గణిత విజ్ఞాన వేదాంత తత్వ శాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -23
నిర్ణయ స్వేచ్చ
మనం చేసే పనులు రెండు రకాలుగా ఉంటాయన్నాడు కాంట్ .కోరికలు ,ఉద్రేకాలు ,ఉద్వేగాలకు లోనై చేసే పనులు మొదటి రకం .కర్తవ్య నిష్ట తో చేసేవి రెండో రకం .మొదటి వానిని స్వేచ్చగా చేయం .వాటికి బయటి వాటి ప్రేరణ ఉంటుంది .అలా చేయటం వల్ల సుఖం ,ప్రయోజనం ,లాభం కలుగుతాయని చేస్తూంటాం .ఇందులో మనకు ‘’సంకల్ప స్వేచ్చ ‘’వ్యక్తం కాదన్నాడు కాంట్ .
మనిషి సంకల్ప స్వేచ్చ వ్యక్తమయ్యే పనులు కొన్ని ఉంటాయి .అవి కర్తవ్య పాలన గా చేసే పనులు .ఏ పని అయినా అది మన విధ్యుక్త ధర్మం అని భావించి చెయ్యాలి .అందులో స్వార్ధం ఉండరాదన్న్నాడు కాంట్ మహాశయుడు .ఇలా చేస్తే సంకల్ప స్వేచ్చ ఎక్కడిది ? /అని ప్రశ్న రావటం సహజమే .మన అంత రాత్మ ప్రబోదిన్చినపుడు దాన్ని మన ఇస్టా నిస్స్టాలతో సంబంధం లేకుండా ఆచరించటానికి నిర్ణయించుకోవటం లోనే మన నిర్ణయ స్వేచ్చ (ఫ్రీ విల్ )వ్యక్తం అవుతుంది .అది మన కర్తవ్యమ్ అని ,విధ్యుక్త ధర్మం అని ,దాన్ని స్వేచ్చగా ఎంచుకొంటాం .అలా ఎంచుకోకుండా ఉండే స్వేచ్చ మనకు ఎలాగూ ఉంది .కాని అది కర్తవ్యమ్ అని ఎంచుకోన్నాం కనుక ఉత్తమ కార్యం ,నైతిక కార్యం అని పించుకొంటుంది అన్నాడు ‘’కాంట్ ది గ్రేట్’’.
కాంట్ గారి కాటగారికల్ కల్ ఇంప రేటివ్
సాధారణ పనులను బాహ్య ప్రేరణలకు లోనై విదిగాచేస్తాము .అవి బాహ్య ప్రేరణల చేత నియంత్రితం అవుతాయి .ఇవి కాక నైతిక చర్యల్ని ,కర్తవ్యమ్ చేయించే పనుల్ని మనకు నిరాకరించే స్వేచ్చ కూడా ఉన్నప్పటికీ ,అవి కర్తవ్యాలు కనుకనే చేస్తాం .అందుకే అవి నైతిక చర్యలు అయ్యాయి .ఈ కర్తవ్య పాలనను ,విధ్యుక్త ధర్మ నిర్వహణ ను కాంట్ ‘’కాట గారికల్ ఇంప రేటివ్ ‘’అంటే ‘’నిరపేక్ష కర్తవ్యమ్ ‘’అన్నాడు .ఈ పేరు పాస్చాస్చ తత్వ శాస్త్రం లో బాగా సుప్రసిద్ధమైంది .ఏ ప్రయోజనాన్నీ ఆశించకుండా ,చేస్తామో ,చేయ దగింది అని భావించి చేస్తామో అదే నిరపేక్ష కర్తవ్యమ్ .కర్తవ్యానికి కర్తవ్యమే ప్రయోజనం .స్తల కాలాలతో బాహ్య కారణాలతో దీనికి సంబంధమే లేదు .ఒక విశ్వ జనీన నైతిక సూత్రాన్ని అనుసరించి అది నిర్ణయం అవుతుంది .దాన్ని ఆచరించటం ద్వారా మనం పరమ సత్యం యొక్క అవగాహనకు మరింత దగ్గర అవుతాం అని నమ్మకం గా కాంట్ చెప్పాడు .
అయితే ఏది కర్తవ్యమ్ ?ఇది అడుగడుగునా వచ్చే ధర్మ సందేహమే .ఏది కర్తవ్యమో ఎలా చెప్పగలం?ఎవరు చెప్పాలి ?ధర్మ సంకటం వస్తే పార్దుడికి పార్ధ సారధి శ్రీ కృష్ణుడు కర్తవ్య బోధ చేశాడు .ప్రతి నిత్యం మనకు ఎవరు చేస్తారు ?ఉషశ్రీ లేడు,మల్లాది వారు వారానికో నెలకో సారో టివి.లలో దర్శనమిస్తారు .కనుక కిం కర్తవ్యమ్ ?అంతరాత్మ చెప్పి నట్లు చేయటమే కర్తవ్యమ్ అన్నాడు కాంట్ .అంతకు ముందెప్పుడో మన వాళ్ళూ ఇదే చెప్పారని మనకు తెలిసిన విషయమే .కనుక అంతరాత్మ చెప్పి నట్లు నడచుకోవాలి .ఏది చేస్తే లోక కల్యాణం జరుగుతుందో దాన్ని మాత్రమె చేయాలి .మనిషి మనిషికి ఒక నీతి సూత్రం ఉండరాదు .సమస్య వస్తే మనం ఎలా ప్రవర్తిస్తామో ,ఇతరులు ఎలా ప్రవర్తిస్తే అందరికి మేలు జరుగుతుందో ,నీతి అవుతుందని భావిస్తామో ,మనం కూడా అలా ప్రవర్తించాలి ఉత్కృష్ట కర్తవ్యమ్ .అంటే విస్తృత ప్రయోజనం చాలా ముఖ్యం అన్న మాట .మనం నిర్దేశించుకొనే కర్తవ్యమ్ ,ఒక విశ్వ జనీన నైతిక సూత్రం అవటానికి అర్హమై ఉండాలి అని కాంట్ నిక్కచ్చిగా బోధించాడు .
