చందమామ భాషంతా మా క్యాంపుదే

చందమామ భాషంతా మా క్యాంపుదే

September 01, 2013

అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్ తెలుసా?
ఎవరాయన?
‘ఆహుతి ప్రసాద్’ తెలుసా?
ఓహో, ఆయనా…. ‘చందమామ’ సినిమాలో మ్యాచింగ్ మ్యాచింగ్ లుంగీజుబ్బాలేసుకుని పంచ్ డైలాగులతో తెగ నవ్వించేశాడు… అతనేగా?
ఆయ్.. ఆయనేనండి.
చందమామే కాదండి, బోల్డన్ని సినిమాల్లో రకరకాల పాత్రలతో, పాత్రకు తగిన మాటతీరుతో అందర్నీ ఆకట్టుకునే ఆహుతి ప్రసాద్‌కు అన్నిటికన్నా ఇష్టమైనదేదో తెలుసాండీ?
‘మా పాండురంగ క్యాంప్, అక్కడి మనుషులు, ఆయ్’ అంటున్నారాయన. ప్రసాద్ చెబుతున్న ఆ క్యాంపు విశేషాలే ఈ వారం ‘మా ఊరు’


నేను పుట్టింది కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం కోడూరు గ్రామంలో. మా కుటుంబానికి జనార్దనస్వామి ఇలవేల్పు. అందువల్ల నా పూర్తిపేరు అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్. కోడూరులో ఉన్న జనార్దనస్వామి ఆలయాన్ని మా వంశస్థులే పూర్వం ఎప్పుడో కట్టించారని చెబుతారు. నేను పుట్టింది 1958 జనవరి 2న. మాది వ్యవసాయ కుటుంబం. మానాన్న రంగారావు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తూ దాన్ని వదిలేసి మళ్లీ వ్యవసాయంలోకే వచ్చారు! ఆ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగమంటే చాలా విలువైనది. అయినా సరే, ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారంటే – వ్యవసాయం మీదే ఆయనకు ప్రేమ ఎక్కువని కదా.

కోడూరు వదిలేశాం

నాకుముగ్గురు అక్కలు. అన్నదమ్ములెవరూ లేరు. ముగ్గురాడపిల్లల తర్వాత పుట్టిన మగపిల్లాణ్ని కనుక సహజంగానే నన్ను ఇంట్లో చాలా గారాబంగా చూసుకునేవారు. ఆడపిల్లల పెళ్లిళ్ళు చెయ్యాలి, మగపిల్లాణ్ని బాగా చదివించాలి అంటే కోడూరులో ఉన్న ఏడెనిమిది ఎకరాలు సరిపోవని మానాన్నకు అర్థమయింది. అందువల్ల ఆ భూములు అమ్మేసి కర్నూలు సమీపంలో శాంతినగరం అనే చోట భూములు కొన్నారు. నాకు మూడునాలుగేళ్ల వయసులోనే మేం శాంతినగరానికి వచ్చేశాం. అందువల్ల మా సొంతూరు కోడూరు గురించి జ్ఞాపకాలేవీ నా మనసులో ముద్రపడలేదు. శాంతినగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని చంద్రశేఖరనగరం అనేచోట మా నివాసం. మా తాత, నాయినమ్మ కూడా ఉండేవారు. అప్పట్లో తుంగభద్ర మీద వంతెనలు లేవు. అందువల్ల కృష్ణా జిల్లా నుంచి మేముంటున్న చోటికి రావాలంటే ద్రోణాచలం వచ్చి, అక్కణ్నుంచి కర్నూలు, అలంపురం మీదుగా వచ్చేవారం. శాంతినగరం చుట్టుపక్కల భూములన్నీ రాజోలిబండ డైవర్సిఫికేషన్ కెనాల్ కింద సాగవుతూ ఉండేవి.

క్యాంపుకెళ్లాం


ఇంతలో ఇక్కడ కన్నా కర్నాటకలోని భూములు మరింత చవగ్గా వస్తున్నాయి, పైగా వాటికి మంచి నీటి వసతి ఉందని మా నాన్న తరంలో కొందరు అటువైపు వెళ్లారు. దాంతో మా కుటుంబం కూడా రాయచూరు సమీపంలోని సింధనూరుకు బయల్దేరింది. అక్కడ తెలుగువాళ్లుండే ప్రాంతాలను ‘క్యాంప్’లంటారు. మేమున్నది పాండురంగ క్యాంప్‌లో. నేను ‘మా ఊరు’ అని చెప్పవలసి వస్తే పాండురంగ క్యాంప్ గురించే చెబుతాను. నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచి పెరిగిందంతా అక్కడే మరి.

