అందరూ దేవ ‘దాసు’ లే!

అందరూ దేవ ‘దాసు’ లే!

June 26, 2013


‘దేవదాసు’ సినిమా విశేషాలు తెలుగువారికి తెలియనివి కావు. శతదినోత్సవాల్లో, సిల్వర్, గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో, పత్రికల్లో, ప్రత్యేక సంచికల్లో, ఆత్మకథల్లో ఈ క్లాసిక్ గొప్పదనం గురించి పదే పదే వస్తూనే ఉంటుంది. ఆ ‘పదే పదే’లో నేటి షష్టిపూర్తి సందర్భం కూడా ఒకటి. తెలుగు దేవదాసు సినిమాకు 60 ఏళ్లు నిండిన సందర్భంగా ఆ సినిమాకు పనిచేసిన కొందరి ప్రముఖుల అనుభూతులివి.

‘దేవదాసు’ను రీమేక్ చేయడం అసాధ్యం -అక్కినేని
ఇప్పుడు వస్తున్న సినిమాలు శరీరాన్ని మాత్రమే కదిలిస్తున్నాయి. కానీ ‘దేవదాసు’ అలా కాదు.. అది మనసును, ఆత్మను, బుద్ధిని కదిపే సినిమా. కావునే 60 ఏళ్లయినా దాని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. నిజం చెప్పాలంటే ‘దేవదాసు’ మామూలు కథే… కానీ మామూలు కథ కాదు. ఇలా ఎందుకన్నానంటే… ఒకమ్మాయిని ప్రేమించడం… ఆ ప్రేమ విఫలం కావడంతో మందుకు బానిసై తనను తాను కోల్పోవడం… ఈ పాయింటాఫ్ వ్యూలో సాదాసీదాగానే కనిపిస్తుంది. కానీ ఆయా పాత్రల సైకో అనాలసిస్ చాలా గొప్పగా ఉంటుంది.

పార్వతిని దేవదాసు ప్రేమించాడా? లేదా? అంటే ఈ విషయం ప్రేమించినవాడికే తెలియదు. పార్వతి పెళ్లి తర్వాత కానీ దేవదాసు మనసుకు దెబ్బ తగల్లేదు. తన మనసు నుంచి ఏదో మిస్సయిన ఫీలింగ్ అతడిని కుదురుగా ఉండనీయలేదు. అందుకే ‘అందని పొందు కన్నా అందమే లేదు… ఆనందమే లేదు’ అని ప్రాణం పోయేవరకు తాను కోల్పోయిన దాన్నే వెతుకుతూ పిచ్చిగా తిరిగాడు. ఒకవేళ దేవదాసుకు పార్వతి దక్కిఉంటే అందరిలా సంసారం చేసుకుంటూ ఉండేవాడు. కాలగర్భంలో కలిసిపోయేవాడు. కానీ అలా జరగలేదు. పార్వతికేమో ‘ఇగో’ సమస్య. దేవదాసు తండ్రికేమో వంశ గౌరవం, ప్రతిష్ఠ ముఖ్యం. పాత్రల నడుమ ఈ సంఘర్షణే దేవదాసును అజరామరం చేసింది.

ఈ సినిమా చేసేనాటికి నాకు 29 ఏళ్లు. అప్పుడప్పుడే నేను కెరీర్‌లో నిలదొక్కుకుంటున్నా. నిర్మాత డి.ఎల్.నారాయణగారు ‘దేవదాసు’ను నాతో చేయాలనుకున్నప్పుడు చాలా విమర్శలొచ్చాయి. ముఖ్యమైన ముగ్గుర్నీ పనికిరానివారని అనుకున్నారంతా. అంత బరువైన పాత్రను అక్కినేని భరించలేడన్నారు. సావిత్రి చిన్న పిల్ల ఆమెకేం తెలుసు అన్నారు. ఇక డాన్సులు నేర్పించే వేదాంతం రాఘవయ్య ‘దేవదాసు’ను డైరెక్ట్ చేయడమేంటని పదే పదే నిర్మాతను భయపెట్టారు. రాఘవయ్యగారు, నేను సరదాగా ‘తాతా… తాతా’ అనుకుంటాం. ‘ఏమైనా సరే తాతా ఈ సినిమాను బాగా తీయాల్సిందే’ అని ఇద్దరం ఒకరికొకరు చెప్పుకుని కసిని పెంచుకున్నాం.

