మరుగున పడిన మతాలు –మాతా చార్యులు -2
టావోమతం
చైనా దార్శనికుడు కన్ ఫ్యూజియాన్ కంటే యాభై ఏళ్ళ ముందు పుట్టిన ‘’లా వోట్జు ‘’ఒక గొప్ప తత్వ వేత్త .ఆయన ప్రవచించిందే టావో మతం.అతను ‘’టావో టే చింగ్‘’అనే గ్రంధాన్ని రాశాడు .చైనా లో హోవాన్ రాష్ట్రం లో క్రీ పూ.604 లో జన్మించి నట్లు తెలుస్తోంది .చౌ రాజు ఆస్థాన ఉద్యోగి .ఆ రాజ్య పతనాన్ని ముందే ఊహించి ఉద్యోగానికి రాజీ నామ చేశాడు .ఏకాంత అజ్ఞాత సన్యాస జీవితం గడిపాడు .కొంతకాలాని ఆ రాష్ట్రాన్ని వదిలి కొండలు ఎక్కి పడమట వైపుకు వెళ్ళాడని అంటారు అక్కడ పర్వత దగ్గరున్న ఒక రాజు ‘’ఇన్ హి’’ కి తన మతాన్ని బోధించాడు .తాను రాసిన గ్రంధాన్ని అతనికి అంద జేశాడు .కంఫ్యూసియాన్ ను రెండు సార్లుఈయన్ను కలుసుకోన్నాడని ఒక ఐతిహ్యం ఉంది .
అతని గ్రంధం క్రీ పూ .300 నాటిదని భావిస్తారు .చువాంగ్ చూ అనే ప్రసిద్ధ తత్వ వేత్త లా వోట్టూ ను ప్రశంషించాడు .క్రమం గా లా వోట్టూ అమరజీవి అని మహిమాన్వితు డ ని ప్రచారం జరిగింది .అంతకు ముందే దశావతారాలు దాల్చాడని అన్నారు .క్రీ .పూ.221 లో చక్ర వర్తి ‘’చిన్ హిష్ హువాంగ్ టి ‘’తో బాటు క్రీ .పూ..140-86 లో రాజ్యమేలిన’’ పూ చక్ర వర్తి ‘’కూడా టావో మత ప్రభావానికి లోనైనారు .టావో మతం లో అమరత్వాన్ని పొందే మూలికల సంపాదన ,రసాయనాల తయారీ ,అంధ విశ్వాసాలకు బానిసలవటం ముఖ్య భాగం .అసలు లావోత్జూ బోధలన్నీ పక్కకు నెట్ట బడ్డాయి .పూ చని పోయిన తర్వాతా ఈ విశ్వాసాలన్నీ తగ్గి పోయి అసలు బోధలు వెలుగు లోకి వచ్చాయి .
క్రీ .శ 147-168ప్రాంతపు హవాన్ చక్ర వర్తి టావో మత ప్రభావం లో పడ్డాడు .అప్పటి నుంచి లా వోట్జు పుట్టిన చోట ఉన్న అతని ఆలయం లో చక్ర వర్తి బలులను ఇప్పించే ఏర్పాటు చేశాడు .మళ్ళీ ఆ మతం క్షీణించింది .తర్వాతా 424–452 మధ్య ఉన్న ‘’టాయ్ ఉ టే చక్ర వర్తి ‘’మతాన్ని వ్యాప్తి చేశాడు . 477-500 లో టాయ్ హో చక్ర వర్తి ఎన్నో ఆలయాలు మఠాలు నిర్మించాడు క్రమంగా అంతకు ముందు నుంచే క్రతువులు చేయటం ప్రారంభ మైంది .ఇలా పాలకుల ను బట్టి ఈ మతం ఉత్హాన పతనాలు పొందింది
టావో అంటే మార్గం అని అర్ధం .ప్రజల జీవిత విధానం ,ప్రక్రుతి విధానం ,పర తత్త్వం అనే వాటికి కూడా టావో శబ్దం వర్తిస్తుంది .’’ఏ సూత్రాన్ని అనుసరించి ప్రపంచం లోని ప్రక్రియ లన్నీ జరుగుతున్నాయో అదే టావో ‘’.నీతులన్నీ దేన్నీ అనుసరించటానికి ప్రేరణ పొందుతాయో అదే టావో .మనుష్యులు స్వభావ సిద్ధం గా నడచే బాట టావో .