అనుకరించి నేర్చుకున్నా

మా క్యాంపే కాదు, ఏ క్యాంప్‌లో అయినా తెలుగు పల్లెటూరి వాతావరణమే ఎక్కువగా ఉండేది. పాండురంగ క్యాంపు విషయంలో ఒక్క తేడా ఏమిటంటే – మిగిలిన చోట్ల కృష్ణా జిల్లా వాసులు ఎక్కువ కనిపిస్తే, ఇక్కడ మాత్రం గోదావరి జిల్లాల నుంచి వచ్చినవారు ఎక్కువమంది ఉండేవారు. మాకు వాళ్ల భాష విచిత్రంగా అనిపిస్తే, వారికి మా అలవాట్లు కొత్తగా ఉండేవి. సరదాగా వేళాకోళాలు చేసుకునేవాళ్లు తప్ప పెద్ద గొడవలేం ఉండేవి కాదు. మేం ఉలవచారు చేసుకుంటే ‘ఏంటండీ అది? ఉలవలు గుర్రాలకు పెట్టాలిగానీ మనుషులు తింటారేంటండీ?’ అని నవ్వేవాళ్లు. నేనేమో మాటిమాటికీ ‘ఆయ్’ అనో, ప్రతివాక్యం చివరా ‘అండీ’ అంటూనే వాళ్ల యాసను అనుకరిస్తూ మాట్లాడి చుట్టుపక్కల అందర్నీ తెగ నవ్వించేవాణ్ని. దాంతో కొన్నాళ్లకు నాకు పూర్తిగా గోదావరి భాషే వచ్చేసింది. నాకు బాగా పేరు తీసుకొచ్చిన ‘చందమామ’ సినిమాలో నేను అచ్చమైన గోదావరి మనిషిలా మాట్లాడగలిగానంటే అదంతా చిన్నప్పుడు మా క్యాంపులో విన్న భాష మహత్యమే.

పెళ్ళంటే పందిళ్లు….


క్యాంపుల గురించి ఎప్పుడు తల్చుకున్నా కళ్లకు కట్టినట్టు గుర్తొచ్చే విషయం ఏమిటంటే – అక్కడ జరిగే పెళ్ళిళ్లు. ఎవరింట్లోనైనా పెళ్లి కుదిరితే చాలు, వెంటనే క్యాంపు జనాలంతా రంగంలోకి దూకేవారు. ఇంటికి సున్నాలు వెయ్యటం మొదలు, పసుపు దంచటం, పిండివంటలు చెయ్యటం మొదలైన పెళ్లిపనులన్నీ తలా ఒకటీ పంచుకుని చేసేసేవారు. ఫలానాది చెయ్యమని అడిగే అవసరమే లేకపోయేదక్కడ. పెళ్లికి పది రోజుల ముందు నుంచే చుట్టాలు పక్కాలు దిగుతారు దూరం నుంచి రావాలి కాబట్టి. ఆ పది రోజులూ క్యాంపులో అందరూ వాళ్లింటికి పాలు పంపించేవాళ్లు. అలాగే కనీసం పదిహేను రోజుల ముందునుంచీ క్యాంపు ఆడవాళ్లందరూ పగటి పూట పెళ్లివారింట్లో ఏదో ఒక పనిచేస్తూనే ఉండేవారు! ఇక పెళ్లి ముందు మూడు రోజులైతే క్యాంపంతా సందే సందడి. మగవాళ్లు పందిళ్లు వేస్తూ, ఇతర సాయాలు చేస్తూ ఉంటే ఆడవాళ్లంతా వంటలు, వడ్డనల్లో మునిగితేలేవారు. ఇప్పట్లాగా డబ్బులిచ్చి ఆ పనులన్నీ చేయించుకునే రోజులు వస్తాయని అప్పటివారికి చెబితే నమ్మేవారు కాదేమో.

