మానవ సేవకు మారు రూపు మదర్ కాబ్రిని

మానవ సేవకు మారు రూపు మదర్ కాబ్రిని

               

 మదర్ కాబ్రినిమదర్ కాబ్రిని

  మహాను భావులు అన్ని దేశాలలో ఉంటారు .తమ సేవా కార్యక్రమాలతో ప్రపంచం లోని ప్రజలందర్నీ తమ వారిగా భావిస్తారు .తాము చేస్తున్నది దైవ కార్యమనే భావించి చేస్తారు గొప్ప తనాన్ని తమకు ఆపాదించుకోరు .తమను నడిపించి, చేయిస్తున్న దైవానికే ఆ కృతజ్ఞతలు ,ప్రసంశలు దక్కాలని అనుకొంటారు .వారి సేవకు ఒక దేశం పరిమితం కాదు .ప్రపంచమంతా విస్తరించి ప్రజా హృదయాలను గెలుచుకొంటారు తాము భగవంతుని పరికరాలమే నని వారి భావన .అలాంటి మానవ సేవా తత్పరురాలు ఇటలీ దేశానికి చెందినమదర్ ఫ్రాన్సెస్ కాబ్రిని .ఆమె గురించే మనం ఇప్పుడు తెలుసుకొంటున్నాం .

మేరియా ఫ్రాన్సెస్ కాబ్రిని 1850 లో జులై 15 న ఇటలీ దేశం లోని మిలన్ కు దగ్గర లో డీజియానో లో జన్మించింది .తండ్రి  అగస్తినో .తల్లి స్టెల్లా కాబ్రిని .పదకొండు మంది సంతానం లో ఏడుగురు చిన్న తనం లోనే చని పోయారు .తల్లికి 41 ఏళ్ళ వయసులో కాబ్రినిగర్భస్థ సమయం కంటే రెండు నెలలు ముందుగానే బలహీనం గా . పుట్టింది .ఆమె ను ఎంతో జాగ్రత్తగా ఆ దంపతులు పెంచారు కుటుంబం అంతా కాధలిక్  మతానికి అంకిత మైనదే ..ఇంటి పనులన్నీ కాబ్రినే చేసి తల్లికి సాయ పాడేది .అందుకని చదువు అంతగా అబ్బలేదు ఆట పాటలూ ఒంట బట్టలేదు .అర్భకు రాలు .      ఆ నాటు ఉన్న సాంప్రదాయం ప్రకారం ఈమెకు ఏడవ ఏటనే కాథలిక్ మత దీక్ష నిచ్చారు .ఆ దీక్షా సమయం లో ఆమెలో గొప్ప అనుభవం కలిగింది .దానిని మాటలలో చెప్పలేక పోయింది .ఆ నాడు ఇటలీ అంతా సమైక్య మవటానికి సిద్ధమవుతోంది .ఈమెను  పదమూడవ ఏట మిలన్ కు పడమర ఉన్న’’డాటర్స్ ఆఫ్ సేక్రేడ్ హార్ట్స్ ‘’నిర్వహిస్తున్న  కాన్వెంట్ స్కూల్ కు పంపారు .ఆమెను చేర్చుకోవటానికి సుపీరియర్ తిరస్కరించాడు దానికి ఆమె అనారోగ్యం ఒకకారణం .రెండోది ఈమె కొన్ని ఏళ్ళలో స్వంతం గా ఒక మత సంస్థను ఎర్పరుస్తుందేమో ననే అనుమానం .

