కన్యాశుల్కం’ నాటకానికి కొత్త వెలుగులు
June 24, 2013
ఇటీవల హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో కొత్త నటీనటులతో ‘కన్యాశుల్కం’ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు హాలు కిటకిటలాడిపోవడం నిజంగా నిర్ఘాంతపరచింది. సంజయ్ కిశోర్‌కు చెందిన ‘సంగమం’ అనే సాంస్కృతిక సంస్థ నిర్వహణలో డి.ఎస్. దీక్షిత్ దర్శకత్వంలో ప్రదర్శించిన ఈ నాటకాన్ని చూడడానికి వేలాది మంది రవీంద్ర భారతికి చేరుకున్నారు. వీరంతా తమకు హాలులో చోటు దొరికినా దొరకకపోయినా ఎంతసేపైనా నిలబడి నాటకాన్ని చూడడానికి సిద్ధమై వచ్చినట్టు కనిపించింది. వాస్తవానికి చోటు దొరకక నిరాశతో వెనుతిరిగిన వారి సంఖ్య కూడా వందల్లో ఉంటుంది. ఈసారి ప్రదర్శనలో ఉత్తేజ్, ఝాన్సీ వంటి సినీ నటులు కూడా పాల్గొనడం విశేషం. ఇంతవరకూ వయసు మీరినవారే ఇందులోని గిరీశం పాత్రను పోషించడం చూసిన ప్రేక్షకులకు ఉత్తేజ్ వంటి యువ నటుడు ఈ పాత్రలో ఒదిగిపోవడం, మధురవాణి పాత్రను ఝాన్సీ అద్భుతంగా పోషించడం ఆశ్చర్యం, ఆనందం కలిగించాయి.
మొత్తం మీద వెండితెర వెలుగులతో ఈ 120 ఏళ్ల ‘కన్యాశుల్కం’ ఇప్పుడు తెలుగునాట సరికొత్త జిలుగులు కుమ్మరిస్తోంది, 1892 ఆగస్టు13 న విజయనగరం కోటలో రాచ కుటుంబీకులు, బ్రిటిష్ అధికారులు కలిసి చూసిన ఆ నాటకం ఇప్పుడు కూడా దాదాపు అదే స్థాయిలో ఆదరణ పొందుతోంది. నాటకాలు చూసేవారు తగ్గిపోయారని, అందులోనూ గురజాడ అప్పారావు రాసిన చరిత్రాత్మక ‘కన్యాశుల్కం’ నాటకానికి కూడా ఆదరణ తగ్గిపోయిందని పొడిపొడి కన్నీళ్ల ఉపన్యాసాలు చెప్పేవారికి ఈ నాటక ప్రదర్శన, దానికి లభించిన జనాదరణ ఓ సమాధానంగా కనిపించింది. ఏడు తరాలుగా ఈ నాటకానికి లభిస్తున్న ఆదరణ మరో ఏడు తరాలైనా కొనసాగుతుందనే భావన అది చూసిన వారికి ఎవరికైనా కలుగుతుంది.
రవీంద్ర భారతిలో జరిగిన తాజా ప్రదర్శన తీరును స్వయంగా చూసిన సాంస్కృతిక శాఖ సంచాలకుడు రాళ్లబండి కవితా ప్రసాద్ ఈసారి 5500 మంది హాయిగా చూసేలా లలిత కళాతోరణంలో ఈ నాటకాన్ని ప్రదర్శిస్తామని, దీనికయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. సినిమాలు, టీవీలలో ఎన్ని పాత్రలు వేసినా కలగని ఆనందం, తృప్తి, ఎదురు చూడని ఆదరణ ఈ ‘కన్యాశుల్కం’ నాటక ప్రదర్శనలో కనిపిస్తోందని కళాకారులు కూడా పరవశించిపోతున్నారు. ఇక మీదట తెలుగువారికి తమ నాటకాన్ని మరింత ఆకర్షణీయంగా అందించాలని వారు భావిస్తున్నారు.