శరత్ నవలకు, సినిమాకు చాలా మార్పులే ఉంటాయి. క్లాస్ నవలను మాస్‌కు నచ్చేలా తీయాలనే మా ప్రయత్నం సక్సెస్ అయ్యింది. ‘పల్లెకు పోదాం… పారును చూద్దాం చలో చలో’ అంటూ దేవదాసు ఉత్సాహంగా పాడుకోవడం, ‘అయ్యో అంత సిగ్గుపడితే ఎలా… కాస్త నీ పెళ్లికి అట్టే పెట్టుకో’ అని పార్వతితో దేవదాసు అనడం… ఇవన్నీ మామూలు ప్రేక్షకులకు కూడా ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలే. మిగతా ‘దేవదాసు’ల కన్నా మన దేవదాసు బాగుందనడానికి ఇలాంటి కొన్ని చమక్కులతో పాటు సాహిత్యం, సంగీతం బాగా తోడ్పడ్డాయి. ఇక ‘ఆయనలా నటించడం, దేవదాసు పాత్రలో జీవించడం ప్రపంచంలో ఎవరి తరమూ కాదు’ అని దిలీప్‌కుమార్ గారు నాకు కాంప్లిమెంట్ ఇవ్వడం అప్పట్లో పెద్ద విశేషంగా చెప్పుకున్నారుగానీ ఏ ఊరి వస్తాదును ఆ ఊరిలో పొగడటం మామూలే కదా.

1972లో హై కొలెస్టరాల్‌తో నేను అనారోగ్యానికి గురయ్యాను. అప్పటికే ‘దేవదాసు’ నైజాం హక్కులు అమ్మకానికి వస్తే చాలా డబ్బు పోసి వాటిని కొన్నాను. 1974 అక్టోబర్ 18న అమెరికాలో నాకు బైపాస్ సర్జరీ జరిగింది. ఆ సమయంలో నా పని అయిపోయిందనుకున్నాను. అప్పులు కూడా ఉండేవి. సరిగ్గా అదే సమయంలో కృష్ణ, విజయనిర్మల కలర్‌లో తీసిన ‘దేవదాసు’ విడుదలకు సిద్ధమైంది. ఆ సినిమాకు వారం ముందు నా ‘దేవదాసు’ విడుదల చేస్తే నాక్కూడా నాలుగు డబ్బులొస్తాయి కదా అనే ఆలోచన కలిగింది. పైగా అప్పటికే ఆ సినిమా కోసం చాలా డబ్బులు పోశాను అనే డిప్రెషన్‌లో ఉన్నాను. అందుకే అమెరికా నుంచే డిస్ట్రిబ్యూటర్‌కు ఫోన్ చేసి సినిమా విడుదల చేయమన్నాను.

కృష్ణ ‘దేవదాసు’ పెద్దగా ఆడలేదు కానీ నా ‘దేవదాసు’ బ్రహ్మాండంగా ఆడి నాకు లాభాలను తీసుకొచ్చింది. అయితే అభిమానులు దీన్ని పెద్ద వివాదంగా మార్చారు. కృష్ణ ‘దేవదాసు’ బాగా లేదనే టాక్ రావడంతో నేను కూడా ఆ సినిమా చూడలేదు. పాత క్లాసిక్స్‌ను రీమేక్, రీమేడ్ చేయడం ఫ్యాషనైపోయింది. అయితే ‘దేవదాసు’ను రీమేక్ చేయడం అసాధ్యం. అలాంటి సాహసం ఎవరైనా చేస్తారని నేననుకోవడం లేదు. నేను బ్రతికుండగా ఎవరైనా రీమేక్ చేసినా చూసి తట్టుకోలేను.