నాయనమ్మ సారమే నాది

మా నాయనమ్మ చదువుకోలేదు గానీ బోలెడు పాటలు పాడేది, వింత వింత కథలు చెప్పేది. సందర్భానుసారం ఏదో ఒక పాటో, కథో ఆమె నోటి నుంచి బైటికి వచ్చేది. వేసవి కాలంలో రాత్రులు ఆరుబయట పక్కలు వేసుకున్నాక పడుకోబోయే ముందు ఓ ముప్ఫై నలభై మంది ఆమె చుట్టూ కూర్చుని పాటలో, కథలో వినడం నాకిప్పటికీ గుర్తుంది.రాత్రి తరిగిపోయేదిగాని మా నాయనమ్మ చెప్పే కథలు అయిపోయేవి కాదు. ఎప్పుడైనా ఆమె చెప్పకపోతేక్యాంపులో జనాలు అడిగి మరీ చెప్పించుకునేవారు. దేవుళ్లు, రాజులు, జానపదులు – ఆమె కథల్లో ఎంతో మంది ఒదిగిపోయేవారు. ఆమె ప్రభావం నామీద ఉండడం వల్లే నేను సినిమాలవైపు ఆకర్షితమయ్యానేమో అనిపిస్తుంది చాలాసార్లు. మా తాత నన్ను తన భుజాల మీదకు ఎక్కించుకుని పొలానికి తీసుకెళ్లేవారు. పెద్దయ్యాక కూడా తరచుగా పొలానికి వెళుతూ ఉండేవాణ్ని. క్యాంపు పల్లెటూళ్లన్నీ తుంగభద్ర కాలవలకు సమీపంలోనే ఉండేవి కనుక కాలవలు మా బాల్యంలో విడదీయరాని భాగాలయిపోయాయి. వాటిలో స్నానాలు, ఈతలు కొట్టడాలు – ఒకటేమిటి, నీటిలో చాలా ఆడుకునేవాళ్లం.

కన్నడవారితో కలిసిపోయాం

క్యాంపులో పెరిగినందువల్ల నాకు కన్నడ భాషకూడా బాగా పట్టుబడింది. ఎందుకోగాని క్యాంపులోనూ, చుట్టుపక్కల ఊళ్లలోనూ నాకన్నా పెద్దవాళ్లు కూడా నాకు స్నేహితులుగా ఉండేవారు. నా బలమంతా నా స్నేహితులే. ప్రస్తుతం మూడోసారి సింధనూరు ఎమ్మెల్యేగా ఉన్న హంపన్నగౌడ నా చిన్నప్పటి స్నేహితుడే. మా క్యాంపులోనే కాదు, చుట్టుపక్కల క్యాంపుల్లో కూడా ఎవరికే అవసరం వచ్చినా వెంటనే వచ్చి అడిగేవారు నన్ను. సింధనూరులో భాస్కర్రావు, రాధాకృష్ణ అనే ఇద్దరు డాక్టర్లుండేవారు. వీరు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌కు గుల్బర్గా వైద్యకళాశాలలో సహాధ్యాయులు. క్యాంపుల్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే ‘నీకు ఆ డాక్టర్లు తెలుసు కదా, వాళ్లకో మా ముందుగా చెప్పరా’ అంటూ నాకు పురమాయించేవాళ్లు. ఆ రోజుల్లోనే కాదు, ఈనాటికీ అక్కడేమైనా పనులుంటే నాకు ఫోన్ చేస్తుంటారు. ‘ఫలానావాళ్లతో కొంచెం మాటాడ్రా బాబూ’ అని. మనకు చేతనయినంతలో ఇతరులకేదైనా సాయం చెయ్యాలనే స్వభావమే నాది కూడా. దానివల్లే ఇప్పటికీ అక్కడి స్నేహితులు, వాళ్లతో నా సంబంధాలూ పదిలంగా ఉన్నాయి. అందుకే ఎవరైనా నా అడ్రస్ అడిగితే, చప్పున అక్కడిదే చెప్పేస్తుంటాను!

ఎంత మంచివాళ్లో

కర్ణాటక ప్రజలు చాలా మంచివాళ్లు. దక్షిణాది అందరిలోకీ వాళ్లు చాలా ఉదార హృదయమున్నవాళ్లు. మీరు ఏదైనా అడ్రస్ అడిగారనుకోండి, మలయాళీలు అసలు విననట్టే వెళ్లిపోతారట, తమిళ తంబీలు మాటలతో చెప్తారట, తెలుగువాళ్లు దిక్కులతో చెప్తారట, అదే కన్నడవాళ్లయితే మిమ్మల్ని తీసుకెళ్లి దిగబెడతారట. దీన్ని కొందరు జోకులాగా చెబుతుంటారు గానీ, నిజానికి కన్నడ ప్రజల మంచి మనసుకు అది మచ్చుతునక అనిపిస్తుంది నాకు. వాళ్లకు భక్తి ఎక్కువ, సెంటిమెంట్ ఎక్కువ, దయ్రార్ద హృదయులు. కక్షలు, పగలు వాళ్లకసలు తెలియనే తెలియవు.

