గణిత విజ్ఞాన వేదాంత తత్వశాస్త్ర కోవిదుడు –ఇమాన్యుయల్ కాంట్ -24
మనుష్యుడిలమహాను భావుడే
ప్రతి వాడూ లేకం లో తనకు తాను ఇచ్చుకొనే విలువనీ ,ఇతరులు కూడా తమకు తాము ఇచ్చుకొంటారు అని అందరం గ్రహించాలి .ప్రతి వ్యక్తీ గమ్యం తానే .అని అర్ధం చేసుకోవాలి ..తన వ్యక్తిత్వ సాక్షాత్కారమే అని తెలుసుకోవాలి ..ఎవడూ ఇంకోడికి సాధన మాత్రుడు కాదు .తాను తప్ప మరి ఏ ఇతర ప్రయోజనానికి నిమిత్త మాత్రుడు కాదు .ఎవడి వ్యక్తిత్వం ప్రత్యేకతా వాడిదే .అందుకని మనం ఇచ్చుకొనే విలువ ,గౌరవం ఇతరులకు కూడా ఇవ్వాలి .ఇదే నైతిక ప్రవర్తనకు ఆధార సూత్రం కావాలి .దాన్ని ఆచరణలో చూపించాలి .కాంట్ దీనిని ఈ విధం గా చెప్పాడు –
‘’మానవ జాతి పట్ల మనం ఎలా ప్రవర్తించాలి అంటే-నీతో సహా ,మనలో ప్రతి ఒక్కరి తో సహా మొత్తం మనవ జాతిని ,ప్రతి ప్రత్యెక సందర్భం లోను ,దాని కొరకే దాన్నిగా తప్ప ఏ ఇతర ప్రయోజనానికి సాధన మాత్రం గా మనం పరిగణించ రాదు (treat humanity whether in thineown person or in that of any other .In every casae as an end withal ,never as a means only )
మనతో సహా ప్రతి ఒక్కడూ తనకు తానే గమ్యం అని బావించాలి .దీని వల్ల సర్వ మానవ సమానత్వం అనే విశ్వ జనీన సత్యం ఆవిష్కృత మౌతుంది .ఇదే మన ఉపని షత్తు చెప్పిన ‘’ఆత్మ వత్ సర్వ భూతాని ‘’.ఇంకొంచెం ముందుకు వెడితే ‘’యస్తు సర్వాణి భూతాని ,ఆత్మన్యవాను పశ్యతి ,సర్వ భూతేషు చాత్మానం తతో న విజుప్సతే ‘’అంటే ఎవరైతే తనలో సర్వ ప్రాణులను ,సర్వ ప్రాణులలో తననూ చూసుకొంటాడో వాడికి దుఖం అనేది లేదు ‘’అందుకే భారతీయ తత్వ వేత్తలకు కాంట్ అంతగా ఆదరణీ యడయ్యాడు .పాశ్చాత్య తత్వ వేత్తలలో నిరపేక్ష ,సార్వత్రిక నైతిక ప్రవర్తన సూత్రం (కేట గారికల్ ఇంప రేటివ్ )ను ఆవిష్కరించి ,అందరి కంటే ముందు చూపుగల వాడయ్యాడు కాంట్ .మార్గ దర్శనం చేశాడు వారందరికీ .ఈ సూత్రం ఉదాత్త సౌందర్యం తో భాసిస్తుంది .పాశ్చాత్య వేదాంతానికి క్రాంత దర్శి కాంట్ మహాశయుడు పెట్టిన ధర్మ భిక్ష ఇది .
