గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -18
కాంట్ తాత్విక వివేచన
క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ లో కాంట్ తన ప్రధాన తాత్విక వివేచనా నంతా పొందు పరచాడు .సాధారణం గా ‘’క్రిటిక్ ‘’అంటే విమర్శ అని అర్ధం .ఐతే కాంట్ దీనినే పరిశీలన ,వివరణా ,విశ్లేషణ అనే అర్ధాలలో విస్తృతం గా ఉపయోగించాడు .అలాగే ‘’ప్యూర్ ‘’అంటే నిర్మల మైన ,స్వచ్చమైన అని లౌకికార్ధం .కాని కాంట్ దీనిని అనుభవం తో సంబంధం లేని ,అనుభవానికి ముందున్న (ప్రయరి )అనే అర్ధం లో వాడాడు .రీజన్ అంటే వివేచనా అనే సామాన్య అర్ధం ఉంది .మొత్తం మీద ‘’క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ ‘’అంటే ‘’అనుభవానికి ముందున్న వివేచనా వాదం యొక్క పరిశీలన ‘’గా భావించాలి అని నండూరి వారి భావన .ప్లేటో తనకు ముందున్న విభిన్న తాత్విక సిద్ధాంతాలను సమన్వయము చేస్తూ ,,కొత్త సిద్ధాంతాన్ని ప్రతి పాదించాడు .కాంట్ కూడా విభిన్న ,విరుద్ధ సిద్ధాంతాల సమన్వయము తో కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మార్గ దర్శనం చేశాడు .
కాంట్ ఉన్న కాలానికి ‘’డేకార్డ్ ‘’పండితుని బుద్ధివాదం లేక’’ రేషనలిజం ‘’,,లాక్ గారి అనుభూతి వాదం అంటే ‘’ఎమ్పిరిసిజం ‘;;వాడుక లో ఉన్నాయి .బుద్ధి వాదులు చెప్పిన దేమిటంటే –ఇంద్రియానుభవం వల్ల నిశ్చితమైన ,స్పష్టమైన జ్ఞానం లభించదు .అది వివేచన ద్వారానే సాధ్యం. మనసులో స్వతస్సిద్ధ భావాలు (ఇన్నేట్ ఐడియాస్ )ఉంటాయి .వాటిని విశ్లేషించి ,సంశ్లేషించితే నిశ్చిత జ్ఞానం ప్రాప్తిస్తుంది .ఇది గణిత శాస్త్ర పద్ధతిలో జరిగే ప్రక్రియ .డేకార్డ్.చెప్పిన ఈ బుద్ధి వాదాన్ని అనుభూతి వాదులు తిరస్కరించారు .అనుభూతి వాదులేం చెప్పారు ?మనకు కలిగే జ్ఞానమంతా అనుభవం నుంచే వస్తుందన్నారు .మనస్సులో స్వతస్సిద్ధ భావాలనేవి ఉండవని ,మొదట్లో మనసు శుభ్రం చేసిన గాజు పలక లాగా స్వచ్చం గా ఉంటుందని ,తర్వాత అనుభవాల వల్ల మనసులో భావాలు కలుగుతాయని దీని సిద్ధాంత కర్త ‘’లాక్ ‘’మహాశయుడు చెప్పాడు .అనుభవం తర్వాతా వచ్చే జ్ఞానం త ప్ప ,అనుభవానికి ముందు జ్ఞానం (ప్రయరి )అనేది లేదని నమ్మాడు లాక్ వేదాంతి
‘’హ్యూమ్ ‘’తత్వ వేత్త అనుభూతి వాదాన్ని తార్కిక పర్యవసానం దాకా విస్తరించాడు .అనుభవాల వల్ల జ్ఞానం కలగటం నిజమే కాని ,ఆ జ్ఞానం లో నిశ్చితత్వం (certainty )ఉండదన్నాడు .సార్వత్రికత (యూని వేర్సల్ )కానీ ,ఆవశ్యకత (నేసేసిటి)కానీ ఉండవు .ఇంద్రియాను భవాల వల్ల సంవేదనలు కలుగుతాయి .అవి ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి .దాని వల్లనే జ్ఞానం వస్తుంది .ఈ క్రమం ఇలానే ఉండాలన్న నియమమేదీ లేదు .అందుకని అలా వచ్చిన జ్ఞానం లో ఆవశ్యకత అనేది లేదు .అది యాదృచ్చిక మైన ( యాక్సి డెంటల్ ),వైకల్పిక మైన (కంటిన్ జెంట్ )జ్ఞానమే అవుతుంది .దీనిలో కార్య ,కార ణత్వం ఉండదు .కనుక నిశ్చిత జ్ఞానం కాని ,సార్వత్రిక జ్ఞానం కాని పొందటం సాధ్యం కాదు .శాస్త్రీయ జ్ఞానమూ అసాధ్యమే .ఇలా హ్యూమ్ ‘’సంశయ వాదం ‘’(skepticism )ను లేవ నెత్తాడు .
