గణిత విజ్ఞాన వేదాంత తత్వ కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -21
ఇంతకీ అవగాహనా పద్ధతులేమిటి ?వీటి పై కాంట్ సమగ్రం గా చర్చించాడు .మొదట ఇంద్రియానుభవం .దాన్ని మనస్సు పన్నెండు విధాల అవగాహన చేసుకొంటుంది .ఇంద్రియానుభవం లేక పోతే అవగాహనకు విషయాలే ఉండవు .అవగాహన లేక పొతే వట్టి ఇంద్రియానుభవం జ్ఞానాన్ని ఇవ్వదు .కాంట్ దీనికేconcepts without percepts are empty ,percepts without concepts are blind ‘’అన్నాడు .ఇంద్రియాను భవం లేక పొతే అవగాహనా పద్ధతులు నిరుపయోగమే.అవగాహనా పద్ధతులే లేక పొతే ఇంద్రియానుభవం జ్ఞానం గా వికశించదు .జ్ఞాన సముపార్జన కు ఇంద్రియానుభవం ,అవగాహనా పద్ధతులు అంటే వర్గాలు రెండూ అవసరమే .బయటి ప్రపంచాన్ని గురించి అవగాహన 12 వర్గాలపై ఆధార పడి ఉంటుంది. ఇవే అవగాహనా సూత్రాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ అండర్ స్టాండింగ్ .గా ,పద్ధతులు గా అంటే ఫారంస్ గా పని చేస్తాయి .మనకొచ్చే ఏ అనుభవమైనా ఈ పన్నెండు పద్ధతులలోనే కలుగుతుంది ,కలిగి తీరుతుంది .ఈ పన్నెండు పద్ధతులలో తప్ప అనుభవం అవగాహనకు రాదు అని తేల్చాడు కాంట్ .మనసు ఈ పన్నెండు పద్ధతులలో మాత్రమె ప్రపంచాన్ని అవగాహన చేసుకొంటే ,ఈ పన్నెండింటికి అనుభవాలు ఉండి తీరుతాయి అని కాంట్ స్పష్టం గా చెప్పాడు .
నాలుగు శ్రేణులు
పన్నెండు వర్గాలను కాంట్ నాలుగు శ్రేణులు గ విభజించాడు .ఒక్కొక్క శ్రేణిలో మూడేసి వర్గాలు ఉంటాయన్న మాట .ఒక శ్రేణి రాశి లేక సంఖ్య కు (క్వాంటి టి )సంబంధించింది .ఇందులో ఏకత్వం (యూనిటి ),బహుత్వం (ప్లురాలిటి )పూర్నత్వం (టోటాలిటి.)అనే మూడు వర్గాలున్నాయి. సంఖ్యాత్మికం గా ఏది చెప్పినా ఈ మూడు వర్గాలలో ఏదో ఒక దానికి కిందకు వస్తుంది .
రెండవ శ్రేణి గుణానికి (క్వాలిటి )సంబంధించింది .దీనిలో యదార్ధం (రియాలిటి ),ఖండన (నేగేషన్) ,పరిమితత్వం (లిమిటేషన్ ) అనే మూడు వర్గాలున్నాయి .వస్తువు గుణానికి సంబంధించి ఏది చెప్పినా ఈ మూడు వర్గాలలో చేరుతుంది .
మూడవ శ్రేణి సంబంధం (రిలేషన్ )కు చెందింది .దీనిలో ద్రవ్యం (సబ్ స్టన్స్ ),కార్య కార ణత్వం (కాసువాలిటి) ,పారస్పర్యం (రేసిప్రోసిటి) అనే మూడు వర్గాలున్నాయి .వస్తువుల మధ్య సంబంధాలను ఇవి తెలియ జేస్తాయి .
నాల్గవ శ్రేణి సంభావ్యత (మొడాలిటి )కి చెందుతుంది .దీనిలో సాధ్యాసాధ్యాలు ,అస్తిత్వం అస్తిత్వ రాహిత్యం ,ఆవశ్యకత ,వైకల్పికత అనే వర్గాలున్నాయి .మనం ఏది ఆలోచించినా ,ఏ వాక్యం చెప్పినా ,ఏ నిర్ణయం చేసినా ,ఈ నాలుగు శ్రేణులలోని పన్నెండు వర్గాలలో ఏదో ఒక దాని కిందికి చేరుతుంది వీటి సహాయం తో తప్ప ,మనసు ఇంకో విధం గా ప్రపంచాన్ని కాని ,ప్రపంచానికి సంబంధించిన వస్తువులను కాని ,సంఘటనలను కాని ,అనుభవాలను కాని అవగాహన చేసుకోలేదు అని కాంట్ గట్టి గా చెప్పాడు .ఈ వర్గాలను ఇంద్రియానుభావాలకు అన్వయించటం ద్వారానే మన మనసు వాటిని అవగాహన చేసుకొంటుంది .కనుక ఇంద్రియానుభావాలు విధిగా ఈ పన్నెండు వర్గాల పరిధి లోనే ఉంటాయి .అప్పుడు మాత్రమె ఇంద్రియానుభవాలు జ్ఞానం గా పర్య వసిస్తాయి అన్నాడు కాంట్ .
