‘తాగుబోతును చూడ్డానికి సినిమాకే వెళ్లాలా!’

ఫిల్మ్‌నగర్ : ‘తాగుబోతును చూడ్డానికి సినిమాకే వెళ్లాలా!’

June 22, 2013

– కంపల్లె రవిచంద్రన్s

అక్కినేని ‘పల్లెకుపోదాం పారును చూద్దాం చలోచలో’ అని ఉరకలెత్తే యవ్వనోత్సాహంతో గుర్రబ్బండి తోలుకొస్తున్నాడు. ఆ బొమ్మ చూడగానే నా మనసూ కీలుగుర్రమెక్కిన అక్కినేనిలాగా ఆనందోద్వేగానికి గురైంది. సినిమా మొత్తం రెప్పలార్పకుండా చూశాను. ఇల్లు చేరగానే మా అమ్మ ఏదో పేద్ద యుద్ధం నుంచి కొడుకు తిరిగి వచ్చినట్లు నాకు దిష్టి తీసింది. రెండు రోజుల నిరీక్షణ ఫలించింది.

ఇది 1986-87 నాటి సంగతి… నాన్నంటే భయం. ఒట్టి భయం కాదు. చచ్చేంత భయం. సర్వాంగాలూ ఎక్కడివక్కడ బిగుసుకుపోయేంత భయం. అయినా ‘దేవదాసు’ కోసం తెగించాను. మా ఎదురింటి పక్కసందులో గోడమీద చూసిన ‘దేవదాసు’ వాల్‌పోస్టరే నా భయాన్ని జయించేలా చేసింది. నాకోసమే దేవతలెవరో తెచ్చి దాన్ని అక్కడ అతికించినట్లుంది. ఒక చేతితో చిన్న కర్ర పట్టుకొని మరో చేత్తో సావిత్రి చెవిని మెలిపెడుతున్నాడు అక్కినేని నాగేశ్వరరావు. నీలిరంగులో ఉందా పోస్టర్. ఆ కిందే వేదాంతం రాఘవయ్య, డి.ఎల్.నారాయణ, సి.ఆర్.సుబ్బురామన్ అని పెద్ద పెద్ద అక్షరాల్లో పేర్లు. కానీ అక్కినేని, సావిత్రి తప్ప మరెవ్వరూ తెలీదు నాకు. వాళ్లెవరో, వాళ్ల పేర్లన్నీ అక్కడెందుకున్నాయో నాకర్థంకాక నిలబడి ఉంటే పక్కవీ«ధి మస్తాన్‌బాషా కొడుకు సైకిల్‌తో గుద్దేశాడు. ఎలాగో లేచి ఇంటికొచ్చాను.

అమ్మను డబ్బులడిగాను. అర్థరూపాయిచ్చింది. ఆ అర్థరూపాయితో పాటు నాకు మా చెల్లెల్ని కూడా అంటగట్టింది. “నా దగ్గరున్నది ఇదే. సినిమాకే వెళ్తావో, బుద్ధిగా స్కూలుకు వెళ్లి, అక్కడేమైనా కొనుక్కొని తింటావో నీ ఇష్టం” అని ఖరాఖండిగా చెప్పేసింది. ఆ లంకంత కొంపలో ఆ క్షణంలో మా అమ్మ నా ప్రాణానికో పెద్ద లంఖిణిలా, ఆ అర్థరూపాయిలో భాగస్వామైన నా చెల్లెలు మాధవీలత శూర్పణఖలా అన్పించారు. సరే నాన్ననే అడిగితే పోలా… అంతకు మూడు రోజుల ముందే మా ఊరు (చిత్తూరు జిల్లా పుంగనూరు) బి.ఆర్.టాకీస్‌లో చూసిన ‘పాతాళభైరవి’ సినిమా గుర్తుకువచ్చింది.