కాంట్ దృక్పధం
అనుభూతి వాదులు జ్ఞాన సముపార్జన తో మనసు నిర్వహించే పాత్ర ను మర్చి పోయారు .అనుభవానికి ముందే నిశ్చిత జ్ఞానం రావటం ఖాయమే కాని జ్ఞానార్జన లో అనుభవం నిర్వహించే పాత్రను అలక్ష్యం చేశారు .అనుభవానికి ముందే జ్ఞానం ఉన్నప్పటికీ అనుభవం తో నే మొట్ట మొదట జ్ఞాన సముపార్జన జరుగుతుంది .బుద్ధి ,అను భూతి వాదాలను సమన్వయము చేయటం ఎలా ?అనే సమస్య కాంట్ ను వేధించింది .దీని పరిష్కారమే కాంట్ తాత్విక చింతన అంతా
హ్యూమ్ నిశ్చిత జ్ఞానాని ఇంద్రియానుభవం ద్వారా సాధించలేము అన్నది నిజమే కాని అసలు నిశ్చిత జ్ఞానం అనేది లేదు అంటే కుదరదు .ఇంద్రియానుభవానికి మించిన జ్ఞానం ఎందుకు ఉండరాదు ?అనుభవానికి ముందే జ్ఞానం ఎందుకుండ రాదు ?అనుభవానికి ముందున్న జ్ఞానానికి సార్వత్రికత ,ఆవశ్యకత ఎందుకు ఉండరాదు ?శాస్త్రీయ జ్ఞానం ఎందుకు సాధ్యం కాదు ?అని కాంట్ వేసుకొన్న మౌలిక మైన ప్రశ్నలు .వీటికి తన దైన శైలిలో భాషలో విశ్లేషణ చేసి సమాధానాలు చెప్పాడు.
అవగాహన ( అండర్ స్టాండింగ్ )ను కేవలం అనుభవానికి మాత్రమె పరిమితం చేయటం అనుభవ వాదులు చేసిన పొరబాటని గ్రహించాడు .అనుభవం వల్ల ఉన్నదేదో తెలుస్తుంది .అది అలాగే ఎండుకు ఉండాలో ,ఇంకో రకం గా ఎందుకు ఉండకూడదో మనకు తెలియదు .అనుభవ విశ్లేషణ వల్ల నిస్చితత్వం ,కార్య కారణత ,సార్వత్రికత మొదలైనవి మనకు అర్ధం కావు .
సార్వత్రికత ,నిశ్చిత ,ఆవశ్యకత, సత్యాలు లేవని చెప్పలేం .అనుమానం లేదు అవి ఖచ్చితం గా ఉన్నాయి .అనుభవానికి ముందూ ఉన్నాయి తర్వాతా ఉంటాయి .అనుభవం నుంచి అవి రాక పోయినా ,అవి అనుభవానికి తప్పని సరిగా వర్తించే అంశాలే .అనుభవం మీద మాత్రమె ఆధార పడి నిశ్చిత జ్ఞానాన్ని సార్వత్రిక జ్ఞానాన్ని సాధించలేం .అనుభవం ద్వారా యాదృచ్చికం ,,వైకల్పికం అయిన జ్ఞానాని మాత్రమె పొందగలం .ఇలా జరగా వచ్చు జరక్క పోనూ వచ్చు .జరగటానికి కారణం ఎలా ఉండదో జరక్క పోవటానికీ కారణం ఉండదు .మన జ్ఞానం అనుభవానికి మాత్రమె పరిమితం కాదు .అనుభవానికి ముందే జ్ఞానం లభిస్తుంది .దీనినే సార్వత్రికం అంటారు .అదే నిశ్చితం ఆవశ్యకత కూడా అవుతుంది .ఇది అనుభవానికి తప్పకుండా వర్తిస్తుంది .మరి ఇది ఎలా సాధ్యం ?అనుభవం తో సంబంధం లేకుండా ,అనుభవానికి వర్తించే నిశ్చిత జ్ఞానం మనకు ఎలా వస్తుంది ?శాస్త్రీయ జ్ఞానం ఏ విధం గా మనకు అలవడుతుంది ?వీటన్నిటికీ సమాధానం గా కాంట్ ‘’అతీత భావ వాదం ‘’వ్యాప్తి చేశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –24-8-13- ఉయ్యూరు