భగవద్గీతకు స్వరాభిషేకం
July 04, 2013
ఘంటశాల గానమాధుర్యాన్ని, ఎంఎస్ గొంతులో లాలిత్యాన్ని, ఏసుదాసు స్వర సౌందర్యాన్ని అందరం ఆస్వాదిస్తూ ఉంటాం. కాని వారి గొంతులను గ్రామఫోనులలో రికార్డు చేసి భద్రపరిచిన వారి గురించి ఎప్పుడూ మనం పట్టించుకోం. వారి శ్రమ ఎలాంటిదో మనకు తెలియదు. ఘంటశాలతో భగవద్గీత, నమో వెంకటేశ వంటి అపురూప గీతాలు, ఏసుదేసుతో అయ్యప్ప స్వామి గీతాలు రికార్డు చేసి తెలుగు శ్రోతలకు అందించిన వ్యక్తి పుట్టా మంగపతి. హెచ్ఎంవీలో పనిచేస్తున్న సమయం నుంచి సొంత రికార్డింగ్ కంపెనీ ‘విజయశ్రీ’ స్థాపించేదాకా ఆయన అనుభవాల సమాహారమే ‘స్వరసేవ’. దానిలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలను మీకు అందిస్తున్నాం..
ఘంటసాలగారు చాలా బిజీ ఆర్టిస్టు. అందుచేత ఆయన ప్రైవేటు రికార్డింగులు అనుకున్నంత మాత్రాన జరిపించడానికి వీలుండేది కాదు. ఆయన డేట్స్ గురించి వేచి ఉండేవాణ్ణి. 1970లో హెచ్ఎంవి బొంబాయి బ్రాంచి వారు లతా మంగేష్కర్ గారితో సంస్కృత భగవద్గీత శ్లోకాలు పాడించి మగ గొంతుకతో ఇంగ్లీషులో వ్యాఖ్యానం చెప్పించి రికార్డు రిలీజు చేశారు. నేను ఘంటసాల గారి చేత తెలుగులో చేయించడానికి పూనుకున్నాను.
నేను ఏ రికార్డింగ్ తల పెట్టినా ముందుగా మా బ్రాంచి సీనియర్ సేల్స్ మేనేజర్ (తర్వాత బ్రాంచ్ మేనేజర్‌గా ప్రమోట్ అయ్యారు) ఆల్ఫ్రెడ్ తంగయ్యగారితో సేల్స్ గురించి సంప్రదించేవాడ్ని. లతామంగేష్కర్ చేత భగవద్గీతను బొంబాయి బ్రాంచి వారు రికార్డు చేసి రిలీజ్ చేసి ఉన్న విషయం చెప్పి ‘ఇక్కడ ఘంటసాలగారి చేత రికార్డింగ్ చేయాలని ఉంది’ అని చెప్పాను.
అందుకు ఆయన ‘ఘంటసాల మన హెచ్ఎంవి లేబుల్‌కు అతి ముఖ్యమైన ఆర్టిస్టు. కాని ఒక చిన్న అనుమానం – బొంబాయిలో లతా మంగేష్కర్ పాడారు గనుక ఇక్కడ కూడా అదేవిధంగా ఆడవారి చేత అంటే యం.యస్.సుబ్బులక్ష్మిగారి చేత పాడించవచ్చు గదా” అన్నారు.
దానితో నా తలపైన పెద్ద గుండు పడ్డట్లు అయింది. నేను వెంటనే తేరుకుని “ఈ రికార్డింగ్ ప్రత్యేకంగా తెలుగు జనానికి ఉద్దేశించినది. సంస్కృతంలో ఉన్న భగవద్గీత శ్లోకాలకు తెలుగులో అక్కడక్కడ అర్థం చెప్పుతూ ఘంటసాల పాడతారు. ఘంటసాల గారు పాడగా, మధ్యలో వచ్చే వచనం కూడా తెలుగులో ఉంటుంది. తెలుగు ఆర్టిస్టులైతేనే బాగుంటుంది. తెలుగువారందరికీ పరిచితమైన వాయిస్ ఘంటసాలది. అందుకనే నేను ఘంటసాల గారిని కోరుకున్నాను” అన్నాను. ఇది విన్నాక తంగయ్య గారు నాతో ఏకీభవించారు.
వెంటనే ఘంటసాల గారి వద్ద కెళ్లి “భగవద్గీత శ్లోకాలు మీరు పాడితే రికార్డు రిలీజ్ చేయాలని అనుకుంటున్నామ”ని చెప్పాను. అందుకు ఆయన తక్షణం స్పందించి “మంచి ఆలోచన మంగపతి గారూ తప్పక చేద్దాం. లతా మంగేష్కర్ పాడిన భగవద్గీత రికార్డు హైదరాబాద్‌లో ఆమె తండ్రిగారి సంస్మరణ సభలో విన్నాను. చాలా బాగుంది” అన్నారు.