సినిమా చూడటం పెద్ద తంతు

క్యాంపుల్లో వినోద సాధనాలేవీ పెద్దగా ఉండేవి కావు. సింధనూరులో థియేటర్లున్నా తెలుగు సినిమాలు రావడం అరుదు. మాకు దగ్గర్లో తెలుగు సినిమాలు వచ్చే ఊరేదంటే బళ్లారే. అది దాదాపు తొంభై కిలోమీటర్ల దూరం. అక్కడ ఎన్టీఆర్ సినిమా విడుదలవుతోందంటే పెద్ద హడావుడి. చుట్టుపక్కల వందకిలోమీటర్ల లోపలి ఊళ్ల వాళ్లంతా బళ్లు కట్టుకొని ముందు రోజు రాత్రికే బళ్లారి చేరుకునేవారు. మర్నాడుదయం ఎనిమిదిన్నరకే తొలి ఆట. స్నానాలు చేసి ఏడున్నరకల్లా మేళతాళాలతో ఆ థియేటర్ దగ్గరకు చేరుకునేవాళ్లం. అక్కడ ఎన్టీఆర్‌గారిది పెద్ద కటౌట్ ఉండేది. దానికి దండలు వేసి పూజలు చేసేవారు. తర్వాత సినిమా బాక్స్‌కు హారతులిచ్చి గొర్రెను బలిచ్చేవారు. ఇక బాజాల మధ్య అందరూ హాల్లోకి అడుగుపెట్టేవారు. స్క్రీన్‌కు ముందున్న ప్రదేశంలో బంతిపూలతో పెద్దగా ‘ఎన్టీఆర్’ అని ఆయన బిరుదులతో సహా రాసుండేది. అక్కడే పెద్ద పెద్ద బస్తాలతో బంతిపూలు, కొబ్బరికాయలు పెట్టుకొని మనుషులు సిద్ధంగా కూర్చుని ఉండేవారు.

తెరమీద ఎన్టీఆర్ పేరు తొలిసారి కనిపించినప్పుడు, సినిమా పేరు వచ్చినప్పుడు, తొలిసారి ఎన్టీఆర్ తెరమీద కనిపించినప్పుడు, మొదటి పాట అప్పుడు , మొదటి ఫైట్ అప్పుడు – ఇలా అన్ని సందర్భాల్లోనూ పువ్వులు తెరమీదకు విసిరేవాళ్లు, కొబ్బరికాయలు ఠపాఠపా కొట్టేసేవారు. అభిమానులు చేసే ఈ హంగామా వల్ల మొదటి ఇరవై నిమిషాలు, అరగంట సేపు సినిమా అస్సలు కనిపించేది కాదు. దాంతో కొన్ని రోజుల తర్వాత మళ్లీ వచ్చి చూసేవాళ్లం. కొంతకాలం ఆడిన తర్వాత కూడా సినిమా హాళ్ల దగ్గరకు అభిమానులు వచ్చి ‘ఎన్ని టికెట్లు మిగిలాయ్?’ అని యజమానిని అడిగి, మిగిలిన టికెట్లన్నీ వాళ్లు కొనేసి ‘బైట హౌస్‌ఫుల్ అని బోర్డు పెట్టు’ అని పురమాయించడం నాకింకా గుర్తుంది. అలాగే ఏఎన్నార్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య తరచూ విభేదాలు భగ్గుమనేవి. ఒకసారి నాగేశ్వర్రావు ఏడంతస్తులమేడ వచ్చిన రెండు రోజుల్లోనే ఎన్టీఆర్ సినిమా ‘ఛాలెంజ్‌రాముడు’ వచ్చింది. ఆ సందర్భంగా సినిమాహాల్లో ఎన్టీఆర్ అభిమాని ఎవరో ఏఎన్నార్‌ను కామెంటు చేశాడని మొదలైన చిన్న గొడవ మర్నాటికి చాలా పెద్దదయిపోయింది. ఇలాంటివాటిని ఎంజాయ్ చేస్తూ బళ్లారిలో నాలుగు షోలు, నాలుగు సినిమాలు చూసి ఇంటికి తిరిగొచ్చేవాళ్లం మాలాంటి కుర్రాళ్లమంతా. చిరంజీవి సినిమా ‘పున్నమినాగు’ చూసి ఇతనెవరో పెద్ద ఏక్టరవుతాడు అని మేమంతా అనుకోవడం ఇప్పటికీ గుర్తే నాకు.