సూర్య చంద్రాదుల గతి ,పృథ్వి సంచారమూ టావో .అన్ని వస్తువుల సహజ స్వభావం సారమే టావో .కనుక ఒక రకం గా టావో అనేది అనిర్వచ నీయం అని పిస్తుంది .జీవన్మరణాలు సత్తు అసత్తు చక్ర భ్రమణం గా ఒక దాని తర్వాతా ఒకటి వస్తుంది .’’ద్యావా పృథ్వి లప్రారంభం అసత్ . ప్రపంచ వస్తువు తల్లి సత్ .వీటి విపర్యయం వల్ల మొదటి దాని ఆశ్చర్యం రెండవ దాని సాన్తత్వం కనీ పిస్తుంది సద సత్తుల యోని పరమ రహస్య మైన టావో .కనీ పించే ప్రపంచా విర్భానికి ముందే అది ప్రవర్తిల్లింది .అది శాంతం శూన్యం ఏకాకి .నిర్వికారం .దీని స్వభావం తెలుసు కోవటం ఎవరి తరం కాదు. అది ద్వంద్వా తీతం .టావోయే అన్నిటికి మూలం ఆధారం .అది నిష్క్రియం అయినా అన్నిటినీ స్వాభావికం గా చేస్తుంది .
టావో ను అనుసరించిన వారిలో ‘’టే’’అనేది కనీ పిస్తుంది .అంటే మంచి ప్రవర్తన,ధర్మం నైతిక శక్తి మార్గ దర్శనం అన్నమాట .స్వభావాన్ని అనుసరించే వాడు ఏపని చేయక పోయినా చేసి నట్టే లెక్క .అనిదీనిని ‘’వెయ్ వు వెయ్ ‘అంటారని గ్రంధం లో ఉంది అంటే నిష్క్రియ అయిన క్రియ ,నిరాకారమైన కర్మ .అని భావం .మనిషి నిష్క్రియుడై ,నిశ్చలుడై ,స్తిరుడై ,శాంతుడై నిర్లిప్తుడై తన ద్వారా టావో ను పని చేయ నిస్తే ఈ స్తితి కలుగుతుంది ..
క్రీపూ..369-286 మధ్య చువాంగ్ టావో మతాన్ని అభి వృద్ధి చేశాడు .యితడు తార్కికుడు గ్రంధ కర్త .రాజు ప్రధానిని చేస్తానని పిలిచినా తిరస్కరించాడు టావో కు సత్తా సాక్ష్యం ఉన్నాయని చెప్పాడు .క్రియ ఆకారం లేవు .అది సంక్రమించటానికి వీలుంది కాని గ్రహించే వీలు లేదు .ప్రతి వాడు నిష్కళం కం గా సదా చారం తో ప్రవర్తిస్తే ప్రభుత్వమే అక్కర్లేదు .అన్ని దృక్పధాలు ఆచారాలు సమానమే .కనుక వస్తువులలో ఉన్న భేదాలను వదిలి అనంతత్వం గురించే యోచన చేయాలి .సమస్త వస్తువుల ఏకత్వమే ఈ విశ్వం .ఏకత్వం లో మమైకం కావాలి .జ్ఞానాన్ని వదిలేస్తే అనంతం లోఏకమవుతారు .కేవలం తన స్వభావం వల్లనే ఆనందం వస్తుంది .
‘’’నాతో బాటు అన్ని వస్తువులు ఒక్కటే .భూమి ఆకాశం నాతో బాటే వచ్చాయి .’’అనే అను భూతిని పొంది చావు పుట్టుకలు సుఖ దుఖాలు మంచి చెడు అనే ద్వంద్వాలను సమానం గా చూసే వారి స్వేచ్చ ,నిరపేక్షం పరి పూర్ణం.అలాంటి పూర్ణ పురుషుడికి ఆత్మ ఉండదు .అలాంటి ఆధ్యాత్మిక మానవుడికి ఏపనీ చెయ్యాల్సిన అవసరం లేదు .అతడు రుషి తుల్యుడు ఆ ఋషికి పేరు ఉండదు .’’ఇదే చువాంగ్ ట్చు ‘’మతం లోని సారాంశం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-8-13-ఉయ్యూరు