అప్పుడు నేను “ఆమె పాడిన శ్లోకాలన్నిటి తర్వాత, చివరగా ఇంగ్లీష్‌లో మగ వాయిస్‌లో వ్యాఖ్యానం రికార్డు చేసి ఉన్నారు. కానీ మీరు పాడబోయే భగవద్గీతలో తెలుగు వారికందరకు అర్థమయ్యేలా శ్లోకాల మధ్య తెలుగు తాత్పర్యం ఉంటుంది. ఇది మీరు తెలుగు వారి కోసం పాడబోయే ఒక మహత్తరమైన రికార్డు అవుతుంది” అన్నాను.
తాత్పర్యం గురించి వినగానే ఆయన “ఔనౌను, తెలుగులో అర్థం చెప్పితే బాగుంటుంది. అలాగే చేద్దాం” అన్నారు. శ్లోకాలు తాను పాడినా కృష్ణార్జునుల సంభాషణా తాత్పర్యం డైలాగులుగా మాట్లాడడానికి ఎవరైనా సినీయాక్టర్ల చేత మాట్లాడిస్తే బాగుంటుందేమోనని ఆలోచించి నాగయ్య గారి పేరు చెప్తే “బాగానే ఉంటుంది. అలాగే చేద్దాం” అన్నారు.
వెంటనే నేను నాగయ్య గారి ఇంటికి వెళ్లాను. కానీ ఆయనకు చాలా జబ్బు చేసి డా. రంగభాష్యం గారి నర్సింగ్‌హోంలో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు. వెళ్లి చూశాను. ఆయన తీవ్రమైన నొప్పితో కడుపు పట్టుకుని బాధపడుతూ మూలుగుతూ ఉండటం నేను చూడలేకపోయాను. అలాంటి కష్ట సమయంలో నేను వెళ్లిన పని గురించి ఏమని చెప్పను? స్తంభించి నిలబడి నమస్కారమని మాత్రం అనగలిగాను.
నాగయ్యగారు కళ్లు తెరిచి చూసి “ఏం నాయనా మంగపతీ వచ్చావా, చూశావా నా పరిస్థితి…” అని నన్ను గుర్తుపట్టి గద్గద స్వరంతో పలకరించారు. “మీరు ఈ నర్సింగ్‌హోంలో అస్వస్థతగా ఉన్నట్లు తెలిసి మిమ్ములను చూడటానికి వచ్చానండి. మీరు త్వరగా బాగై మీ ఇంటికి తిరిగి వెళ్లాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానండి” అని వచ్చిన పని చెప్పడానికి సంకోచిస్తూ ఉండగా, ఆయనే “ఏమిటి మంగపతీ, ఆలోచిస్తున్నావ్?” అని అడిగారు.
“ఏమీ లేదండి. ఒక మంచి విషయం మీతో ముచ్చటిద్దాం అని వచ్చానండి” అనగానే “ఏమిటదీ? చెప్పు పర్వాలేదు” అన్నారు. అప్పుడు “ఘంటసాల గారి చేత భగవద్గీత శ్లోకాలు రికార్డు చేయించి, అందులో మధ్యలో వచ్చే తెలుగు తాత్పర్యము మీ చేత మాట్లాడించాలనే ఉద్దేశ్యంతో ఉన్నాం” అని చెప్పాను.
ఆ మాట వినగానే ఆయనకు ఎక్కడలేని ఆనందమూ, ఉత్సాహమూ పుట్టుకొచ్చి తన బాధను మర్చిపోయారు. కడుపుపై పెట్టుకున్న రెండు చేతులూ పైకెత్తి “ఎంత సంతోషకరమైన వార్త చెప్పావు నాయనా! భగవద్గీత పాడటానికి ఘంటసాల గొంతే తగినది. తప్పక ఆయన చేతనే రికార్డింగ్ చేయించండి. నేను వచ్చి వచనం మాట్లాడుతాను” అని చెప్పి నా చేతులు పట్టుకొని “నేను ఒకప్పుడు హెచ్ఎంవి బెంగుళూరు రికార్డింగ్ సెషన్సు జరుగుతుంటే పాడాను, రెంటచింతల సత్యనారాయణలాంటి చాలామంది ఆర్టిస్టుల చేత తెలుగు డ్రామా సెట్టు రికార్డింగులు చేయించాను కూడా” అని జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థించి ఆయన వద్ద సెలవు తీసుకుని వచ్చాను.
రోజులు గడుస్తూ ఉన్నాయి గానీ ఆయన ఆరోగ్యం మాత్రం త్వరలో కుదురుకునే పరిస్థితిలో లేదని తెలిసింది. చాలా బాధపడ్డాం. ఘంటసాలగారు తాను మద్రాసుకు వచ్చిన తొలుదొలుత నాగయ్యగారు తనకు ఎంతో సహాయం చేశారని, అది ఎన్నడూ మరువలేననీ చెప్పుకుని ఆయన ఆరోగ్యపరిస్థితిపై విచారించారు. త్వరగా రికార్డింగు చేయాలని ఆదుర్దా పడుతున్నారు. పద్యనాటకాలను ఆంధ్రప్రజలకు శ్రీకృష్ణరాయబార విజయముల రచనతో రుచి చూపినవారు మహానుభావులు తిరుపతి వేంకటకవులని చెప్పక తప్పదు. ఈ ప్రభావంతోనే భగవద్గీతలో కృష్ణార్జునుల సంభాషణలో నిస్పృహ, నివర్తి వివరణలో నాటకీయత ఉందని గ్రహించాను.
