గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -20
మనసనేది లేక పొతే సంవేదనలు అనుభవం గా మారవు అని చెప్పుకొన్నాం కదా .దీనికోసం మనసు 1-స్థలానికి సంబంధించినది ,2 కాలానికి సంబంధించినది అయిన సాధనాలను ఉపయోగిస్తుంది .ఈ రెంటినీ అంటే స్పేస్ అండ్ టైంలను ‘’ప్యూర్ ఇంట్యూషన్స్’’ అన్నాడు ఇక్కడ ప్యూర్ అంటే అనుభవానికి ముందున్న అని ముందే చెప్పుకొన్నాం .పూర్వానుభావానికి సంబంధం లేకుండా అప్పటి కప్పుడు (స్పాన్టేని యస్ )కలిగే ఆంతరంగిక జ్ఞానం .స్థలం కాలం అనేవి ఆంతరంగిక జ్ఞాన రూపాలు అన్నాడు కాంట్ .ఈ రెండు వస్తువులలో బాహ్య ప్రపంచం లో ఉండేవికావు .అవి అనుభవానికి ముందే మనసులో ఉంటాయి .మనసు నిర్మాణంలోనే సహజం గా ,అంతర్భాగం గా ఉంటాయి అవి లేక పొతే మనస్సు అనేదే లేదు .బయటి వస్తువులను గురించిన జ్ఞానాన్ని సంపాదించటానికి మనసు –స్తల ,కాలాల ను సాధనాలుగా వాడుకొంటుంది .మనకు కలిగే ఇంద్రియ సంవేదనల పై స్తలాన్నీ కాలాన్నీ మనసు ఆధ్యారోపితం చేస్తుంది .అప్పుడే సంవేదనలు అనుభవాలుగా మారుతాయి .
మనస్సుకు స్తల కాలాల కళ్ళ జోడు స్వతస్సిద్ధం గా ఉండటం వల్ల ,వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో ,సంఘటనలు ఎప్పుడు జరిగాయో తెలుస్తుంది .స్తలకాలాలు అనుభవానికి ముందే ఉన్నాయన్న సంగతి మరువ రాదు .అంటే అవి వస్తువు లో ఉండవు .వస్తువులే స్తల కాలాలలో ఉంటాయని అర్ధం .వస్తువులు అంటే ‘’న్యూమినా ‘’అనే యదార్ధ వస్తువు మాత్రం కాదు .యదార్ధ వస్తువులు స్తల కాలాలకు అతీత మైనవని ముందే చెప్పుకొన్నాం .యదార్ధ వస్తు ప్రపంచం ఎలా ఉంటుందో మనసుకు ,అనుభ వానికి అందని విషయం .అది అజ్నేయం (అన్ నోవబుల్ ).విషయ వస్తువులు (ఫినామినా )మాత్రమె అంటే అనుభవం లోకి వచ్చే వస్తువులు మాత్రమె స్తల కాలాలలో ఉంటాయి .విషయ వస్తువులు శూన్య స్తలాన్ని (ఆబ్సల్యూట్ స్పేస్ ),శూన్య కాలాన్నిఆ బ్స ల్యూట్ టైం ) ఊహించగలం కాని స్తలం లో కాలం లో లేని వస్తువులను ఊహించలేము అని కాంట్ సిద్ధాంతం . ఒక సారి కాంట్ చెప్పిన దాన్ని మననం చేసుకోక పొతే పూర్తిగా అర్ధం కాదు యదార్ధ వస్తువులతో అంటే మ్యూమినాతో కూడిన ప్రపంచం మన అనుభవానికి రాదు .అది అనను భూతం .యదార్ధ వస్తువుల ఆభాసిత గుణాలు అంటే రంగు రుచి వాగైరా మాత్రమె అనుభవం లోకి వస్తాయి అందుకే మన జ్ఞానం ఇంద్రియానుభావాన్ని దాటి ముందుకు పోదు .