-చల్లా శ్రీనివాస్

క్షణకాలమైనా కలకాలం గుర్తున్నాను
-‘మనోరమ’ పాత్రధారి సీత
‘దేవదాసు’లో నటించడం నిజంగా నా పూర్వజన్మసుకృతం. కొన్ని చిత్రాలు మొదట్లో నటించేప్పుడు చాలా సాధారణంగా అనిపించినా అవి కాలక్రమేణా కళాఖండాలుగా నిలిచిపోవడం చాలా సంతోషాన్నిస్తుంది. ‘దేవదాసు’లో నాకు పార్వతి స్నేహితురాలు మనోరమ పాత్ర షావుకారు జానకి ద్వారా దక్కింది. అప్పటికి ‘షావుకారు’ చిత్రంలో ఆమెతో కలిసి నటించడం వల్ల, ఆ స్నేహం కారణంగా నన్ను డి.ఎల్.నారాయణగారికి ఆమే సిఫారసు చేశారు. అప్పటివరకు ‘గుణసుందరికథ’, ‘యోగివేమన’, ‘షావుకారు’ వంటి చిత్రాల్లో చలాకీ వేషాలు వేసిన నేను ఈ చిత్రంలో కనిపించేది క్షణకాలమైనా కలకాలం గుర్తుండే బరువైన పాత్రను ధరించాను. నిజానికి ఇందులో నాది కథాపరంగా చాలా కీలకమైన పాత్ర. పార్వతి ఎడబాటుతో సర్వభ్రష్టుడైన దేవదాసు దీనస్థితిని పార్వతికి తెలియజెప్పి, ఎలాగైనా ఆ దొరబాబును మళ్లీ పూర్వస్థితిలో చూడాలని ఆశపడ్డ హితైషి పాత్ర. ఇంత చక్కటి పాత్రనిచ్చిన దర్శకనిర్మాతలు ఏ లోకంలో ఉన్నా వారికి నా ధన్యవాదాలు. 60 ఏళ్లయినా దేవదాసు సినిమా ప్రాణం కోల్పోని పత్రహరితంలా సజీవంగా ప్రేక్షకులను రంజింపజేయడం, ఈ గుదిగుచ్చిన ముత్యాలహారంలో ఒక మంచి ముత్యంగా నా పాత్ర ప్రకాశించడం నాకు సంతోషాన్నిస్తోంది. ఈ సందర్భంగా నన్ను గుర్తుపెట్టుకుని నా ఆనందాన్ని మీతో పంచుకునేలా చేసినందుకు ఆంధ్రజ్యోతికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.

ఈనాటి కీ ‘దేవదాసు రాణి’ అంటారు
-గాయని కె.రాణి
ఏనాటి ‘దేవదాసు’… ఎప్పటి పాటలు… అయినా ఈనాటికీ నన్ను ‘దేవదాసు రాణి’గా పిలుస్తూ, మొన్న మొన్నటిదాకా కచేరీల్లో ఆ పాటలు పాడించుకునేవారు. దేవదాసులో నేను ‘అంతా భ్రాంతియేనా…’, ‘చెలియ లేదు చెలిమి లేదు…’ పాటలు పాడాను. వీటితో పాటు మూడోపాటగా ‘ఓ దేవదా’ను కూడా పాడాను. అయితే నా సహగాయని స్వర్గీయ జిక్కీ ఆ పాటను నాకంటే ముందు పాడిందని ఆ పాట రికార్డింగ్ నాటికి నాకు తెలియదు. అలా తెలిసుంటే ఆ పాటను నేను పాడేదాన్ని కాదేమో. చివరికి జిక్కీ పాటనే బయటకు వచ్చింది. కారణాలేమైనా ఆ పాటలో నా హమ్మింగ్ మాత్రం అలాగే ఉంచేశారు. ‘దేవదాసు’ రెండవమారు విడుదలై శతదినోత్సవం జరుపుకున్నప్పుడు అఖిలాంధ్ర ప్రేక్షకుల ముందు, ముఖ్యంగా ‘దేవదాసు’ (అక్కినేని) ముందు నేను ఈ సినిమా పాటలు పాడటం ఇప్పుడు తలుచుకున్నా నా మనసులో ఒక అనిర్వచనీయ ఆనందం కలుగుతుంది. మా అన్నయ్య (అక్కినేని) నిండు నూరేళ్లు పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలని నా ఆకాంక్ష.