నాన్న కళ్లలో నీళ్లు

ఇలాంటి వాతావరణం వల్లనేమో తెలియదు, నాకు సినిమాలంటే పిచ్చి పెరిగింది. ఇంటర్మీడియెట్ పూర్తవుతూనే సినిమాల్లోకి వెళతానని నేనంటే ఇంట్లోవాళళ్ల వద్దన్నారు. ఎలాగైనా వాళ్లను ఒప్పించాలన్న ప్రయత్నాలో ఉన్నప్పుడే ఒకసారి క్యాంపువాళ్లంతా రచ్చబండ దగ్గర కూర్చున్నప్పుడు మా నాన్న అటుగా వస్తుంటే వాళ్లు చూసి ‘రంగారావుకు ఒక్కగానొక్క కొడుకు… చదివి బాగుపడతాడనుకుంటే ఆడేమో సినిమాలెంట తిరుగుతూ, ఊళ్లో అవీఇవీ చేసి చెడిపోతున్నాడు… పాపం రంగారావు’ అన్నారట. నేను మా నాన్న కళ్లలో నీళ్ళు చూసింది ఆరోజే. అది నా గురించేనని తెలిసినా ఆయనతో ఏమీ మాట్లాడలేకపోయాను. ఎంత బాధపకడపోతే ఆయన కన్నీళ్లు పెట్టుకుంటారనుకున్నాను. అయితే సినిమాల్లో రాణించి తీరాలన్న పట్టుదలను నాలో పెంచిందీ నాన్న కన్నీళ్లే.

మా రాజుల గొడవ

మా పాండురంగ క్యాంపులో గోదావరి జిల్లా రాజుల కుటుంబాలు రెండో మూడో ఉండేవి. సాధారణంగా వాళ్లు తమ పని తాము చేసుకుపోయేవారు. అందులో ఒక కుటుంబంలోని గృహిణిని నేను అక్కా అని పిలిచేవాణ్ని. ఒకసారి వాళ్లింటికెళ్లినప్పుడు వాళ్ల పొరుగింటి నుంచి అరుపులు వినబడ్డాయి. ‘ఏంటక్కా అది’ అని అడిగితే పెరట్లో గోడ దగ్గరకు తీసుకెళ్లి నిలబెట్టింది. అవతలివాళ్ల గొడవ వింటున్నకొద్దీ నాకు నవ్వాగలేదు. ఎందుకంటే అత్తాకోడళ్లు తిట్టుకుంటున్నారు, కానీ అత్తగారు తిట్టాక కోడలు అవే తిట్లను రిపీట్ చేస్తోంది తప్ప తనంత తానుగా ఏమీ అనడం లేదు. అలాగే ఎంత తిట్టుకుంటున్నా మీరు, అండీ అని గౌరవించుకోవడం మానట్లేదు! మొదటిసారి విన్నప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది గానీ, తర్వాత్తర్వాత వారి పద్ధతులు తెలిసొచ్చాక అది మామూలే అని అర్థమయింది. ఆ సంగతి చెప్పి ‘ఎంత కోపాలొచ్చినా మర్యాదలు మర్చిపోరే మీరు’ అంటూ అక్కడున్న మా స్నేహితులను సరదాగా ఆటపట్టిస్తుంటాను.
– అరుణ పప్పు
ఫోటోలు : లవకుమార్

సాయానికి ముందుంటా
మా సొంతూరి జ్ఞాపకాలు పదిలం చేసుకోవాలన్న ఆలోచనతో అక్కడ పొలాలు కొనుక్కున్నాను. వాటి పనుల మీద కొంత, కొన్నిసార్లు సరదాగా – మొత్తానికి తరచూ మా ఊరికి వెళ్లొస్తుంటాను. ఒక్కణ్నే కాదు, కుటుంబమంతా కలిసి వెళ్లి కొన్నిరోజులుండి వస్తుంటాం. స్నేహితులు సరదాపడితే వాళ్లనూ తీసుకెళుతుంటాను. ఇప్పటికీ పాండురంగ క్యాంపులోనూ, చుట్టుపక్కల క్యాంపుల్లోనూ ఏ అవసరమున్నా వెంటనే నాకు ఫోన్ చేస్తారు అక్కడివాళ్లు. అక్కడ పెద్ద శివాలయం కడుతున్నప్పుడు నేను విరాళమిచ్చాను. దాని ప్రారంభోత్సవానికి తెలుగు సినిమా పెద్దలను ఆహ్వానించి తీసుకెళ్లాను. మన సినిమావాళ్లల్లో గుమ్మడిగారికి, జయప్రకాశ్ రెడ్డి, శ్రీకాంత్ వంటివాళ్లందరికీ క్యాంపుల అభిమానాలు బాగా తెలుసు.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.