ముందు  తండ్రి ,ఆ తర్వాత తల్లీ మరణించారు .ఆదరించే బాబాయి కూడా చనిపోయాడు .అనాధగా మిగిలి పోయింది .ఈ బాధలన్నీ మరిచి పోవటానికి నిరంతరం దైవ సాన్నిధ్యం లో గడపటం ప్రారంభించింది కాబ్రిని .స్కూలు పిల్లలకు నీతి, మతధర్మాలను బోధించేది .బాధలతో ఉన్న వారిపై సాను భూతి చూపింది .ఊరికి దూరం గా ఉంటూ ఎవరూ పట్టించుకోని ఒక కేన్సర్ బాధితుడికి సేవ చేసి నయం చేసింది .మసూచికంఆ ప్రాంతం లో  విజ్రుమ్భించిన సమయం లో దాని బారిన పడిన వందలాది మందికి సేవలందించి తానూ ఆ వ్యాధికి గురైంది .ఆమె కు తోడుగా ఉన్న రోసా సేవలతో మళ్ళీ మామూలు మనిషి అయింది .అసలే అనారోగ్యం .దీనికి తోడూ ఈ వ్యాధి సోకి తగ్గింది అందుకని ఏ స్కూల్ లోను ఆమె ను చేర్చుకోలేదు ..దీనికి కారణం ఆ నగర మేయర్ ను కాథలిక్ మతం లోకి మార్చటం .కాబ్రినికి క్రమంగా మిషనరీ’’ నన్’’ గా మారాలనే సంకల్పం బలీయ మైంది ..హౌస్ ఆఫ్ ప్రావిడెన్స్ లో చేరి’’ సిస్టర్ సేవేరియా కాబ్రిని ‘’ అయింది .అక్కడ రెండవ స్తానం పొందింది .ఆమె కు అనాధలకు విద్య ,నేర్పటం మత దీక్ష నివ్వటం అప్పగించారు

బిషప్ జేల్మిని ఈమె లోని దీక్ష కు ,సేవా తత్పరతకు అబ్బుర పడి కాబ్రిని ని 1877‘లో ’మదర్ సుపీరియర్ ఆఫ్ హౌస్ ఆఫ్ ప్రావిడెన్స్ ‘’అనే అత్యంత గౌరవనీయమైన పదవిని ఇచ్చాడు .కొద్ది మందికి ఇది అసూయ కు కారణం అయింది  .ఆమె జీవితాన్ని నరకప్రాయం చేశారు కూడా .అప్పటికి ఆ సంస్థ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కు మాత్రమె పరిమిత మైంది .దాని నిర్వాహకుడు  ‘’తొండిని’’సంస్థ నిధులన్నీ స్వాహా చేశాడు .ఈ పరిస్తితులలో మదర్ కాబ్రిని తన స్వంత సంస్థను తన సేవా ధర్మాలకు అనుగుణం గా ఏర్పాటు చేయాల్సిన పరిస్తితి కలిగింది .వెంటనే ‘’’’సేలేశియన్ మిషనరీస్ ఆఫ్ సేక్రేడ్ హార్ట్స్ ఇన్స్టిట్యూట్ ‘’ను స్తాపించింది .దీనినే అ తర్వాతా ‘’ది మిషనరీ సిస్టర్స్  ఆఫ్ ది సేక్రేడ్ హార్ట్స్ ఆఫ్ జీసస్ ‘’గా మార్చింది .

ఫ్రాన్సెస్ కాబ్రిని కి ‘’మదర్ మేరీ ‘’అనుక్షణం స్పూర్తి నిస్తూండేది .1887 లో  రోమ్ నగరానికి  వెళ్లి అక్కడ ఒక సంస్థ ను ఏర్పాటు చేయటానికి పాప్ గారి అనుమతి పొందింది .ఆమెను ఎన్నో సంస్తలు ప్రోత్సహించి ఆమె సేవా సంస్థలను దేశామంతావిస్తరిల్ల జేయమని అభ్యర్ధించాయి అప్పటికి ఆమె సంస్థ చర్చి ఒప్పుకొన్న మహిళా సంస్థలలో రెండవది అయింది ..ఆ కాలం లో ఆడవారు క్రిస్టియన్ మత ప్రచారానికి తగిన వారు కారనే అభిప్రాయం బలం గా ఉండేది .ఆ  అభిప్రాయాన్ని కాబ్రిని తప్పు అని రుజువు చేసింది మగవారు నిర్వహించే కార్యక్రమాల కంటే మహిళలు నిర్వహించేవే ఉత్తమోత్తమ మైనవని రుజువు చేసింది .ఇది ఆమెకు ఒక సవాలు గా నిలిచింది ఎన్ని అడ్డంకులెదురైనా తన పని తాను దైవ కృప తో చేసుకొని ముందుకు సాగింది .ఎన్నో మత సంస్తలు ఆమెకు బాసటగా నిలబడ్డాయి అవసరమైన డబ్బు ,పరికరాలు స్తలం అన్నీ సమకూర్చినాయి . ఆమె సేవకు తామూ తోడ్పడ్డాయి .కొద్ది రోజులకే అక్కడి కార్డినల్ బీద పిల్లలకు ఒక స్కూల్ ను ,దాంతో బాటు ఒక  కిండర్  గార్టెన్ స్కూల్ ను ప్రారంభించమని కోరాడు ఆమె ఆ పని దిగ్విజయం గా నిర్వహించి అందరి అభిమానం సంపాదించింది ..క్రమంగా మదర్  కార్య క్రమాలకు విశేష స్పందన విశ్వ వ్యాప్తం గా లభించింది