ఇప్పుడొక సారి కాంట్ చెప్పిన జ్ఞాన సిద్ధాంతాన్ని సంక్షిప్తం చేసి చూస్తె –బాహ్య ప్రపంచం రెండు రకాలు .ఒకటి యదార్ధ వస్తువులతో (న్యూమినా )కూడిన ప్రపంచం .ఆ ప్రపంచం ,అందులోని వస్తువులు మన ఇంద్రియానుభవం లోకి రావు .ఇంద్రియానుభవం లోకి వస్తేనే ,మనం దేని నైనా అర్ధం చేసుకో గలం . .కాని యదార్ధ వస్తువులు అవగాహన కు కూడా అందవు .అవి అజ్నేయాలు (అన్ నోవబుల్ ).
రెండవ ప్రపంచం మనం నిత్యం చూస్తున్న విషయ జగత్తు .ఇదే మన ఇంద్రియానుభవం లోకి వచ్చి ,మన చేత అవగాహన చేసుకో బడుతోంది .
యదార్ధ వస్తువులు
ఆజ్ఞేయ మైనది ,అనుభవానికి రానిది అయిన ప్రపంచం ఉందని ఎలా చెప్పగలం ?అని ప్రశ్నించుకొని కాంట్ మంచి వివరణ ఇచ్చాడు .దీనికి అనుమాన ప్రమాణం (ఇన్ఫె రెన్స్ )మాత్రమె సాక్ష్యం .సంవేదనలను అనుభవాలుగా మార్చుకొని ,అవగాహన చేసుకొనేది మనస్సు .అయినా సంవేదనలను కలిగించేది బాహ్య ప్రపంచం లోని యదార్ధ వస్తువులే కదా .అంటే బయటి ప్రపంచం స్వతస్సిద్ధం గా ఉన్నట్లే కదా .దానికి కర్త ఉన్నాడో లేదో తెలియదు .ఆ కర్త ఎవరో కూడా తెలియదు ..మన మనసు మాత్రం దానికి కర్త కాదు ఇది నిజం .మనకు సంవేదనలు పంపటం వరకే బాహ్య ప్రపంచం పని .ఆ సంవేదనలను స్థల కాల అవస్తితం చేసి అంటే క్రమ పరచి ఒక పద్ధతిలో అమర్చి ,కార్య కారణ సంబంధం ,సంఖ్య ,గుణం ,సంభావ్యత పద్ధతుల ద్వారా అవగాహనా చేసుకొనేది మనస్సీ .ఈ పద్ధతులు లేక కేటగిరీలు బాహ్య ప్రపంచానికి చెందినవి మాత్రం కావు అని ఇప్పటికే మనకు తెలిసింది .ఖచ్చితం గా మనో ప్రపంచం లోనివే ఇవి ..మానవ మానస నిర్మాణం లోనే ఆ పద్ధతులు అంతర్భూతం గా ఉన్నాయి .మనసు ఆ పద్ధతులలో తప్ప ,ఇంకో పధ్ధతి లో ఆలోచించలేదు .బాహ్య ప్రపంచం నుంచి మనకు కలిగే ఇంద్రియానుభవానికి ,ఆ పద్ధతులను వర్తింప జేసి అప్పుడు మనసు ఆ అనుభవాన్ని అర్ధం చేసుకొంటుంది అన్న మాట .ఇదే కాంట్ మాట .
ఈ అవగాహనా పద్ధతులు (ప్రిన్ సిపుల్స్ ఆఫ్ అండర్ స్టాండింగ్ )అనుభవం ద్వారా మాత్రం రానే రావు .అనుభవానికి ముందే అవి మన మనసులో ఉంటాయి .అందుకే వాటిని అనుభవానికి వర్తింప జేయటానికి వీలౌతోంది .మన మనసు ఒక పద్ధతిలో ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ప్రపంచం అలా ఉండక ఇంకో రకం గా ఉండటానికి వీలు లేదుకదా ..ఇందులో ఏమైనా వైరుధ్యం ఉందేమో తరువాత తెలుసుకొందాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26-8-13-ఉయ్యూరు