అమెరికా లో కూచిపూడి అరంగేట్రం
హూస్టన్ లోని మా అమ్మాయి వాళ్ళ ఇంటి నుంచి మధ్యాహ్నం నాలుగింటికి బయల్దేరి పోస్ట్ ఓక్ లోని వావిలాల వారమ్మాయి ‘’ఏమెండా ‘’ఇంటికిమా అమ్మాయి విజ్జి మమ్మల్ని తీసుకొని వెళ్లి దింపింది . .అక్కడి నుంచి వావిలాల లక్ష్మి గారు వాళ్ళ కారు లో నన్ను ,మా ఆవిడ ను రైస్ యూని వేర్సిటి కి దాదాపు ఇరవై నిమిషాలు డ్రైవ్ చేసి తీసుకొని వెళ్ళింది .అక్కడ పచ్చని చెట్లూ వాతా వరణం చాలా బాగుంది .మన ఆంధ్రా యూని వేర్సిటి లా కనీ పించింది అయితే ఇక్కడ ‘’సముద్రం బాక్ డ్రాప్’’ గా లేదు అంతే తేడ .ఈ ప్రాంతం లో స్తలాలన్ని చాలా ఖరీదైనవి .మంచి బిజీ సెంటర్ .
doctor Rice
అక్కడ Hamman hall ఆది టోరియం లో సాయంత్రం ఆరు గంటలకు పుచ్చా రమ్య శ్రీ అనే అమ్మాయి చేత‘’రంగ ప్రవేశ కార్య క్రమం ‘’ఉంది .అప్పటికే రమ్య భారత నాట్యం లో గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించింది .ఇప్పుడు కూచి పూడి నాట్యం చేసి రంగప్రవేశం ఈ రోజు న చేస్తోంది .వచ్చ్చిన వారందరికీ అనేక రకాలైన స్నాక్స్ ,సమోసాలు ,వడ ,స్వీట్లు ,దాదాపు పది రకాలు పెట్టారు .అందరికి కోక్ ఇచ్చారు .అందరూ తెలుగు వాళ్ళే .అంతా మన తెలుగు వాతా వరణమే కనీ పించింది .అందరు మంచి తెలుగునే మాట్లాడుతున్నారు .ముచ్చటేసింది .ఆడవాళ్ళంతా చీర ,బొట్టు లతో అమ్మతల్లుల్లా,ఆడపడుచుల్లా వచ్చారు .ఇంతమంది తెలుగు దేశపు ఆచార వ్యవహారాలతో వచ్చినందుకు ముచ్చట తో బాటు ఆశ్చర్యం వేసింది .హాలు పై అంతస్తులో ఉన్నది చిన్న హాలె .అందరికీ రుమాళ్ళను సెంటు లో తడిపి ఇచ్చారు .ఆడవాళ్ళకు ‘’చిన్న పూర్ణ కుంభం ‘’,రుమాలు ,జీడిపప్పు కిస్మిస్ పాకెట్ ,సుపారి పాక్ చేసి అందించారు .
పుస్తకాలను పెట్టి అందులో అందరి చేత శుభా కాంక్షలు రాయించారు .అక్కడే రమ్య నాట్య భంగిమతో ఉన్న ఒక పెద్ద ఫోటో ను పాలెట్ పై ఉంచారు .దాని పై ప్రత్యెక పెన్ను తో అందరి చేతా శుభా కాంక్షలు రాయించారు .నల్లని ఆ బార్డర్ పై ఆ ప్రత్యెక పెన్ను తో రాస్తే అక్షరాలూ తెల్లగా కనీ పించి ఆశ్చర్యమేస్తుంది .నేను ‘’రమ్య –రస రమ్యం గా నాట్యం చేసి ,ప్రేక్షక హృదయాలను రసప్లావితం చేయాలి –గబ్బిట దుర్గా ప్రసాద్ ,ప్రభావతి -713-784-434అని అభి నందించాను .నన్ను చూసి ఇంకొకాయన ‘’శుభా కాంక్షలు ‘’అని తెలుగు లో రాశాడు .మిగిలిన వాళ్ళంతా ఇంగ్లీష్ లోనే రాశారు .ఆరు గంటలకు టంచన్ గా కార్యక్రమం ప్రారంభ మైంది .