మనకు ఒకడి పై ద్వేషం కలిగి ,వాడికి హాని తల పెడితే ,లోకం లో అందరూ అలానే ప్రవర్తిస్తే లోకం భ్రష్ట మై పోతుంది .ఇలా అయితే సహజీవనం ,సంఘ జీవనం సాధ్యం కాదు అని స్పష్ట పరచాడు కాంట్ .కనుక ఇతరులను ద్వేషించటం హాని కల్గించటం విశ్వ శ్రేయస్సు దృష్ట్యా చేయరాని పని .అలాగే అబద్దాలాడటం చేయరాదు .మోసం అసలు కూడదు .కనుక నిజాయితీ గా మన కర్తవ్య పాలన చేస్తే లోక శుభం కలుగుతుంది .’’సర్వే జనా స్సుఖినో భవంతు ‘’అని చెప్పిన మన ఉపనిషద్ వాక్యమే కాంట్ తన భాషలో చెప్పాడని తెలుస్తోంది .కర్తవ్యమ్ విశ్వ జనీన సూత్రాన్ని బట్టే నిర్ణయం అవుతుంది .’’ఇతరులు ఏ పని చేస్తే ,అది మనకు హితం గా ఉండదో ,ఆ పని ఇతరులకు చేయక పోవటం అన్ని ధర్మాలలో ఉత్తమ ధర్మం ‘’అని మహా భారతం లో చెప్పిన సూత్రమే ఇమాన్యుయల్ కాంట్ తాత్వికుడుగారి ‘’కాట గారికల్ ఇంప రేటివ్ ‘’.గీతలో శ్రీ కృష్ణ భగవానుడు చెప్పినట్లు ‘’కర్మలు చేయటం మన వంతు .కర్మ ఫలాల పై మనకు అధికారం లేదు‘’.అయితే పని అంటే మన ఇష్టం వచ్చినట్లు చేసే పని కాదు .’’కర్తవ్యమ్ ‘’అని గుర్తుంచుకోవాలి .ఇందులో విశ్వ జనీనత ఇమిడి ఉంది .
కాంట్ చెప్పిన అతీత సత్యం
‘’కంటికి కనిపించే ఈ వస్తు ప్రపంచం వెనక ,దేశాకాలా బాధిత మైన ఒక సత్యం అవాగ్మానస గోచరం గా ఉంది .మన నైతిక సంకల్ప స్వేచ్చ ను ఉపయోగించుకొని ,నిరపేక్ష కర్తవ్య నిర్వహణ ద్వారా ఆ సత్యాన్ని కొంత వరకు మనం దర్శించగలం అన్నాడు కాంట్ .మన కర్తవ్యమ్ విశ్వ జనీనం ,దేశ కాలా బాధితం కనుకనే ఇది వీలవుతుంది .అంతే కాదు అనుభావాత్పూర్వ అనుభా తీతం కూడా . ఈ పరిస్తితులలో దేశాకాలా బాదితమైన ఆ పరమ సత్యం తనను తాను అభి వ్యక్తం చేసుకొంటుంది ‘’అని కాంట్ పండితుని అభిభాషణం .మన వేదాంత దర్శనమూ ఇదే కదా .ఇలాంటి కర్తవ్య నిర్వహణ లోక కల్యాణాన్ని కోరుకొంటుంది కనుక అది ఆవశ్యకమైనది అవుతుంది .,అనుసరణీయం ఆచర ణీయం అవుతుంది ఇదే కాంట్ గారి కట గారికల్ ఇంప రేటివ్ .మరి దీనికి పర్యవసానం ఏమిటి ?సర్వ సమానత్వం .అంటే ప్రజాస్వామ్యం .సోషలిజం ‘’.నైతిక దృష్టిలో ఎవడూ ఎవడి కంటే గొప్ప కాదు .సార్వ కాలీన ,సార్వ జనీన నీతి సూత్రం ముందు ఎవడైనా ,ఆఖరికి దేవుడైనా తల వంచాల్సిందే ‘’అని నిశ్చయం గా చెప్పాడు సమ సమాజ దర్శనుడు ,మహా వేదాంతి కాంట్ మహాశయుడు . .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-8-13 ఉయ్యూరు
excellent………….