుంది. ఇంత పెద్దవాడినైనా, ఇంగ్లీష్ బాగా వచ్చినా, చేతిలో డబ్బున్నా కూడా అలాంటి చోటకు వెళ్లినప్పుడు నా లోపలి పల్లెటూరి మనిషికి ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది.

చదువుతోనే మార్పు
ఈమధ్యే మా ఊళ్లోని కాలేజీకి నన్ను కరస్పాండెంటుగా ఎన్నుకున్నారు. అందుకే మా ఊరి కాలేజీలో సంప్రదాయ కోర్సులకు తోడు ఎంసీయే, ఎంబీయేలను కూడా ప్రారంభించాం. అక్కడికి వచ్చేది ఎక్కువగా చాలా పేద పిల్లలే. వాళ్లకివి అందుబాటులో ఉండటంతో బాగా చదువుకోగలుగుతున్నారు. ఈ సంవత్సరం ఫలితాలు చాలా బాగా వచ్చాయి.

జిల్లాలో ఎయిడెడ్ కాలేజీల్లో మాదే ప్రథమ స్థానంలో నిలిచింది. గ్రామీణ బాలబాలికలకు కూడా ప్రపంచస్థాయి విద్య అందుబాటులో ఉంచాలన్న ధ్యేయంతో ‘నెక్ట్స్‌జెన్’ పేరుతో ఓ పాఠశాలను మా ఊళ్లో ప్రారంభించాను. దాదాపు 850 మంది వెనకబడిన వర్గాల విద్యార్థులు దానిలో చదువుకోగలుగుతున్నారు. పోషకాహార లోపం ఉండకూడదని వారికి సాయంత్రం స్నాక్స్ వంటివి అందిస్తున్నాం. ప్రస్తుతం ఊరికి మంచి వైద్యం అందించాలనే ప్రయత్నంలో ఉన్నాను. కుటుంబ పరిస్థితిని మార్చే సామర్థ్యం చదువుకే ఉందని నేను బలంగా నమ్ముతాను. అందుకే ఆ దిశగా మా ఊరి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాను.”

‘లావు వీరభద్రస్వామి’
మా ఊళ్లో మా ఇంటి పేరున్న కుటుంబాలు ఎక్కువ. ‘లావు’ కుటుంబాలకు వీరభద్రస్వామి కులదైవం. ఈ కుటుంబాలన్నీ కలిసి ఏడాదికోసారి ఆయనకు కొలుపులు చేస్తారు. అది కూడా తిరునాళ్లలాగా అట్టహాసంగా జరుగుతుంది. అప్పుడు కొంచెం వీరశైవ భక్తిని ప్రదర్శిస్తారు. అంటే ఒంటికి దబ్బనాలు గుచ్చుకుని, నిప్పుల్లో నడిచి… ఇలా తమ భక్తిని చాటుకుంటారు. మా ఇంటిపేరు వాళ్లకు మరో ఆచారమూ ఉంది మా ఊళ్లో. అదేంటంటే పెళ్లికి ముందురోజున ఆడపిల్లయితే అబ్బాయిలాగా, వరుడైతే వధువులాగా తయారై ఊరేగింపుగా వీరభద్రస్వామి గుడి కి వెళ్లి మొక్కడం. ఇరవై ముప్పయ్యేళ్లుగా ఈ కొలుపులు సరిగా జరగడం లేదు.

దాంతో ఊళ్లో పరిస్థితి మారుతోందనిపించి మళ్లీ ఇప్పుడు వాటిని ఘనంగా చెయ్యడం మొదలుపెట్టారు. నేను దేవుణ్ని విశ్వసిస్తాను. ప్రతిఏటా మా విద్యాసంస్థల్ని ప్రారంభించినప్పుడు పూజ చేస్తాం. మా సాంకేతిక విశ్వవిద్యాలయం తెరిచే రోజున కూడా పూజ చేస్తుంటే కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు అదేంటని అడుగుతుంటారు. మనల్ని మించిన శక్తి ఉందని, దాన్నే దేవుడంటామని చెపుతాను నేను.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.