మెక్సికో మహిళా మణి దీపం- రోసారియో కాస్టలనాస్

మెక్సికో మహిళా మణి దీపం- రోసారియో కాస్టలనాస్

 

 

మెక్సికో మహిళా మణి దీపం- రోసారియో కాస్టలనాస్

    ఆమె పుట్టిన కుటుంబం బాలిక బతికున్డటానికి ఇష్టపడదు  .ఇంక చదువేం చెప్పిస్తారు ?అలాంటి కుటుంబం లో పుట్టి ఉన్నత శిఖరాల నందుకొన్న మెక్సికో మహిళా మణి దీపం  రోసారియో కాస్ట లనాస్ గురించే ఇప్పుడు మనం తెలుసుకొంటున్నాం

రోసారియో కాష్టలనాస్ లాటిన్ అమెరికా దేశ మైన మెక్సికో లో కొమిటాన్ దగ్గరున్నచియాపాస్ లో  ఒక పెద్ద సంపన్న కుటుంబం లో ఫామిలీ రాంచ్ లో 25-5-1925 న జన్మించింది .ఆ కుటుంబం లో ఆడ వాళ్ళను గడప దాట  నివ్వరు  ఆడపిల్లకు చదువు చెప్పించ టమే ఉండదు .1933 లో ఆ యింటి స్నేహితురాలు ,దేయ్యాలూ , భూతాలూ వదిలించే ఒకావిడ వాళ్ళ ఇంట్లో త్వరలో చిన్నపిల్లలెవరో చని పోతారని తల్లికి జోస్యం చెప్పింది .రోసారియో కు ఒక తమ్ముడున్నాడు .తమ్ముడు చని పొతే బాగుండు అని అక్క రోసారియో భావించింది ..ఈ అమ్మాయి చస్తే బాగుండు నని,పీడా విడగడై పోతుందని  తలిదండ్రులు గట్టిగా అనుకొన్నారు .చివరికి తమ్ముడే చని పోయి రోసారియో నే బతికింది .అప్పటి నుంచీ ఇంట్లో ఆమె ఒంటరిగా, సిగ్గుగా, బిడియం తో అసూర్యం పశ్య గా గారాబం గా పెరిగింది

అప్పటి మెక్సికో ప్రెసిడెంట్ లిజారో కార్దినాస్ భూసంస్కరణల చట్టం చేశాడు .దాని ప్రకారం రోసారియో కుటుంబానికి ఉన్న చాలా మిగులు  భూమిని  ప్రభుత్వం స్వాధీన పరచుకొంది .దీనిని అక్కడి ‘’నేటివ్ ఇండియన్స్ ‘’కు ప్రభుత్వం పంచింది ..చేసేది లేక రోసారియో కుటుంబం ఆమె పదిహేనవ ఏట మెక్సికో సిటి కి తరలి వెళ్ళింది .కుటుంబం దారుణ మైన ఆర్ధిక బాధలను అనుభవించింది .మెక్సికో చేరిన ఏడాదికే ఆమె తల్లీ  తండ్రీ చని పోవటం తో  ఆమె జీవితం నడి  సంద్రాన నావ అయింది .గారాల పట్టి గా గడిపిన రోసారియో స్వంత కాళ్ళ మీద నిలబడి జీవించాల్సిన దుస్తితి ఆ చిన్న వయసులో  ఏర్పడింది .

ధైర్యం కూడా గట్టుకొని చదవటం ప్రారంభించింది బాగా చదివి 1950 లో డిగ్రీ సాధించింది  స్పెయిన్ లో చదువుకోవటానికి ప్రభుత్వం నుండి అనుమతి పొందింది యూరప్ అంతా పర్య టిన్చింది .తర్వాత ‘’నేషనల్ అటానమస్ యూని వర్సిటి ఆఫ్ మెక్సికో –(UNAM)..లో చేరి ఫిలాసఫీ, లిటరేచర్ సబ్జెక్టు లను చదివింది .మెక్సికో  లోను సెంట్రల్ అమెరికా లోను ఉన్న మేధావులతో పరిచయం పెంచుకోంది.ఇది ఆమె జీవితానికి బాగా ఉపయోగ పడింది మంచి రచనలూ చేయటం ప్రారంభించింది .’’the three knots in the net ‘’అనే నవలలో ఆమె తన కుటుంబ చరిత్ర అంతా  చెప్పుకోంది ..యూని వర్సిటి లో ఫిలాసఫీ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ‘’రికార్డో గువేరా ‘’ను పెళ్లి చేసుకొంది.కాని అభిప్రాయ భేదాలేర్పడి 1971 లో విడాకులు తీసుకొన్నది .ఆమె చదివిన యూని వర్సిటి లోనే లెక్చరర్ గా చేరి పని చేసింది .1966 లో ‘’కంపారటివ్ లిటరేచర్ ‘’కు ప్రొఫెసర్ గా పదోన్నతి సాధించింది .తరువాత విజిటింగ్ ప్రొఫెసర్ అయింది .