రమ్య గురువు’’ రత్న పాప’’ అని అందరికి పరిచయమైన ‘’రత్న కుమార్ ‘’.ఈమె ప్రసిద్ధ జాన పద గాయిని వింజమూరి అనసూయా దేవి (ఇప్పుడు అవసరాల ) దేవి కూతురు .సీతా అనసూయలు కృష్ణ శాస్త్రి గారి మేన కోడళ్ళు .ఆయన పాటలను, జానపద గేయాలను ఆంద్ర దేశమంతా తిరిగి గొప్ప ప్రచారం కల్పించిన గాయినీ మణులు ఆ సోదరిలిద్దరు .27 ఏళ్ళ క్రితం రత్న పాప మద్రాస్ నుండి అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రం లోని హూస్టన్ నగరానికి వచ్చి స్తిర పడింది .మొదట్లో ‘’ డల్ ‘’గా ఉన్నా క్రమేపీ పుంజు కొంది .’’అంజలి ‘’అనే డాన్స్ స్కూల్ పెట్టి అందరికి నాట్యం నేర్పిస్తోంది వెంపటి చిన సత్యం గారి వద్ద మద్రాస్ లో శిక్షణ పొంది ఆయన ముఖ్య శిష్యురాలిగా రత్న పాప గుర్తింపు పొందింది .మా పెద్దక్కయ్యా వాళ్ళు ఈమెను గురించి చెబుతూండే వారు .ఐప్పటికిఇక్కడ అయిదు వందల మందికి పైగా రత్న పాప వద్ద నాట్యం అభ్యశించి పేరు తెచ్చుకొన్నారు .
కార్యక్రమం అయిన తర్వాత అనసూయ గారి దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకోన్నాం .’’నేను గాడేపల్లి కృపానిధి గారి బావ మరిదిని .మా అక్క లోపా ముద్ర .ఆవిడ మామ గారు పండిట్ రావు ‘’అని చెప్పాను .ఆవిడ వెంటనే‘’మీరందరూ మా బంధువు లండీ .మిమ్మల్నిఇక్కడ చూసి నందుకు చాల సంతోషం గా ఉంది .’’అని అనసూయ గారు ఆప్యాయత ఒలక బోశారు .వావిలాల లక్ష్మి గారు కూడా తమకు బంధువే నని అనసూయ గారు చెప్పారు .మాటలలో కృష్ణ శాస్త్రి గారి భార్య ‘’రాజ హంస ‘’గారు మరణించి నట్లు చెప్పారామే .’’మీకు తెలుసా “’అని అడిగారు తెలుసు నని చెప్పాం. ఆమెను ఈవిడ ‘’రాజత్తయ్య ‘’అని ఆత్మీ యం గా పిలిచింది తరువాత వాళ్ళమ్మాయి రత్న పాప ఫోన్ నంబర్ ఇచ్చి తరచూ మాట్లాడుకొందాము అని చెప్పారు .ఆవిడా
కొడుకు ,కోడలు హూస్టన్ లోనే ఉన్నారని చెప్పింది .రత్న పాప చక్కని ఇంగ్లీష్ లో కార్యక్రమాన్ని ప్రెసెంట్ చేసింది అందరి మన్ననలు పొందింది .అనసూయ గారి అబ్బాయి ఫోటోగ్రాఫర్ .రత్న పాప కూడా మేము బంధువులం అని తెలిసి ఎంతో గౌరవాన్ని చూపి మాట్లాడింది .
రమ్య తల్లి ,తండ్రి ‘’నాసా ‘’ లో పెద్ద సైంటిస్ట్ లు . లు .రత్న పాప తో మొదటి నుంచి పరిచయం ఉన్న వాళ్ళు .ఇదే స్టేజి మీద రమ్య పదేళ్ళక్రితం భారత నాట్యం లో అరంగేట్రం చేసిందట .ఇప్పుడు ఊచి పూడి .చికాగో యూని వర్సిటి లో ‘’మ్యూజిక్ అండ్ డాన్స్ ‘’లో డిగ్రీ చేస్తోంది .రమ్య టీచర్ ఆఫ్రో అమెరికన్ మహిళఈమె కూడా శిష్యురాలి అరంగేట్రం చూడ టానకి వచ్చింది .మ్యూజిక్ అండ్ డాన్స్ లోప్రోఫేసర్ ఒకాయన వాషింగ్టన్ నుంచి ప్రత్యేకం గా వచ్చాడు చూడ టానికి .రమ్య సినిమా స్టార్ దివ్య వాణి ,టి.వి.ఆంకర్ ఉదయభాను లకలగలుపు గా ఉందని పించింది .