ధర్మ సూత్రాలు ప్రతి నీతి సూత్రాన్ని బాధిస్తాయి .అప్పుడు సూత్రాలు సంఘర్షించి నట్లుగా అని పిస్తుంది .అప్పుడు ఏమిటి గతి ?ప్రత్యెక సన్ని వేశా లలోఅందరూ ఎలా ప్రవర్తిస్తే నీతి అవుతుందని మన అంతర్వాణి ఉద్బోదిస్తుందో ,ఆ విధం గా చేయటమే కర్తవ్యమ్ అవుతుంది .దానిలో స్వార్ధం లేనంత వరకు దోషం మనలను బాధించదు .అంటే సందర్భానికి తగిన నీతిని ఆవిష్కరించి సమాజ శ్రేయస్సుకు దోహద పడాలి అన్నదే కాంట్ భావించిన కే ట గారికల్ ఇమ్పరేటివ్ పరమార్ధం అని అందరు గ్రహించాలి
కాంట్ రామణీయక సిద్ధాంతం
కాంట్ రాసిన మూడవ పుస్తకం ‘’దిక్రిటిక్ ఆఫ్ జడ్జ్ మెంట్ ‘’.ఇది ‘’సౌన్దర్య మీమాంస’’ (Aesthetic logic )కు సంబంధించింది .వస్తువు బాహ్య ద్రుష్టి లోనైనా ,కళా ద్రుష్టి లో నైనా సుందరమైనదో కాదో ఎలా తెలుస్తుంది ?సౌందర్యా స్వాదనను ఎలా చేయగలం ?మొదలైన విషయాలను చర్చిన్చేదే ఈస్తటిక్స్ అంటే ..మన అలంకార శాస్త్రం లాంటిది .ప్లేటో, అరిస్టాటిల్ ,లు పూర్వం దీన్ని గురించి చర్చించారు ..కానీ ఆ తర్వాతి యూరోపియన్ తత్వ వేత్తలుదీన్ని పట్టించుకోకుండా వదిలేశారు .వీళ్ళ తత్వ చర్చ అంతా పార భౌటిన ,నైతిక చిన్తనలకే పరిమితం చేశారు .మళ్ళీ ఇన్నేళ్ళకు కాంట్ దీనిని తీసుకొని రామణీ యకత్వం పై అద్భుత మైన చర్చ చేశాడు దాని పై ఒక దివ్య గ్రందాన్నే రాశాడు .అందుకే కాంట్ ను ‘’ఆధునిక రామణీయక శాస్త్ర పితామహుడు ‘’అన్నారని నండూరి రామ మోహన రావు గారన్న మాట అక్షర సత్యమే .
కాంట్ రాసిన మూడు పుస్తకాలైన ‘’క్రిటిక్ ‘’లో మొదటి దానిలో’’ సత్యం ‘’(ట్రూత్ )గురించి చర్చించాడు .రెండవ క్రిటిక్ లో ‘’శివం’’( ది గుడ్)ను గురించి చర్చిస్తే మూడవ దానిలో ‘’సుందరం ‘’(దిబ్యూటిఫుల్ )గురించి చర్చ చేశాడు .అంటే’’ సత్య శివ సుందర త్రికం’’ గురించి మీమాంస చేసిన ఘనా ఘనుడు కాంట్ .కాంట్ కాలం నుంచే తత్వ శాస్త్రం లో ‘’రామణీయకత ‘’పై చర్చ ఒక ముఖ్య భాగమై పోయింది అదీ కాంట్ ప్రత్యేకత .సత్య ,శివ, సుందరాలు దేనికి అదే ప్రత్యెక మైనది కీట్స్ కవి‘’సత్యం సౌందర్యం ఒకటే ‘’అన్నాడు ‘’an ode on Gracian Arn ‘’కవిత లో –‘’beauty is truth ,truth beauty –that is all ye ,know on earth ,and all e need to know ‘’చెప్పాడు .
అయినా ఆ ప్రతిపాదన అందరికీ అంగీకారం కాలేదు .కారణం సత్యం విషయం నీతి మంతం శుభకరం కాక పోవచ్చు .నైతిక మైనంత మాత్రాన సత్యమైనది కాకనూ పోవచ్చు .సత్య విషయం సుందరం నీతి మంతం కాకనూ పోవచ్చు .సుందరమైనది ప్రతిదీ నైతికం సత్య నిష్టం కాక పోవచ్చు .కనుక ఈ మూడూ విభిన్న సూత్రాలే .సత్యం అందరికీ సత్యమే .అది సార్వత్రిక సార్వ జనీన మైనది .నైతిక సూత్రం మానవు లందరికి ఒకటే .నీతి అందరికి నీతి అవ్వాలి .అదీ సార్వత్రికం సార్వ జనీనం
వ్యక్తీ అనుభూతి
సుందరమైనది అందరికి సుందరం అని పించక పోవచ్చు అందమైన వస్తువు కలిగించే సంవేదన (ఫీలింగ్ )మిగిలిన వాటి కంటే భిన్నం గా ఉంటుంది .దానికి అదే లక్ష్యం గమ్యం .అది ఏ ఇతర సంవేదనకూ కారణం కాదు .అందానికి ఆనందమే పరమావధి అందమైనది అనైతికం అసత్యం కావచ్చు కూడా .అయినా అది అందమైనదే అని పిస్తుంది .మరి దీనికి కొలమానం ఏమిటి ? ఈ ప్రశ్నను సంధించుకొని కాంట్ గొప్పగా దాన్ని ఆవిష్కరించాడు .ఆ విషయాలు తర్వాత తెలుసు కొందాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –27-8-13 ఉయ్యూరు