అమెరికా ,యూరప్ దేశాల వారు తమ దేశాలలో ఆమెను చారిటబుల్ సంస్థలను నెలకొల్ప మని అభ్యర్ధించాయి ఆమె మనసులో చాలా కాలం నుండి చైనా లో ఏర్పాటు చేయాలని అనుకొన్నది కాని దేవేచ్చ ..అమెరికా లో తన సేవా కార్యక్రమాలను విస్తరించటానికి నిర్ణయించుకోంది ..అప్పటికే ఆమె విపరీతం గా పని చేసి అలసి పోయింది ఆరోగ్యమూ బాగాలేదు .అమెరికా లోని న్యూ యార్క్ సిటీ దాని పరిసరాలలో ఇటాలియన్ ఇమ్మిగ్రెంట్స్ చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు .సరైన విద్యా వైద్య సౌకర్యాలు వారికి లేవు .వారికి సేవలందించాలన్న ధ్యేయం తో కాబ్రిని 1889 లో అమెరికా కు కొద్ది మంది సిస్టర్స్ తో చేరుకొన్నది .ఆహ్వానించిన వారే మొహం చాటేశారు అంతా కొత్త .కాని ఆమె అధైర్య పడలేదు తన పని తాను ప్రారంభించింది నెమ్మదిగా అక్కడి సంస్థలు సహకారం అందించటం ప్రారంభించాయి .పోప్ లియో కూడా ఆమెకు బాసట గా నిలిచాడు .

సిస్టర్స్ వీధిలో తిరిగి అడుక్కొంటూ సాయం రాబట్టారు .వీరిని చూసి మిగిలిన వారు ముందుకొచ్చారు. ఒక చోట మంచి  వాతా వరణంలో సంస్తనేర్పరచారు .ఉదయం  అయిదింటికే కార్యక్రమాలు మొదలు .ఆ తర్వాత ప్రార్ధన ..తర్వాతా విద్యా బోధనా ,ఆరోగ్య సూత్రాలు తెలియజేయటం .ఇటాలియన్ ఇమ్మిగ్రంత్స్ కు గొప్ప ఊరట కలిగింది .కొద్ది కొద్ది మొత్తాలను ఆహార పదార్ధాలను సేకరించేవారు .