అది మనసులో పెట్టుకుని “శ్లోకాల మధ్య వచ్చే వచనం ప్రవచనాల్లా కాకుండా కృష్ణార్జున సంవాదంగా, నాటక సంభాషణారూపంలో నడుస్తుంది గనుక నాగయ్య గారు రాలేని పక్షంలో ఎవరైనా స్టేజి నటుల చేత డైలాగుల రూపంలో చెప్పిస్తే బాగుంటుంది కదా” అన్నాను ఘంటసాల గారితో.
అందుకు ఆయన కొంతసేపు ఆలోచించి “అన్నట్లు నేనూ ఒకప్పుడు స్టేజి యాక్టర్‌నే. నాటకాల్లో నటించి డైలాగులు బాగా మాట్లాడే అనుభవం నాకూ ఉంది. ‘సక్కుబాయి’లో యోగిగా, ‘చింతామణి’ నాటకంలో బిళ్వమంగళుడుగా వేషాలు వేసి ఉన్నాను” అన్నారు.
ఇది వినగానే నాకూ చాలా సంతోషమేసి “ఇక ఆలస్యమెందుకు? కృష్ణార్జునుల డైలాగులు రెండూ మీరే మాట్లాడండి. ఎందుకంటే మీ పాటా మాటా ఒకే శ్రుతిలో, ఒకే గాత్రంలో గాంభీర్యంతో మాట్లాడినప్పుడు ఒక దృశ్యనాటక అనుభూతి కలుగుతుంది” అన్నాను.
ఆయన కూడా కన్విన్స్ అయ్యారు. అన్ని సందేహాలు తీరాయి. రికార్డింగుకు సన్నాహమయ్యాము. నా ఆత్మీయ సోదరులు శ్రీ కోట సత్యరంగయ్య గారి చేత వ్యాఖ్యానం వ్రాయించాము. ఘంటసాల గారు అతి జాగ్రత్తగా శంకరమఠం, రామకృష్ణామఠం వారి భగవద్గీత పుస్తకముల నుంచి 108 శ్లోకాలు ఏరుకుని వాటికి సంగీతం సమకూర్చుకోవటం ప్రారంభించారు. శ్లోకాలకు ట్యూన్స్ కట్టడానికి దాదాపు ఆరు మాసాలు పట్టింది.
భగవద్గీత శ్లోకాలను వివిధ రాగాల్లో కంపోజ్ చేస్తున్న సమయాల్లో ఘంటసాల గారి సతీమణి సావిత్రిగారు అక్కడే ఉన్నారు. ఆమె బాగున్నదని సూచన ఇస్తే ముందుకు వెళ్లేవారు. లేదంటే ఆమెకు నచ్చేవరకు ఇంకో రాగం సమకూర్చుతూ పోయేవారు. ఈ పద్ధతి ఆయన ప్రైవేటు పాటలకే గాక సినిమా పాటలకు కూడా ఉండేది. ఈమె దాన్ని భగవద్గీత రికార్డింగప్పుడూ కన్పరచింది. సావిత్రమ్మగారు తానే స్వయంగా ఉతికి, ఆరబెట్టి ఇస్త్రీ చేయించిన కాషాయ వస్త్రాలు కట్టుకొని ఆయన అతి భక్తిగా, నిష్ఠగా స్టూడియోకి వచ్చి పాడేవారు. ఈ విధంగా భగవద్గీత రికార్డింగ్‌కు ఘంటసాల గారితో పాలుపంచుకున్న సావిత్రమ్మ గారికి నా మనఃపూర్వక వందనములు.
* * *
వీరందరి సహకారంతో భగవద్గీత రికార్డింగ్ 1973 ఆఖరుకి జయప్రదంగా ముగిసింది. కానీ అతి విచారకరమైన విషయం ఏమిటంటే – రికార్డ్సు స్లీవ్స్ (కవర్లు) ప్రింటింగులోనూ, రికార్డుల ప్రాసెసింగ్‌లోనూ అనివార్య జాప్యం వల్ల ఘంటసాల బ్రతికి ఉండగా రికార్డులు విడుదల చేయలేకపోయాం. దానికి నేను ఇంకా ఎంతో బాధపడుతూనే ఉంటాను. ఘంటసాలగారు స్వర్గస్తులైన రెండు నెలలకు 21-4-74 న విజయవాడ దుర్గా కళామందిరంలో కవిసామ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ, కరుణశ్రీ, ఆకాశవాణి (విజయవాడ) డైరెక్టర్ రజనీకాంతరావు లాంటి ప్రముఖుల సమక్షంలో శ్రీ ఎన్.టి.రామారావు గారి చేతుల మీదుగా భగవద్గీత రికార్డులు విడుదలయినవి. మొదటి రికార్డును విశ్వనాథ సత్యనారాయణ గారికి అందజేశారు రామారావు గారు.