‘ధైర్యే సాహసేలక్ష్మీ’ అనుకున్నా. నెమ్మదిగా మా చెల్లెల్ని తీసుకొని నాన్న గదిలో కెళ్లాను. చండశాసనుడు మా నాన్న. గిరిజలా ‘ నరుడా…ఏమీ నీ కోరిక’ అని అనాలి కదా. అనలేదు. చాలా సీరియస్‌గా ఏదో టైపు చేసుకుంటున్నాడు. ఆ క్షణంలో నేను అడగాలనుకున్నది అడిగితే ఆ టైపుమిషను మీద పరుగెడుతున్న వేళ్లు నా వీపు మీద పరుగెడుతాయనిపించి గుండె ఝల్లుమంది. నేను, మా చెల్లెలు మౌనంగా నిలబడ్డాం. మా మౌనం మా నాన్నను ఏవిధంగానూ చలింపచేయలేదు. పైపెచ్చు నన్ను చూడగానే వంటగదిలోకెళ్లి మా అమ్మనడిగి కాఫీ తీసుకు రమ్మన్నాడు. సమయం ఉదయం తొమ్మిదిన్నర. సినిమా ప్రారంభమయ్యే సమయం పదిన్నర.

image2
కానీ పాత సినిమా కనుక పదిహేను నిమిషాలు ముందుగానే ప్రారంభిస్తారు. కాఫీ పట్టుకెళ్లి ఇచ్చేటపుడు డబ్బులడుగుదామనుకున్నాను. కానీ భయంలో చిన్నముల్లు అప్పటికే పదకొండు మీదకు వచ్చిందని గమనించనే లేదు. సరే మధ్యాహ్నం అడుగుదామనుకున్నాను. కోర్టుకెళ్లిన నాన్న సాయంత్రానికిగాని ఇంటికి రాలేదు. సరే రాత్రి పడుకునే ముందు అడుగుదామనుకున్నాను. ఒకవేళ దెబ్బలు పడితే రాత్రంతా నిద్ర ఉండదని ఊరుకున్నాను. ఏదో అసంతృప్తి. సినిమా ఎలాగూ చూడలేదు. కనీసం అక్కినేనిని వాల్‌పోస్టర్‌లోనైనా చూసి తృప్తి పడదామంటే రాత్రి గనుక బయటికి పంపరు. ఏం చేయాలి?

ఆ రాత్రంతా అరకొర నిద్రే. ఉదయం ఆరుగంటలైందనుకుని మూడు గంటలకే నిద్రలేచేశాను. రోడ్డుమీదకు వెళ్లి వాల్‌పోస్టర్ చూద్దామనుకున్నాను. కాని తలుపుగడియ అందదు. మా అమ్మేమో సరిగ్గా ఆరుగంటలకే నిద్రలేస్తుంది. ఎందుకు మా అమ్మ అందరిలాగా ఉదయం ముగ్గెయ్యదు… ముందు రోజు రాత్రే ఎందుకు ముగ్గులు పెట్టేస్తుందని తిట్టుకున్నాను. నా మనసులోని ఆరాటం ఆ క్షణంలో దేవుడికి తెలిస్తే ఎంత బావుంటుందోననిపించింది. అయితే దేవుడు నిజంగానే నా మొర ఆలకించాడు.

ఎప్పుడూ ఆలస్యంగా వచ్చే పాల సుబ్బయ్య ఆ రోజు ఎందుకో కాస్త ముందుగా వచ్చేశాడు. అతణ్ణి దేవుడే పంపించాడనుకున్నాను. ఆ సాకుతో బయటికెళ్లి వాల్‌పోస్టర్ చూద్దామనుకున్నాను. బయటకొస్తుంటే మా పెద్దక్కయ్య శైలజ ‘చీకట్లో ఎక్కడికిరా సతీష్’ (నా చిన్నప్పటి పేరు) అని కేకేసింది. అక్కను చింతబరికెతో చీరేయాలన్నంత కోపం. అప్పుడే వాల్‌పోస్టర్ చూసేందుకు బయటికి వెళ్లగలిగితే మా అమ్మ ఇచ్చే డబ్బుల్లో పదిపైసలు హుండీలో వేస్తానని దేవుడికి మొక్కుకున్నా.

దేవుడు ప్రలోభపడ్డాడేమో. కాఫీపొడి తెమ్మని మా అమ్మ తను తయారుచేయబోయే కాఫీకంటే కమ్మగా చెప్పింది. వెనకాముందు చూడకుండా పరుగెత్తుకు వెళ్లాను. కానీ అంతలోనే నేను మొక్కుకున్న దేవుడు నాపై శీతకన్ను వేశాడో, లేక నా తాపత్రయం సరిగ్గా అర్థం కాలేదో, దేవదాసు పోస్టరే ఆ గోడ మీద లేదు. దాని మీద ‘అగ్గిపిడుగు’ పోస్టరేశారు. రాజశ్రీ ఆహ్లాదకరంగా ఉన్నా, ఎన్టీఆర్ మాత్రం పెద్ద రాక్షసుడిలా కనిపించాడు నా కళ్లకు. ఆ పోస్టర్ నా నెత్తిన పిడుగులే వేసింది.