ఆభాసిత గుణాలు మన ఇంద్రియాల ద్వారా సంవేదనల రూపం లోనే మనకు తెలుస్తాయి .అయితే వాటి నుంచి జ్ఞానం మాత్రం రాదు .మనస్సు వాటిని స్తల కాల చట్రంలో బిగించి చూస్తుంది .అప్పుడే బాహ్య వస్తువుల గురించి ప్రత్యక్ష జ్ఞానం (పెర్సేప్షన్ )కలుగుతుంది .స్తలకాలాలు లేక పొతే బయటి ప్రపంచం అనుభవం లోకి రాదు .ఈ రెండు వస్తువులను ఒక క్రమం లో సంఘటితం చేసి మనసుకు అంద జేస్తాయి .ఇంత మాత్రం చేత జ్ఞానం సిద్ధించదు .వస్తువులు స్తల కాలాల్లో ఉన్నాయని మాత్రమె తెలుస్తుంది .ఇది జ్ఞానం కాదు ..జ్ఞానానికి ఇంద్రియానుభవం అనేది ముడి సమాచారాన్ని మాత్రమె అందిస్తుంది .ముడి సమాచారం జ్ఞానం గా ఎప్పుడు మారుతుంది ?ఇది జటిల మైన ప్రశ్న సమాధానం కూడా చెప్పాడు కాంట్ .
బాహ్య ప్రపంచం నుండి ఇంద్రియ సంవేదనలు మాత్ర్తమే వస్తాయని అవి ముడి సరుకు మాత్రమె నని తెలిసింది కదా .స్తలం కాలం అనే కళ్ళ జోడు లోంచి చూస్తె తప్ప ఇంద్రియ సంవేదనలకు ఇంద్రియానుభవం కలగదనీ చెప్పుకొన్నాం కదా ..కేవల ఇంద్రియాను భూతి తోనే జ్ఞానం సమగ్రం కాదు సంపూర్నమూ కాదు .ఇంద్రియాను భూతి జ్ఞాన సంపాదనకు ముడి సమాచారాన్ని మాత్రమె అందిస్తుంది .ఇంద్రియాను భూతి జ్ఞానం గా వృద్ధి చెందాలి అంటే మనసుకు మరో కళ్ళ జోడు కావాలి దాని లోంచి చూస్తె తప్ప ఫినామినల్ వరల్డ్ అంటే విషయ జగత్తు అర్ధం కాదు.జ్ఞానం సమగ్రమూ కాదు .
ఈ రెండో కళ్ళ జోడు నే కాంట్ ‘’కే టగారిస్ ‘’అన్నాడు .అంటే వర్గాలు అన్న మాట .కాంట్ పన్నెండు వర్గాలను గురించి చెప్పాడు .ఈ పన్నెండు కేటగిరీలు మన మనసులోనే ఉన్నాయి .వాటిని మన మనస్సు తయారు చేస్తుంది .వాటి ద్వారానే మనసు విషయ ప్రపంచాన్ని అవగాహన చేసుకొంటోంది .అది అలా చేస్తేనే ఇంద్రియానుభవం అవగత మవుతుంది .స్తలకాలాలనే కళ్ళ జోడు లోంచి చూస్తె బయటి వస్తువులన్నీ స్స్థల కాలాల్లో క్రమ పద్ధతిలో అమర్చి నట్లు కన్పిస్తాయో ,ఈ పన్నెండు వర్గాల కళ్ళ జోడు లోంచి చూస్తె బాహ్య వస్తువుల అనుభవాలన్నీ ,ఆ పన్నెండు వర్గాలకు అనుగుణం గా సంభ విస్తున్నట్లు అవగాహన కలుగుతుంది .ఈ వర్గాలు లేక కేట గిరీలు మనం ప్రపంచాన్ని అర్ధం చేసుకొనే పద్ధతులు అని గ్రహించాలి అని కాంట్ భావం .
.సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –25-8-13- ఉయ్యూరు