నాసా లో పని చేసే తెలుగు వారంతా తరలి వచ్చారట .వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది బ్రాహ్మణులే .బందరు లోని డాక్టర్ మోచర్ల పద్మనాభ రావు గారి అమ్మాయట ఒకావిడ,భర్తా పరిచయమైనారు .బెజవాడ లక్ష్మీ జనరల్ వస్త్ర వ్యాపారి శిష్ట్లా లక్ష్మీపతి శాస్రి గారి అమ్మాయి కూడా పరిచయమైంది .పుచ్చా ,కొండముది ,రాచకొండా ,ఐనంపూడి ఇలా చాలా కుటుంబాల వారు వచ్చారు .రమ్య అమ్మమ్మ మన పూర్వకాల స్త్రీలా గా కనీ పించింది .తెలుగుదనం అమెరికాలో అందునా హూస్టన్ లో ప్రతి ఫలించి నందుకు ఆనందం గా ఉంది .
రమ్య నాట్యానికి నేపధ్య గానం జే.రమేష్ –చాలా బాగా పాడాడు .భావం స్పుటంగా ఉంది .గాత్రమూ బాగుంది .ఏన్ .కే.కేశవన్ .మృదంగం’’ వాయించి ‘’వదిలాడు .చక్కని ధృతి ,శబ్ద మాధుర్యం ,.మృదంగాన్ని మైనం లాగా మలచి ఏ షేప్ కావాలంటే ఆషేప్ తెప్పించిన ఘనుడు కేశవన్ .ముత్తుకుమార్ ఫ్లూట్ శ్రావ్యం గా ఉంది .సావిత్రి సత్యమూర్తి అనే సంగీతం మేస్టారు వయోలిన్ వాయించింది .ఆమె కుమార్తె అనూరాధా సుబ్రహ్మణ్యం గాత్రం తో సహకారం అందించింది .నట్టువాంగం రత్న పాప చేసింది వీళ్ళంతా మేచూరేడ్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ లే . ఎన్నో ప్రదర్శనలిచ్చి పేరు పొందిన వారె .మంచి కాంబినేషన్ తో రమ్య నాట్యానికి ఎంతో బాగా తోడ్పడ్డారు .
పుచ్చా రమ్య గణేశ ప్రార్ధన తో కార్యక్రమాన్ని ప్రారంభించింది .తరువాత మాండూక శబ్దం ,తరంగం ,జావళీ ,మోహినీ ,శివ పంచాక్షరి ,తిల్లానాలు చేసి మంగళం తో కూచిపూడి ని పూర్తీ చేసింది .మంచి ఫీచర్లు భావ ప్రకటనా సౌలభ్యం తో ,తేలికగా ప్రదర్శించింది .అయితే ‘’శివ పంచాక్షరి ‘’లో కదలికలు చాలా’’ డల్’’గా ఉన్నట్లు అని పించాయి .ఇంకా వేగం, వెరైటీ ఉంటె ఇంకా బాగా రక్తి కట్టి న్డేది .అల్లాగే తిల్లానా లో వోకల్ మాడ్యులేషన్ కొంచెం మారిస్తే రమేష్ గాత్రం మరింత వన్నె తెచ్చేది .ఏమైనా మూడు గంటల పాటు ఏదో రస లోక విహారం చేసిన అనుభూతి పొందాం .కార్యక్రమం ఖచ్చితం గా రాత్రి తొమ్మిదింటికి పూర్తీ అయింది .మనది కాని దేశం లో మనదైన సంప్రదాయం తో‘’రసరమ్య ‘లోక విహారం చేయించారు అందరూ .కూచి పూడికి ఇక్కడ చక్కని గుడి కట్టారని పించారు .మోహిని నాట్యం లో కృష్ణ శాస్త్రి గారి పాట మధుర మధుర మంజుల గానమే అయింది .దానికి రమ్య సలిపిన మనోహర నాట్యం హృదయం మీద చెరగని ముద్ర వేసింది .వర్షం తో వచ్చిన ఈ సాయంత్రం సంగీత సరిగమ చినుకులు ,నాట్యపు పులకరరింపుల తో ఇంపు గా సోంపు గా ఉన్న్నాయి .దీనిని ఏర్పాటు చేసి గోప్ప అతిధ్యాన్నిచ్చిన రమ్య తలిదండ్రులు ,నాట్యం చేసిన రమ్యా ,మాకు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూపించిన మా ‘’అప్పన కొండ మామయ్యా ‘’కూతురు వావిలాల లక్ష్మి గారికి అభినందనలు .
15-9-2002 ఆదివారం నాటి అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రం లో ఉన్న హూస్టన్ లో నేను రాసుకొన్న డైరీ నుండి
మీ –గబ్బిట దర్గా ప్రసాద్ –6-7-13- కాంప్-హైదరాబాద్