ప్రపంచ నాటక చరిత్రలోనే ప్రత్యేక అ««ధ్యాయం సృష్టించిన ఆ నాటకంపై ఎందరో సాహితీవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తెలుగు తెలిసినవారంతా చూడటానికి చదవటానికి ఎంతో మక్కువ చూపే ‘కన్యాశుల్కం’ నాటకంలోని పాత్రలను అభినయించటానికి నటులు కూడా ముందుకు వస్తున్నారు. సంగీతభరితమైన రాగాలు, వన్స్మోర్లు, కానుకల చదివింపులతో ఒకప్పుడు ఈ నాటకం హోరెత్తిపోయింది. పద్య నాటక ప్రదర్శనల కాలంలో, అంటే దాదాపు 1960ల వరకూ ఈ నాటకం కనీ వినీ ఊహించని విధంగా జనాదరణ పొంది రికార్డులు సృష్టించింది. ఈ నాటక నిర్వాహకులు ఇప్పుడు దీని ప్రదర్శనలో ఒక కొత్త ఒరవడిని ప్రవేశపెడుతున్నారు. జనం రాత్రి భోజనాలు ముగించుకుని తెల్లారకట్ల దాకా ఈ నాటకాన్ని చూసేవారు. అయితే, కాలం మారడంతో నిర్వాహకులు 3 గంటల నిడివిలో నాటక ప్రదర్శనను ముగించడానికి కసరత్తులు చేస్తున్నారు. నిజానికి 1892 నుంచి 2013 దాకా ఆ నాటక ప్రదర్శనలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం సహజమైన విషయమే.
హైదరాబాద్‌కు చెందిన ‘రసరంజని’ సంస్థ గతంలో 23 సార్లు కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించింది. వచ్చే జూలైలో కూడా ఇది ఈ నాటకాన్ని ప్రదర్శించడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు ఈ నాటకం గురించి క్షుణ్ణంగా చదివి, అనేక పర్యాయాలు దీన్ని నాటకంగా ప్రదర్శించడం జరిగింది. ఇంతవరకూ సుమారు 150 నాటకాల్లో నటించిన దీక్షిత్ ఈ నాటకానికి దర్శకత్వం వహించారు. ఆయన దీన్ని హైదరాబాద్‌లోనే ప్రదర్శించారు. రెండవ పర్యాయం ఒంగోలులో ప్రదర్శించారు. ఆయన ఈ నాటకాన్ని ప్రదర్శించడం (రవీంద్ర భారతిలో) ఇది మూడవసారి.
కోటలో మొదటి మెట్టు
చదవటానికి తప్ప వేయటానికి పనికిరాదంటూ అంతా పెదవి విరిచిన ‘కన్యాశుల్కం’ నాటకాన్ని ఆ తరువాత గురజాడ కళ్ల ముందే అద్భుతంగా ప్రదర్శించి ప్రశంసలు పొందారు. నాటి ఆనందగజపతి రాజుకు అంకితమిచ్చిన ఈ నాటకానికి దర్శకుడు ఇంగ్లీషు, సంస్కృత నాటకాల్లో మాదిరిగానే నాందీ ప్రస్తావన చేశారు. జగన్నాధ విలాసిని సభ వారు వాసా జగన్నా«థరావు నిర్వహణలో మొదటిసారిగా ఈ నాటకాన్ని వేదిక పైకి తెచ్చారు. ఆ తరువాత వందలాది మంది నిర్వాహకులు, కళాకారులు దీని ప్రదర్శనకు మరిన్ని వన్నెలు దిద్దారు. ఈ నాటకాన్ని చూసిన ప్రేక్షకులు వన్స్మోర్లతో ఈ నాటకాన్ని మళ్లీ మళ్లీ వేయించుకుని చూశారు. దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా ‘నటాలి’ పేరుతో రిపర్టరీని ఏర్పాటు చేసి, మహామహులతో గురజాడ పాత్రలను పోషింపజేసిన అబ్బూరి రామకృష్టా రావు కృషి నిజంగా మరచిపోలేనిది. తెలుగు నాట తొలి విశ్వవిద్యాలయంగా నెలకొన్న ఆం«ధ విశ్వవిద్యాలయంలో కొద్ది రోజులకే యూనివర్సిటీ నాటక సమితిని ఏర్పాటు చేసి మొదటి నాటకంగా కన్యాశుల్కాన్ని ప్రదర్శించారు. విశేషమేమిటంటే అప్పుడే ఈ నాటకాన్ని 3 గంటల నాటకంగా కుదించారు.