అప్రయత్నంగానే అక్కడున్న రాళ్లన్నీ ఎత్తి ఆ పోస్టర్ మీద వేసేశాను. ఎదురింటి షావుకారు శెట్టి కూతురు ఉమ “ఎందుకురా రామారావుపై రాళ్లేస్తున్నావు” అని గట్టిగా గదమాయించింది. ఆ అదిలింపుకు కారణం రామారావు మీద అభిమానం కాదు.. నేను చిన్నపిల్లాడిని, నా వయసుకు తగ్గ పనికాదనీ కాదు, ఆ పోస్టర్ అతికించింది వాళ్ల ఇంటి గోడకు కాబట్టి. నేనేమో బాధగా, భయంగా ‘దేవదాసు’ వెళ్లిపోయాడు కదా అన్నా. ‘నీకేమి పిచ్చా, వెర్రా, దేవదాసు బి.ఆర్.టాకీస్‌లో ఈ పోస్టర్ సినిమా తాజ్‌మహల్‌లో. థియేటర్ పేరైనా చూసేది లేదురా వెధవా’ అన్నది ఉమక్క.

నా మనసు ‘సువర్ణసుందరి’ సినిమాలో రాక్షసుడి కమండలం అమృతం చిలికిస్తుంటే రాజసులోచన ఎగిరినట్లు ఎగిరింది. కాని ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. నా కోసం ఎదురుచూడలేక ఇంట్లో కాఫీ కావాల్సిన పాలు టీ అయిపోయాయి. వాళ్లేమి తాగితే నాకేంటి. కానీ ‘అగ్గిపిడుగు’పై కురిపించిన రాళ్లవర్షంలో నా చేతిలో పావలా జారిపోయింది. మరిప్పుడెలా? అలాగే రిక్తహస్తాలతో ఇంటికొచ్చాను. అమ్మచేతిలో నా బుర్ర రామకీర్తన పాడింది. ఆ వాతావరణంలో మా నాన్నను దేవదాసు టికెట్ గురించి అడగలేక మౌనంగా స్కూలుకు బయల్దేరాను.

నాకిప్పుడు దేవదాసు సినిమా చూడాలనే దానికంటే ఆ పోస్టర్‌ను చూడాలనే కోరిక ఎక్కువయిపోయింది. ఆ రోజుల్లో వాల్‌పోస్టర్లు ఎక్కడ పడితే అక్కడ వేసేవారు కాదు మా ఊళ్లో. కొన్ని కొన్ని ప్రదేశాల్లో మాత్రమే వేసేవారు. బజారువీధికి ముందర శ్రీ వెంకటేశ్వరా పిక్చర్స్, కడప స్వీట్ స్టాల్‌పైన బి.ఆర్.పిక్చర్స్, సెంటర్‌లో ఇండియన్ బ్యాంకు ముందర అలంకార్ పోస్టర్లు అతికించేవారు. మధ్యలో చూద్దామన్నా చిన్న పోస్టర్లు సరిగ్గా కన్పించేవి కావు. ఆశ్చర్యం. మా స్కూలు దగ్గరికి లగెత్తుకెళ్లేసరికి నయన మనోహరంగా నా చేతికే ఇస్తున్నట్లుగా పేద్ద వాల్ పోస్టర్‌లో మందుగ్లాసుతో నా ఆరాధ్యనటుడు అక్కినేని. ప్రాణం అప్పటికి కుదుటపడింది.|