తరువాత ఆమె అనాధాశ్రమం స్తాపించింది .అది అనాధలకే కాక బాధితులకు, అసహాయులకు ,అండగా నిలిచింది .సెయింట్ జోచిమ్స్  చర్చి ద్వారా రెండు వందల మంది పిల్లలకు సేవలందించింది ..ఆ తర్వాతా బ్రూక్లిన్ లో స్కూల్ పెట్టింది .స్తానికులకు దేనిలోనూ ఇటాలియన్లు తీసి పోరని రుజువు చేయించింది .న్యూ ఆర్లియాన్స్ ,డెన్వర్ ,లాస్ ఆంజెల్స్ ,ఫిలడెల్ఫియా ,న్యూ వార్క్ ,సియాటిల్ లలో ఉచిత విద్యాలయాలను నెలకొల్పింది .విద్యతో బాటు వైద్యం, ఆధ్యాత్మిక చింతనలను అందించింది .ఆదివారం బడులు నిర్వహించింది .వృత్తి విద్యాలయాలను నెలకొల్పింది ,.యువజన విద్యా ,నేర గాళ్ళకు విద్యా బోధనా కూడా ఆమె నిర్వహించిన వాటిలో ముఖ్యమైనవి .ఆమె సేవా సంస్థలకు అనూహ్యం గా దాతలు భూరి విరాళాలను సమర్పించి జన్మ ధన్యం చేసుకొనే వారు .డబ్బు కొరత అనేది మదర్ సంస్థలకు ఎప్పుడూ కలగలేదు అవసరమైతే సిస్టర్స్ వీధుల్లో బిచ్చం ఎత్తి విరాళాలు సేకరించేవారు .

మదర్  కాబ్రిని నికారుగ్వా ,పనామా ,బ్యూనస్ ఐర్స్ ,అర్జంటినా ,లలో స్నేహ యాత్ర జరిపింది కంచర గాడిదల పై ఆండీస్ పర్వతాల లో సంచరించింది .వెళ్ళిన ప్రతి చోటా అవసర మైన కేంద్రాలను స్తాపించి సాయ పడింది .ప్రపంచం అంతా ఆమెను ‘’లా మదర్ ‘’అంటే ‘’మాతృదేవత ‘’ అని ఆప్యాయం గా పిలుచుకొనే వారు ..అందరిపై అపారమైన కరుణా, ప్రేమా ఆమె చూపేది .బాధితులకు సానుభూతి ఆమె నైజం .సకల ప్రాణుల మీద ఆమెకు అపారమైన కరుణ ఉండేది .తన కార్యక్రమాలను ‘’హృదయానికి చేసే విద్య ‘’గా భావించేది .విద్య అంటే ప్రేమను కురిపించటమే అనేది ఆమె .

బ్రజిల్ దేశం లో పర్య టించి నపుడు మదర్ కు మలేరియా సోకి చాలా కాలం బాధ పడింది 1912 లో మళ్ళీ సేవాకార్యక్రమాలకోసం అమెరికా వెళ్ళింది మొదటి ప్రపంచయుద్ధ సమయం లో అమెరికా నుంచి బయటి దేశాలకు వెళ్ళే అవకాశం ఆమెకు లభించలేదు .1938 లోనే ఆమె కు ‘’beatified ‘’(declared sacred )లభించింది .1946 జులై 7 న మదర్ కాబ్రిని  ని అమెరికా కు మొదటి పౌరురాలు గా రోమన్ కాధలిక్ చర్చ్ ‘’సెయింట్ ‘’హోదా నిచ్చింది .1917 డిసెంబర్ 22 న 67 వ ఏట మదర్ కాబ్రిని తుది శ్వాస విడిచింది .చని పోయిన తర్వాతా కూడా ఆమె ప్రభావం ఇసుమంత కూడా తగ్గలేదు .ఆమె పేరా ఎన్నో హైస్జ్కూళ్లు,ఆస్పత్రులు వెలిశాయి .చర్చిలను కూడా ఆమె పేర పెట్టి గౌరవించారు .ఆమెను మదర్  ఫ్రాన్సెస్ క్సేవియర్ గాబ్రిని అని ఆత్మీయం గా ప్రపంచమంతా పిలుచుకొంటారు .ఎందరికో ఆమె సేవా తత్పరత ఆడర్శనీయమైంది .

ప్రేమ కంటే ఏ త్యాగము గొప్పది కాదని కాబ్రిని భావించింది .భగవంతుడే మన చేత అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తాడు అని చెప్పేది .

 

                – గబ్బిట దుర్గా ప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

 

– See more at: http://vihanga.com/?p=9255#sthash.sUzFdIsm.dpuf

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.