సుమారు 12 గంటల నిడివి తప్పని అసలు రచనను ముందుగా 8 గంటలకు, ఆ తరువాత 6 గంటలకు, ఆ తరువాత 3 గంటల నుంచి 2 గంటల ఇరవై నిమిషాల కుదించారు. ఇప్పుడు ప్రదర్శిస్తున్నది ఆ నాటకాన్నే. 1932 లో వాల్తేరులో యూనివర్సిటీ వేదికపై అందరి మెప్పూ పొందిన అగ్రశ్రేణి మేధావులు, విద్యార్థులు ఆయా పాత్రల కోసం రంగు పూసుకున్నారు. అప్పటికే తెనాలిలో అభిమానులు, కళాకారుల్ని కూడగట్టి అబ్బూరివారు 1924లో రామవిలాస సభను ప్రారంభించి, ఆ బృందంతో శతాధిక ప్రదర్శనల రికార్డు సృష్టించార అలా విస్తరించిన ఆ నాటకం వేరు వేరు సమాజాలు ఉద్దండ కళాకారులతో సాటి లేని మేటి నాటకంగా పేరు ప్రతిష్ఠలు పొందింది. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ నాటకానికి ప్రభుత్వ ప్రోత్సాహం వరించి వచ్చింది. 1962లో హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రత్యేకమైన వేదికపై ఆ నాటకాన్ని ప్రదర్శించారు. 3డీలో వేదిక అలంకరణ ప్రారంభమైంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న బక్షి శ్రీరాం ఈ ప్రదర్శనకు ఏర్పాటు చేసిన 300 స్పాట్ లైట్లు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. అప్పట్లో రామచంద్ర కాశ్యప గిరీశంగా, ఆ రోజుల్లో విశాఖపట్నంలో మంచి పేరు గడించిన సత్తిరాజు మ«ధురవాణిగా అద్భుతంగా నటించి మెప్పించారు.
నటీనటుల్లో ఆసక్తి
ఆ నాటకాన్ని తీర్చిదిద్దిన అబ్బూరి రామకృష్ణారావు ప్రతిభ ఆ తరువాత కూడా వందలాది మంది కళాకారులకు స్ఫూర్తిదాయకమైంది. మద్రాసులో జరిగిన నాటకాన్ని చూసి పరవశించి పోయిన జి.టి.బి. హార్వే లక్ష రూపాయల విరాళం ఇచ్చి నటాలి సంస్థ నాటకాలలో అద్బుతాలు విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. అప్పట్లో స్టేజీ మేనేజర్‌గా వ్యవహరించిన ఆనంద మోహన్ ఇందులోని వెంకటేశం పాత్రను పోషించగా, ఇప్పుడు 75 ఏళ్ల ప్రాయంలో అత్యున్నత నాటక రంగ పురస్కారం అందుకొన్న కె.ఎస్.టి. సాయి కూడా ఉత్సాహంగా పాత్రలు ధరిస్తామంటున్నారు. ఇక గతంలో జె.వి. రమణమూర్తి, ఆయన తమ్ముడు జె.వి. సోమయాజులు తమ బృందంతో ఊరూరా తిరిగి నాటక ప్రదర్శనలిచ్చి జేజేలందుకొన్నారు. గోవిందరాజుల సుబ్బారావు, గొల్లపూడి మారుతీరావు కూడా ఆ తరువాత ఈ నాటకాన్ని అనేక ప్రాంతాల్లో ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు. మాటలతో బురిడీలు కొట్టించే గిరీశం పాత్రను వారు తమ అత్యద్భుత నటనతో మరింతగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. తెలుగు నాటకాల్లో ఆడవేషాల అందగాడుగా ఆదరణతో పాటు పద్మశ్రీ పురస్కారం కూడా పొందిన స్దానం నరసింహారావు వంటివారు కూడా ఇందులో నటించి నాటకాన్ని రక్తి కట్టించారు.