ఆ తృప్తి నాకుంది
– గాయని రావు బాలసరస్వతీ దేవి
‘దేవదాసు’ చిత్రంలో లలిత (చంద్రముఖి)కి చాలా లలితమైన పాటలు… ఇందులో ‘అందాల ఆనందం..’, ‘ఇంత తెలిసి యుండి…’, ‘తానే మారెనా…’ పాటలు పాడాను. నా శృతికి తగ్గ పాటలు నా చేత పాడించిన సంగీత దర్శకుడు ఆర్. సుబ్బురామన్ గారికి ఈ సందర్భంగా నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన సంగీతంలో అంతకు మునుపే నేను చాలా చక్కని పాటలు పాడాను. అయితే ఈ చిత్రంలో పాడిన పాటలకు వాటన్నింటిని మించిన పేరొచ్చింది. అక్కినేని, డి.ఎల్‌గారు మా ఇంటికి వచ్చి రాజావారిని ఒప్పించి మరీ నన్ను తీసుకెళ్లి పాడించారు. ఈనాటికీ కచేరీలలో శ్రోతలు నేను కనిపించినప్పుడల్లా ‘తానే మారెనా…’ పాటను కనీసం హమ్ చేయమనైనా అడుగుతారు. అజరామరమైన చిత్రంలో నేనూ పాటలు పాడాననే తృప్తి నాకుంది.

నిన్న మొన్ననే రికార్డింగ్ జరిగినట్లుంది!
-గాయని ఉడుత సరోజిని
‘దేవదాసు’లో చిన్నప్పటి పార్వతీ, దేవదాసులకు నేను, నా ప్రాణ స్నేహితురాలు జమునారాణి కలిసి ‘ఓ దేవదా…’ డ్యూయెట్ పాడాం. నిజానికి మా ఇద్దరి అనుబంధం చిత్తూరు నాగయ్య నిర్మించిన ‘త్యాగయ్య’ నాటిది. అలాంటిది దేవదాసులో ఈ పాట పాడే అవకాశం మమ్మల్ని వరించడం మాకు ఎంతో సంతోషదాయకం. ఆ రికార్డింగ్ నిన్నమొన్న జరిగినట్లుంది. అప్పుడే 60 ఏళ్లు వచ్చేశాయా? కాలప్రవాహం ఎంత వేగంగా వెళ్తోంది. ‘దేవదాసు’ 60 ఏళ్ల సందర్భంగా మేము ఇంకా జీవించి ఉండటం మా అదృష్టం. కళాకారులకు భగవంతుడిచ్చిన గొప్ప వరం… వారు లేకపోయినా వారు సృష్టించిన కళాఖండాలు శాశ్వతంగా నిలిచిపోవడం. మేమున్నా లేకపోయినా దేవదాసు చిత్రం ప్రేక్షకుల మదిలో ఉన్నంతకాలం మేము సంగీత ప్రపంచంలో చిరంజీవులమే.

కచేరీలలో ఇప్పటికీ పాడుతున్నా
-గాయని కె.జమునారాణి
సి.ఆర్.సుబ్బురామన్ గారికి, మాకు ఆ రోజుల్లో కుటుంబస్నేహం ఉండేది. ఆ స్నేహం కారణంగానే ఆయన నాకు ‘దేవదాసు’లో ఒక పాట పాడే మహద్భాగ్యాన్ని కల్పించారు. ముఖ్యంగా ఉడుత సరోజినితో కలిసి నేను యుగళగీతం పాడాను. నాకు చాలా సరదాగా ఉండేదా రోజుల్లో. ఎందుకంటే ఆ రోజుల్లో మేమిద్దరం పిల్లల పాటలకు లాండ్‌మార్క్. అయితే సరోజిని పిల్లల పాటలకే పరిమితమైంది. నాకు కొంటె పాటల కోణంగిగా పేరొచ్చింది. ‘దేవదాసు’లోని ఆ పాట (ఓ దేవదా…) కచేరీల కోసం ఎక్కడికెళ్లినా పాడుతూనే ఉన్నాను.
– కంపల్లె రవిచంద్రన్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.