ఆరోజు ఎంత ప్రయత్నించినా నాన్న దగ్గర డబ్బు తీసుకోవడం కుదరలేదు. మా ఊర్లో దేవదాసు ఉండేది ఇక ఒక్కరోజు మాత్రమే. ఏమైతే అది అవుతుందని మా నాన్నని ధైౖర్యం చేసి డబ్బులడిగేశాను. ‘సినిమా కెళ్తావా? డబ్బుకావాలా? ఏ సినిమా?’ అని చాలా నిర్లక్ష్యంగా అడిగారాయన. భయపడుతూనే ‘దేవదాసు’ అని చెప్పాను. నాన్న చేతి ఐదువేళ్లూ నా పాలబుగ్గ మీద అచ్చుపడ్డాయి. ‘తాగుబోతును చూసేందుకు సినిమాకే వెళ్లాలా?’ ఇదీ నాన్న వ్యాఖ్యానం. నన్ను కొట్టినదానికన్నా, ఆ సినిమాపై ఆయన చేసిన కామెంట్ నన్ను చాలా బాధపెట్టింది. ఆ దిగులుతోనే స్కూలుకెళ్లాను. కానీ అక్కినేని నాగేశ్వరరావుపై నాకున్న అభిమానం గొప్పదేమో! నాన్న మనసు కరిగింది. కోర్టుకు వెళుతూ స్కూలు దగ్గర కారు ఆపి మరీ రూపాయిన్నర ఇచ్చి వెళ్లారు. మా నాన్నను గట్టిగా కౌగిలించుకున్నాను. మధ్యాహ్నం బడిలేదు గనుక మాట్నీకి చెక్కేద్దామనుకున్నాను.

ఇంతలో మరో ఉపద్రవం వచ్చిపడింది. మా అమ్మమ్మ అప్పుడే బస్సు దిగి మనవణ్ణి చూసి వెళ్దామని నేరుగా స్కూలు దగ్గరికే వచ్చింది. నా చేతిలో డబ్బు చూసింది. ఊళ్లో ఎక్కడ చూసినా దొంగలే. చేతిలో డబ్బులుంటే పిల్లల్ని పట్టుకెళ్లిపోతారని నానాయాగీ చేసింది. ఎలాగో ఆమెను ప్రాధేయపడి టాకీసు దగ్గరికి వచ్చేశాను. అప్పుడే టికెట్ కౌంటర్ క్లోజ్ చేశారు. నా మొహం జూనియర్ శ్రీరంజని మొహంలా అయిపోయింది. నిస్సహాయంగా థియేటర్ వద్ద ఉన్న అశోకవృక్షాల దగ్గర నిలబడి ఉంటే, టికెట్లు ఇచ్చే గురువయ్య నన్ను గుర్తుపట్టాడు. అతడు మా నాన్న క్లయింట్. ఆ కారణంతోనే ఆయన నన్ను ఉచితంగానే థియేటర్లోకి పంపాడు.

అక్కినేని ‘పల్లెకుపోదాం పారును చూద్దాం చలోచలో’ అని ఉరకలెత్తే యవ్వనోత్సాహంతో గుర్రబ్బండి తోలుకొస్తున్నాడు. ఆ బొమ్మ చూడగానే నా మనసూ కీలుగుర్రమెక్కిన అక్కినేనిలాగా ఆనందోద్వేగానికి గురైంది. సినిమా మొత్తం రెప్పలార్పకుండా చూశాను. ఇల్లు చేరగానే మా అమ్మ ఏదో పేద్ద యుద్ధం నుంచి కొడుకు తిరిగి వచ్చినట్లు నాకు దిష్టి తీసింది. రెండు రోజుల నిరీక్షణ ఫలించింది. ధైర్యే సాహసే లక్ష్మి అన్నది సత్యమనిపించింది. ఆ సినిమా వల్లే నేను సినిమా పాత్రికేయుణ్ణయ్యాను.

చిన్నప్పుడు ఏ అక్కినేని బొమ్మ చూస్తే చాలు నా జన్మ ధన్యమని అనుకునే వాణ్ణో… అదే అక్కినేనిని పెద్దయ్యాక ఎన్నోసార్లు కలుస్తానని, మా మధ్య గాఢపరిచయం ఏర్పడుతుందని ఆ రోజున నేనూహించలేదు. అయితే ఆ దేవదాసును ఎన్నిసార్లు చూసినా కన్నీటి కాలువలే కళ్లు. కొన్ని సినిమాలు అలా నిలిచిపోతాయి మరి!|

వ్యాసం, ఫోటోలు(సేకరణ): – కంపల్లె రవిచంద్రన్, 9848720478

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.