మరో విశేషమేమిటంటే, నిజ జీవితంలో వేశ్యలుగా ఉన్నవారు కూడా వేదిక పైకి వచ్చి నాటకంలోని వెలయాలు మధురవాణిగా సటించారు. వీరి సంఖ్య 80కి పైగా ఉంటుందని భావిస్తున్నారు. దాడి గోవిందరాజుల నాయుడు, బి.ఎస్. జోస్యుల వంటి విద్యావంతులు ఉన్నతమైన వ్యక్తిత్వం గల వేశ్యగా నటించి అవగాహన పెంచారు. 1991 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆ నాటకం ప్రత్యేకతలపై కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్, పుస్తకంతో పాటు జిజ్ఞాస పేరిట గోష్టి నిర్వహించారు. 1955లో సినిమాగా, 1990లో దూరదర్శన్ వారి సీరియల్‌గా, 2005లో చెన్నైకు చెందిన అభిమాని ద్వారా ‘మా టీవీ’ సీరీయల్గా ఈ కన్యాశుల్కం నాటకం లక్షలాది మంది అభిమానుల్ని కూడగట్టుకుంది. తర తరాల తరాల వారసత్వాన్ని మూటగట్టుకొంది.
నాటకానికి కొత్త హంగులు
నాటక రంగంలో విశేషానుభవం ఉండడమే కాకుండా, కన్యాశుల్కం పట్ల ప్రత్యేకాభిమానం ఉన్న డి.ఎస్. దీక్షిత్ మున్ముందు తెలుగునాట దీన్ని మరింత విస్తృతంగా ప్రదర్శించాలనే ఊపులో ఉన్నారు. ఆయన పద్మభూషణ్ ఎ.ఆర్ కృష్ణ స్థాపించిన ‘నాట్య విద్యాలయ’లో నటన నేర్చుకున్నారు. “నాటక ప్రదర్శనలో రిపర్టరీ వల్ల ఒనగూడే మేలు అవగతం అయింది. చాలా కష్టనష్టాలతో అప్పటి రిపర్టరీని కొనసాగిస్తున్నాం. ఆ రోజుల్లో నీరాజనాలు అందుకొన్న కన్యాశుల్కం నాటకాన్ని ఈ తరానికి అందించాలని భావిస్తున్నాం. ఈ దిశగా వీలయినన్ని ప్రయత్నాలు చేస్తే ఇన్నాళ్లకి ఇది వేదిక పైకి వచ్చింది. పాత్రదారుల ఎంపికపై చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. తరాలు మారాయి. అభిరుచులు మారాయి. గతంలో గురజాడ పాత్రల వయసు, మనసులకు సంబంధం లేకుండానే అబినయం ప్రధానంగా నాటకాలు జరిగాయి. గిరీశంగా నటించినవారు పాత రోజుల్లోనే 50 ఏళ్ల పైబడినవారు. పొట్టలు పెరిగి సరిగ్గా నడవలేక పోయినా డైలాగుల వల్ల నాటకం నడిపించి మెప్పించేవారు” అని ఆయన అన్నారు.
అయితే, ఈ తరం వారికి గిరీశం పాత్రను యువ పాత్రగా చూపించాలనే ఉద్దేశంతో ఉత్తేజ్‌ను ఎంపిక చేసినట్టు ఆయన చెప్పారు. ఇందులో నటించడానికి పలువురు సినిమా నటులు ఆసక్తి చూపించినప్పటికీ, చివరికి ఉత్తేజ్, ఝాన్సీలను కీలక పాత్రలకు ఎంపిక చేసినట్టు ఆయన చెప్పారు. “ప్రసిద్ధ నటులు మురళీ మోహన్, రాళ్లపల్లి వంటి వాళ్లు మక్కువతో వచ్చారు. సుబ్బరాయ శర్మ, రాగిణి వంటివారితో పాటు బుల్లితెర కళాకారులు కూడా ముందుకు ఆసక్తిగా వచ్చారు” అని ఆయన చెప్పారు. ఆయన కూడా ఇందులో ఓ పాత్ర పోషించారు. ‘సంగమం’ సంస్థ ఇప్పటికి 3 ప్రదర్శనల్ని విజయవంతంగా పూర్తి చేసింది. అంతేకాక, ఈ నాటక ప్రదర్శనకు గురజాడ 150 ఏళ్ల జయంతి, ఈ నాటకం 120 ఏళ్ల వైభవం కలసి వచ్చాయి.
– జి.ఎల్.ఎన్. మూర్తి