చిన్న పిల్లల కోసం రోసారియో చాలా కధలు రాసింది .అంతే  కాదు ‘’నేషనల్  ఇండీజినస్ స్కూల్ ‘’లో చేరి,పేదలు ,అతి నిర్భాగ్యులు చదువు అంటే ఏమిటో తెలియని ఆభాగ్యులున్న మురికి వాడలలో తాను  రాసిన ‘’పపెట్ షో ‘’లను ప్రదర్శించి వారిలో విద్య పట్ల మక్కువ కలిగించింది .ఈ సంస్థను తమ కుటుంబపు భూమిని ప్రభుత్వ పరం చేసిన ప్రెసిడెంట్ కార్దినాస్  స్థాపించిందే .’’ఎక్సేల్సర్ ‘’అనే వార్తా పత్రికకు వీక్లీ కాలమ్స్ రాసింది .’’one must laugh ,then ,since laughter ,as we know is the first manifestation of freedom ‘’అని  రోసారియో కాస్టలనాస్ నవ్వు కు గొప్ప అర్ధాన్ని చెప్పింది .ఈమె కేధలిక్ మతాన్ని అవలంబించింది

1971 లో ‘’ఫామిలి ఆల్బం ‘’నవల రాసింది .1971లో   సంవత్సరం ఆమె సమర్ధత ను గుర్తించిన  మెక్సికో ప్రభుత్వం ఇస్రాయిల్ కు రాయబారి గా నియమించి గొప్ప గౌరవాన్ని కల్పించింది .ఇది మెక్సికో ప్రభుత్వం   ఒక మహిళ కు అందజేసిన అరుదైన ,అసాధారణ మైన, అత్యున్నత  స్థాయి గౌరవం .రోసారియో నిజం గానే తనస్వశక్తితో  సమర్ధత తో ఉన్నత శిఖరాలను అధిరోహించింది ..ఆమెమామూలు రాయబారి మాత్రమె కాదు విదుషీ మణి కనుక సాంస్కృతిక రాయబారీ అయిందని భావించ వచ్చు .కాని ఇదే ఆమె పాలిటి శాపం అవటం దురదృష్టకరం . 49 ఏళ్ళ  వయసులో ఇస్రాయిల్ రాజధాని’’ టెల్ అవైవ్ ‘’లో తన ఇంట్లో ఎలెక్ట్రిక్ లాంప్ ను అమరుస్తూ షాక్ కొట్టి 7-8-1974 న మరణించటం సాహిత్యాభిమానుల్నే కాదు రాజకీయ నాయకులను తీవ్ర విషాదం లో ముంచేసింది .మన తెలుగు నవలా రచయిత్రి శ్రీమతి మాదిరెడ్డి సులోచనా రాణి స్వంత ఇంట్లో గాస్ స్టవ్ వెలిగిస్తూ మరణించిన విషయం మనకు గుర్తుకు వస్తుంది ఇద్దరూ విధి వంచితలే

రోసారియో కవిత్వం, కధలు, నవలలు ,పెద్ద నాటకం రాసింది .ఆమె రాసిన ‘’బాలన్ కానన్ ‘’నవల ఆమె పాక్షిక స్వీయ జీవిత చరిత్రే .ఆమె రచించిన ‘’ది.బుక్ ఆఫ్ లామేన్ టేషన్ ‘’19 వ శతాబ్దం లో జరిగిన యదార్ధ సంఘటనలకు దర్పణం..’’నైన్  గార్దియన్స్’’నవల, లామేన్ టేషన్   రెండూ అనేక భాషల్లోకి అనువాదం పొందాయి .సృజనాత్మక రచనలకు రోసారియో పేరెన్నిక గన్నది రోసారియా ను ప్రభావితం చేసిన ఇద్దరు మహిళా ఉత్తేజిత కార్య కర్తలున్నారు .ఒకరు పదహారవ శతాబ్దానికి చెందిన మత కార్య కర్త ‘’సెయింట్ తీసా ఆఫ్ అవిల ‘’రెండవ ఆమె పదిహేడవ శతాబ్దికి చెందిన మెక్సికన్ నన్ ,మరియు కవయిత్రి అయిన  ‘’సార్జువోనా ఇనెస్ డీ  లాక్రాజ్ ‘’.అంతే  కాదు సాంఘిక దురన్యాయం  మహిళా వివక్షత లపై తీవ్ర పోరాటమూ చేసింది రోసారియో .

రోసారియో వచన రచనలు బాగా ప్రసిద్ధి చెందాయి .కాని ఆమె కవిత్వం చాలా శక్తి వంతమైనదే కాదు ,ఆమె సమకాలీనుడైన,1990 లో సాహిత్యం లో నోబెల్ బహుమతి పొందిన  ‘’ఆక్టేవియా పాజ్ ‘’కవిత్వం తో,  సృజనాత్మక శక్తితో తుల తూగు తుందని విశ్లేషకులు భావిస్తారు .మెక్సికన్ రివల్యూషన్ కు పాటు బడుతున్నఅభాగ్యులైన నేటివ్ ఇండియన్స్ కు  తాను  పుట్టి పెరిగిన ‘’చియాపాస్ ‘’లో ప్రభుత్వం స్వాధీన పరచుకొన్న ది పోను మిగిలి ఉన్న భూమిని  రాసిచ్చేసిన  మెక్సికో మహిళా మణి పూస రోసారియో కాస్టలనాస్ ..

   –  గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.